నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 115:12వ వచనమును మన ధ్యానము కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును'' ప్రకారము మన బాధలలో మనం అనేకసార్లు ఏడుస్తుంటాము. దేవుడు మనలను మరచిపోయాడని తలంచి విచారముతో ఉంటాము. కానీ, బైబిల్ నుండి దేవుని వాక్యము మనకు ఇలాగున హామి ఇచ్చుచున్నది, "యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును...'' అని తెలియజేసినట్లుగానే, దేవుడు మనలను మరువని దేవుడై యున్నాడు. ఇది ఎంతటి చక్కటి వాగ్దానము కదా! ప్రభువు తన పిల్లలను ఎన్నటికిని మరచువాడు కాదు. ఆయన మన పేర్లను తన అరచేతులపై చెక్కుకొనియున్నాడు. ఈ భూమిపై కోట్లాదిమంది ప్రజలు ఉన్నప్పటికిని, దేవుడు మనలో ప్రతి ఒక్కరిని వారి పేర్లతోనే గుర్తెరిగియున్నాడు. ఆలాగుననే, ఆకాశములో ఉన్న ప్రతి నక్షత్రాన్ని ఆయన పేరు పెట్టి పిలిచియున్నాడు. అయితే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన మనం ఎంత విలువైనవారమో కదా! కనుకనే, మీరు కూడా ఆయన యెదుట నమ్మకంగా నడిచినప్పుడు, ఆయన మీ భక్తిని, మీ కన్నీళ్లను, మీ ప్రార్థనలను మరియు మీరు కలిగియున్న స్వల్పమైన ప్రేమతో కూడిన కార్యాలను కూడా గుర్తుంచుకుంటాడు. ఆయన నామము కొరకు మీరు చేసిన ప్రతి పనిని మరచిపోయేంత అన్యాయస్థుడు ఆయన కాదు. ఆయన నీతిగల న్యాయాధిపతియై యున్నాడు. కనుకనే, నేడు, దేవుడు మీతో, ' నా బిడ్డా, నేను నిన్ను జ్ఞాపకముంచుకుంటాను. నేను నిన్ను మరువను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, ఆలాగున దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నవారిని బట్టి బైబిల్‌లో ఎన్నో చక్కటి ఉదాహరణలను కలిగియున్నది. మొట్టమొదటగా, హిజ్కియా రాజు చనిపోతాడని చెప్పినప్పుడు, అతను యెషయా 38:3వ వచనములో ఇలాగున ప్రార్థించాడు, " యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యాలాగు సెలవిచ్చెను'' ప్రకారము ప్రభువు అతని ప్రార్థన విన్నాడు, అతని విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మరియు అతని జీవితానికి మరో పదిహేను సంవత్సరాలు ఆయుష్షును పొడిగించాడు. అదేవిధంగా, మరొక ఉదాహరణను బైబిల్ నుండి న్యాయాధిపతులు 16:28వ వచనములో మనము చూచినట్లయితే, సమ్సోను తన బలాన్ని మరియు దృష్టిని కోల్పోయినప్పుడు, అతను ఇలా ప్రార్థించాడు: "అప్పుడు సమ్సోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొనుము, దేవా దయచేసి యాసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టెను'' ప్రకారము ఆలాగుననే, దేవుడు అతని మొర విని, అతని శత్రువులను జయించడానికి మరల దేవుడు అతనిని బలపరిచాడు. ఇంకను నెహెమ్యా 5:19వ వచనములలో చూచినట్లయితే, నెహెమ్యా యెరూషలేము గోడను తిరిగి నిర్మిస్తున్నప్పుడు మరియు వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు, అతను ఇలాగున మొఱ్ఱపెట్టాడు, " నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములనుబట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము'' అని ప్రార్థించినప్పుడు ప్రభువు అతనికి రాజు యెదుట అనుగ్రహం మరియు అతని శత్రువులపై విజయమును ఇచ్చాడు. ఈ సేవకులలో ప్రతి ఒక్కరూ ఒకే ఒక సాధారణ ప్రార్థనను ప్రార్థించారు, 'ప్రభువా, నన్ను గుర్తుంచుకో ' మరియు దేవుడు దయతోను, బలముతోను మరియు పునరుద్ధరణతోను వారి ప్రార్థనలకు స్పందించాడు.

నా ప్రియమైన స్నేహితులారా, ఆలాగుననే, బైబిల్‌లో ఒక స్త్రీని ఇప్పుడు హన్నాను ఆమె గొడ్రాలిగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్న అదే దేవుడు ఈ రోజు మిమ్మును కూడా గుర్తుంచుకుంటాడు. ఆమె ఇలాగున మొఱ్ఱపెట్టినది, "సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన యెడల, వాని తల మీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను'' (1 సమూయేలు 1:11). చూడండి, దేవుడు ఆమె మొరను విని, ఆమెను సమూయేలుతో ఆశీర్వదించి, ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. నా ప్రియులారా, హన్నాను జ్ఞాపకం చేసుకున్న ప్రభువు, నేడు మీ అవసరతలలో, అది అనారోగ్యం, ఒంటరితనం లేదా కుటుంబ కష్టాలు మరియు మరి ఇంకా ఏవైనను సరే, ఆయన మిమ్మును మరవకుండా గుర్తుంచుకుంటాడు. స్నేహితులారా, ఒకవేళ మీరు ఎటువంటి వ్యాధితో, అది మరణకరమైన వ్యాధితో బాధపడుచున్నను సరే, నేడు ఆయన మిమ్మును హిజ్కియావలె స్వస్థపరచి, ఆయుష్షును పొడిగిస్తాడు. ఆలాగుననే, మీరు ఓటమిలను ఎదుర్కొంటున్నట్లయితే, సమ్సోనువలె దేవుడు మిమ్మును బలపరుస్తాడు. ఇంకను మీరు వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నట్లయితే, నెహెమ్యావలె మీకు కటాక్షమును మరియు విజయమును అనుగ్రహిస్తాడు. అదేవిధముగా, ఒకవేళ మీరు సంతానము లేకుండా, అవమానములను ఎదుర్కొంటున్నట్లయితే, హన్నావలె దేవుడు మీకు సంతానము దయచేసి, మీ అవమానమును నిందను తొలగించి మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే, ఆయన మీ యొక్క ప్రతి ప్రార్థనను, ప్రతి కన్నీటిని, ప్రతి విశ్వాసము ద్వారా జరిగించిన క్రియలను గుర్తుంచుకుంటాడు. ప్రభువు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మీ గతాన్ని క్షమించి, మిమ్మల్ని మరల ఫలించువారినిగా మారుస్తాడు. కనుకనే, ఈ సత్యాన్ని గట్టిగా పట్టుకోండి: దేవుడు మిమ్మల్ని మరచిపోలేదు. మిమ్మల్ని పైకి లేవనెత్తడానికి, కోల్పోయిన వాటిని మరల పునరుద్ధరించడానికి మరియు మీ పేరును ఆయన మహిమకు సాక్ష్యంగా మార్చడానికి ఆయన తెరవెనుక పనిచేయుచున్నాడు. కనుకనే, భయపడకండి, మీరు నిత్యము మరువబడరు. నేటి వాగ్దానము ద్వారా ఆయన మిమ్మును జ్ఞాపకము చేసుకొని, ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, అత్యల్ప క్షణాల్లో కూడా మమ్మును జ్ఞాపకం చేసుకుంటున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, నేను బాధతో మొఱ్ఱపెట్టినప్పుడు మమ్మును మరువకుండా జ్ఞాపకము చేసుకొనుము. దేవా, మా కన్నీళ్లను చూసి మా ప్రార్థనలకు జవాబును దయచేయు ము. యేసయ్యా, మేము అనారోగ్యంతో ఉన్నప్పుడు మమ్మును స్వస్థపరచుము మరియు మా బాధలు మరియు వ్యాధి పడక నుండి మమ్మును లేవనెత్తుము. దేవా, మేము బలహీ నంగా ఉన్నప్పుడు మమ్మును బలపరచుము మరియు మేము పడిపోయినప్పుడు మమ్మును పునరుద్ధరించుము. ప్రభువా, మేము వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు మాకు నీ అనుగ్రహమును చూపించుము మరియు మా ఓటమిలలో నీవు మాకు విజయం దయచేయుము. యేసయ్యా, మమ్మును మరియు మా పిల్లలను జ్ఞాపకం చేసుకొని మరియు మా హృదయ కోరికలతో మమ్మును ఆశీర్వదించుము. దేవా, దుఃఖముతో ఉన్న మమ్మును ఆనందం మరియు సమాధానముతో నింపుము. యేసయ్యా, నీవు మాకు సమీపముగా ఉన్నావనియు మరియు మమ్మును ప్రేమిస్తున్నావని మాకు ఎల్లప్పుడూ తెలియజేయుము. ప్రభువా, నీకు మొఱ్ఱపెట్టిన నీ పిల్లలను జ్ఞాపకము చేసుకొన్నట్లుగానే, నేడు నీవు మమ్మును మరువకుండా జ్ఞాపకం చేసుకుని, మా ఓటమి, బలహీనతను, వ్యాధులను, సంతానలేమిని, మా సమస్యలను తొలగించి, మమ్మును సమృద్ధిగా ఆశీర్వదించుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.