నాకెంతో ప్రియమైనవారలారా, ఈ నెలలో మీ కొరకు నేను ప్రార్థన చేయగా, ప్రభువు నా హృదయములో ఈ వాగ్దానమును ఉంచెను: ఈ నూతన మాసము కొరకైన వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 51:18వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నీ కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయుము యెరూషలేము యొక్క గోడలను కట్టించుము'' అని చెప్పబడినట్లుగానే, ఇది ఎంత ఆదరణపూరితమైన నిశ్చయత కదా! దేవుడు తన బిడ్డలను వృద్ధిపరచుట మాత్రమే గాక, వారి జీవితములోని విరిగిపోయిన స్థితిలోనున్న ప్రతి అంశమును మరల కట్టును. సీయోను దేనిని సూచించుచున్నదో మీకు తెలుసునా? అది దేవుని యొక్క నివాస స్థలము. నేడు, యేసుక్రీస్తు ద్వారా, మీ హృదయము ఆయనకు సీయోనువలె మారుచున్నది. మీలో ఆయన యొక్క సింహాసనమును స్థాపించుటకు ప్రభువు తీర్మానించుకొనియున్నాడు. అందుకే బైబిల్ నుండి 1 యోహాను 4:4వ వచనములో చూచినట్లయితే, "మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు'' అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అవును, ప్రభువు మీలో నివసించుచున్నాడు గనుక, మీరు మీ భవిష్యత్తును గూర్చి భయపడనవసరము లేదు. అయితే, మీరు ' ప్రభువా, నీ చిత్త ప్రకారము మరియు నీ కటాక్షము చొప్పున మమ్మును ఆశీర్వదించుము' అని చెప్పి, మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకున్నట్లయితే, మీ జీవితములోని ప్రతి అంశమును ఆయన నిర్మించును. మీరు దేవుని బిడ్డలై యున్నారు. కనుకనే, ఆయన కన్నులు నిత్యము మీ మీద నిలిచి ఉంటాయి.

అనేక సంవత్సరముల క్రితం, దైవసేవకుడైన విలియం బ్రాన్‌హంగారి యొక్క కుమారుడు బిల్లీ పాల్‌గారు ఒక అద్భుతమైన అనుభవమును పంచుకొన్నారు. ఒకసారి పరిచర్య నిమిత్తము ప్రయాణించుచున్నప్పుడు, ఆ తండ్రి కొడుకులు, ఇద్దరు ఒక హోటల్ గదిలో బస చేశారు. ఒక రాత్రి, ఆలస్యముగా బ్రాన్‌హంగారు తన కుమారుడైన బిల్లీగారిని లేపి, 'నాతో మాటలాడు దేవదూతను నువ్వు చూడాలని ఆశించుచున్నావా?' అని అడిగాడు. అందుకు అతడు అంగీకరించాడు. ఆయన యొక్క ఆధ్యాత్మిక కన్నులు తెరుచుకొనగా, తన వెనుక అందమైన ముఖవర్చస్సుతో ఒక దేవదూత నిలబడి ఉండుటను ఆయన చూసెను. అయితే, బిల్లీగారి దృష్టిని అధికముగా ఆకర్షించిన అంశమేమనగా, ఆ దేవదూత చూపు. తన తండ్రి ఎక్కడికి వెళ్లినా లేదా మాట్లాడినా, ఆ దేవదూత కళ్లు ప్రేమపూర్వకంగా ఆయనపైనే నిలిచి ఉండుటను, ఎంతో ప్రేమతోను మరియు శ్రద్ధతోను ఆయనను చూస్తూ ఉండుటను ఆయన గమనించెను. ప్రియులారా, నేడు ప్రభువు మిమ్మును కూడ అదేవిధంగా చూచుచున్నాడు. ఆయన యొక్క ప్రేమ ద్వారా, తన కటాక్షము చొప్పున దేవుడు మీ జీవితమును మేలుతో నింపును. అందుకే బైబిల్ నుండి 3 యోహాను 2వ వచనములో చూచినట్లయితే, "ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను'' అని దేవుని వృద్ధిపరచు మార్గము ఎంతో చక్కగా వివరించబడినది. ప్రభువు మీ విశ్వాసమును బలపరచుట ద్వారా ముందుగా మీ ఆత్మను వృద్ధిపరచును మరియు మీ జీవితములోని అత్యంత క్లిష్ట సమయములలో సహితం, ఆయన సమస్తమునకు మించి చాలినవాడని చెప్పునట్లుగా ప్రభువు మిమ్మల్ని సిద్ధపరచును. మీ ఆత్మ ఆవిధంగా వృద్ధిపొందినప్పుడు, సమస్తము ఆయన ఆశీర్వాదము క్రిందికి వచ్చును.

మొట్టమొదటిగా, నీతియందు ఆయన మిమ్మును వృద్ధిపరచును. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 23:3వ వచనములో చూచినట్లయితే, "నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు'' అని సెలవిచ్చుచున్నది. మన ప్రాణమును ఆయన సేదదీర్చుట ద్వారా ప్రభువు మన జీవితములలో ఆయన క్రియలను ప్రారంభించును. బహుశా, మీ జీవితములో అనేక సంవత్సరములుగా దేని కొరకైనను ఇబ్బంధిపడుచుండవచ్చును. అయితే, దేవుడు మిమ్మును విడిచిపెట్టలేదని మీరు తెలుసుకొనవలెని ఆయన ఆశించుచున్నాడు. మీ జీవితము నీతి మీద కట్టబడినప్పుడు, ఏ నింద, అసూయ, చెడు ప్రచారం లేక అంధకార శక్తులు మీకు వ్యతిరేకంగా రావు. ప్రభువే మిమ్మల్ని ఘనపరచి, కాపాడి, స్థిరపరచును. రెండవదిగా, స్తుతుల యందు ఆయన మిమ్మును వృద్ధిపరచును. కృతజ్ఞతా స్తుతుల యందు ప్రభువు మిమ్మును వృద్ధిపరచవలెనని ఆశించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 63:3వ వచనమును చూచినట్లయితే, " నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును'' అని సెలవిచ్చుచున్నది. కనుకనే, ఒక వ్యక్తికి దేవుడు ఇవ్వగల గొప్ప ఆశీర్వాదము ఏమనగా, ఎటువంటి పరిస్థితిలోనైను ఆయనను స్తుతించే హృదయము. ప్రియులారా, బహుశా, నేడు మీరు అనేక సవాళ్లను ఎదుర్కొనుచుండవచ్చును. కానీ ఏదైన శక్తివంతముగా చేయమని ప్రభువు మిమ్మును ఆహ్వానించుచున్నాడు. జవాబు లభించుటకు ముందే ఆయనను స్తుతించుట ప్రారంభించవలెనని ఆయన ఆశించుచున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడు గనుక ఆయనను స్తుతించండి. ఆయన మీకు తోడై యున్నాడు గనుక ఆయనను స్తుతించండి. మీరు చూడలేకపోయినను, ఆయన మీ తరపున క్రియ చేయుచున్నాడు గనుక ఆయనను స్తుతించండి. మీ హృదయము స్తుతులతో నింపబడినప్పుడు, నిరాశ తొలగిపోవును మరియు మీ కన్నులు సమస్యలన్నిటి కంటె గొప్పవాడైన దేవుని మీద ఉంచబడును. మూడవదిగా, ఆయన యొక్క అద్భుతమైన సృష్టిగా మిమ్మును వృద్ధిపరచును. ఆయన యొక్క అద్భుతకార్యముల నిమిత్తము సాధనముగా మారే అభివృద్ధిని ప్రభువు ఇవ్వాలని ఆశించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 139:14వ వచనమును చూచినట్లయితే, "నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది'' అని సెలవిచ్చుచున్నది. దేవుడు మన హృదయములలో ఆయన యొక్క సింహాసనమును స్థాపించెనని మనము గుర్తించినప్పుడు, మనకు మనకే భిన్నముగా కనిపించెదము. మన బలహీనతల మీద దృష్టిపెట్టుటకు బదులుగా, మనలో నివసించువాని యొక్క గొప్పదనమును చూచుట ప్రారంభించెదము. బహుశా, నేడు మీరు మీ పరిమితులను చూచుకొనుచుండవచ్చును. ఆయన హస్తము మీ జీవితము మీదనున్నది మరియు మీ కొరకు ఆయన ఉద్దేశ్యములు మారలేదు. ప్రభువు మీ కొరకు మరియు మీ ద్వారా ఆశ్చర్యకరమైన కార్యములను చేయుచున్నాడు.

నాల్గవదిగా, బుద్ధియందును మరియు జ్ఞానమునందును ఆయన మిమ్మును వృద్ధిపరచును. మీ ఆత్మకు మేలు కలుగజేసి, మిమ్మును గొప్ప ఉన్నత స్థితికి చేర్చే జ్ఞానమునందును మరియు బుద్ధియందును మిమ్మును వృద్ధిపరచవలెనని ప్రభువు ఆశించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి సామెతలు 2:5 మరియు 9 వచనములలో చెప్పబడెను, "యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు'' అని చెప్పబడిన ప్రకారము ఇది ఎంత అమూల్యమైన వాగ్దానము కదా! బహుశా! నేడు మీరు, మీ చదువులు, మీ భవిష్యత్తు, మీ ఉద్యోగము, మీ కుటుంబము లేక మీ పరిచర్యకు సంబంధించిన దారిలో నిలబడి యుండవచ్చును. మీ ఆత్మ దేవుని జ్ఞానమునందును మరియు బుద్ధియందును వృద్ధిపొంది నప్పుడు, ఆయన మీ యెదుటనున్న మంచి మార్గమును మీకు బయల్పరచును. ఆయన మీ కొరకు సిద్ధపరచిన మంచి భవిష్యత్తులోనికి మీరు నడిపించబడుదురు. ఐదవదిగా, ఆయన మిమ్మును తన మేలులతోను, సమృద్ధితోను వృద్ధిపరచును. ఆశీర్వాదములు మరియు మేలులయందు మిమ్మును వృద్ధిపరచవలెనని ప్రభువు ఆశించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి యిర్మీయా 31:14వ వచనములో చూచినట్లయితే, "నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు '' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రకారమే, ప్రభువు తన బిడ్డలను ఆయన యొక్క మేలులతో తృప్తిపరచుట యందు ఆనందించుచున్నాడు. ప్రియులారా, ప్రభువు, అలసిపోయిన మీ ఆత్మను ఉజ్జీవింపజేయును, పిరికితనముతోనున్న మీ హృదయమును బలపరచును మరియు మీ జీవితమును ఆయన యొక్క మేలులతోను మరియు సమృద్ధితోను నింపును. చివరిగా, ఆయన ప్రేమను పంచుకొనుటయందు మిమ్మును వృద్ధిపరచును. దేవుడు మనకు ఇచ్చే అత్యున్నతమైన సమృద్ధి ఏమనగా, ఇతరులకు ఆశీర్వాదకరముగా మారే భాగ్యం. అందుకే బైబిల్ నుండి మత్తయి 11:29వ వచనములో చూచినట్లయితే, "నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును'' అని యేసు సెలవిచ్చుచున్నాడు దేవుడు మీ హృదయమును తీర్చిదిద్దుటకు మీరు అనుమతించినట్లయితే, ఆయన తన యొక్క దీనత్వము, తగ్గింపు, కనికరము మరియు ఉధారత్వముతో మిమ్మును నింపును. ఆయన కన్నుల ద్వారా మీరు ప్రజలను చూచెదరు మరియు ఆయన ప్రేమతో మీరు వారిని ప్రేమించెదరు. కనుక, ధైర్యముగా ఉండండి. ఆయన కన్నులు మీ మీదనున్నవి, ఆయన హస్తము మీ జీవితము మీద నున్నది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 51:18వ వచనములో చూచినట్లయితే, "నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలు చేయుము యెరూషలేము యొక్క గోడలను కట్టించుము'' అని ఆయన వాగ్దానము ప్రకారం, ఆయన మిమ్మును వృద్ధిపరచి, ఆయన యొక్క కటాక్షము చొప్పున మరియు ఆయన చిత్త ప్రకారం మీ జీవితములోని ప్రతి అంశమును ఆయన కట్టును. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల పరలోకమందున్న మా తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. తండ్రీ, మాకు మేలు చేస్తానని, మా జీవితంలోని ప్రతి విరిగిన భాగాన్ని బాగుచేస్తానని నీవు చేసిన వాగ్దానమునకై నీకు వందనములు. దేవా, నీ బిడ్డలైన మమ్మును మానసికముగాను మరియు శారీరకముగాను వృద్ధిపరచుము. ప్రభువా, మా జీవితములలోని ప్రతి విరిగిన స్థితిని మరల కట్టుము, మా హృదయములలోని దుఃఖమును తొలగించుము. యేసయ్యా, నీ యందు గుప్తములై ఉన్న నీ బుద్ధి, జ్ఞానములతో మమ్మును నింపుము మరియు నీ కటాక్షము చొప్పున, నీ చిత్త ప్రకారం మమ్మును ఆశీర్వదించుము. దేవా, నీ సన్నిధిలో మా ఆత్మ వర్ధిల్లునట్లుగా చేసి, నీ నీతియందు, నిన్ను స్తుతించుట యందు, నీ జ్ఞానమందు, మరియు నీ సమృద్ధియందు మమ్మును స్థిరపరచుము. ప్రభువా, నీ మేలుతో మమ్మును నింపి మరియు అనేకులకు మమ్మును ఆశీర్వాదకరంగా చేయుము. దేవా, నీ ప్రేమగల కన్నులు మా మీద ఉంచి, మేము వేయుచున్న ప్రతి అడుగును మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.