నా ప్రశస్తమైన స్నేహితులారా, ఈ రోజు కార్మిక దినోత్సవం. కనుకనే, మీ చేతుల కష్టార్జితమును దేవుడు ఆశీర్వదించును గాక. నేడు మీ కుటుంబంలో, ఈ జీవనోపాధిలో, ఇతరులకు చేయు సేవలో మరియు ఆయనకు చేయు సేవలోను దేవుడు మిమ్మును నూతన మాసములో ఆశీర్వదించును గాక. ఈ నెలలో, మీ జీవితంలోని సమస్తమును తిరిగి నిర్మించాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 102:16వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీ కుటుంబములను మరల కట్టవలెనని మీ పట్ల ఆశించుచున్నాడు. అంతా కోల్పోయామని, సమస్తమును చెల్లాచెదరైపోయిందని, మీ జీవితం నుండి సమస్త మహిమ కనుమరుగైపోయిందని మీరు భావించవచ్చును. అయినప్పటికిని, దేవుడు ఇలాగున వాగ్దానము చేయుచున్నాడు: "నా నివాస స్థలంగా నిన్ను నేను తిరిగి నిర్మించెదను; నీ జీవితంలో నా మహిమతో నేను ప్రత్యక్షమవుతాను'' అని సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, నా ప్రియులారా, మీ జీవితం, కుటుంబం, శరీరం మరియు పరిచర్య అన్నియు ఆయన మహిమతో పునరుద్ధరించబడతాయి. కనుకనే, మీరు తిరిగి ప్రకాశించెదరు. కాబట్టి, మీ హృదయం కలవరపడనీయకండి; దేవుడు మిమ్మును తిరిగి కట్టుచుండగా, మీ జీవితములో మహిమతో నిండిన దినములు రాబోవుచున్నవి. బైబిల్‌లో యెషయా 61:4వ వచనములో చూచినట్లయితే, "చాలకాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు తరతరముల నుండి శిథిలములైయున్న పురములను బాగుచేయుదురు '' అని చెప్పబడినట్లుగా, ఎంతో కాలము నుండి పాడైన మీ స్థలములను మరియు పట్టణములను, శిథిలములైయున్న పురములను బాగుచేయునని ప్రకటించబడుచున్నది. పాడైనపోయిన గోడలు మరియు శిథిలమైనవి మరల కట్టబడతాయని బైబిల్ నుండి యెషయా 58:12వ వచనములో ఈలాగున మీకు వాగ్దానము చేయుచున్నాడు, " పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరుగబడినదానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును '' అని చెప్పబడినట్లుగానే, మీ జీవితంలో ఏది విరిగిపోయినప్పటికిని, దానిని తిరిగి కట్టడానికి దేవుడు మిమ్మును బలపరచి, తన మహిమతో నింపుతాడు. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. కనుకనే, మీ సంబంధములు నూతనపరచబడును; ఆనందం, ప్రేమ మరియు జీవితములో పరిపూర్ణత తిరిగి పునరుద్ధరించబడుతుంది.

దేవుడు దేనిని పునర్నిర్మిస్తాడు? మొదటగా, మీ సంపదను. అందుకే బైబిల్ నుండి ఆమోసు 9:14వ వచనములో చూచినట్లయితే, "మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు, మీ యొక్క బానిసత్వం నుండి పునరుద్ధరణను కలుగజేయునని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, నేడు మీరు బంధించబడినట్లుగా మరియు అభివృద్ధిని సాధించలేనట్లుగా భావించవచ్చును. అయితే, దేవుడు తన ఆత్మ ద్వారా మిమ్మును విడిపిస్తాడు. పాడైన వాటిని మీరు మరల కట్టెదరు, ద్రాక్ష తోటలను నాటుతారు, వాటి ఫలాన్ని త్రాగెదరు, తోటలను నాటుదురు, వాటి పంటను ఆనందించెదరు. మీ పని, వ్యాపారం, కుటుంబం, సేవా కార్యం మరియు దానం మరల ప్రతిఫలం ఇవ్వడం ప్రారంభిస్తాయి. బైబిల్ నుండి యెషయా 9:10వ వచనములో మనకు గుర్తు చేయుచున్నది: "వారు ఇటికలతో కట్టినది పడిపోయెను చెక్కిన రాళ్లతో కట్టుదము రండి; రావి కఱ్ణతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కఱ్ఱను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు'' అని చెప్పబడినట్లుగానే, ఇటుకలు కూలిపోయినా, సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, పేరు ప్రఖ్యాతులు, జ్ఞానం లేదా సామర్థ్యంలో అయినా, దేవుడు మరింత బలంగా తిరిగి కట్టడానికి మీకు సహాయం చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీకు నూతనమైన ఒక పునాది ఇస్తాడు. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 10:4వ వచనములో చూచినట్లయితే, " అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే'' అని చెప్పబడినట్లుగానే, మూలస్థంభమైన ఆ బండ యేసుక్రీస్తు. అవును, ఒక రాయితో గొల్యాతును కూల్చిన రీతిగానే, క్రీస్తు మీ దృఢమైన పునాదిగా మీతో నిలిచియుంటాడు. అంజూరపు వృక్షములను ఫలించని చోట, దేవుడు వాటి స్థానంలో దేవదారు వృక్షములను నిలబెడతాడు, అవి ఆయన బలం మరియు సమృద్ధిని సూచిస్తాయి. కనుకనే, నా ప్రియులారా, యేసును మీ యొక్క పునాదిగా తీసుకొని లేచి నిలువబడి, ఆయన మహిమతో మరల కట్టబడండి. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 15:16-18వ వచనములలో చూచినట్లయితే, " ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనొ ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైనవాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాదికాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది '' ప్రకారము పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టబడుతుందని చెప్పబడియున్నది. పాపం మరియు అవిశ్వాసం కారణంగా పడిపోయినప్పటికిని, క్షమాపణ నిమిత్తం మెస్సీయ అయిన యేసుక్రీస్తు త్యాగమును విశ్వసించుచూ ప్రజలు ఆయన వైపు తిరిగి వచ్చినప్పుడు, పునరుద్ధరణ దొరుకుతుంది. అదేవిధంగా, మీరు దేవుని వైపు తిరిగినప్పుడు, ఆయన మీ జీవితాన్ని తిరిగి కడతాడు.

రెండవదిగా, దేవుడు మీ కుటుంబమును పునర్నిర్మిస్తాడు. అందుకే బైబిల్ నుండి యోవేలు 2:25-27వ వచనములలో చూచినట్లయితే, " నేను పంపిన మిడుతలును గొంగళి పురుగు లును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును'' ప్రకారముగా మీ జీవితములో కోల్పోయిన సంవత్సరముల పునరుద్ధరణ కలిగిస్తాడని మరియు మిడతలు తినివేసిన దానికి ప్రతిఫలం ఇవ్వబడుతుందని వాగ్దానము చేయబడుచున్నది. నా ప్రియులారా, నేడు మీకు సమృద్ధి కలుగుతుంది, కనుకనే, ప్రభువును స్తుతించండి, ఇక ఎన్నటికిని మీరు అవమానపరచబడరు. దేవుడు మీ కుటుంబమును తన నివాసస్థలంగా రూపుదిద్ది, దానికి ఘనతను చేకూరుస్తాడు. అదియుగాక,"తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు. ఆయన సమస్త శరీరుల మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు'' అని చెప్పబడినట్లుగానే, అందుకు యేసుక్రీస్తే సాక్ష్యము(ప్రకటన 19:10). వారు తమ జీవితాలలో ఆయన చేసిన కార్యములను ధైర్యంతో పంచుకొనెదరు. ఇంకను మీ యౌవనులు దర్శనములను చూచెదరు, అభివృద్ధి పొందెదరు. వర్ధిల్లెదరు; వారు ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొంటూ, గొప్ప కార్యములను సాధించెదరు. ఇంకను మీ ముసలివారు ఆనందభరితమైన కలలుకందురు, పునరుద్ధరణ నెరవేరడాన్ని చూచెదరు. పరిశుద్ధాత్మ ద్వారా మీ కుటుంబమంతయు ప్రభువులో మరల కట్టబడుతుంది. మూడవదిగా, మీ పేరు పునర్నిర్మించబడుతుంది. మీ పేరు మరుగైపోయినదని లేదా అపకీర్తి పాలైందని మీరు భావించవచ్చును; కానీ ప్రకటన గ్రంథం 2:17లో చూచినట్లయితే, ఒక తెల్లని రాయిపై లిఖించబడిన ఒక కొత్త పేరును మీకు అనుగ్రహిస్తానని దేవుడు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 62:2 వ వచనములో చూచినట్లయితే, " జనములు నీ నీతిని కనుగొనును రాజులందరు నీ మహిమను చూచెదరు యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును'' అని చెప్పబడినట్లుగానే, దేవుడే స్వయంగా అనుగ్రహించే ఒక క్రొత్త పేరును మీరు పొందుతారు; ఇది మీకు ఘనతను, ఒక నూతన స్థానాన్ని, నూతన స్థాయిని మరియు సరికొత్త విజయాలను చేకూరుస్తుంది. మీరు నూతన మహిమలో నడిచెదరు. నా ప్రియులారా, ఇంకను దేవుడు తన సేవకులకు, తన ఆశీర్వాదంతో కూడిన ఒక క్రొత్త పేరును అనుగ్రహిస్తాడని యెషయా 65:15 వ వచనములో ప్రకటించబడుచున్నది. ఆలాగుననే, క్రీస్తు నిమిత్తం మీరు అవమానములకు గురైనప్పటికిని, మీ ద్వారా అనేకులు దేవుని గుర్తెరుగునట్లుగా ఆయన మిమ్మల్ని ఉన్నత స్థాయికి హెచ్చిస్తాడు. ఆయన మీకు శక్తితో కూడిన నూతన ఆధ్యాత్మిక గుర్తింపును అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్ నుండి జెఫన్యా 3:19వ వచనములో చెప్పబడినట్లుగానే, దేవుడు మిమ్మును హింసించేవారిని శిక్షించి, స్తుతి మరియు ఘనతలతో నిండిన పేరును మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఎక్కడైతే అవమానమును అనుభవించియున్నారో, సరిగ్గా అదే స్థలంలో ఇప్పుడు మీరు ఘనతను మరియు గుర్తింపును పొందుకొందురు. దేవుడు ఆకాశమును భూమిని, సముద్రమును మరియు నేలను కంపింపజేస్తాడని హగ్గయి 2:6వ వచనములో తెలియజేయబడియున్నది. ఈ ప్రకంపనల నడుమ, సమస్త జనముల మధ్య ఉన్న వాంఛయైన యేసు వచ్చి, తన ప్రజలను మహిమతో నింపుతాడు. నా ప్రియులారా, మీరు సజీవుడైన దేవుని ఆలయమై ఉన్నారు; కనుకనే, ఆయన మిమ్మును మునుపటికంటే నూతనమైన, అత్యధికమైన మహిమతో నింపుతాడు. సవాళ్లు మిమ్మును చుట్టుముట్టాయని మీకు అనిపించినప్పటికిని, ఈ కదలిక మిమ్మును ఆయన మహిమను పొందేందుకు సిద్ధపరుస్తుంది. మీలో ఉన్న క్రీ స్తు మహిమను గురించిన నిరీక్షణయై యున్నాడు. కనుకనే, నా ప్రియులారా, మీరు ధైర్యముగా ముందుకు కొనసాగండి. నేటి వాగ్దానము నుండి దేవుడు ఈ నూతన మాసమంతయు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమామయుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, మా జీవితంలోని ప్రతి విరిగిన భాగమును నీ చేతులకు అప్పగించుచున్నాము. దేవా, నీకు నివాస స్థలముగా మమ్మును తిరిగి కట్టుము మరియు నీ మహిమ మా మీద నిలిచియుండునట్లుగా నీకృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మేము కోల్పోయిన మరియు మా జీవితములో తినివేసిన వాటన్నిటిని తిరిగి ఇచ్చి, నీ ఆత్మ ద్వారా మా బలమును నూతనపరచుము. దేవా, మిడుతలు తినివేసిన మా సంవత్సరములన్నిటిని నీవు మాకు మరల తిరిగి దయచేయుము. ప్రభువైన యేసయ్యా, నీవే మాకు పునాదిగా ఉండి, నీ సత్యంలో మమ్మును స్థిరపరచుము. దేవా, నీ మహిమ మరియు ఘనత కొరకు మా కుటుంబమును, మా పనిని, మరియు మా పేరును తిరిగి కట్టుము. దేవా, నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపి, నూతన జీవితంలోకి మమ్మును నడిపించుము. యేసయ్యా, మా అవమానమును ఘనతగాను, మా బలహీనతను బలంగాను మార్చుము. ప్రభువా, మేము చేయుచున్న ప్రతి పనిలో మా జీవితం నీ మహిమను ప్రతిబింబించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.