నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 కొరింథీయులకు 1:20 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై యున్నవి.'' నా ప్రియ స్నేహితులారా, ఈ వచనము అనుసారముగా, దేవుని వాగ్దానములు అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నవి. నా ప్రియులారా, ఈ రోజు మీ జీవితములో దేవుని వాగ్దానములు నెరవేరాలని మీరు వేచియున్నారేమో? ప్రభువు మీ కొరకు మరియు మీ కుటుంబము కొరకు, ఉద్యోగము లేక వ్యాపారము కొరకు ఒక గొప్ప వాగ్దానమును మీ జీవితము మరియు మీ భవిష్యత్తు కొరకు ఇచ్చియుండవచ్చును. మీరు మీ జీవితములో ఆ వాగ్దానములు నెరవేరాలని కనిపెడుతున్నారేమో? మీరు అనేక కష్టములను ఎదుర్కొంటున్నారేమో? మీరు కష్టపడుతూ, వేదనపడుచున్నారేమో? అంతా ఇంకా ముగిసిపోయింది అని మీరు అనుకుంటున్నారేమో? దేవుడు మీ కొరకు ఇచ్చిన వాగ్దానముపై మీరు విశ్వాసమును కోల్పోవుచున్నారేమో? అవును ప్రియ స్నేహితులారా, బైబిల్ గ్రంథములో కూడా అబ్రాహాము దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేరుతుందా? లేదా? అని అనుకోవడము కూడా చూస్తున్నాము. శారా అయితే, విన్నప్పుడు నవ్వింది. వృద్ధాప్యములో వారికి అనేకమంది బిడ్డలు, సంతతి కలుగుతుందని విన్నప్పుడు ఆమె నవ్వింది. వారు శ్రమలో నుండి వారిని విడిపిస్తానని ప్రభువు వాగ్దానము చేసినప్పుడు, ఇశ్రాయేలీయులు ఏమి చేశారో చూచినట్లయితే, ఐగుప్తు నుండి ఎప్పుడు వాగ్దాన దేశములోనికి వెళ్లతామో? అని వారు ఆశ్చర్యపోయి ఉండవచ్చును. ప్రభువు వారికి ఒక రక్షకుడు వస్తాడని వాగ్దానము చేసినప్పుడు, వారిని విడిపించడానికి వారి కొరకు మెస్సీయా పంపిస్తానని వాగ్దానము చేసినప్పుడు, వారు ఎదుర్కొంటున్న కష్టాలను బట్టి, అది జరగడము అసాధ్యము అని వారికి అనిపించి ఉండవచ్చును. వారు బంధీలుగాను మరియు బానిసత్వములో ఉన్నారు. కాబట్టి, అది నమ్మడానికి వారికి అసాధ్యమై ఉండవచ్చును. అయితే, వీటన్నిటి మధ్యలో కూడా ప్రతిసారి ప్రభువు తన వాగ్దానములను ఎలా నెరవేర్చాడో మనము చూడగలము. ప్రభువు వృద్ధాప్యములో కూడా అబ్రాహాము మరియు శారాలకు ఒక చక్కటి బిడ్డను అనుగ్రహించాడు. తద్వారా, అబ్రాహాము జనములకు తండ్రిగా మారాడు. ప్రభువు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి విడిపించి, వాగ్దాన దేశములోనికి నడిపించాడు. చివరిగా యేసయ్యా, మెస్సీయా వలె వచ్చి, తన పాపముల నుండి ప్రజలు విడిపించి, వారిని రక్షించాడు. మన రక్షకుడుగా ఆయన వచ్చి, తన ప్రజలను ఆయన విడిపించాడు. ప్రభువు వాగ్దానము చేసిన ప్రతిసారి, తన ప్రజలను ఎన్నడును విడిచిపెట్టలేదు. వాగ్దానములన్నియు ఆయన నెరవేర్చాడు.

మా కుటుంబములోను మరియు పరిచర్యలో కూడా దేవుడు అనేకమైన వాగ్దానములను మరియు ప్రణాళికలను మా పట్ల చేసి, వాటన్నిటిని కూడా ఎంతో నమ్మకముగా నెరవేర్చాడు. అనారోగ్యములో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులలోను మరియు పేదరికములో బాధపడుచున్నప్పుడు మరి మా తాతగారు డాక్టర్. డి.జి.యస్. దినకరన్‌గారి ద్వారా ఒక పెద్ద విశ్వవిద్యాలయమును నిర్మించాలని ప్రభువు వాగ్దానము చేసియున్నాడు. ఆయన చేతిలో అప్పుడు ఏమియు కూడా లేదు. అది నమ్మడానికి కూడా ఎంతో అసాధ్యమైన విషయము. అంత పెద్ద ప్రాజెక్టు నాకెలా లభిస్తుంది. కానీ, తన సేవకునికి ఆయన ఇచ్చిన ప్రణాళికలను మరియు వాగ్దానములను నెరవేర్చడములో ప్రభువు ఎంతగానో నమ్మకముగా ఉన్నాడు. ఈ రోజు కారుణ్య విశ్వవిద్యాలయము ప్రపంచములోని మరియు దేశములోని ఒక ఉన్నతమైన విశ్వవిద్యాలయముగా మరియు డీమ్డ్ యూనివర్సిటీగా ఉంటూ, ఉన్నతమైన ర్యాంక్యును పొందుకున్న విశ్వవిద్యాలముగాను మరియు అందరికి దీవెనకరముగా ఉంటున్నది. ప్రతి సంవత్సరము వేలకొలది మంది విద్యార్థులు ఇక్కడ నుండి ఉత్తీర్ణులై ఉంటూ, ఎంతో ఉన్నతమైన ఉద్యోగములలో చేరుతున్నారు. ప్రభువు చెప్పిన వాగ్దానములన్నియు కూడా మనకు నమ్మడానికి అసాధ్యముగా ఉన్నప్పటికిని, అవన్నియు క్రీస్తునందు అవును మరియు అమేన్ అన్నట్టుగా ఉన్నవి.

నా ప్రియులారా, నేడు మీరు శ్రమలలో ఉండవచ్చును, ఆర్థిక ఇబ్బందులలో ఉండవచ్చును, చేతులలో ఏమి లేకుండా ఉన్నారేమో? కాబట్టి, దేవుడు ఇచ్చిన వాగ్దానములను నమ్మడానికి అసాధ్యమైనదిగా ఉన్నదేమో? ఇప్పుడు మీ జీవితములో లేనిది, భవిష్యత్తులో ఏదైన ప్రారంభించవలసి వచ్చిన వ్యాపారము గురించి లేక జీవిత భాగస్వామిని గురించి దేవుడు వాగ్దానము చేసియున్నాడేమో? మీరు గర్భము ధరించడము అసాధ్యము, లేక మీరు ఈ వ్యాధి నుండి కోలుకోవడం అసాధ్యం మరియు మీరు బ్రతకడమే అసాధ్యము అని వైద్యులు ఒకవేళ చెబుతున్నారేమో? కానీ, దేవుడు తన స్వస్థతను వాగ్దానము చేసినప్పుడు, ఆయన నిశ్చయముగా, మిమ్మును జీవింపజేసి, వాగ్దానమును అనుభవించునట్లుగా చేస్తాడు. కాబట్టి, వాగ్దానములను హత్తుకొని ఉండండి, అవి మీ జీవితములో, క్రీస్తునందు అవును, అమేన్ అన్నట్టుగా ఉన్నవి. కనుకనే, ఈ రోజు అవి పొందుకుందామా? ఆలాగునే పొందుకొనుటకు మిమ్మును మీరు దేవునికి సమర్పించుకొనండి, నేటి వాగ్దానము ద్వారా దీవెనలు పొందుకొనండి. దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
వాగ్దానములను నెరవేర్చు మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానరము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు నేడు ఇచ్చిన వాగ్దానములన్నిటి బట్టి నీకు వందనాలు. దేవా, మా జీవితములో ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, నీవు మా పట్ల ఇచ్చిన వాగ్దానములు నమ్మడానికి కష్టతరముగా ఉండవచ్చును. అయితే, ఇప్పుడే నీ నిరీక్షణ మాలో నుండి ఉదయించును గాక. ప్రభువా, నీవు మమ్మును ఆదరించి, నీవు మా పట్ల ఇచ్చిన వాగ్దానములన్నిటిని నెరవేరుస్తావని మాకు నమ్మకమును కలుగజేయుము. దేవా, నీవు మా పట్ల ఇచ్చిన వాగ్దానములన్నియు క్రీస్తునందు అవును, ఆమేన్ అన్నట్టుగా మేము స్వీకరించుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, అవన్నియు మా జీవితములో త్వరగా జరుగునట్లుగా చేయుము. ప్రభువా, నీవు ఇచ్చు ఆశీర్వాదములను మేము అనుభవించునట్లుగా చేయుము. దేవా, మా కుటుంబాలను, మా హృదయాలను, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో నీవు మమ్మును సిద్ధపరచుము. ప్రభువా మా జీవితములో నీ ఆదరణను మరియు నిరీక్షణను మాకు కలుగజేయుము, ఇంకను నిన్ను గట్టిగా పట్టుకొనగల శక్తిని మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీతో మరియు నీ యొక్క ఆశీర్వాదములను మేము అనుభవించునట్లుగా కృపను మాకు దయచేయుము. దేవా, ఈ రోజు మమ్మును మరియు మా కుటుంబమును దీవించుము. యేసయ్యా, ఈ రోజంతా నీవు మాకు తోడుగా ఉండి, మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.