నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 62:5 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...పెండ్లికుమారుడు పెండ్లికూతురిని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును'' ప్రకారము, ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యలో ప్రభువు నివసించడానికి ఎంతగానో ఇష్టపడ్డాడు. మరియు యెషయా 65:19వ వచనములో ప్రభువు ఇలాగున అంటున్నాడు, "నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను నా జనులను గూర్చి హర్షించెదను రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు'' మరియు యెషయా 62:4లో ప్రభువు అంటున్నాడు, "విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును'' ప్రకారం ప్రభువు తన వధువుగా ఉన్న యెరూషలేమును 'హెప్సీబా' అను పేరుతో పిలుచుచున్నాడు. 'హెప్సీబా' అనగా, " నా ఆనందము ఆమె యందు ఉన్నది'' అని అర్థము.

ఇంకను బైబిల్ నుండి యెషయా 62:12వ వచనములో చూచినట్లయితే, "పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును'' ప్రకారం విడువబడినటువంటి, ఒంటరియైనటువంటి ఆ దేశమునకు అనేకమైన నూతన పేర్లను ప్రభువు పెట్టియున్నాడు. అనగా, 'వారికి నూతన ఆరంభము కలుగుతుంది' అని దానికి అర్థము. ఇశ్రాయేలు దేశము అనేకమైన శత్రువుల చేత చుట్టబడియున్నది, వారందరు కూడా ఇశ్రాయేలును నశింపజేయాలని ప్రయత్నించుచున్నారు. అయితే, ప్రభువు ఆమె యందు ఆనందించుచున్నాడు కాబట్టి, ఇశ్రాయేలు ఇంకను కొనసాగుచున్నది. ఇశ్రాయేలునకు విరోధముగా ఏ ఆయుధము కూడా వర్థిల్లదు. ప్రభువు తన ప్రజలను ప్రేమించినప్పుడు, ఆయన వారిని కాపాడతాడు. వారి పైన ఉన్నటువంటి శాపములన్నిటిని ఆయన ఆశీర్వాదములుగా మారుస్తాడు.

నా ప్రియులారా, మొదటి శత్రువైన సాతాను మీ పైన శాపములను వేయాలని అనుకుంటున్నాడేమో? అయితే, ఆ సిలువలో యేసుక్రీస్తు చేసిన త్యాగము, ప్రతి శాపమును కూడా నశింపజేయుచున్నది. యేసు మీ యందు ఆనందించుచున్నాడు. ఆయన త్వరగా రానై యున్నాడు. యేసుక్రీస్తు అతి త్వరలో తిరిగి మన యొద్దకు రానైయున్నాడు. వధువై యున్న మనలను పరలోకమునకు తీసుకొని వెళ్లడానికి ఆయన తిరిగి వస్తున్నాడు. పరలోకములో మనము ఆయనతో కలిసి ఆనందించబోవుచున్నాము. పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెను బట్టి సంతోషించునట్లుగా, ఆయన మిమ్మును గూర్చి ఆనందించుచున్నాడు. దేవుని ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు వర్ణింపనాశక్యమైన సంతోషము మీకు కలుగుతుంది. ప్రభువు మీ యందు కూడా అట్టి విధముగా ఆనందించుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, ప్రభువు మీ యందు ఆనందించాలని మీరు తలంచినట్లయితే, నిశ్చయముగా, మీ జీవితాలను ఆయనకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును గురించి, సంతోషించి నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రేమగల ప్రభువా, వరుడు తన వధువును బట్టి సంతోషించునట్లు మమ్మును బట్టి సంతోషించినందుకు నీకు వందనాలు. ప్రభువా, మమ్మును విమోచించబడినవారని, పరిశుద్ధులనియు, విడిచిపెట్టబడనివారనియు పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, నీ యొక్క ఆత్మ నీ ప్రజలపైకి దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, నీ వాక్యము చెప్పిన రీతిగా మా హృదయములను నీ యొక్క సంతోషముతో నింపునట్లుగా చేయుము. ప్రభువా, నీవు వాగ్దానము చేసినట్లుగానే, నీ సంతోషము మా మీదికి దిగివచ్చునట్లు చేయుము. దేవా, నీవు మా యందు ఆనందించుము. యేసయ్యా, మా యందు ఉన్న నీ యొక్క సంతోషమును వర్థిల్లింపజేయు ము. ప్రభువా, నీ యొక్క సంతోషముతో మేము పొంగిపొర్లు కృపను దయచేయుము. ప్రభువా, నీ సంతోషము చేత మమ్మును తృప్తిపరచుము. దేవా, ఈ లోకములో ఏదియు కూడా మమ్మును సంతోషపరచజాలదు. కాబట్టి, నీ యొక్క సంతోషముతో మమ్మును నింపుము. ప్రభువా, నీవు మా యందు ఆనందించుచున్నావు కాబట్టి మేము నిన్ను స్తుతించుటకును మరియు శత్రువు యొక్క ప్రతి బాణము నుండి మరియు ప్రతి శాపము నుండి నీవు మమ్మును కాపాడి, సంరక్షించుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మును వర్ణించలేని ఆనందం మరియు శాంతితో నింపుము. దేవా, నీవు తిరిగి రానై యున్న నీ యొక్క రాకడకు మా హృదయాన్ని సిద్ధపరచుకొనుటకు నీ కృపను అనుగ్రహించి, తద్వారా మేము పరలోకంలో నీతో నిత్యము ఆనందించుటకు సహాయము చేయుమని యేసుక్రీస్తు కృపగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.