నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము మీతో మాట్లాడడము నాకెంతో ఆనందముగా ఉన్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 58:9వ వచనమును మనము నేడు ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాను'' అని చెప్పబడిన ప్రకారం నేడు మీరు కలిగియున్న కష్టతరమైన పరిస్థితులను బట్టి సహాయము కొరకు మీరు ఈ వచనానుసారముగా దేవునికి మొఱ్ఱపెట్టుచున్నారా? స్వస్థత కొరకు ప్రభువును అడుగుచున్నారా? మీ ఆర్థిక ఇబ్బందులలో సహాయము కొరకు ప్రభువుకు మొఱ్ఱపెట్టుచున్నారా? మీ కుటుంబములో సమాధానము, ఉద్యోగము, మీ జీవితములో హెచ్చింపు కొరకు మరియు తర్వాతి మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని అడుగుచున్నారా? నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ మొఱ్ఱను ఆలకించి, మీకు సహాయము చేస్తాడు. ప్రభువు, ' ఇదిగో నేనున్నాను' అని మిమ్మును చూచి సెలవిచ్చుచున్నాడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, బైబిల్‌లో కీర్తనలు 91:15వ వచనములో చూచినట్లయితే, "అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను'' అని చెప్పబడిన ప్రకారం స్నేహితులారా, మీరు ప్రభువునకు ప్రార్థించినప్పుడు, ఆయన మిమ్మును రక్షిస్తాడు, మీ శ్రమలన్నిటిలో నుండి మిమ్మును విడిపిస్తాడు. బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 15వ అధ్యాయములో ఒక సందర్భమును మనము చదువుతాము. యేసయ్య, మరొక పట్టణమునకు ప్రయాణము చేయుచుండగా, ఆయన మార్గములో ఉండగా, కనానీయురాలైన ఒక స్త్రీ తనకు సహాయము చేయమని ప్రభువుకు మొఱ్ఱపెట్టినది. 'ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలు వేసెను.' ఆలాగుననే, ఆమె ఎంతో శ్రద్ధగా ప్రభువును అడిగినది. అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడుకొనగా, ఆమె మొఱ్ఱపెడుతుంది, గనుకనే, ఆమెను పంపించమని శిష్యులు చెప్పారు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి 'ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను.' కానీ, యేసు ప్రభువు ఆలాగున ఒక్క మాట కూడా ఆమెకు చెప్పలేదు. ఇంకను ఆమె విడువకుండా, ఎంతో పట్టుదలతో తన కుమార్తెను విడిపించమని యేసయ్యను అడుగుతూనే ఉండెను. యేసయ్యకు మొఱ్ఱపెట్టుచూనే ఉండెను. చివరిగా, 'అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ' ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.
అవును, నేడు నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ మొఱ్ఱలను కూడా ఆలకిస్తాడు. ప్రతి రోజు రాత్రి మీరు విలపించుచున్నారా? పడుకోలేకపోతున్నారా? మీ పరిస్థితి మిమ్మును వేదించుచున్నదా? సహాయము కొరకు మేము ఎక్కడకు వెళ్లినను కూడా పారద్రోలబడుచున్నాము అని అంటున్నారా? ఎవ్వరు నా మాట వినలేదు. మీరు స్వస్థత కొరకు మరియు బిడ్డల కొరకు వేచియున్నారా? జీవిత భాగస్వామి కొరకు వేచియున్నారా? మీ జీవితములో హెచ్చింపు కొరకు వేచియున్నారా? ఈ రోజు యేసయ్య యొద్ద మీరు మొఱ్ఱపెట్టుచుండగా, 'ఇదిగో, నేను ఇక్కడ ఉన్నాను,' అని మీతో అంటాడు. మీరు ఆయనకు మొఱ్ఱపెట్టుచుండగా, ఆయన మీకు వెంటనే ఉత్తరమిస్తాడు. ఆయన మిమ్మును కాపాడతాడు, మీ శ్రమలన్నిటిలో నుండి మిమ్మును విడిపించి, మిమ్మును గొప్ప చేస్తాడు. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీ కన్నీళ్లన్నియు ఆయన బుడ్డిలో దాచిపెట్టియున్నాడు అని ధైర్యము తెచ్చుకొనండి. మీ కన్నీళ్లు ఏవియు కూడా వృధా పోవు, ఈ రోజు ప్రభువు మీకు తప్పకుండా జవాబును ఇస్తాడు. కనుకనే, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్య, ఈ రోజు మేము మా హృదయపూర్వకంగా నీకు మొరపెట్టుచున్నాము, మరెవరూ విననప్పుడు మా కేకలను నీవు విని, ఇదిగో నేనున్నాను అని ప్రభువా, మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు నీవు మాకు జవాబును దయచేస్తావని నమ్ముచున్నాము. యేసయ్యా, మా యొక్క ప్రతి అవసరమును కొరకు నీకు మొఱ్ఱపెట్టుచున్నాము, మా యొక్క ప్రతి కన్నీటి బొట్టును, నీవు నీ బుడ్డిలో దాచి పెట్టియున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, మేము నీకు మొఱ్ఱపెట్టుచున్న ప్రతిసారి, నీవు మాతో కూడా ఉన్నావని చెప్పి, మాకు రావలసిన దీవెనలను మాకు అనుగ్రహించుము. యేస్యయా, మా అనారోగ్యమును స్వస్థపరచుము. దేవా, మా యొక్క ప్రతి కీడు నుండి మమ్మును కాపాడుము. ఇంకను ప్రభువా, మాకు మంచి ఉద్యోగము, చక్కటి కుటుంబ జీవితమును మాకు దయచేయుము. దేవా, మా చదువులలో ముందుకు రాణించడానికి మాకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించి, నీవు మాతో కూడా ఉన్నావని ఋజువుపరచుము. ప్రభువా, నీ యొక్క వాగ్దానము చొప్పున మమ్మును ఆశీర్వదించుము. దేవా, మా కష్టాలన్నిటి నుండి మమ్మును విడిపించి, మాకు సమాధానమును దయచేయుము. ఓ ప్రభువా, మా శరీరాన్ని ముట్టి, మాకు స్వస్థతను దయచేయుము. దేవా, మా కుటుంబాన్ని ఐక్యత మరియు ప్రేమతో దీవించుము. యేసయ్యా, మా జీవితంలో ఏర్పాటు మరియు అభివృద్ధి కొరకు ద్వారాలు తెరువుము. తదుపరి, మా జీవితములో ఏమి జరుగుతుందో మాకు చూపించుము మరియు మా మార్గాన్ని నిరీక్షణతో వెలిగించుము. ఇంకను దేవా, మా ప్రతి కన్నీటిని విలువైనదిగా పరిగణించినందుకు వందనాలు చెల్లించుచు, మా బాధలన్నింటిని నీవు ఆనందంగా మారుస్తావని మేము నమ్ముచూ, యేసు క్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.