నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి 1పేతురు 2:3వ వచనమును ధ్యానించుటకు మిమ్మును ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఆ వచనము, "కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి'' ప్రకారము నిర్మలమైన పాలు అనగా, నిర్మలమైన వాక్యము అని అర్థము. ఇది మన ఆత్మను పోషిస్తుంది మరియు మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 8:3, మత్తయి 4:4, మరియు లూకా 4:4 వంటి లేఖనాలు మనకు గుర్తు చేయుచున్నవి, " అందుకాయన మనుష్యుడు రొటె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.'' నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథమునకు మీరు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారు? మీలో ప్రతి ఒక్కరికి మీ స్వంత బైబిల్ గ్రంథము ఉన్నదా? మా కుటుంబ జీవితములో చూచినట్లయితే, మా అమ్మగారు ప్రతి బిడ్డ పుట్టిన వెంటనే బైబిల్‌ను కొనడం మా తల్లిగారు ఒక అలవాటుగా చేసుకున్నారు, మా అమ్మగారు కొనే మొదటి వస్తువు బైబిల్‌గా ఉంటుంది. అందుకే తన బిడ్డలైన మమ్ములందరిని ప్రభువు దీవించాడు మరియు తద్వారా, దేవుడు మా కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించాడు.

బైబిల్ నుండి లూకా 5:5వ వచనమును మనము చదివినట్లయితే, సీమోను పేతురు అతని స్నేహితులు రాత్రంతయు శ్రమపడినను, వారు చేపలు పట్టలేకపోయారు. ఇంకను లూకా 5:4వ వచనములో యేసు ప్రభువు ఈలాగున చెప్పెను, " ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా'' యేసు ప్రభువు సీమోను పేతురు యొక్క దోనెలో కూర్చున్నప్పుడు, సీమోను పేతురు యేసు ప్రభువుతో ఇలాగున అన్నాడు, " నా ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు అని ఆయనతో చెప్పెను.'' ఆలాగుననే, వారు రాత్రంతయు కష్టపడినను, వారు ఏమి చేయలేకపోయారు. అతను దానితో ఆగిపోలేదు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది చూడండి, అదే వచనములో పేతురు ఈలాగున అంటున్నాడు, "అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.'' అదే విధముగా, లూకా 5:6వ వచనములో అద్భుతము జరిగినది. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.'' చూడండి, ఎంతటి గొప్ప అద్భుతకరమైనది కదా! అవును, నా ప్రియులారా, మీ స్వంత జీవితములో మీరు దేవుని వాక్యమునకు ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు, మీ జీవితములో ఆశీర్వాదములు పొంగిపొర్లుతాయి.

కనుకనే, నా ప్రియులారా, ఒకసారి మీ జీవితాన్ని పరీక్షించుకొనండి. ప్రతి రోజు మీరు దేవుని వాక్యమును చదవడానికి, ధ్యానించడానికి ఎంత సమయమును కేటాయించుచున్నారు? ఒకవేళ మీరు సరిగ్గా చేయలేకపోవుచున్నట్లయితే, దేవుని హస్తాలలోనికి మీ జీవితములను సమర్పించుకొని, యథార్థముగా దేవుని వాక్యమును చదువుటకు కావలసిన కృపను ఇవ్వమని దేవుని అడుగుదాము. ప్రతిరోజు క్రమముగా దేవుని వాక్యమును చదివే కృపను ఇవ్వమని వేడుకుందాము. దేవుని వాక్యమునకు విధేయులుగా ఉండడానికై ఇప్పుడే ప్రార్థన చేద్దాము. ఆలాగున చేసి, దేవుని ఆశీర్వాదాములను పొందుకుందాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ప్రతి రోజు నీ వాక్యమును చదువుటకు మాకు కావలసిన కృపను అనుగ్రహించుము. దేవా, ఈ రోజు నుండి నీ వాక్యమును క్రమముగా చదవాలి అనే నిర్ణయమును తీసుకొనుటకు మాకు అటువంటి హృదయమును దయచేసి, నీ వాక్యాన్ని హృదయపూర్వకంగా ధ్యానించే కృపతో మా హృదయాన్ని నింపుము. ప్రభువా, నీ వాక్యములో ఉన్న ప్రతి వాక్కు మా జీవితాలను బలపరచునట్లుగా చేయుము. దేవా, నీ వాక్యమును చదువుట ద్వారా నీ యొక్క సమృద్ధియైన ఆశీర్వాదములను పొందుటకు సహాయము చేయుము. ప్రభువా, నీ వాక్యము మా జీవితాలను మరియు మా కుటుంబాలను బలపరచునట్లుగా చేయుము. దేవా, నీ వాక్యము ద్వారా మా జీవితాలను రూపాంతరపరచుము. ప్రభువా, ప్రతిరోజు నీ వాక్యమును చదవాలనే ఆశతో మా హృదయాలు మరియు మా జీవితాలు నింపబడునట్లుగా చేయుము. దేవా, నీ వాక్యం నుండి మాకు జ్ఞానం మరియు అవగాహనను అనుగ్రహించి, మా జీవితాన్ని నీవు సమృద్ధిగా ఆశీర్వదించుము. దేవా, నీ వాక్యాన్ని ప్రేమించి, అనుసరించునట్లుగా మా హృదయాన్ని మార్చుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి భాగములోను నీ వాక్యం ఫలించునట్లుగా చేయుము. దేవా, నీ వాగ్దానాలను ప్రతిరోజు విశ్వసించే ధైర్యాన్ని మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ దృష్టిలో సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మమ్మును నడిపించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.