నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మనకు దేవుడు చేసిన వాగ్దానం ఏమిటో తెలుసుకుందాం. ఈ రోజు యేసు పిలుచుచున్నాడు అధినేత డాక్టర్. పాల్ దినకరన్‌గారి యొక్క జన్మదినం. మా తండ్రిగారి ద్వారా దేవుడు చేయుచున్న గొప్ప కార్యాలన్నిటికి, ఈ పరిచర్యను నిర్మించడానికి దేవుడు ఇచ్చిన దర్శనానికి నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. దయచేసి ఈరోజు మీ ప్రార్థనలలో ఆయనను జ్ఞాపకము చేసుకొనండి. దేవుడు మిమ్మును దీవించును గాక.

నా ప్రియులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 60:14వ వచనమును మనము చూద్దాము. ఆ వచనము, "...నిన్ను తృణీకరించిన వారందరు వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు'' ప్రకారం నేడు మిమ్మును తృణీకరించిన వారందరు వచ్చి, మీ పాదముల మీద పడెదరు. అవును, ప్రజలు మన పాదముల యెదుట సాగిలపడెదరు మరియు యెహోవా పట్టణమనియు వారు మనలను పిలుచుచున్నారు. కానీ, మొదటి భాగాన్ని తీసుకోవడం అంత సులభం కాదు. అయితే, ప్రజలు మనలను తృణీకరించుటకు, ద్వేషించడానికి మరియు నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. బహుశా, ఈ రోజు మీరు అలాంటి ప్రజలను ఎదుర్కొంటుండవచ్చును; మిమ్మల్ని ద్వేషించే వారు, మీరు పడిపోవాలని కోరుకునే వారు, మీ తలుపు తట్టి మిమ్మల్ని బెదిరించే వారు. మీ హృదయం బ్రద్ధలైపోయినట్లుగాను, భయంతోను భారముగా ఉన్నట్లుగా అనిపించవచ్చును. కానీ, నా ప్రియ స్నేహితులారా, ఇలాంటి సమయం కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానం అనుగ్రహించుచున్నాడు. అదేవిధముగా, మా తాతగారి జీవితములో జరిగినది. మా తాతగారు యేసు పిలుచుచున్నాడు పరిచర్యను ప్రారంభించి, ప్రభువు బోధించిన మార్గాలలో ప్రార్థనా పూర్వకంగా నడుస్తున్నప్పుడు, ఒక వ్యక్తి ఆయనకు వ్యతిరేకంగా నిరంతరం ఉత్తరములు వ్రాయుచుండెను. తన పత్రికలో, మా తాతగారు చేయుచున్న ప్రతి కార్యమును, దేవుడు ఆయనకు ఇచ్చిన దర్శనాన్ని, దేవుడు ఆయన హృదయంలో ఉంచిన ప్రణాళికలను మరియు ఆయన నిర్మించిన ప్రతి పరిచర్యను వ్యతిరేకించాడు. నిశ్చయంగా, ఇది మా తాతగారి యొక్క హృదయాన్ని తీవ్రంగా గాయపరచి ఉండి ఉండవచ్చును. అయినప్పటికిని, ఎప్పుడు తిరిగి జవాబు చెప్పలేదు. అందుకు బదులుగా, మా తాతగారు వెళ్లి, 'ప్రభువు సన్నిధిలో మొఱ్ఱపెడుతూ, 'ప్రభువా నేను నిన్ను సేవించడం లేదా? నేను నీకు విధేయత చూపడం లేదా? కానీ, ప్రజలు ఎందుకు నాకు వ్యతిరేకంగా లేచి, నాకు విరోధంగా మాట్లాడుచున్నారు?' అని ప్రభువులో తన్ను తాను మరుగుపరచుకున్నారు.

నా ప్రియులారా, అలాంటి సమయములలో మనం చేయవలసినదంతయు ప్రభువులో మనలను మరుగుపరచుకోవడమే మాత్రమే. మరి ఆలాగున చేసినప్పుడు ఏమి జరుగుతుంది? మా తాతగారు ఆలాగున తనను తాను మరుగుపరచుకున్నప్పుడు, ప్రభువు మా తాతగారిని ఉన్నత స్థాయికి లేవనెత్తాడు, లక్షలాది మందికి ఆయనను ఒక ఆశీర్వాదకరంగా మార్చాడు మరియు వారి ప్రేమతో ఆయనను ఆవరించారు, ఆయన జీవితంలో ఎంతో ప్రేమను పొందుకొని ఉండెను. ఒకరోజు, ఆయనకు విరోధంగా వ్రాసిన ఆ వ్యక్తి వచ్చి, మా తాతగారి దగ్గర క్షమించమని చెప్పి, క్షమాపణ కోరాడు. చూడండి, నా ప్రియులారా, అలాంటి వ్యక్తులకు అతి పెద్ద భయం వారు చేయుచున్న చెడుకు తమను తాము నాశనం చేసుకోవడం కాదు; మీరు ఉన్నతంగా ఎదగడం చూచెదరు. వారు ఎక్కువగా భయపడునది కూడా అదియే. మరియు ప్రభువు వాగ్దానం చేసినది కూడా ఇదియే: ఆయన మిమ్మును పైకి లేవనెత్తుతాడు, మిమ్మును తన పట్టణముగా చేసుకుంటాడు మరియు మీ శత్రువులు కూడా మీ పాదాల ముందు సాగిలపడతారు. కనుకనే, నా ప్రియులారా, నేడు మిమ్మును తృణీకరించువారిని చూచి మీరు భయపడకండి, మీరు దేవుని లోబడుచూ, ఆయన వాక్యమునకు విధేయత చూపినప్పుడు, నిశ్చయముగా, దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మమ్మును తృణీకరించేవారు కూడా ఒకరోజు మా యెదుట సాగిలపడి, నీవు మాకు చెందినవారవని అంగీకరిస్తారని నీవు చేసిన వాగ్దానానికై నీకు వందనాలు. దేవా, ప్రజలు మమ్మును ద్వేషించినప్పుడు, మమ్మును బెదిరించినప్పుడు లేదా మమ్మును క్రిందకు త్రోసివేయడానికి ప్రయత్నించినప్పుడు, మేము నీలో మరుగుపరచేందుకు మాకు సహాయం చేయుము. ప్రభువా, మమ్మును పైకి లేవ నెత్తి, నీ ప్రేమ మరియు మహిమకు సాక్ష్యంగా మమ్మును తృణీకరించిన వారి యెదుట మమ్మును నిలబెట్టుము. దేవా, మా శత్రువు యొక్క ప్రతి ప్రణాళిక విఫలమవునట్లుగా మాకు కృపను దయచేయుము. ప్రభువా, మా జీవితం, "యెహోవా పట్టణముగా'' ప్రకాశింపజేయునట్లుగా సహాయము చేయుము. దేవా, మేము తగ్గించుకొని, నీ సన్నిధికి వచ్చి, మొఱ్ఱపెట్టడానికిని మరియు మా హృదయాన్ని నీ ప్రేమతో బలపరచుమనియు, తద్వారా నీ నామమునకు ఘనతను తీసుకొని వచ్చునట్లుగా మాకు కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.