నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు మోసపోవుచున్నట్లుగా భావించుచున్నారా? మీ కుటుంబ సభ్యులు మరియు మీ స్నేహితులు మిమ్మును క్రిందకు త్రోసివేసినట్లుగా ఉంటున్నదా? అందరు మిమ్మును అణిచివేయుచున్నట్లుగా మీరు భావించుచున్నారా? అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మీకా 5:2వ వచనములో ఈ విధముగా మీకు వాగ్దానము చేయబడుచున్నది. ఆ వచనము, " బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును; పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను'' అని చెప్పబడిన ప్రకారము అవును, మీలో నుండి ఆశీర్వాదాలు నేడు రానున్నాయి. ప్రజలు మిమ్మును మోసము చేసినను, మిమ్మును అణగద్రొక్కినను సరే, మీలో నుండి ఆశీర్వాదములు రాబోవుచున్నవని ఆయన మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, మీరు దిగులుపడకండి.

అవును, మా తండ్రిగారు చాలా ఔదార్యముగల వ్యక్తియై యున్నారు. ఆయనను ఎవరు డబ్బులు అడిగినను సరే, ఇస్తూనే ఉంటారు. వారు తిరిగి ఇవ్వకపోయినను సరే, మా తండ్రిగారు అస్సలు చింతించేవారు కాదు. మా దగ్గర పని చేయుచున్న ఒక వ్యక్తి వచ్చి, 'అయ్యా, ఒక్క నెలలో మీకు తిరిగి ఇచ్చేస్తాను. నాకు కొంత డబ్బు ఇవ్వండి అని అడిగారు.' అతను అడిగినది 20 వేల రూపాయలు. ఇది దాదాపు పది మరియు పదిహేను సంవత్సరముల క్రితము జరిగిన ఒక సంఘటన. ఆ కాలములో అది చాలా పెద్ద డబ్బు. మా తండ్రిగారు రెండవసారి కూడా ఏమి ఆలోచించకుండా తిరిగి అతనికి డబ్బులు తీసి ఇచ్చేశారు. పది రోజులలో మీకు తిరిగి ఇచ్చేస్తాను అని ఆ అన్నయ్య చెప్పారు. అయితే, అతడు పది రోజులలో తన ఉద్యోగమును వదిలి వేసి తన స్వంత ఊరికి తిరిగి వెళ్లిపోయాడు. అతడు మరి ఎన్నడు కూడా తిరిగి రాలేదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అందులో, ఇది ఒక్కటి మాత్రమే. కానీ, మా తండ్రిగారు దీనిని గురించి ఎప్పుడు పట్టించుకునేవారు కాదు. దేవుడు నాకు ఇచ్చియున్నాడు. నేను వారికి ఇచ్చాను అని చెప్పేవారు.

నా ప్రియులారా, ఒకవేళ మీరు కూడా మోసపోవుచున్నారేమో? నేడు మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తుల ద్వారా మీరు మోసపోవుచున్నారేమో? మా తండ్రిగారు ఇప్పటి వరకు కూడా ఆలాగే ఉన్నారు. దేవుడు నన్ను ఆశీర్వదించియున్నాడు గనుకనే, ఇవ్వడమే నా పని అని అంటుంటారు. ఆలాగే మీరు ఎన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారని ప్రభువు మిమ్మును చూస్తున్నాడు. మా నాన్నగారిని దీవించిన అదే దేవుడు నేడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. మా తండ్రిగారు దంతవైద్యులు, ఆయనగారు తిరునెల్వేలిలో ఎంతో ప్రాముఖ్యతను పొందియున్న ఒక వైద్యులు. అదంతయు దేవుని ఆశీర్వాదముల వలననే కలిగినది. ఆయన ద్వారా నేను కూడా దీవించబడ్డాను. నేను ఒక వైద్యురాలను మరియు పరిచర్యకు పిలువబడ్డాను. అద్భుతమైన కుటుంబము ద్వారా నేను దీవించబడియున్నాను. అందుకే బైబిల్ నుండి యెషయా 60:22వ వచనములో చూచినట్లయితే, "వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును'' అని చెప్పబడిన విధముగా, మీలో ఎన్నికలేనివారు బలమైన జనముగా ఉంటారు. ప్రభువు మిమ్మును ఆశీర్వదించి, మీ ద్వారా మీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. కనుకనే, ఆయన మిమ్మును చూచి, " నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును '' అని చెబుతున్నాడు. కనుకనే, మీరు అణిచివేయబడుచున్నప్పటికిని కూడా మరియు మోసపోవుచున్నప్పటికిని కూడా మీ హృదయమును బ్రద్ధలు కానివ్వకండి, ప్రభువే మిమ్మును మరియు మీ కుటుంబాన్ని నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము కార్చిన కన్నీళ్లు మరియు మేము కోల్పోయిన నమ్మకాన్ని నీవు గుర్తెరిగియున్నావు కనుకనే, ప్రభువా, మా నుండి ఆశీర్వాదాలు వస్తాయని మాకు వాగ్దానం చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువైన యేసయ్యా, నీ యొక్క అద్భుతమైన వాగ్దానము కొరకై నీకు వందనాలు. దేవా, నీ బిడ్డలైన మేము కార్చిన కన్నీటిని నీవు చూచి, మేము మోసపోయి, సిగ్గుపడిన వేళలన్నిటిని కూడా చూచుచున్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా స్వంత కుటుంబ సభ్యులు మమ్మును మోసపరచియున్నారు కనుకనే, నీవు మమ్మును చూచి, స్వంత సోదరీ, సోదరులు, లేక భర్త, భార్య మరియు బిడ్డలు తల్లిదండ్రులైన మాకు విరోధముగా మాట్లాడినందున విరిగిన స్థితిలో ఉన్న మా హృదయములను చూచి, నీవు మాలో నుండి ఏలునట్లుగా మా హృదయాలను మార్చుము. దేవా, మేము ఎల్లప్పుడు నిన్ను గట్టిగా పట్టుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా బాధలలో కూడా, నీ ఉద్దేశ్యం మాలో నుండి ఎదుగునట్లుగా చేయుము. యేసయ్యా, మా గాయాలను కృపా బావులుగాను మరియు మా దుఃఖాన్ని స్తుతిగానములుగాను మార్చుము. దేవా, నీవు మమ్మును ప్రతిరోజు క్షమించినట్లుగానే, మమ్మును బాధపెట్టిన వారిని క్షమించుటకు మాకు నేర్పుము. ప్రభువా, మేము ఏమియు పొందలేనప్పుడు కూడా ఇవ్వడంలో ఆనందంతో మమ్మును నింపుము. దేవా, ఇతరులు నీ యొక్క మంచితనాన్ని చూడగలిగేలా నీ వెలుగు మా ద్వారా ప్రకాశించునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితంలో నీ చేతుల పని ద్వారా మా కుటుంబాన్ని మరియు రాబోయే తరాలను ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.