నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 2:10,11వ వచనములను తీసుకొనబడినది. ఆ వచనములో, "వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి'' అని చెప్పబడిన ప్రకారము బాలుడైన యేసు చాలా చిన్నపిల్లవానిగా ఉండి ఉండెను. కనుకనే, ఆయన బాలుడుగా ఉన్నప్పటికిని రాజులు మరియు జ్ఞానులు వచ్చి ఆయనకు మ్రొక్కియున్నారు. వారు ఆయన యందు భయభక్తులు చూపి, ఆయనను ప్రేమించి గౌరవించియున్నారు. చూడండి, ఇది ఎంతటి గొప్ప భాగ్యము కదా!

నా ప్రియమైన స్నేహితులారా, మనము కూడా ఆ విధంగా ఉండాలి. మన హృదయమంతటితో ప్రభువును ప్రేమించాలి. అదేవిధముగా, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. నేను మొదటిసారిగా బైబిల్ గ్రంథములో 'భయభక్తులు' అనే పదమను చదివినప్పుడు మరియు కీర్తనల గ్రంథములోను మరియు సామెతల గ్రంథములోను అనేకసార్లు చదివినప్పుడు కూడా ఎంతగానో ఆశ్చర్యపోయేదానను. భయభక్తులు అనగా, గౌరవము కంటె అధికమైనది. అది ఒక పవిత్రమైన భయభక్తులు; ప్రేమతో కలిసిన పరిశుద్ధమైన భయం. ఆయన ప్రపంచమునకు దేవుడై యున్నాడు గనుకనే, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన పాద సన్నిధిలో మోకరించి, ఆరాధించినప్పుడు, ప్రభువు మనలను ఉన్నత శిఖరములకు లేవనెత్తుతాడు.

బైబిల్ నుండి కీర్తనలు 113:7-8వ వచనములో చూచినట్లయితే, "ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు'' ప్రకారము ఈ రోజు నా ప్రియులారా, మీరు దీనులుగా ఉండిన యెడల, మీరు దేవుని ఘనపరచి, ఆయనను ఆరాధించినట్లయితే, ప్రభువు మిమ్మును ఉన్నత శిఖరములకు లేవనెత్తుతాడు. ప్రధానులతో మిమ్మును కూర్చుండబెడతాడు. దేశములోని గొప్ప జనులతో మిమ్మును కూర్చుండబెడతాడు. మీ పేరు గౌరవించబడుతుంది. ఈ రోజు దేవుని ఘనపరచడానికి ఆయనను జ్ఞాపకము చేసుకుందాము. మనమందరము ఆయనను గౌరవించి, ప్రేమించుదాము. అంతమాత్రమే కాదు, ప్రభువును ఘనపరచి, గౌరవిద్దాము. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మనము ప్రభువును ప్రేమించి, భయభక్తులు కలిగియుండి, ఆయనను ఘనపరచినప్పుడు ఆయన నేటి వాగ్దానము ద్వారా మిమ్మును ఉన్నత శిఖరములకు లేవనెత్తి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సర్వశక్తిగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, మా మీదికి నీ సన్నిధానము దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, మేము ఎల్లప్పుడు నిన్ను గౌరవించి, ప్రేమించి, ఘనపరచే కృపను దయచేయుము. ప్రభువా, నీ బిడ్డలైన మేము మా హృదయమంతటితో నిన్ను ప్రేమించుటకు మాకు సహాయము చేయుము. దేవా, మేము ఆలాగున చేసినప్పుడు, మమ్మును నీవు గొప్ప శిఖరములకు లేవనెత్తగలవనియు, మేము దేశములో ప్రధానులతో కూర్చుండునట్లుగా మాకు కృపనిమ్ము. ప్రభువా, ఎల్లప్పుడు నిన్ను గౌరవించడానికి మరియు ఘనపరచడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించడం మాకు నేర్పుము మరియు మేము అలాగున చేసినప్పుడు, నీవు మమ్మును ఉన్నత శిఖరములకు లేవనెత్తుతావని మాకు తెలుసు. కనుకనే, నీవు మమ్మును రాజుల మధ్య మరియు గౌరవనీయ ప్రజల మధ్య కూర్చుండబెడతావని నమ్ముచున్నాము. ప్రభువా, నీ జ్ఞానం మమ్మును నింపునట్లుగాను, మేము చేయు ప్రతి పనిలో మాకు తెలివిని మరియు వివేకమును అనుగ్రహించుము. దేవా, మేము తెలియజేయు ప్రతి మాట మరియు మేము చేయుచున్న ప్రతి పని నీ పరిశుద్ధమైన నామమునకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా మీద నీ ప్రేమ మరియు కటాక్షమును మా మీద కనుపరచి, తగినకాలమందు నీవు మమ్మును ఉన్నత శిఖరములకు లేవనెత్తుతావని నమ్ముచూ, యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.