నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, ఈ రోజు ఒక అద్భుతమైన వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 138:8వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీ కార్యములన్నిటిని సఫలపరుస్తాడు. అవును, నా ప్రియులారా, ప్రభువు మన పక్షమున కార్యములన్నిటిని సఫలపరచవలెనని మన పట్ల కోరుచున్నాడు. దావీదు ఎటువంటి పరిస్థితులలో ఈ మాటను పలుకుచున్నాడు? అని మునుపటి వచనమైన కీర్తనలు 138:7వ వచనములో చూచినట్లయితే, "నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును'' అని దావీదు భక్తుడు అంటున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మన పక్షమున అన్ని కార్యములను జరిగిస్తాడు. ఇది నాకు ఇష్టమైనటువంటి వచనములలో ఒక వచనమై యున్నది. మన జీవితములో జరుగుచున్న విషయాలను గురించి మనము ఎంతో చింతించుచుండవచ్చును. అందుకే అటువంటి మనలను చూచి ప్రభువు, "నా కృప నీకు చాలును, నా కుమార్తె, కుమారుడా'' అని అంటున్నాడు. కాబట్టి, నేడు మీ సమస్యల మధ్యలో ఆయన కృప ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంటుంది.
బైబిల్ నుండి భక్తుడైన యోబును చూచినట్లయితే, యోబు కష్టాల మధ్యలో కూడా దేవుని యందు నమ్మకముంచాడు. అందుకే బైబిల్ నుండి యోబు 42:2వ వచనములో చూచినట్లయితే, "నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని'' అని చెప్పబడినట్లుగానే, యోబు తన శ్రమల మధ్యలో కూడా అతడు ఈ విధంగా చెప్పుచున్నాడు. అందుకే బైబిల్లో, "నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము'' అని చెప్పబడినట్లుగానే, మనుష్యుని హృదయములో అనేకమైన ఆలోచనలు ఉన్నప్పటికిని, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుతుంది. మనము అనేకమైన విషయములను ఆలోచించి, ప్రణాళిక చేయవచ్చును. కానీ, దేవుడు మన పట్ల వేరొక ప్రణాళికను కలిగియుంటాడు. ఎందుకనగా, ఆయన మనలను గురించి, ఆలోచించి చింతిస్తాడు కాబట్టి, ఆయన మన పక్షమున కార్యము సఫలపరుస్తాడు. కనుకనే, నా ప్రియులారా, మనము దేనిని గురించి చింతించనవసరములేదు. అవును, ప్రియ స్నేహితులారా, అపవాదికి అనేకమైన దుష్ట ఆలోచనలు మరియు దుష్ట పన్నాగములు ఉండవచ్చును. మనలను నశింపజేయడానికి అనేకమైన విషయములను అపవాది ప్రణాళిక చేయవచ్చును. మనలను ప్రభువు నుండి దూరపరచడానికి ప్రయత్నించవచ్చును. మనుష్యులకు అనేకమైన దురాలోచనలు ఉండవచ్చును. అయితే, అవి ఏవియు కూడా ఎంతమాత్రము నెరవేరవు.
అయితే, బైబిల్ నుండి కీర్తనలు 21:11-12వ వచనములలో చూచినట్లయితే, "వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి దురుపాయము పన్నిరి కాని దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పి వేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు'' అని చెప్పబడినట్లుగానే, వారు ఒక ద్వారములో నుండి వచ్చియుండవచ్చును. కానీ, అనేకమైన మార్గములలో వారు పారిపోవునట్లుగా చేస్తాడు. నా ప్రియులారా, మనము వారిని తరుమ అక్కరలేదండి. కానీ, ప్రభువే మన పక్షమున కార్యమును జరిగిస్తాడు. అపవాది యొక్క పన్నాగములను లేదా దుష్ట మనుష్యుల యొక్క పన్నాగములు ఏవియు కూడా ప్రభువు సఫలమవ్వనివ్వడు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, మీ చుట్టు జరుగుచున్న విషయాలను గురించి, అస్సలు చింతించకండి. మీరు శ్రమల మధ్యలో విశ్వసించడము కొంచెము కష్టతరముగా ఉండవచ్చును. కానీ, నా ప్రభువు నా పక్షమున అన్నిటిని సఫలపరుస్తాడు అని చెప్పినప్పుడు, ప్రభువు మిమ్మును విజయవంతులనుగా చేస్తాడు. నా ప్రియులారా, మీ జీవితములో కార్యములన్నిటిని సఫలపరుస్తాడు.
నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ, మీకు వ్యతిరేకముగా మీకు కోర్టుకేసులు ఉండి ఉండవచ్చును. ప్రజలు నన్ను అణిచి వేయడానికి ప్రయత్నించుచున్నారు, వారు నన్ను చంపడానికి కూడా ప్రయత్నించుచున్నారు అని మీరు అంటున్నారా? నా జీవితమును నేనే అంతము చేసుకుంటాను అని ఒకవేళ మీరు బాధపడుచున్నారా? ఈ బాధలన్నిటిని ఇక నేను భరించలేను అని అనుకుంటున్నారా? లేదు నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభువు హస్తము మీ మీదికి దిగివచ్చుచున్నది. ప్రభువు మీ జీవితము పట్ల చేసిన ప్రతి ప్రణాళికను కూడా నెరవేరుస్తాడు. ప్రభువు యొక్క ప్రణాళిక లన్నియు కూడా సఫలమవుతాయి. మీరు ఆ కేసులో నిశ్చయముగా గెలుస్తారు. మీరు చేయుచున్న యుద్ధములన్నిటిలో కూడా ప్రభువు మీకు విజయమునిస్తాడు. మీ శత్రువులు వెనుకకు వెళ్లి పారిపోవునట్లుగా ప్రభువు చేస్తాడు.
నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు యొద్ద వచ్చు విడుదలను మీరు చూచుట మాత్రమే కాదు, దానిని మీరు అనుభవించబోవుచున్నారు. ఆయన తన ప్రజల పట్ల పోరాడు దేవుడు కనుకనే, ఆయన మీ పక్షమున పోరాడి, మీకు విజయమును అనుగ్రహిస్తాడు. ఈ రోజు మీ పరిస్థితులలో ప్రభువు యొక్క శక్తివంతమైన హస్తము పనిచేయడానిని మీరు అనుభవించుదురు గాక. మీ న్యాయ పోరాటములలో ఆయన మీకు జ్ఞానమును, కృపను అనుగ్రహిస్తాడు. నా ప్రియులారా, మీకు విరోధముగా లేచు ప్రతి దుష్టపన్నాగముల నుండి మిమ్మును తప్పించి, బలపరచి, విమోచన వైపు మిమ్మును నడిపిస్తాడు. కనుకనే, నా ప్రియులారా, మీరు ఆయన యందు విశ్వాసము ఉంచినంత కాలము, ప్రతి సవాలులోనూ ఆయన మిమ్మును నడిపిస్తాడు. మీ భారములను దేవుని హస్తములలో ఉంచి, ఆయన విశ్వసనీయతపై నమ్మకంగా ఉండండి. ఆయనే మీ రక్షకుడు మరియు మీకు ఆశ్రయం. మీరు ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు, ఆయన మీ పోరాటముల మధ్యలో కూడా మిమ్మును నడిపించి, మీ జీవితంలో తన ఉద్దేశములను నెరవేర్చి, మీకు సమాధానమును మరియు బలమును అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము నుండి ఆయన మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొక్క వాగ్దానము చొప్పున, మా యొక్క కోర్టుకేసులలో యుద్ధము చేయుచుండగా, నీవు మా పక్షమున యుద్ధము చేసి, మాకు విజయమును అనుగ్రహించుము. దేవా, మేము పోరాడుచున్న ప్రజలతో నీవు మా పక్షమున పోరాడుము. ప్రభువా, మాకు విరోధముగా వచ్చు దుష్టపన్నాగముల నుండి నీ యొక్క నీతిగల దక్షిణ హస్తము మా మీదికి దిగివచ్చి, మమ్మును కాపాడునట్లుగా చేయుము. దేవా, ఇప్పటి నుండి మా జీవితములో ఎటువంటి యుద్ధము ఉండకుండా, నీవు మాకు తోడుగా ఉండుము. యేసయ్యా, మా జీవితములో మాకు ఎదురగుచున్న ప్రతి పోరాటములను నీ నామము ద్వారా గద్దించి, మా జీవితములో చీకటి అంధకారము ఇక ఎంతమాత్రము ఉండకుండా చేయుము. దేవా, ఈ రోజే మా యుద్ధములన్నిటిలో మేము గెలుచునట్లుగాను మరియు మేము విడుదలను పొందుకొనునట్లుగా మాకు విజయమును చేకూర్చుము. ప్రభువా, నీవు మా పట్ల కార్యములను సఫలపరుస్తావని నమ్మి నీ యందు సహనముతో కనిపెట్టుకొని ఉండుటకు మాకు ఓర్పును దయచేయుము. దేవా, నీ యొక్క మంచి ప్రణాళికను మా జీవితములో నెరవేర్చుము. యేసయ్యా, మా శ్రమలన్నిటిలో నుండియు మరియు మా హృదయ వేదనలన్నిటి నుండి మమ్మును విడిపించి, బయటకు తీసుకొని రమ్ము. దేవా, మేము శ్రమల మధ్యలో జీవించునట్లుగాను, మేము విజయవంతులమగునట్లుగా మా పట్ల ఒక అద్భుతమును జరిగించుము. ప్రభువా, మేము ఎక్కడైతే, అవమానమును ఎదుర్కొని యున్నామో, అదే స్థలములో మేము రెండంతలుగా ఘనతను పొందుకొనునట్లుగా మాకు నీ యొక్క కృపను దయచేయుము. దేవా, మా యొక్క ప్రతికూల పరిస్థితులన్నిటిని తలక్రిందులుగా చేయుము. ప్రభువా, మా శత్రువు మా వెనుకకు వెళ్లి ఏడు మార్గములలో పారిపోవునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమన ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


