నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటివరకు మీరు దేవుని రాజ్యం కొరకు విత్తిన ప్రతి విత్తనమునకు దేవుడు మీకు సమృద్ధియైన వర్థిల్లతను మరియు ప్రతిఫలాలను ఈ నూతన మాసములో ఇవ్వబోవుచున్నాడు. ఈ నెల కొరకైన దేవుని వాగ్దానముగా బైబిల్ నుండి మలాకీ 3:10వ వచనం ఆధారంగా ఇవ్వబడినది. ఆ వచనము, "నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొని రండి; దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు'' ప్రకారం దేవుడు సమృద్ధిగల దేవుడుగా ఉన్నాడు. ఈ నూతన మాసములో ఆయన విస్తారమైన కృపను మనకు అనుగ్రహించుచున్నాడు. అందుకే బైబిల్‌లో, 2 కొరింథీయులకు 9:8వ వచనమును చూచినట్లయితే, " మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు'' మరియు యోహాను 10:10వ వచనములో "సమృద్ధి జీవము '' మరియు "సమృద్ధియైన ప్రేమ'' (నిర్గమకాండము 34:6). ఇంకను ప్రభువు, " నేను విస్తారమైన ప్రేమను కలిగియున్నాను మరియు ఒప్పుకొని పశ్చాత్తాపపడే వారిని క్షమిస్తాను'' అని చెప్పుటకు సమర్థుడైన దేవుడు ఆయన మాత్రమే. అందుకే వాక్యములో, " ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టు వారందరి యెడల కృపాతిశయము గలవాడవు'' మరియు ఆయన ఐశ్వర్యవంతులలో సమృద్ధిగలవాడు. అందుకే బైబిల్‌లో ఫిలిప్పీయులకు 4:19వ వచనములో చూచినట్లయితే, "కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును '' అని చెప్పబడియున్నది. ఇంకను కీర్తనలు 36:8వ వచనములో చూచినట్లయితే, "నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు'' ప్రకారం ఆయన మందిరములో ఉన్న సమృద్ధి వలన మనలను సంతృప్తిపరచే దేవుడు. కనుకనే, మీరు ఆయన యందు సంతోషించండి.

బైబిల్‌లో నోవహు కాలంలో చూచినట్లయితే, "నోవహు వయస్సు యొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను'' ఆదికాండము 7:11వ వచనములో ఉన్నట్లుగా, దేవుడు తీర్పులో కూడా జలప్రవాహముల ద్వారాలను తెరుస్తాడు. కానీ, నీతిగా జీవించువారికి, ఆయన ఆశీర్వదించడానికి పరలోకపు వాకిళ్లను తెరుస్తాడు. ఇంకను ద్వితీయోపదేశకాండము 28:8వ వచనములో ఇలాగున చెబుతుంది, " నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును'' ప్రకారం ఇందులో మీ కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, చదువులు, పరిచర్య మరియు పరిపాలన ఉన్నాయి. మనం ప్రభువుకు విధేయులైనప్పుడు ఈ ఆశీర్వాదాలన్నియు మనకు లభిస్తాయి. ఆలాగుననే, ద్వితీయోపదేశకాండము 28:1-2వ వచనములలో చూచినట్లయితే, విధేయత తరువాత ఆశీర్వాదాలు లభిస్తాయని నొక్కి చెప్పబడియున్నది. దేవుడు మీ హృదయంతో సమాధానపరచమని లేదా ఏదైనా తిరిగి ఇవ్వాలని లేదా ధారాళంగా ఇవ్వాలని లేదా తన పరిచర్యకు సహాయము చేయాలని మాట్లాడినట్లయితే, మీరు ఆ మాటలకు విధేయత చూపినప్పుడు, దేవుడు పరలోకపు ద్వారాలను తెరుచుట ద్వారా మీ విధేయతను ఘనపరుస్తాడు.

బైబిల్‌లో అబ్రాహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక, ఎలా విధేయత చూపి వెళ్ళాడో హెబ్రీయులకు 11:8వ వచనములో మనము చూడగలము. ఆ వచనములో, " అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను'' అని చెప్పబడియున్నది. అయినప్పటికీ దేవుడు అతనికి మరియు శారాకు ఒక బిడ్డను దయచేసి మరియు ఒక బలమైన జనముగా మార్చబడునట్లుగా అతనికి గొప్ప స్వాస్థ్యమును అనుగ్రహించాడు. ఇంకను, " మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని '' (యెషయా 51:2 మరియు ఆదికాండము 26:4-5)లో మనం విధేయతతో నడుచుకున్నప్పుడు లేనివాటిని దేవుడు తన సన్నిధి ద్వారా ఉన్నట్లుగా పిలుస్తాడని ఈ వచనాలు మనకు గుర్తు చేయుచున్నవి. విధేయత పరలోకపు ద్వారములను తెరుచునట్లుగా చేయుచున్నది. ఇంకను బైబిల్‌లో, 1 సమూయేలు 15:22వ వచనములో చెప్పినట్లుగానే, " అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము'' ప్రకారం బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు శ్రేష్టము అని చెప్పబడియున్నది. యేసుక్రీస్తు తల్లియైన మరియ కానా ఊరి వివాహ విందులో ఆయన తల్లి పరిచారకులను చూచి, "ఆయన మీతో చెప్పునది చేయుడనెను.'' వారు ఆయనకు విధేయులయ్యారు మరియు నీరు అత్యంత మధురమైన ద్రాక్షారసంగా మార్చబడింది. ఆకాశపు వాకిళ్లు తెరుచుకున్నాయి. అపొస్తలుల కార్యములు 5:29 లో, అపొస్తలులు ఇలాగున అన్నారు, "అందుకు పేతురును అపొస్తలులును మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా'' ప్రకారం మనము కూడా దేవునికి లోబడవలెనని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. వారి సమయం వచ్చేవరకు ఎవరూ వారిని ఆపలేరు. వారు యేసును బోధించారు, అద్భుతాలు చేశారు మరియు ప్రజల మధ్యలో స్వస్థత తీసుకొని వచ్చారు.

నా ప్రియులారా, నేడు మీరు దేవునికి విధేయత చూపినప్పుడు, మీకు విరోధముగా రూపొందింపబడిన యే ఆయుధమూ వర్థిల్లదు. కనుకనే, నేటి నుండి దేవునికి విధేయతను చూపండి మరియు ఆయనను నమ్మండి. బైబిల్‌లో రోమా 5:19 ఇలాగున చెబుతుంది, " ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు'' ప్రకారం, మనము విధేయత చూపినప్పుడు, మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఆలాగుననే, రోమా 4:14వ వచనములో విధేయతతో మరియు విశ్వాసంతో కూడిన ప్రార్థనలకు ప్రత్యుత్తరంగా దేవుడు అద్భుతాలను వాగ్దానం చేయుచున్నాడు. ఇంకను 1 కొరింథీయులకు 15:58వ వచనములో చూచినట్లయితే, "కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి'' ప్రకారం ప్రభువు పనిని చేయమని మనకు చెబుతుంది; ప్రభువునందు మీ శ్రమ ఎన్నటికీ వ్యర్థం కాదు. ఇంకను పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే (ఎఫెసీయులకు 6:1) అని చెప్పబడియున్నది. ఆలాగుననే, భూసంబంధమైన యజమానులకు (ఎఫెసీయులకు 6:5) మరియు ప్రభుత్వ చట్టాలకు కూడా లోబడండి, అప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు. ఇంకను, ' భార్యలారా, ప్రభువునకువలె మీ భర్తలకు లోబడియుండుడి' (ఎఫెసీయులకు 5:22-24), అప్పుడు మీ విధేయత ద్వారా కుటుంబానికి రక్షణ కలుగుతుంది. మనం ఐశ్వర్యవంతులము కావడానికి యేసు దరిద్రుడయ్యాడు (2 కొరింథీయులకు 8:9). ఆయన విధేయతతో తనను తాను తగ్గించుకున్నాడు, ఇప్పుడు పరలోకపు వాకిళ్లు మనకు తెరవబడి ఉన్నాయి. దేవుని యొద్ద నుండి దొంగలించకూడదు. ఇంకను మలాకీ 3:10వ వచనములో, "మీ సంపాదనలో పదియభాగమును దేవునికి ఇవ్వమని'' చెబుతుంది. మీ వాగ్దానాలను నెరవేర్చండి. దేవుని పరిచర్యకు సహాయపడండి (కీర్తనలు 16:2), పేదలకు ఇవ్వండి (యెషయా 58:7-8), మరియు ఇతరుల కన్నీళ్లను తుడవండి. మీరు విధేయత చూపినప్పుడు, దేవుడు పరలోకపు ద్వారాలను తెరిచి మీ జీవితములో మీరు పట్టజాలనంతగా విస్తారమైన ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా ఈ నెలంతయు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, పరలోక ద్వారాలను తెరుస్తానని వాగ్దానం చేసినందుకు ధన్యవాదాలు. దేవా, మా జీవితాన్ని నీ ఉప్పొంగే కృప, ప్రేమ మరియు ఏర్పాటుతో నింపుము. ప్రభువా, నీ వాక్యానికి ఆనందకరమైన విధేయతతో నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ యొక్క దైవీకమైన సదుపాయమును నమ్ముతూ, ధారాళంగా నీ రాజ్యము కట్టుట కొరకు ఇవ్వడానికి మాకు నేర్పించుము. దేవా, మా హృదయంతో నీ స్వరాన్ని శ్రద్ధగా విని, నిన్ను ఎల్లప్పుడూ అనుసరించడానికి సిద్ధంగా ఉండునట్లుగా మమ్మును మార్చుము. ప్రభువా, మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించుము మరియు మా ప్రతి అడుగును సరైన మార్గములో మమ్మును నడిపించుము. దేవా, మా జీవితం, వనరులు మరియు సంబంధాలతో నిన్ను ఘనపరచడానికి మాకు నీ కృపను అనుగ్రహించుము. యేసయ్యా, నీవు తెరచిన తెలుపులు ఎవరు కూడా మూయలేరు మరియు నీవు మూసిన తలుపులు ఎవరు కూడా తెరువలేరు. కనుకనే, నేడు ఆకాశపు వాకిండ్లు నేడు మా కొరకు విప్పి, మా జీవితములో పట్టజాలనంతగా విస్తారమైన దీవెనలు కుమ్మరించి, ఈ నూతన మాసమంతయు మాకు ఆశీర్వాదకరముగా మార్చుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.