నా ప్రియ స్నేహితులారా, నేడు బైబిల్ నుండి కీర్తనలు 41:1వ వచనముగా ఒక అద్భుతమైన వాగ్దానమును మనము కలిగియున్నాము. ఆ వచనము, "బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును'' అని చెప్పబడినట్లుగానే, మీరు కూడా బీదలకు సహాయము చేసినప్పుడు, ఆయన మీ యొక్క ఆపత్కాలమందు మిమ్మును తప్పిస్తాడు. ఒకవేళ నా ప్రియులారా, మీరు ఈలాగున చెప్పవచ్చును, ' మేము పేదవారికి ఎందుకు సహాయము చేయాలి?' అని మీలో అనేకమంది అనుకుంటుండవచ్చును. ఇంకను, మేము పేదవారికి, అవసరతలో ఉన్నవారికి ఎందుకు సహాయము చేయాలి అని అనుకుంటున్నారేమో? ఇంకెవరైనా చూసుకుంటారులే అని అనుకుంటుండవచ్చును. వేరేవారు ఎవరైన సరే, వారికి సమాకూర్చుచుండవచ్చును అని అనుకుంటుండవచ్చును. నా స్వంత కుటుంబమును నేను చూచుకుంటే చాలు అని అనుకుంటూ ఉంటాము. నాకే నా సమస్యలు ఎన్నో ఉన్నాయని అనుకుంటారు. అయితే, బైబిల్ నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయములో యేసు ప్రభువు ఈలాగున అంటున్నాడు, "అందుకు రాజు మిక్కిలి అల్పులైన యా నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును'' అని చెప్పబడినట్లుగానే, మీరు కూడా అల్పులైన వారికి సహాయము చేయాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. అందుకే యేసు ప్రభువు, 'ఈ చిన్నవారికి సహాయము చేసినట్లయితే, నాకు సహాయము చేసినట్లుగానే,' అని సెలవిచ్చుచున్నాడు. బలహీనులకు మరియు నిరుపేదలకు మనము సహాయము చేసినప్పుడు, వారి స్వరమును వినిపించలేని వారికి మనము సహాయపడినప్పుడు, మనము ప్రభువును సేవించుచున్నట్లుగానే, మనము ప్రభువు కొరకు చేయుచున్నాము. నిస్సహాయుల పట్ల కనుపరచు ప్రతి కనికరముతో కూడిన కార్యములను దేవునికి జరిగించు ఆరాధనతో సమానముగా ఉంటుంది; అటువంటి ప్రేమను ఆయన ఎన్నటికిని మరచిపోడు. ఆయన దానికి తగిన ప్రతిఫలమును ఇస్తాడు.
అట్టివిధముగా చేసినటువంటి ఒక కుటుంబము యొక్క అద్భుతమైన సాక్ష్యమును మీకు తెలియజేయాలని నేను కోరుచున్నాను. గురుదాస్‌పూర్ నుండి పరమజిత్ అను ఒక ప్రియ సహోదరి తన యొక్క సాక్ష్యమును ఈలాగున పంచుకున్నారు. 25 సంవత్సరములుగా యేసు పిలుచుచున్నాడు పరిచర్యతో వారు అనుసంధానము కలిగియున్నారు. తన చెల్లెలందరికి కూడా వివాహము జరిగి, వారు ఒక చక్కని కుటుంబ జీవితములను కలిగియున్నారు. అయితే, అనేక సంవత్సరములైనప్పటికిని కూడా తనకు ఒక జీవిత భాగస్వామి దొరకలేదు. సంవత్సరాలుగా తను వేచియుండి ఉండెను. అటువంటి సమయములో, 'నీవు ఎందుకు ఇంకా వివాహము చేసుకోవడము లేదు అనియు, మీ దేవుడు ఎక్కడ ఉన్నాడనియు చాలామంది అడిగేవారు. అయితే, తను ఈలాగున చెప్పింది, 'నేను ఉపవాసము ఉండి, ఒకే ఒక కోరికను కోరుకున్నాను, ప్రభువా, నాకు ఒక దైవీకమైన జీవిత భాగస్వామిని ఇవ్వండి, పది సంవత్సరములు ఆ విధంగా గడిచిపోయినవి. ఇవన్నియు జరుగుచున్నప్పుడు, తను డాక్టర్. పాల్ దినకరన్‌గారికి ఒక ఉత్తరము వ్రాసి యుండెను. తాను వ్రాసిన ఉత్తరమునకు జవాబును పొందుకున్నప్పుడు, ఎంతగానో తన హృదయములో సమాధానమును పొందుకొనెను. ఆ ఉత్తరములో జవాబుగా, 'నిశ్చయముగా ముగింపు ఉన్నది, నీ నిరీక్షణ వ్యర్ధము కానేరదు, ఇంకను ప్రభువు మిమ్మును వర్థిల్లజేయడానికి ప్రణాళికలను కలిగియున్నాడు' అని చెప్పి డాక్టర్. పాల్ దినకరన్‌గారు జవాబును వ్రాసి పంపించారు. తను ఈ వాగ్దానములన్నిటిని గట్టిగా పట్టుకొనియుండెను. అయితే, 2009వ సంవత్సరములో తను 44 సంవత్సరముల వయస్సులో సహోదరులు పీటర్‌గారితో తనకు వివాహము జరిగియున్నది. వారు ఎంతో సంతోషమైనటువంటి అద్భుత కుటుంబ జీవితమును కలిగి జీవించసాగారు.
అయితే, రోజులు గడిచిపోవుచుండగా, వారు గర్భఫలమును పొందుకొనలేకపోయారు. వారు వివాహము చేసుకొనగానే, వారు కుటుంబ ఆశీర్వాద పధకములో భాగస్థులుగా చేరియున్నారు. తన భర్తకు విద్యుత్తుశాఖలో ఒక అద్భుతమైనటువంటి మంచి ఉద్యోగము ఉండినది. తను ఒక దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉండియున్నాడు. అయినప్పటికిని, 5 సంవత్సరములు గడిచినప్పటికిని కూడా, వారు బిడ్డను కనలేకపోయారు. తద్వారా, వారి హృదయము విరిగిపోయిన పరిస్థితిలోనికి వెళ్లిపోయారు. వారు నిరీక్షణ అంతటిని కూడా కోల్పోయారు. వారు తమ యొక్క వయస్సును బట్టి, వారికి ఇక పిల్లలు కలగడము లేదేమో అని అనుకున్నారు. మనము ఇక ఎన్నటికిని బిడ్డలను కనలేము అని ఎంతగానో బాధపడిపోయారు. అయినప్పటికిని కూడా సీషా ద్వారా చిన్నబిడ్డలకు ప్రోత్సాహమును కలిగించాలి అనుకున్నారు. ఏ నిరీక్షణ లేని పేద పిల్లలకు సహాయము చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆశ్చర్యకరముగా, రెండు నెలలలోనే ఆమె గర్భమును ధరించెను. ఆ పేద విద్యార్థులకు సహాయము చేసిన వెంటనే, 2015వ సంవత్సరములో ఒక అద్భుతమైనటువంటి బిడ్డకు తను జన్మనిచ్చెను. ఆ బిడ్డకు, ' మహిమ' అను పేరు పెట్టారు. ఈ రోజు ఆ అమ్మాయి చక్కగా ఎదిగియున్నది. నేటి దినములలో ఆ బిడ్డ దేవుని కొరకు అనేకమైన తలాంతులను కలిగియున్నది. ప్రభువు తనకు జ్ఞానమును అనుగ్రహించి, తన తరగతిలో కూడా ఉన్నతంగా హెచ్చించియున్నాడు.
అవును, నా ప్రియ స్నేహితులారా, ఆ కుటుంబము ఆ పేద పిల్లలందరికిని కూడా దీవెనకరముగా ఉండగా, ప్రభువు పరమజిత్ సహోదరికిని మరియు పీటర్ సహోదరునికి అద్భుతమైన కుమార్తెనిచ్చి, ప్రభువు అద్భుతంగా వారిని దీవించియున్నాడు. వారు నిరీక్షణ అంతయు కోల్పోయి ఉన్నామన్న పరిస్థితులలో ఉన్నప్పుడు, అయితే, చిన్నబిడ్డల పట్ల వారు జాలికలిగివారికి సహాయము చేసినప్పుడు, ప్రపంచము ఎవరినైతే, బలహీనులు అని అనుకుంటుందో, ఆ పేద పిల్లలకు సహాయము చేసినప్పుడు, ప్రభువు చక్కని బిడ్డతో దీవించాడు. ఇంకను వారు ఏ ఆశీర్వాదము కొరకైతే వేచియున్నారో, దానిని వారు పొందుకొనగలిగియున్నారు. నా ప్రియులారా, ఈ రోజు బలహీనుల పట్ల మీరు కనికరమును చూపెట్టినప్పుడు, ప్రభువు మిమ్మును కూడా చక్కని దీవెనలతో దీవిస్తాడు. మీరు దేనికొరకైతే ఎదురు చూస్తూ, ప్రార్థిస్తూ కనిపెడుచున్నారో, ప్రభువు ఆ దీవెనలను మీకు నిశ్చయముగా ఇస్తాడు. ప్రభువు కొరకు చేసినట్లుగా, మిక్కిలి అల్పులైన వారికి, చిన్నవారికి మరియు బలహీనులైన వారికి మీరు సహాయము చేసినప్పుడు, ప్రభువు మిమ్మును కూడా దీవిస్తాడు. ప్రభువు కొరకు చేసిన విధానముగా మీరు బలహీనులకు చేయాలి. ఇది దేవుని వాగ్దానం. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు ఈ అద్భుతమైన ఆశీర్వాదమును ప్రభువు యొద్ద నుండి పొందుకుందాము. నా ప్రియ స్నేహితులారా, మీరు బలహీనుల పట్ల శ్రద్ధ కలిగి, ప్రేమతో వారికి సేవ చేసినప్పుడు, ప్రభువు తానే మిమ్మును జ్ఞాపకము చేసుకుని, మిమ్మును కటాక్షించి, ఘనపరచి, మీ హృదయ కోరికలను తీర్చి మిమ్మును దీవిస్తాడు. ఈ రోజు మీరు ఎటువంటి అద్భుతం కొరకు ఎదురుచూస్తున్నను సరే, దేవుని యందు విశ్వాసముంచండి, ఇష్టపూర్వకమైన హృదయంతో ఇతరులకు సేవ చేసినట్లయితే, ఆయన తగిన కాలమందు మీకు ప్రతిఫలము అనుగ్రహించి, మిమ్మును హెచ్చిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, పేదలకు సహాయము చేయాలని ఈ రోజు నీవు మాకు జ్ఞాపకము చేసినందుకై నీకు వందనములు. ప్రభువా, బీదలకు మరియు బలహీనులకు నీ కొరకు చేసినట్లుగానే, ఈ రోజు సహాయము చేయాలని నిర్ణయము తీసుకుంటుండగా, మమ్మును ఘనపరచి, మాకు తగిన ప్రతిఫలమును దయచేయుము. దేవా, మేము నీ సేవకు ఇచ్చుటకును మరియు నీ సేవ చేయుటకు మాకు అటువంటి హృదయమును ఇచ్చి, మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, మేము ఎంతో కాలము నుండి వేచియున్నటువంటి ఆశీర్వాదమును మాకు అనుగ్రహించి, మమ్మును ఘనపరచుము. దేవా, నీ కొరకు చేసినట్లుగా మేము పేదలకు మరియు బలహీనులైన వారికి సేవ చేయుచుండగా మాకు తగిన ప్రతిఫలమును దయచేసి, మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, ఈ విషయమును మేము ప్రతి రోజు గుర్తుపెట్టుకొని, ఆలాగున నడుచుకొనుటకు మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీకు చేసిన విధముగానే, మేము ఎల్లప్పుడు ఇతరులకు సేవ చేయుటకు మాకు అటువంటి హృదయమును దయచేయుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


