నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, ఈ రోజు ప్రభువు మీకు అద్భుతమైన ఒక చక్కటి లేఖన వచనాన్ని వాగ్దానముగా అనుగ్రహించుచున్నాడు. ఆ వచనమేమనగా, " నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును '' (సామెతలు 28:14) అన్న వచనము ప్రకారం మీరు ధన్యులుగా జీవించాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, మనము అట్టి ధన్యతను పొందాలంటే, మనం ప్రభువుకు ఎప్పుడు మరియు ఎంతకాలము భయపడాలి? అనగా, మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, సంతోషంగా లేనప్పుడు కూడా దేవుని ఏమియు ప్రశ్నించకుండా, మనం ఎల్లప్పుడు దేవునికి భయపడవలెనని లేఖనాలు స్పష్టంగా తెలియజేయుచున్నవి. దేవుడు తన పిల్లలకు ఇచ్చిన ప్రాముఖ్యమైన కర్తవ్యాలలో ఒకటి ఆయనకు భయపడటం. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, "ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచు చుండవలెను, మానవకోటికి ఇదియే విధి'' (ప్రసంగి 12:13) అని చెప్పబడినట్లుగానే, మనము దేవునికి భయపడి, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే మానవుల కర్తవ్యము. కనుకనే, దేవుని యందు భయము కలిగియుండువారిని పరిపూర్ణులనుగా చేయుచున్నది. పరిస్థితులు ఏమైనప్పటికిని, దేవునికి భయపడు ప్రతివారు పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి, ప్రభువుకు భయపడేవారు ఆయన నుండి పరిపూర్ణమైన ఆశీర్వాదాలను పొందుకొని అనుభవిస్తారు.

నా ప్రియులారా, ఇంకను దేవునికి భయము కలిగియుండుట ద్వారా ఏయే ధన్యతను పొందుకొనగలము? అని చూచినట్లయితే, " యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు''(సామెతలు 1:7) ప్రకారం ప్రభువుకు భయభక్తులు కలిగియుండుట జ్ఞానమునకు మూలము అని లేఖనము చెప్పినట్లుగానే, అవును, దేవుని యందు భయమే జ్ఞానానికి మూలము. ఇది అంతం కాదు. మనం దేవునికి ఎంతగా భయపడితే, ఆయన తెలివిమరియు జ్ఞానం మనలో అంతగా అభివృద్ధి పొందుతుంది. జ్ఞానం అనేది మనము దేవుని యందు ఎదుగునట్లు చేయుచున్నది. మనలో సత్‌క్రియ ప్రారంభించిన ప్రభువు తన రాకడ వరకు దానిని నెరవేర్చడానికి నమ్మకంగా ఉంటాడు. కాబట్టి నా ప్రియులారా, మీరు ఆయనకు భయపడుటకు దేవునిచే పిలువబడియున్నారు. మీరు దేవునికి భయపడినట్లయితే, నిశ్చయముగా మీరు ఆయన జ్ఞానాన్ని పొందుకుంటారు. కాబట్టి, దేవునికి భయపడడమనగా, మనకు అవసరమైన ప్రతి ఒక్కదాని కొరకు అనుదినము మనము దేవుని వైపు చూడటము మాత్రమే. కనుకనే, దేవునికి భయము కలిగి ఉండుట ఇది ముగింపు కాదు కానీ, తెలివికి మూలము అని బైబిల్ తెలియజేయుచున్నది. మనం దేవునికి భయపడుచున్న కొలది, దేవుని జ్ఞానం మరియు తెలివి మనలో అభివృద్ధి పొందుచున్నవి. ఈ జ్ఞానం మరేమీ కాదు, అది దేవుని జ్ఞానము మనలో అభివృద్ధి పొందుతుంది. ప్రభువు మనలో ప్రారంభించిన సత్‌క్రియలు, తన రాకడ వరకు ఈ సత్‌క్రియలను సంపూర్తి చేస్తాడు. అవును, నా స్నేహితులారా, నేడు మీరు మరియు నేను ఆయనకు భయపడాలని దేవునిచే మనము పిలువబడియున్నాము. కనుకనే, మనం దేవునికి భయపడినట్లయితే, మనలో దేవుని జ్ఞానం పెరుగుతుంది. దేవునికి భయపడటం అంటే మన సదుపాయముల లేక మన అవసరతల కొరకు ప్రతిరోజు దేవుని వైపు చూడడము మాత్రమే.

ఒకసారి నేను, ఆకాశము వైపు చూస్తున్న పొద్దు తిరుగుడు పువ్వును ప్రత్యక్షంగా చూశాను. నిజంగానే, నేను ఆ పువ్వును చూచినప్పుడు, అది ఆకాశం వైపు చూస్తున్నట్లుగా నాకు అనిపించింది. అది సూర్యునికి అభిముఖంగా ఉన్నది. ఆ రోజు, నేను పొద్దుతిరుగుడు పువ్వు నుండి ఒక మంచి పాఠమును నేర్చుకున్నాను. అదే మనగా, మనం కూడ ప్రతిదానికి ఉదయకాలమున దేవుని వైపు చూడాలని నేను గ్రహించాను. అవును, నా ప్రియ స్నేహితులారా, మనం అన్ని విషయాలలో దేవునికి భయపడటం ప్రారంభించినప్పుడు, మనం నిజంగా ఆశీర్వదించబడతాము. అంతమాత్రమే కాదు, " యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము '' (కీర్తనలు 138:8) ప్రకారం ప్రభువు మన కొరకు సమస్తమును నెరవేరుస్తాడు. కనుకనే, మనం దేవునికి నిత్యము భయపడాలి. అదియుగాక, ప్రభువు మనకు ముందుగా వెళ్లి వంకర మార్గములను సరిచేస్తాడు. మనం యథార్థతగా నడవడానికి ఆయన మన మార్గాలను విస్తరింపజేస్తాడు. అటువంటి పరిపూర్ణమైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించడానికి ప్రభువు మనలను జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. అవును, నా ప్రియులారా, మీరు నేటి ప్రొద్దుతిరుగుడు పువ్వువలె దేవుని వైపు చూస్తు, ఆయనకు భయపడుటకు నేర్చుకొనండి, నిశ్చయముగా, దేవుడు మీకు గొప్ప ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించి, మిమ్మల్ని సంపూర్ణులనుగా చేసి, మీ వంకర మార్గములన్నిటిని తొలగించి, మిమ్మును సరైన మార్గములను చక్కగా నడుచునట్లుగా చేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నిన్ను ఘనపరచుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ప్రభువా, మేము నిన్ను మా జీవితంలోనికి ఆహ్వానించుచున్నాము. ' ప్రభువునకు భయము జ్ఞానమునకు మూలము ' అని నీ వాక్యము చెప్పినట్లుగానే, ప్రభువా, నీకు భయపడే హృదయాన్ని మాకు అనుగ్రహించుము. దేవా, మేము నిత్యము నీకు భయపడి, నీ సన్నిధి యెదుట వణుకునట్లు చేయుము. ప్రభువా, మా జీవితంలో వంకర మార్గాలన్నిటిని సరిచేసి, నీ ధన్యతను మా జీవితంలో పరిపూర్ణంగా ఉండునట్లు చేయుము. ప్రభువా, మేము భయపడే మరియు చింతించే ఈ లోక కార్యాలన్నియు మా జీవితంలో ఏవియు జరగకుండా, వాటిని మా నుండి తొలగించుము. దేవా, మా జీవితం నుండి అంధకారమును తొలగించుము; ఇక నుంచి మా జీవితంలో నీ వెలుగును ప్రకాశింపజేయుము.ప్రేమగల ప్రభువా, నీ పట్ల భక్తితో కూడిన భయంతో నడవడం మాకు నేర్పుము. దేవా, మా హృదయం నీ సాన్నిధ్యాన్ని మరియు నీ వాక్యాన్ని ఘనపరచునట్లుగా చేయుము. ప్రభువా, నిన్ను భయపెట్టడం వలన వచ్చే దైవిక జ్ఞానంతో మమ్మును నింపుము. దేవా మా జీవితంలోని ప్రతి అవసరానికి నీపై ఆధారపడటానికి మాకు సహాయం చేయుము. దయచేసి మా మార్గాలను సరిచేయుము, నీ సత్యంలో మేము నడుచునట్లుగాను మరియు నీ కృప ద్వారా మాకు సంబంధించిన సమస్తమును పరిపూర్ణం చేయుము. దేవా, మా హృదయాన్ని సున్నితంగాను మరియు నీ ఎల్లప్పుడు మృదువుగాను ఉండునట్లుగా చేయుము. ప్రభువా, నీ వాక్కు పట్ల భక్తితో నడవడానికి మరియు నీ నామాన్ని మహిమపరచడానికి మమ్మును మేము నీకు అప్పగించుకొనుచున్నాము. ప్రభువా, మేము నీ యందు భయభక్తులు కలిగియుండుట ద్వారా మా జీవితంలో విజయం సాధించునట్లుగా నీ జ్ఞానంతో మమ్మును ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.