నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆదికాండము 28:15వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీకు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చు వరకు ఆయన మిమ్మును విడువడు. కనుకనే, ఆయన మీకు ఇచ్చిన వాగ్దానములన్నింటిని తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రభువు సహాయముతో ఒక వ్యక్తి ఒక పనిని చేపట్టవచ్చును, కానీ ఆ పనికి ప్రతిఫలమును చేకూర్చునది ప్రభువు మాత్రమే. బైబిల్ నుండి 1 సమూయేలు 14:45వ వచనములో యోనాతానును గురించి ఒక సంఘటనలో మనము దీనిని చూడగలము.

అదేవిధంగా, బైబిల్ నుండి ఆదికాండము 28:13-15వ వచనములను చదువగలము. యాకోబు తన ఇంటిని విడిచి ఒంటరివానిగా బయలుదేరాడు; అతని చేతిలో ఒక కర్ర తప్ప మరేమియు లేదు. తాను ఎక్కడికి వెళ్లుచున్నాడని తెలియకపోయినా, తన తల్లి చెప్పిన మాటను పాటించి, తన మామగారి యింటిని వెతుక్కుంటూ బయలుదేరాడు. తద్వారా, అతడు వివిధ ప్రాంతముల గుండా ఎన్నో మైళ్లు ప్రయాణించవలసి వచ్చినది. అయితే యాకోబు ప్రభువునకు విధేయత చూపుతూ ముందుకు సాగాడు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు, ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను. ఆ సమయంలో, ప్రభువు అతనిని వెదుక్కుంటూ వచ్చి, కలలో అతనితో ఇలాగున మాట్లాడియున్నాడు. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యా భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమి యొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును'' అని చెప్పబడినట్లుగానే, నిజానికి, అతని తల క్రింద ఒక రాయి మాత్రమే ఉన్నది. అతని చుట్టూ కూడా చీకటి అలుముకుంది. అతను నేల మీద పడుకుని ఉన్నాడు, చేతిలో ఒక కర్ర తప్ప మరేమియు లేదు. అతనికి తోడుగా ఎవరూ లేరు. ఒకప్పుడు అతడు ఎంతో ఉన్నతమైన స్థితిలో జీవించాడు. కానీ, ఆ సమయములో అతని దగ్గర ఏమియులేనట్లుగా కనిపించినది. ఆలాగుననే, నా ప్రియ స్నేహితులారా, బహుశా! మీరు కూడా నేడు అటువంటి పరిస్థితిలోనే ఉండవచ్చును. ఒకవేళ మీరు, 'నేను ఇప్పుడు శూన్యంలో పడి ఉన్నాను' అని చెప్పకండి. మీరు యాకోబు వలె ఒంటరిగా ప్రయాణిస్తూ, ప్రభువుకు విధేయతతో జీవించుచున్నట్లయితే, అటువంటి కష్టకాలంలో కూడా ప్రభువు మిమ్మును వెతుక్కుంటూ మీ యొద్దకు వస్తాడు. అవును, ఆయన నేడు మిమ్మును ఆశీర్వదించుటకు వెదకుచున్నాడు!

చూడండి, ప్రభువు యాకోబుతో ఇలాగున అన్నాడు: " మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యా భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను'' అని సెలవిచ్చినట్లుగానే, ప్రభువు అతనికి ఆ భూమిని ఇచ్చునట్లుగా వాగ్దానము చేసియున్నాడు. ఆ సమయములో యాకోబు ఆశ్రయముగా ఉన్నప్పటికిని, ఆ భూములన్నియు అతనికి మరియు అతని సంతతికి స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు వాగ్దానము చేసియున్నాడు. నా ప్రియులారా, నేడు మీరు ప్రభువు నామము నిమిత్తము నేడు మీరు తిరస్కరించబడి యున్నారా? లేక దేవుని ఎరుగని వారి నుండి వెళ్లగొట్టబడియున్నారా? అవమానించబడు చున్నారా? లేదా దుర్వినియోగమునకు గురవుచున్నారా? అయితే, ప్రభువు మిమ్మును స్థిరపరచి, మీకు స్వాస్థ్యమును అనుగ్రహించుచున్నాడు. నా ప్రియులారా, మీరు యాకోబు వలె ఆయనకు విధేయత చూపినప్పుడు, మీరు వెళ్లవలసిన చోటికి వెళ్లుచున్నారు మరియు చేయవలసిన పనిని చేయుచున్నారు. అయితే, ప్రభువు మిమ్మును చూచి ఇలాగున అంటున్నాడు: " నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను'' అని వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, మీరు భయపడకండి.

నా ప్రియులారా, అంతమాత్రమే కాదు, మీ సంతానము భూమి మీద ఉన్న ఇసుకరేణువలె ఉంటుంది. మీరు విస్తరించి, అన్ని దిశలలోనూ వ్యాపించెదరు. అవును, ప్రభువు మీకు ఈ ఆశీర్వాదమును నేడు ఇచ్చుచున్నాడు; ఆయన దీనిని మీ సంతానమునకు కూడా విస్తరింపజేయుచున్నాడు. నేడు, ప్రభువు మీ సంతానమును స్థిరపరుస్తాడు మరియు మీ జీవితమును భద్రపరుస్తాడు. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 28:15వ వచనములో ప్రభువు ఇలా అంటున్నాడు: " ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును'' అని చెప్పినట్లుగానే, ఆయన మిమ్మును కాపాడతాడని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. దుర్మార్గులు మీకు విరోధముగా లేచి, మిమ్మును మ్రింగివేయాలని ప్రయత్నించవచ్చును; కానీ వారు మీ మీద విజయమును సాధించలేరు. ప్రభువు వారిని వెళ్లగొట్టి, మీ కొరకు ఆయన సిద్ధపరచిన చోటికి మిమ్మును మరల రప్పిస్తాడు. కనుకనే, దిగులుపడకండి.

నా ప్రియులారా, ప్రభువు యాకోబును ఎలాగున తిరిగి తీసుకువచ్చాడు? అని మనము చూచినట్లయితే, ఆయన అతని సమృద్ధియైన ఆశీర్వాదములతో తిరిగి తీసుకువచ్చాడు. అవును, బైబిల్ నుండి ఆదికాండము 32:10వ వచనములో చూచినట్లయితే, "నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యా యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని '' అని చెప్పబడినట్లుగానే, యాకోబు యొర్దాను నదిని దాటినప్పుడు కేవలం తన చేతి కర్రతో మాత్రమే వెళ్ళాడు, కానీ ఇప్పుడు రెండు గుంపులుగా తిరిగి వచ్చాడని యాకోబు ఒప్పుకున్నాడు. అతను తన మామగారి దగ్గర పద్నాలుగు సంవత్సరములు పనిచేశాడు, ఎన్నో త్యాగములు చేశాడు. అయినను, భయభక్తులతో ప్రభువును వెంబడించాడు మరియు తన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశములను నెరవేర్చాడు. తద్వారా, ప్రభువు అతని పట్ల కటాక్షం చూపాడు. యాకోబు గొప్ప సంపదను, శ్రేయస్సును, సమృద్ధియైన దీవెనలను, ఆశీర్వాదకరమైన కుటుంబ జీవితమును, పిల్లలను, మరియు బలమును పొందుకున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ జీవితములో కూడా కార్యమును జరిగిస్తాడు. ఆయన మిమ్మును దీవించి, మిమ్మును విస్తరింపజేస్తాడు. కనుకనే, ధైర్యంగా ఉండండి! నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానమును నెరవేర్చుము. ప్రభువా, నీ వాగ్దానములను, ప్రవచనములను గట్టిగా పట్టుకొని, విశ్వాసంతో ప్రార్థించి, పవిత్రమైన జీవితములను గడుపుతూ, యాకోబు వలె నీకు విధేయులుగా జీవించుటకును, సమస్తమును కోల్పోయినప్పుడు కూడా నీ మార్గములలో నడిచునట్లుగా మమ్మును కూడా నీ మార్గములో నడిపించి, ఆశీర్వదించుము. దేవా, మేము అన్నిటియందు సర్వసమృద్ధిగా వర్థిల్లునట్లుగా చేసి, మా జీవితములో ఆశీర్వాదములను విస్తరించునట్లుగా చేయుము. ప్రభువా, నీవు మాకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించి, మేము చేయు ప్రతి పని విజయవంతమగునట్లుగా చేయుము. దేవా, యకోబు వలె మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించునట్లుగాను మా కుటుంబములను సురక్షితంగా స్థిరపరచుము. యేసయ్యా, మా మరియు మా ప్రియులగు వారికి ఎటువంటి కీడు తాకకుండా మమ్మును కాపాడుము. దేవా, మాకు విరోధముగా లేచు అసూయ కార్యములను మరియు దుష్టత్వము నుండి మమ్మును రక్షించుము. ప్రభువా, యాకోబుతో మాట్లాడినట్లుగానే, నీవు మాతో మాట్లాడి, నీ పరిపూర్ణ చిత్తములోనికి మమ్మును నడిపించుము. దేవా, యాకోబునకు నీవు వాగ్దానము చేసి, ఆశీర్వదించినట్లుగానే, ఈ రోజు నీ యొక్క ఆశీర్వాదములను మా మీద మరియు మా కుటుంబము మీద కుమ్మరించునట్లుగా మమ్మును విడువకుండా మాకు తోడుగా ఉండి, మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.