నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క గొప్ప నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 సమూయేలు 22:2వ వచనమును మనకు ఇవ్వబడినది. ఆ వచనములో దావీదు దేవునితో ఇలాగున పలికియున్నాడు, "యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు'' అని అతడు గానము చేయుచున్నాడు. ఆలాగుననే, బైబిల్ నుండి 2 సమూయేలు 22:47వ వచనమును మనము చూచినట్లయితే, "యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయ దుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక'' అని చెప్పబడినట్లుగానే, 'యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయ దుర్గమైనవాడు' అని దావీదు అంటున్నాడు. దావీదు భక్తునికి అనేకమంది శత్రువులు ఉండేవారు. కానీ, అతడు ప్రార్థించి రక్షకుని వైపు చూచినప్పుడు, దేవుడు అతని యొక్క శత్రువులందరి నుండి అతనిని విమోచించెను. ఆ సమయములో దావీదు భక్తుడు ఈలాగున అంటున్నాడు, 2 సమూయేలు 22:47వ వచనములో చూచినట్లయితే, "...నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక'' అని అంటున్నాడు. దావీదు దేవునిని తన రక్షకునిగా చేసుకున్నందున దేవుడు అతనిని కాపాడి సంరక్షించి, ఉన్నత స్థానమునకు హెచ్చించాడు.
అదేవిధముగా, క్రొత్త నిబంధన గ్రంథములో గలతీయులకు వ్రాసిన పత్రిక 2:20వ వచనములో భక్తుడైన సౌలును మనము చూడగలము. ఆ వచనములో సౌలు పౌలుగా రూపాంతరము చెందుట మనము చూడగలము. సౌలు క్రీస్తును వెంబడిస్తున్నటువంటి విశ్వాసులందరిని కూడా సంహరిస్తుండేవాడు. దేవుని యెదుట అతడు చెడు జీవితమును కలిగియున్నాడు. కానీ, యేసయ్యా, అతని జీవితములోనికి ప్రవేశించాడు. యేసయ్య, అతనికి దర్శనమిచ్చి, 'సౌలా నీవు ఎంతకాలము నన్ను హింసించెదవు? నన్ను బాధపెడతావు?' అని అతనిని ప్రశ్నించాడు. ప్రభువు అతని హృదయమును తాకాడు. సౌలును పౌలుగా మార్చాడు.
నా ప్రియులారా, అతడు సంపూర్ణముగా రూపాంతరము చెందాడు. అందుకే బైబిల్ నుండి గలతీయులకు వ్రాసిన పత్రిక 2:20వ వచనములో అతడు ఏమి చెబుతున్నాడని మనము చదువుదాము, " నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' అని పౌలు భక్తుడు ఇక్కడ చెబుతున్నాడు. ఇంకను అతడు, 'యేసయ్య, నన్ను ప్రేమించి, సిలువకు తన్నుతాను అప్పగించుకున్నాడు' అని అంటున్నాడు. తద్వారా, అతడు పౌలుగా మార్చాబడ్డాడు. అంతమాత్రమే కాదు, సౌలుగా ఉన్న అతడు సంపూర్ణముగా రూపాంతరము చెందాడు. యేసయ్యను తన స్వంత రక్షకునిగా అంగీకరించాడు. దేవుని శక్తి ద్వారా బలమైనటువంటి సేవకునిగా ప్రభువు చేత వాడుకొనబడియున్నాడు. చూడండి, ఇది ఎంతటి గొప్ప ధన్యత కదా!
నా ప్రియ స్నేహితులారా, మీరు ప్రభువును మీ ఆశ్రయ దుర్గముగా కలిగియున్నారా? మీ దుర్గముగాను, మీ విమోచకునిగాను, మీ రక్షకునిగా కలిగియున్నారా? అన్నిటి కొరకై ఆయనను మీరు హత్తుకొనియున్నారా? అయితే, మీరు ప్రభువును హత్తుకున్నప్పుడు, ప్రభువు మీ యందు ఇష్టము కలిగియుంటాడు. అంతమాత్రమే కాదు, మిమ్ములను కూడా తన యొక్క మహిమార్థమై వాడుకుంటాడు. నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మీ జీవితములను దేవునికి సమర్పించుకొనండి. ఇంకను, యేసయ్యను మీ స్వంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభువు యెదుట ఆయనకు ప్రీతికరమైన జీవితమును కలిగియుండండి. అప్పుడు దేవుడు మీకు కోటగాను, రక్షణగాను, ఆశ్రయ దుర్గముగా ఉండి, మిమ్మును పౌలు వలె బలంగా తన సేవలో వాడుకుంటాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మాకు నీవిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానమును బట్టి నీకు వందనములు. యేసయ్యా, నీవు ఆ సిలువలో చేసినటువంటి త్యాగమునకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, మా హృదయాలను నీవు తాకి, మమ్మును నీ బిడ్డలనుగా మార్చుము. ప్రభువా, చెడు జీవితములను కలిగియున్న మమ్మును, నీకు దూరముగా ఉన్న మమ్మును మరియు మా ప్రియులను మా హృదయాలను ఇప్పుడే తాకుము, నీవు మమ్మునందరిని నీకు సమీపముగా తీసుకొని రమ్ము. యేసయ్యా, నీ యొక్క సిలువ రక్తముతో మమ్మును కడుగుము. దేవా, సౌలును పౌలుగా మార్చిన రీతిగా మమ్మును కూడా మార్చుము. ప్రభువా, నీ యొద్దకు వచ్చు మమ్మునందరిని నీవు నిశ్చయముగా ఆశీర్వదించుము. యేసయ్యా, నీవు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టియు వందనములు. ప్రభువా, నీవు మాకు ఆశ్రయదుర్గముగాను, కోటగాను మరియు విమోచకునిగా ఉండి, మమ్మును నీ యొద్దకు నడిపించుము. దేవా, మా జీవితములు నీకు ప్రీతికరంగా ఉండునట్లుగాను, నీ మహిమ కొరకు శక్తివంతంగా మేము వాడబడునట్లుగా కృపను దయచేయుమని యేసుక్రీస్తు అత్యంత ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


