నా ప్రియులారా, నీతిమంతులైన తల్లిదండ్రులుగా, గొప్ప స్వాస్థ్యమును మరియు బహుమానమును మరియు ఐశ్వర్యమును మీరు మీ పిల్లల కొరకు సమకూర్చుకొనవచ్చును. అయితే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 20:7వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో, "యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు'' అని చెప్పబడినట్లుగానే, యథార్థవంతమైన మనస్సుతో, నీతివంతమైన జీవితమును జీవించుచున్న ప్రతి తండ్రి, తల్లి మీరు మీ పిల్లలకు గొప్ప ఐశ్వర్యమును తీసుకొని వచ్చుచున్నారు. ఇంకను, గొప్ప బహుమానమును సమకూర్చుచున్నారు. తద్వారా, దేవుడు వారిని ఆశీర్వదించుచున్నాడు. కనుకనే, మీ హృదయమును కలవరపడనీయ్యకండి. బహుశా! మీ పిల్లల భవిష్యత్తును పరామర్శించడానికి మీ దగ్గర చాలినంత ధనములేదని మీరు భావించుచూ ఉండవచ్చును, లేదా వారు ఉన్నత స్థాయికి ఎదగడానికి మీరు వారి కొరకు తగినంత చేయలేదని మీరు అనుకుంటూ ఉండవచ్చును. అయితే, నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు అంటున్నాడు, "నా కుమారుడా, నా కుమార్తె, మీరు నీతితోను, యథార్థవంతమైన జీవితమును జీవించియున్నారు. నా చిత్తమంతటిని మీరు నెరవేర్చియున్నారు; కాబట్టి, నేను మీ పిల్లలను ఆశీర్వదించెదను. వారి బహుమానము గొప్పగా ఉంటుంది. మీ పిల్లల కొరకు నేను సమస్తమూ చేయుదును. నేను వారిని వృద్ధిపొందింపజేయుదును.'' బైబిల్ నుండి కీర్తనలు 115:14వ వచనములో వ్రాయబడినట్లుగానే, " యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీ పిల్లలను గురించి దిగులుపడకండి. మీరు ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, యథార్థవంతులైన మరియు నీతిమంతులైన తల్లిదండ్రుల పిల్లలకు ఎటువంటి ఆశీర్వాదములను అనుగ్రహించబడుచున్నవి? అని చూచినట్లయితే, మొట్టమొదటగా, దేవుడు అట్టివారి పిల్లలకు సమస్త వనరులను వారికి అనుగ్రహించును. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 37:27వ వచనములో చూచినట్లయితే, " నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు'' అని చెప్పబడినట్లుగానే, మీ పిల్లలైన వారు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు అని ప్రకటించబడుచున్నది. రెండవదిగా, బైబిల్ నుండి కీర్తనలు 112:1-2 వచనములలో చూచినట్లయితే, "యెహోవా యందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతివారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును'' అని వాగ్దానము చేయబడినట్లుగానే, వారి పిల్లలు దేశంలో బలవంతులుగా ఉంటారు. మూడవదిగా, బైబిల్ నుండి కీర్తనలు 115:12-14 ప్రకారం, వారు సమృద్ధి యైన ఆశీర్వాదములతో వృద్ధిపొందింపజేయుచున్నాడు. కారుణ్య విశ్వవిద్యాలయములో ఒక విద్యార్థి ఈవిధంగా తన సాక్ష్యమును పంచుకొనెను. ఆ విద్యార్ధి, తన తల్లిదండ్రులు రోజువారీ కూలీగా పనిచేసినప్పటికి, వారి యథార్ధమైన, నీతివంతమైన జీవితం ద్వారా తనను దేవుని మార్గంలో నడిపించారు. అతను బాగా చదివి 12వ తరగతిలో, 90 శాతముకంటే ఎక్కువ మార్కులు సాధించాను. అక్షరాల, అదే సంవత్సరం, కారుణ్య విశ్వవిద్యాలయము వారు, అటువంటి విద్యార్థుల కొరకు ఉచిత విద్యా బోధనను సంకల్పించియున్నారు. ఆ విద్యార్థికి పూర్తి స్కాలర్‌షిప్ పొందుకున్నాడు. ఆ విద్యార్థి ఆ యొక్క ఉపకార వేతనమును పొందుకొనియున్నాడు. ఈ రోజు, ఆ విద్యార్థి ఎటువంటి ట్యూషన్ ఫీజులు చెల్లించకుండా ఇంజెనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఉచితముగా ఆ విద్యార్థి విద్యను అభ్యసించుచున్నాడు. ఇది నీతిమంతుల తల్లిదండ్రులైన వారు దేవుని యెదుట నీతిగా జీవించుట ద్వారా కలుగు ఆశీర్వాదం! అటువంటి వారి పిల్లలు వృద్ధినొందెదరు. నా ప్రియులారా, ఇది మీ కుటుంబానికి, మీ పిల్లలకు కూడా ఇలాగున సంభవిస్తుంది.

నాలుగవదిగా, బైబిల్ నుండి కీర్తనలు 14:5వ వచనములో చూచినట్లయితే, "ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీ పిల్లల మధ్యన ఉంటాడు. అవును, నా ప్రియులారా, మీరు నీతిమంతులుగా జీవిస్తూ, నీతిమార్గంలో నడుచుకున్నప్పుడు, మీ పిల్లల మధ్యలో దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. ఐదవదిగా, బైబిల్ నుండి యెషయా 65:22-24వ వచనములలో వాగ్దానము చేయబడినట్లుగానే, "వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు వారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురు వారి సంతానపువారు వారి యొద్దనే యుందురు. వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను'' అని చెప్పబడినట్లుగానే, మీ పిల్లలు వేడుకొనకముందే దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. అన్నిటికంటే అత్యంత గొప్ప ఆశీర్వాదము ఏదనగా, దేవుడు మీ పిల్లల మీద తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడని, మీ కుమారులును కుమార్తెలును ప్రవచించెదరని యోవేలు 2:28వ వచనములో ప్రకటించబడియున్నది. అవును, నా ప్రియులారా, నేడు తల్లిదండ్రులుగా మీరు దేవుని సన్నిధిలో నీతిమంతులుగాను నడుచుకుంటూ, యథార్ధవంతులుగా జీవించినప్పుడు, దేవుడు ఈ ఆశీర్వాదాలన్నింటిని మీ పిల్లలకు అనుగ్రహించును గాక. అవును, తల్లిదండ్రులైన మీ నీతిని బట్టి, అత్యంత గొప్ప స్థాయికి హెచ్చింపజేసి, మీ పిల్లలు వృద్ధి పొందింపబడుదురు గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవిచ్చిన వాగ్దానము ప్రకారము మేము నీతిమంతులుగా నడుచుకొనుటకును, మా పిల్లలు గొప్ప బహుమానమును, ఐశ్వర్యమును పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రియమైన ప్రభువా, మేము నీతి మార్గంలో నడుచుకోవడానికి, నీ యెదుట యథార్థమైన జీవితం గడపడానికి తల్లిదండ్రులమైన మాకు అటువంటి ధన్యతను దయచేయుము. దేవా, మా జీవితము మా పిల్లలకు ఆశీర్వాదములను, సంపదను మరియు వృద్ధిని తీసుకొని వచ్చునట్లుగా మమ్మును మార్చుము. ప్రభువా, మా నీవు పిల్లల మధ్య ఉండి, నీ మార్గాలలో వారిని నడిపించి, వారిని దేశంలో బలవంతులగునట్లుగా చేసి, అనేకులకు ఆశీర్వాదంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, వారు వేడుకొనకముందే వారికి ఉత్తరమిచ్చి, వారిపై నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును కుమ్మరించి, నీ మహిమ కొరకు వారు వాడబడునట్లుగా సహాయము చేయుము. దేవా, నీ యెదుట మా యొక్క నీతివంతమైన జీవితం వారి భవిష్యత్తులో దీవెనలకు పునాదిగా మారునట్లుగా కృపను దయచేయుమని యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.