నా ప్రియమైనవారలారా, ఈ నూతన మాసము ప్రారంభమై, జీవితములో బాధ్యతలు, ఒత్తిళ్లు మరియు చింతలతో నిండిపోవుచున్న సమయములో నిజమైన సమాధానము మరియు నిత్యమైన కాపుదల లభించే ఆ పరలోకం వైపు మీ కన్నులను ఎత్తవలెనని ప్రభువు మీకు మృదువుగా గుర్తుచేయుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 కొరింథీయులకు 5:1వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "భూమి మీద మన గుడారమైన యా నివాసము శిథిలమై పోయినను, చేతి పనికాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మన కున్నదని యెరుగుదుము'' అని చెప్పబడినట్లుగానే, మానవ హస్తాలతో నిర్మించబడని, ఆయనే సిద్ధపరచిన ఒక నిత్యగృహమును ఇస్తానని దేవుడు తన బిడ్డలైన మీకు వాగ్దానము చేయుచున్నాడు. ఈనాడు నా ప్రియులారా, ఇది మీ హృదయమునకు ఎంతటి ఆదరణను కలిగించే వాగ్దానము కదా! బైబిల్‌లో మత్తయి సువార్త 10:41-42వ వచనములలో చూచినట్లయితే, యేసు " మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.'' ఆయనను విశ్వాసంతో వెంబడించువారికి, నీతిగా జీవించువారికి మరియు ఆయన రాజ్యాము కొరకు యథార్థతతో సేవ చేయువారికి పరలోకంలో నిత్య బహుమానములు సిద్ధపరచబడియున్నవి. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, మీ జీవితంలోని ప్రతి దశలోనూ యేసుకు సన్నిహితంగా ఉండు విశ్వాసపరులైన శిష్యులకు మొదటి పరలోక బహుమానము లభించుచున్నది. అందుకే బైబిల్ నుండి యోహాను 8:31వ వచనములో చూచినట్లయితే, "కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు '' అని చెప్పబడినట్లుగానే, తన బోధనలకు గట్టిగా లోబడి ఉండువారు మాత్రమే నిజమైన శిష్యులని యేసు సెలవిచ్చియున్నాడు. బైబిల్‌నందు మగ్దలేని మరియ ఈ భక్తిని ఎంతో చక్కగా ప్రత్యక్షపరచియున్నది. యేసు ఆమెను విడిపించిన తర్వాత, ఆమె ఆయన కనికరమును, ప్రేమను నిత్యము మరవబడలేదు. సిలువ వేయబడిన ఆ బాధాకరమైన సమయములలో, అనేకులు భయంతో దూరంగా వెళ్ళిపోయినప్పటికిని, ఆమె మాత్రం అచంచలమైన విశ్వాసంతో ఆయనకు దగ్గరలోనే నిలిచియుండెను. యేసు పట్ల ఆమెకున్న గాఢమైన ప్రేమ కారణంగా, పునరుత్థానుడైన క్రీస్తును చూచిన వారిలో ఈమె మొట్టమొదటి వ్యక్తిగా నిలిచిపోయినది. నా ప్రియులారా, అదేవిధంగా, మీరు దృష్టి చెదరగొట్టు విషయాలకంటే ప్రార్థనను, రాజీపడటంకంటే పరిశుద్ధతను, సౌకర్యముకంటే విధేయతను ఎంచుకున్నప్పుడు ప్రభువు మీ పట్ల ఆనందిస్తాడు.

రెండవ పరలోక ప్రతిఫలం నీతిమంతమైన జీవితమును జీవించిన వారి కొరకు ఇవ్వబడుతుంది. అందుకే బైబిల్ నుండి దానియేలు 12:3వ వచనములో చూచినట్లయితే, "బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు'' అని చెప్పబడినట్లుగానే, అనేకులను నీతి మార్గంలో నడిపించువారు నక్షత్రములవలె నిరంతరం ప్రకాశిస్తారు. నీతి అంటే, క్షమాగుణం, వినయం, పవిత్రత, దయ మరియు ప్రేమ ద్వారా మన అనుదిన జీవితంలో క్రీస్తు స్వభావమును ప్రతిబింబించడము మాత్రమే. కనుకనే, నా ప్రియులారా, మిమ్మును పూర్తిగా దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఇతరులను బలపరచడానికి మరియు నడిపించడానికి ఆయన మిమ్మును వాడుకుంటాడు. మూడవదిగా, ప్రజలకు ఆదరణను, బలమును మరియు పునరుద్ధరణను కలిగించు మాటలను మాట్లాడడం ద్వారా, ప్రవచనాత్మకంగా తనకు సేవ చేయువారికి కూడా ప్రభువు ప్రతిఫలమిచ్చుచున్నాడు. అందుకే బైబిల్ నుండి ఆమోసు 3:7వ వచనములో చూచినట్లయితే, " తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు'' అని తెలియజేసినట్లుగానే, దేవుడు తన హృదయమును తన సేవకులతో పంచుకుంటాడు; తద్వారా సొమ్మసిల్లిన ఆత్మలకు నిరీక్షణను కలిగించుచూ, వారు మరువబడలేదని వారికి గుర్తుచేయుచున్నాడు.

ఇందుకు ఒక చక్కటి ఉదాహరణగా, నామక్కల్ జిల్లాకు చెందిన ఎస్తేరు రాసాత్తి. ఆమె ఎన్నో అత్యధికమైన ఆర్థిక భారములు, నిరాశతో కృంగిపోయి ఆమె, ఒక 'యేసు పిలుచుచున్నాడు ప్రార్థన కూటములో' పాల్గొనెను. ఆమె తీసుకున్న అప్పుల వారు ఆమె యొద్ద ఆ డబ్బులు వసూలు చేయువారు ఆమెను ఎల్లప్పుడు ఎగతాళి చేసేవారు. ఆమె తన కష్టాలను జయించడానికి చేసిన ప్రతీ ప్రయత్నం విఫలమైనది. తీవ్ర నిరాశలో, దేవుని నుండి చివరిగా ఒక అద్భుతమైన జరుగుతుందేమోనన్న గొప్ప నిరీక్షణతో, ఆమె ఆ కూటమునకు పాల్గొనుటకు ముందుగా ఒక ఆత్మహత్య ఉత్తరము కూడా రాసి పెట్టెను. ప్రార్థనా కూటము సమయంలో, ఈ ప్రవచన వాక్యములను చెప్పమని పరిశుద్ధాత్మ నా హృదయాన్ని ప్రేరేపించెను: 'రసాత్తి, నీవు ఆర్థిక సమస్యల కారణంగా ఎంతో దుఃఖంతో ఇక్కడికి వచ్చియున్నావు. కానీ, ఈ రోజు నుండి ప్రభువు నిన్ను ఆశీర్వదించుచున్నాడు; మీ దుఃఖము సంతోషముగా మారిపోతుంది' అని ఆమె పేరు పెట్టి పిలిచి, ఆమె యొక్క సమస్యను కూడా తెలియజేశాను. ఆ మాటలు విన్న వెంటనే, దేవుని సన్నిధి ఆమె హృదయమును సమాధానముతోను, నూతన నిరీక్షణతోనూ నింపినది. ఆనాటి నుండి ప్రభువు అద్భుతరీతిలో ఆమె కొరకు ఆర్థిక మార్గములను తెరచి, ఆమె అప్పులన్నింటిని పూర్తిగా తీర్చబడడానికి సహాయపడియున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, దేవుని ప్రవచనాత్మక పరిచర్యలోని మాధుర్యం ఇదియే. ఆయన మీ బాధను చూచుచున్నాడు, మీరు వెళ్లుచున్న అంధకార సమయములలో మీకు నిరీక్షణను పంచుతాడు మరియు ఆయన హస్తం ఇంకా మీ జీవితము మీద ఉన్నందున మీ కథ ఇంకా అంతముకాలేదని మీకు గుర్తుచేయుచున్నాడు. కనుకనే, మీరు ఎటువంటి పరిస్థితులలో ఉన్నను సరే, ఇప్పుడే మిమ్మును మీరు దేవునికి సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును నేటి వాగ్దానము నుండి దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమామయుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నిన్ను విశ్వాసంతో వెంబడించువారికి నిత్య ప్రతిఫలములను సిద్ధపరచినందుకై నీకు వందనములు. దేవా, మా జీవితంలోని ప్రతి దశలోనూ నీకు సన్నిహితంగా ఉండునట్లుగా మాకు సహాయం చేయుము. ప్రభువా, ప్రతిదినం నీతి, దీనత్వము మరియు విధేయతతో నడుచుకొనునట్లుగా మాకు నేర్పించుము. దేవా, నలిగిన వారిని ఓదార్చడానికి మరియు అలసిపోయిన వారిని బలపరచడానికి మా హృదయమును ప్రేమతో నింపుము. ప్రభువా, నీ మంచితనాన్ని ప్రతిబింబించు సాధనంగా మరియు ఇతరులను నీకు దగ్గరగా తీసుకువచ్చు ఒక సాధనంగా మమ్మును వాడుకొనుము. దేవా, శ్రమలు మమ్మును చుట్టుముట్టినప్పుడు కూడా, మా దృష్టిని ఎల్లప్పుడూ పరలోకము మీదనే నిలుపుటకు మాకు సహాయం చేయుము. ప్రభువా, మా ప్రేమ ప్రయాసను ఎన్నడు మరువకుండా, నీవు మమ్మును జ్ఞాపకము చేసుకొని, మాకు తగిన ప్రతిఫలమును అనుగ్రహించుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.