హలో నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 46:4వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తలవెండ్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అవును, మీ వృద్దాప్యము వరకు ప్రభువు మిమ్మును కాపాడుతాడు అని మీతో చెబుతున్నాడు. అనేకసార్లు మన భవిష్యత్తును గురించి మనము ఎంతో చింతిస్తుంటుంటాము. మరి ముఖ్యముగా ప్రస్తుత ప్రపంచములో అనేకమంది ఒంటరితనముతో భావిస్తుంటాము. సాధారణముగా, 40 లేక 50 సంవత్సరములు వచ్చిన తరువాత, నేను ఒంటరిగా ఉంటాను అని ఆలోచిస్తుంటాము కదా! "నా జీవిత భాగస్వామికి ఏదైనా జరిగినట్లయితే, నేనేమి చేయవలెను. నేను ఒంటరిగా ఉండవలసినదియే. నన్ను ఎవరు చూసుకుంటారు, నా అవసరతలన్నియు ఎవరు తీరుస్తారు'' అని అనుకుంటాము. అవును నా ప్రియులారా, ఆ విధంగా ఆలోచించడము సాధారణమైన ఒక విషయముగా ఉంటున్నది.
అయితే, ప్రభువు ఇలాగున అంటున్నాడు, "మీ యొక్క వృద్ధాప్యము వరకు నేను మిమ్మును జాగ్రత్తగా చూచుకుంటాను'' అని దేవుని వాక్యము తెలియజేయుచున్నది. ఈ వచనమును నేను చదివినప్పుడు, మా బామ్మగారైన స్టెల్లా దినకరన్‌గారు నాకు జ్ఞాపకమునకు వచ్చారు. ఒకరోజు నేను చింతపడుతూ, నేను వారి యొద్దకు వెళ్లి, ఈలాగున అడిగియున్నాను," బామ్మ మీకేమైన సహాయము కావాలంటే, నన్ను అడగండి, నేను వచ్చి, మీకు సహాయము చేస్తాను అని అన్నాను. '' ఆలాగుననే, మేమందరము కలిసి ఒక కూటమునకు వెళ్లుచున్న సమయములో, యింటిలో తాను ఒంటరిగా ఉండియున్నారు. అప్పుడు నేను మా బామ్మగారి యొద్దకు వెళ్లి, ' బామ్మా, మీరు ఒక్కరే ఏలాగున ఉంటారు?'' అని నేను అడిగాను. అందుకు మా బామ్మగారు ఈలాగున చెప్పారు, "నాకు ఏంటమ్మా భయము, యేసయ్య, నాతో కూడా ఉన్నాడు. కాబట్టి, నేను ఒంటరిదానను కాదు, యేసయ్యా, నాకు తోడుగా ఉన్నాడు, నేను ఎందుకు చింతించాలి. ఆయనే, అన్నిటిని చూసుకుంటాడు. నాకు అస్సలు విసుగు పుట్టనే పుట్టదు. ఒంటరి అని తలంపు నాకు రాదు. ఇంకను నేను యేసయ్యతో మాట్లాడుతూ ఉంటాను, ఆయన నాతో మాట్లాడుతూ ఉంటాడు'' అని చెప్పారు.
అవును, నా ప్రియమైన స్నేహితులారా, నేటి దినములలో మీలో కూడా అనేకులు ఒంటరిగా భావిస్తూ ఉంటుండవచ్చును. మీరు ఒంటరిగా ఉంటూ, ' ఒంటరిగా ఉన్న నేనేమి చేయాలి? 'అని అనుకుంటుండవచ్చును. అయితే, ప్రభువు అంటున్నాడు, " నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను చూచుకుంటాను'' అని వాగ్దానము చేయుచున్నాడు. బామ్మగారు, ఈ రోజు కూడా ఉదయముననే తలుపు తీయ్యడానికి కూడ ఎవ్వరిని అనుమతించరు. బామ్మగారు, నాతో, "ప్రభువు నాకు బలమిచ్చాడు, నా పనులు నేను చూసుకోగలను'' అని చెబుతూ ఉంటారు. అవును, నా ప్రియులారా, అదే బలముతో ఈ రోజు ప్రభువు మిమ్ములను అందరిని నింపబోవుచున్నాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 40:29-31 వ వచనములలో చూచినట్లయితే, "సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచి పోవుదురు'' అని చెప్పబడినట్లుగానే, సొమ్మసిల్లియున్న మీకు బలమిచ్చువాడు ఆయనే, ఆయనే శక్తిహీనులైన మీకు బలాభివృద్ధి కలుగజేయుచున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు ప్రభువు ఇటువంటి బలమును మీకిచ్చి, మిమ్మును తన శక్తితో నింపబోవుచున్నాడు. కనునకే, ఈ బలమును నేడు మీరు పొందుకొనుటకు మీ హృదయాలను దేవునికి సమర్పించి, ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, ప్రభువు మిమ్మును తన పరిశుద్ధాత్మతో నింపుచున్నాడు. నిశ్చయముగా, దేవుడు, మిమ్మును ముదిమి వచ్చు వరకు ఆయన ఎత్తికొనుచూ, మీ తల వెండ్రుకలు నెరయు వరకు మిమ్మును ఎత్తికొని మోయును. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీ యొక్క అద్భుతమైన వాగ్దానమును బట్టి నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మా జీవితాంత ము, మా వృద్ధాప్యంలో కూడా మమ్మును పోషిస్తానని నీవు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనములు. దేవా, మా భవిష్యత్తును గురించిన మా యొక్క చింతలను తొలగించి, మా భవిష్యత్తు పట్ల నీవు కలిగియున్న ఉద్దేశములను నీవెరుగుదువు. కనుకనే, నేడు మా పట్ల నీ ఉద్దేశములను నెరవేర్చుము. దేవా, బలహీనులమైన మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో బలపరచి, మా వృద్ధాప్యము వరకు నీవు మమ్మును జాగ్రత్తగా చూచుకొనుము. ప్రభువా, మేము ఎప్పుడు కూడా ఒంటరిగా భావించకుండా, నీవు మాతో ఉన్నావని మేము గుర్తెరుగునట్లుగా మాకు కృపను చూపుము. దేవా, ఇక మా జీవితములో ఒంటరితనము ఉండకూడదు, దుఃఖము ఉండకూడదు, ఆర్థిక పరిస్థితులు కష్టముగా ఉండకూడదు. దేవా, మాకు కావలసిన వాటన్నిటిని సమృద్ధిగా అనుగ్రహించుము. దేవా, మా భవిష్యత్తును గురించిన ఆందోళన చెందుతున్న, ఒంటరిగా జీవిస్తున్న, లేదా మా ప్రియులైన వారిని కోల్పోయి దుఃఖిస్తున్న మా ప్రతి ఒక్కరిని నీ శక్తితో బలపరచుము. ప్రభువా, తమ పిల్లల బాగోగులు పట్టించుకోని వారికి తోడుగా ఉండి, వారిని నీ పరిశుద్ధాత్మతో నింపి, వారు ఎన్నడూ ఒంటరిగా లేదా విచారంగా భావించకుండా చేయుము. దేవా, ఒంటరిగా ఉన్నటువంటివారికి బలము, శాంతి మరియు వారికి అవసరమైనవన్నియు దయచేయుము. ప్రభువా, మా యొక్క ప్రతి ఆర్థిక కష్టాన్ని తొలగించి, ప్రతిరోజూ మమ్మును పోషించుము. యేసయ్య, నీవు ఎల్లప్పుడూ మాతో ఉంటావనియు మరియు మమ్మును జాగ్రత్తగా చూసుకుంటావని గుర్తుంచునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితాలను నీ సన్నిధి, ఓదార్పు, బలము మరియు ఆనందముతో నింపుమని యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


