నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి జెకర్యా 10:12వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఇక్కడ ఎంతో అద్భుతంగా దేవుని వాక్యము ఈలాగున చెబుతుంది, "నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు; ఇదే యెహోవా వాక్కు'' అని చెప్పబడినట్లుగానే, ఇది ఎంత చక్కటి వాగ్దానము కదా! ఆయన, ' నేనే నా ప్రజలను నడిపిస్తాను ' అని ప్రభువు అంటున్నాడు. ఎంత ప్రేమగలిగిన దేవుని మనము కలిగియున్నాము కదా! అందుకే బైబిల్ నుండి కీర్తనలు 18:32వ వచనములో చూచినట్లయితే, "నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే'' అని కీర్తనాకారుడైన దావీదు చెబుతున్నాడు. కనుకనే, మనకు బలమును ధరింపజేయువాడు మన దేవుడే. ఇంకను బైబిల్ నుండి సామెతలు 21:31వ వచనములో చూచినట్లయితే, " యుద్ధ దినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనము'' అని చెప్పబడినట్లుగానే, అవును, నా ప్రియ స్నేహితులారా, మన యుద్ధములన్నిటిలో నుండి మనకు విజయమును అనుగ్రహించునది దేవుడే. కనుకనే, 'దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?' అని చెప్పబడినట్లుగానే, దేవుడే మన పక్షమున ఉండగా, మనకు విరోధముగా ఎవరు ఉండగలుగుతారు. కనుకనే, ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, ఈ లోకములో మనము చూచినట్లయితే, ఇశ్రాయేలీయుల దేశములో రక్షణ విభాగములో ఉన్న వారికి, అత్యాధునికమైన సాంకేతికము అందుబాటులో ఉన్నది. రక్షణ సైనికులు వారు పౌరులకు కూడా శిక్షణ ఇస్తుంటారు. పురుషులకు మరియు స్త్రీలకు కూడా వారు శిక్షణను అందజేస్తుంటారు. వారందరి జీవితములో రక్షణ ధళములు ఎంత ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తారు. మేము యుద్ధ దినమునకై ఆయుత్తముగా లేక సిద్ధముగా ఉన్నాము అని అంటారు. అయితే, ప్రభువు ఈలాగున అంటున్నాడు, " మిమ్మును యుద్ధమునకు సిద్ధపరచువాడను నేనే, నీకు బలమును అనుగ్రహించువాడను కూడా నేనే'' అని అంటున్నాడు. అవును, ఇశ్రాయేలీయుల ప్రజలు ఎక్కడికి వెళ్లినను కూడా ప్రభువే వారి ముందుర నడుచుచు వెళ్లియున్నాడు. వారి యుద్ధములన్నిటిని కూడా ప్రభువు పోరాడి యున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజల నిమిత్తము ఈ రోజు కూడా ప్రభువు అదే జరిగించుచున్నాడు. అందుకనే, వారు యుద్ధములన్నిటిలో కూడా విజయమును పొందుకొనేవారు. చూడండి, " యుద్ధ దినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనము'' అని చెప్పబడినట్లుగానే, వారికి విజయమును అనుగ్రహించునది కూడా ప్రభువే. ఆలాగుననే, మనకు విజయమును అనుగ్రహించునదియు కూడా ప్రభువే. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 16:8వ వచనములో చూచినట్లయితే, " సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను'' అని భక్తుడైన దావీదు అంటున్నాడు. అవును, మన కుడిపార్శ్వమున మరియు మన పక్షమున దేవుడు నిలిచియుంటాడు. మనకు రక్షణగా ఆయన నిలుచుని ఉంటాడు. ప్రభువే మనకు రక్షణయై యున్నాడు. గొప్ప పరాక్రమశాలివలె మరియు యోధునివలె మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుండగా, అన్ని యుద్ధములన్నిటి గెలుపుపొందుకొనగలము.
నా ప్రియులారా, ఈ లోకములో మనము అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే, ప్రభువు దృష్టిలో అవి ఎంతో అల్పమైయున్నవి. మన సమస్యలన్నిటికంటె ఎంతో గొప్పవాడై యున్నాడు. కాబట్టి, నిరాశ చెందకండి, నా ప్రియమైన స్నేహితులారా, నిరాశచెందకండి. మీకు వ్యతిరేకముగా రూపింపబడినది యేదియు కూడా వర్ధిల్లనే వర్ధిల్లదు. అంతమాత్రమే కాదు, మీకు విరోధముగా రూపింపబడు ఎటువంటి ఆయుధమును కూడా వర్ధిల్లదు. ఇంకను మీకు వ్యతిరేకముగా అనేకమైన ప్రణాళికలు ఉండి యుండవచ్చును. మీకు వ్యతిరేకముగా రావడానికి లేక పోరాడడానికి ఈ లోక ప్రజలు అనేకమైన ప్రణాళికలను చేయుచుండవచ్చును. కానీ, మీ యుద్ధములన్నిటిలోను మీరే విజయమును పొందుకుంటారు. మీరు వాటన్నిటిలో నుండి బయటకు వచ్చెదరు. కనుకనే, మీరు నిరాశ చెందకండి. ప్రభువు యొద్ద మౌనముగా ఉండండి. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 62:5 వచనములో చూచినట్లయితే, "నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది'' అని చెప్పబడిన ప్రకారముగా అవును, నా ప్రియ స్నేహితులారా, మీ బలము ప్రభువు యొద్ద నుండియే కలుగును. ఆయన ఇచ్చు అధికారమంతటితో మీరు ముందుకు నడిచెదరు. నా ప్రియ స్నేహితులారా, అపవాదిని చూచి, మీరు భయపడినది ఇక చాలు. ఇప్పటి నుండి మీరు దయ్యములను మీరు వెళ్లగొట్టెదరు. మీ యుద్దబులన్నిటిని మరు గెలువగలిగే అటువంటి గొప్ప బలమును మీకు అనుగ్రహిస్తాడు. ప్రభువు మీకు తోడుగా వచ్చుచున్నాడు. మీ యుద్ధములన్నిటిలో కూడా మీరు నిశ్చయముగా విజయమును పొందుదురు గాక. మీరే విజయమును కలిగి ఉంటారు. నా ప్రియులారా, ప్రభువు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానము కొరకు నీకు వందనములు. దేవా, విజయం కేవలం నీ యొద్ద నుండి మాత్రమే వస్తుందని నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మేము ఎదుర్కొనే ప్రతి యుద్ధంలో నీవే మా బలంగా, మా రక్షణగా ఉండుము. దేవా, మాకు ముందుగా వెళ్లి మా మార్గమును సురక్షితం చేయుము. ప్రభువా, నిన్ను నమ్మి, చలించకుండా ఉండునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, మా ఆత్మను నెమ్మదిపరచి, మా నిరీక్షణ నీపై నిలుచునట్లుగా చేయుము. ప్రభువా, జయించడానికి నీ శక్తితో, అధికారంతో మమ్మును నింపుము. దేవా, మా జీవితములో ఉన్న ప్రతి భయమును, శత్రువు యొక్క ప్రతి కార్యాన్ని మా నుండి పారద్రోలుము. ప్రభువా, నీ మహిమ కొరకు మమ్మును విజయములోనికి నడిపించుము. ప్రభువా, నీ శక్తి చేత మమ్మును బలపరచి, మమ్మును నీ శక్తితో నింపుము. యేసయ్యా, మేము లేచి నిటారుగా నిలబడునట్లుగా చేసి, మా యుద్ధమున్నిటిలోను మేము విజయమును పొందునట్లుగా మా చేతులను మరియు మా హృదయములను బలపరచుము. దేవా, నీ గుణములతో మేము ముందుకు నడుచు కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా నోరు నీ నామమును ప్రకటించునట్లుగాను, మా తలల మీద నీ నామమును లిఖించి, ముద్రించి, ఎల్లప్పుడు మా తలలు ఎత్తుకొని నడుచుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, ఏ కీడు ఇక మీదట మా దరిచేరకుండా, మేము సింహము వలె ఎంతో ధైర్యముగా ఉండునట్లుగా, ఒక రక్షణ ధళము వలె మాకు ముందుగా వెళ్లుము. దేవా, మా యుద్ధములన్నిటిలో నీవే మాకు విజయమును అనుగ్రహించుము. ప్రభువా, మా కోర్టు కేసు నుండి మాకు అనుకూలమైన తీర్పును ఇచ్చి, నీవే మా రక్షణ బలముగా ఉండి, మా యుద్ధముులన్నిటిలో నీవే పోరాడి మాకు జయమును ఇచ్చి, మమ్మును ఆశీర్వదించి, మా అడ్డంకులన్నిటిని తొలగించివేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


