నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శక్తివంతమైన ఘనమైన నామమున మీకు శుభములు. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 43:4వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించు చున్నాను'' అని వాక్యము సెలవిచ్చినట్లుగానే, ఇది ఎంత ప్రశస్తమైన వాగ్దానము కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండి ఎలా ఘనతను పొందుకొనగలమో నేడు ధ్యానిద్దాము. బైబిల్ నుండి సామెతలు 3:9వ వచనమును చదివినట్లయితే, "నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము'' అని చెప్పబడినట్లుగానే అవును, ప్రభువు పరిచర్య కొరకై మనము ధనమును ఇవ్వవచ్చును. ఇంకను మన రాబడి యంతటిలోను ఆయనకు ప్రధమ ఫలమును ఇచ్చి, ప్రభువును ఘనపరచవచ్చును. ఆలాగుననే, అనేక విధములుగా మనము ప్రభువును ఘనపరచవచ్చును. అవును నా ప్రియులారా, మన సమయం, ధనం లేదా మన కష్టపడి సంపాదించిన ఫలితాలు ఏవైనా కావొచ్చు - వాటిలో ఉత్తమమైనదాన్ని దేవునికి అర్పించినప్పుడు, ఆయన మన జీవితాలలో మొదటి స్థానంలో ఉన్నాడని మనం కనుపరచుచున్నాము. ఇది దేవునికి ఘనత ఇచ్చే ఒక మార్గం, అలాగే ఆయన కూడా మనకు ప్రతిగా ఘనతనిస్తాడు.

అందుకే బైబిల్ నుండి సామెతలు 14:31వ వచనమును చూచినట్లయితే, "దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు'' ప్రకారం అవును, మీరు ఎదుర్కొనే బీదవారికి సహాయము చేయవచ్చును. వారు కష్టాలలో ఉన్నప్పుడు మీరు చేయగలిగినటువంటి సహాయమును మీరు వారికి చేయవచ్చును. ఇంకను అనేక విధాలుగా మీరు వారికి సహాయపడవచ్చును. ఇంకను సామెతలు 29:23వ వచనములో చూచినట్లయితే, "ఎవని గర్వము వానిని తగ్గించును వినయ మనస్కుడు ఘనతనొందును''ప్రకారము ప్రియ స్నేహితులారా, మనము అందరి యెదుట వినయ మనస్కులై ఉన్నప్పుడు మనకు ఘనత కలుగుతుంది. ఆలాగునే కీర్తనలు 8:4,5వ వచనములలో చూచినట్లయితే, "నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసియున్నావు'' అని చెప్పబడిన ప్రకారము మహిమా ప్రభావములతో ఆయన వినయమనస్కులకు కిరీటమును ధరింపజేయుచున్నాడు. మనం ఆయన యెదుట వినయంగా నడుచుకున్నప్పుడు, మన పరలోకపు తండ్రి మనకు ఘనతతో కిరీటం ధరింపజేయడానికి ఎంచుకోవడం ఎంత మహిమాన్వితమైనది కదా! అదేవిధంగా, బైబిల్ నుండి 1 తిమోతికి 2:21వ వచనమును మనము చూచినట్లయితే, "ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్రపరచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును'' అని తెలియజేసినట్లుగానే, నా ప్రియులారా, మనము ప్రభువు యెదుట పవిత్రమైన జీవితమును కలిగియుండాలి. ఇంకను రోమీయులకు 2:15వ వచనములో చెప్పబడిన ప్రకారము మీ మనస్సాక్షి మీరు చేయుచున్నది మంచిదా? చెడ్డదా? అని మీకు తెలియజేయుచున్నది. కనుకనే, నేడు మీరు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారము పవిత్రమైన జీవితమును జీవించినట్లయితే, నిశ్చయముగా, నిశ్చయముగా మీరు ఘనత నొందినవారు అవుతారు.

చివరిగా, నా ప్రియులారా, బైబిల్ నుండి యోహాను 12:26వ వచనములో మనము చూచినట్లయితే, "ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును'' ప్రకారము ప్రభువును మనము ఘనపరచగలిగే మార్గములు ఇవియే. కనుకనే, మీ హృదయమంతటితో ఆయన వాక్యమునకు లోబడి ఉండండి. అప్పుడు మీరు విలువైన రీతిగా ఆశీర్వదింపబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఘనతకు మార్గము సాధారణమైనదే, అది మీకు ఉత్తమమైన దానితో ప్రభువును ఘనపరచడం, బీదలకు సహాయం చేయడము, పరిశుద్ధమైన జీవితం జీవించడము, వినయంగా ఉండడము మరియు క్రీస్తును నమ్మకముగా సేవించడము. కనుకనే నేడు మీరు ఈ సంగతులు చేయగలిగినపుడు, దేవుని ఘనత తప్పకుండా మీ మీదికి దిగివస్తుంది. ఈ ఘనత మనుష్యుల గుర్తింపు వలె తాత్కాలికమైనది కాదు, కానీ అది శాశ్వతమైనది, ఇంకను అన్నిటినియందు దృష్టిని ఉంచగల తండ్రి యొద్ద నుండి వస్తుంది. అందువలన నా ప్రియులారా, ఈ రోజు దేవునికి ఘనతను తీసుకురాగల జీవితాలను జీవించేందుకు మిమ్మును మీరు సమర్పించుకున్నట్లయితే, దానికి ప్రతిగా, ఆయన తన మహిమతో మరియు ఘనతతో మిమ్మును కిరీటంగా అలంకరిస్తాడు. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన పరలోకమందున్న మహిమగల మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ దృష్టిలో ప్రియులైన వారినిగాను మరియు ఘనమైనవారినిగా పిలిచినందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మా తల మీద నీవు ఉంచిన మహిమా కిరీటానికై నీకు వందనాలు. ప్రభువా, నీవు వాగ్దానము చేసినట్లుగానే, ఈ యొక్క మహిమకరమైన జీవితానికై నీకు వందనాలు. దేవా, మేము నిన్ను ఘనపరచగలిగే కృపను మాకిమ్ము. ప్రభువా, మా యొక్క శ్రేష్టమైన వాటిని నీకిచ్చి, నిన్ను ఘనపరచుటకు మాకు అటువంటి ధన్యతను దయచేయుము. యేసయ్య, నీ రక్తము ద్వారా నీవు మమ్మును పవిత్రపరచి, నీ రాజ్యం కొరకు మమ్మును ఘనమైన పాత్రగా మార్చుము. దేవా, అనుదినము పవిత్రత మరియు విధేయతతో నడవడానికి మమ్మును నడిపించుము. యేసయ్యా, నీవు మమ్మును ఎక్కడ ఉంచినా నీకు నమ్మకంగా సేవ చేయడానికి నీ శక్తితో మమ్మును బలపరచుము. దేవా, నిత్యము నిలిచియుండు ఘనతతో మమ్మును ఆశీర్వదించుము. యేసయ్యా, మేము బీదలకు సహాయము చేయుటకు కృపను నిచ్చి, నీ పరిచర్యను చేయగలిగే శక్తిని మాకు దయచేయుము. దేవా, ఆలాగుననే ప్రభువా, నీవే మమ్మును నడిపించుము. దేవా, నేడు అటువంటి నిర్ణయము తీసుకొనుటకు మాకు నీ కృపను దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.