నా ప్రియమైన వారలారా! నేటి ప్రత్యేకమైన వాగ్దానముగా బైబిల్ నుండి 1 రాజులు 3:12వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "...నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములుగల హృదయము నీకిచ్చుచున్నాను...'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మీకు విస్తారమైన జ్ఞానమును, వివేకమును అనుగ్రహించి, మిమ్మును ఆశీర్వదించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 2:3వ వచనములో చూచినట్లయితే, "బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి '' అని చెప్పబడినట్లుగానే, ఆయన ఈరోజు మీ మీద ఇటువంటి కృపను కుమ్మరించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. యేసు నామములో, జ్ఞానము మరియు వివేకము కలిగిన ఆత్మ మీపైకి దిగిరావలెనని నేను వేడుకుంటున్నాను. ప్రభువు సొలొమోనుతో, "ఇదిగో, ...నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములుగల హృదయము నీకిచ్చుచున్నాను...'' అని సెలవిచ్చియున్నాడు. కనుకనే, నా ప్రియులారా, ఏది న్యాయమో, ఏది సత్యమో గ్రహించే వివేకముగల హృదయమును దేవుడు అతనికి అనుగ్రహించియున్నాడు. మరెవరికి కూడా లేనివిధంగా సొలొమోనును గొప్ప ఘనతకలిగియున్న ఉన్నత స్థానమునకు హెచ్చించుట ద్వారా ఆయన తన వాగ్దానమును సొలొమోను పట్ల నెరవేర్చియున్నాడు. అదేవిధంగా, నా ప్రియులారా, ప్రభువు మిమ్మును ఉన్నత స్థానములకు హెచ్చించి, మీ కొరకు నూతన అవకాశములకు కావలసిన ద్వారములను తెరుస్తాడు.

నా ప్రియులారా, నేడు ప్రభువు మనకు జ్ఞానవివేకముగల హృదయమును ఎందుకు ఇస్తాడు? మనము ఇతరులను జాగ్రత్తగా చూసుకోవడానికి, వారిని సరైన మార్గంలో నడిపించడానికి ఆయన అలాగున జరిగిస్తాడు. సొలొమోనును చూడండి; ప్రజలకు సరైన తీర్పు తీర్చు జ్ఞానమును అనుగ్రహించియున్నాడు. ప్రజలు అతని అసాధారణమైన జ్ఞానవివేకములను, వారి హృదయాలను అర్థం చేసుకుని న్యాయమైన తీర్పులు ఇవ్వగల సామర్థ్యమును కలిగియుండుట చూసినప్పుడు, వారు అతని పట్ల భయభక్తులతో నిండిపోయారు. ఆలాగుననే, ఇద్దరు స్త్రీలు మరియు వారి పిల్లలకు సంబంధించిన సంఘటనను చూచినట్లయితే, ఒక రాత్రి, ఒక స్త్రీ నిద్రించుచున్నప్పుడు పొరపాటున తన బిడ్డపై పడటంతో ఆ బిడ్డ మరణించింది. అప్పుడు ఆమె, మరొక స్త్రీకి చెందిన జీవముతో ఉన్న బిడ్డను తీసుకుని, తన చనిపోయిన బిడ్డను ఆ స్త్రీ పక్కన ఉంచినది. రాజు ముందు ఆమె, బ్రతికున్న ఈ బిడ్డ నాది, చనిపోయిన బిడ్డ ఆమెది అని వాదించింది. కానీ, ఆ రెండవ స్త్రీ న్యాయము కొరకు వేడుకొనినది. అయితే, దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానమును ద్వారా సొలొమోను వారి హృదయములను గ్రహించి సత్యమును గ్రహించాడు. కనుకనే, అతడు వారిద్ధరిలో ఉన్న అన్యాయమును పరిశీలించి, వారికి తగిన తీర్పును ఇచ్చియున్నాడు. దాని ఫలితంగా, దేశ ప్రజలందరూ అతనిని చూసి భయభక్తులతో నిలిచారు. తద్వారా, సొలొమోను ఇతర రాజులందరికంటే గొప్ప ఘనతను పొందుకున్నాడు. తన దేశము క్షేమముగా ఉండాలని ఆయన జ్ఞానవివేకములతో ప్రజలను పరిపాలించాడు. అవును, నా ప్రియులారా, మనకు కూడా ఆయన వంటి రాజులు కావలెను. కుల, జాతి లేదా మత భేదము లేకుండా, అందరికి న్యాయమును, నిష్పక్షపాతమును చేకూర్చు నాయకులు మనకు ఎంతో అవసరము. నాయకులు పక్షపాతం లేకుండా పరిపాలించుచూ, నీతిని నిలబెట్టినప్పుడు, సొలొమోను పాలనలో జరిగినట్లుగానే ఆ దేశములో క్షేమము, శాంతి నెలకొంటాయి. ప్రజలు సంపదను, శాంతిని, సోదరభావమును అనుభవిస్తారు; తద్వారా, ఆ దేశము ఒక గొప్ప ఉన్నతస్థాయికి ఎదుగుతుంది.

రెండవది, దానియేలును చూడండి. బైబిల్ నుండి దానియేలు 5:12వ వచనములో చూచినట్లయితే, అతడు అసాధారణమైన జ్ఞానమును, అవగాహనను కలిగి ఉండేవాడు; కలలకు భావము చెప్పడంలోను, ప్రవచనము చెప్పుటలోను మరియు కష్టమైన సమస్యలను పరిష్కరించడంలో అతనికి ఒక ప్రత్యేకమైన సామర్థ్యమును కలిగి ఉన్నాడు. ఈ వరము ద్వారా, ఆయన రాజులకు భవిష్యత్తులో ఏమి జరగబోతుందని తెలియజేయుచూ వారిని నడిపించేవాడు. అతడు ప్రవచనము పలికినట్లయితే, అవన్నియు నిశ్చయముగా నెరవేరుతాయి. నిజానికి, అతనిని బానిసలుగా పట్టుకున్నవారే ఈ రాజులు; అయినప్పటికీ, అతడు వారి మధ్య ఒక రాజకుమారుని వలె ఎంతో ఘనతగా జీవించాడు. నా ప్రియులారా, ప్రభువు మీకు అటువంటి కృపనే నేడు అనుగ్రహించుచున్నాడు. ఈ విధంగానే, మీరు మీ సంస్థలోను, వ్యవస్థలోను మరియు పరిచర్యలోను ఉన్నతస్థాయికి ఎదుగుతారు. వారి నాయకులను నడిపించే జ్ఞానమును ఆయన మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మీకు ఎందుకు అటువంటి జ్ఞానవివేకములను ఇచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నాడని గ్రహించినట్లయితే, మీరు ఆశ్చర్యపోవచ్చును. ఎందుకంటే, దేశమును పరిపాలించుటకు శక్తివంతులైన రాజులకు, నాయకులకు కూడా మీరు తెలివితేటలకు మరియు జ్ఞానవంతమైన ఆలోచనలకు మూలాధారంగా ఉండాలని ఆయన మీ పట్ల కోరుకుంటున్నాడు. ప్రభువు ఆత్మకు అన్ని కార్యములు తెలుసు. రాజులు తమ దేశములను జ్ఞానవివేకములతో పరిపాలించునట్లుగా, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను వారికి తెలియజేయాలని ఆయన ఆశించుచున్నాడు. సంస్థలను మరియు పరిచర్యలను నాయకత్వము వహించి నడిపించుటకు ఆయన మిమ్మును వాడుకోవలెనని కూడా మీ పట్ల కోరుచున్నాడు. అంతమాత్రమే కాదు, నా ప్రియులారా, జ్ఞానవివేకములు కలిగిన పరిశుద్ధాత్మతో మిమ్మును నింపి, మీ జీవితంలోని ప్రతి అడుగులోనూ స్పష్టమైన దిశానిర్దేశాన్ని అనుగ్రహించుచున్నాడు. ఇటువంటి దైవీకమైన వరము మిమ్మును ముందుకు నడిపించుచున్నది. ఈ ఆశీర్వాదం కొరకు ఇప్పుడే ప్రభువును అడగండి; ఎందుకంటే, దానిని మీకు అనుగ్రహించడానికి ఆయన నేడు సిద్ధంగా ఉన్నాడు.

మూడవదిగా, మీ కుటుంబమును పరామర్శించడానికి అవసరమైన జ్ఞానమును, వివేకమును మీకు అనుగ్రహించాలని దేవుడు మీ పట్ల కోరుకుంటున్నాడు. బైబిల్‌లో నుండి 1తిమోతికి 5:8వ వచనములో చూచినట్లయితే, "ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును'' అన్న వచనము ప్రకారము ఎవరైనను తన స్వజనులను, ముఖ్యముగా తన ఇంటివారిని, సంరక్షించని యెడల, వాడు విశ్వాసము లేనివాడై, అవిశ్వాసికంటే చెడ్డవారుగా ఉంటారు. కనుకనే, నా ప్రియులారా, మీరు మీ ప్రియులైన వారిని అనగా, మీ భార్యను, భర్తను మరియు పిల్లలను చక్కగా పరామర్శించవలెను. ఇంకను వారి పట్ల ప్రేమ, శ్రద్ధలతో వ్యవహరించవలెనని ప్రభువు మీ పట్ల కోరుకుంటున్నాడు. వారి అవసరతలను తీర్చడములోనూ, మీ పిల్లల వివాహములను సరైన పద్ధతిలో జరిపించడంతో సహా అనేక విషయాలలో జ్ఞానవివేకముతో నిర్ణయాలు తీసుకోవలెనని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. వారికి అవసరమైన వాటిని సరైన సమయంలో అందించడమే మన యొక్క ప్రాథమిక బాధ్యత. వారు తమ ప్రయత్నాలలో విజయం సాధించడానికి అవసరమైన వనరులు, ఆర్థిక సహాయము అనగా, వారికి కావలసిన నిధులు అందించబడునట్లుగా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. నా ప్రియులారా, జీవితంలోని ప్రతి అంశంలోనూ మీ కుటుంబమును పోషించడానికి, రక్షించడానికి అవసరమైన జ్ఞానమును దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. మీ బిడ్డల కొరకు, మీ భర్త కొరకు ఏమి చేయాలో ఆయన మీకు తెలియజేసి, మిమ్మును నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మీకు, 'నీ భార్య కోసం ఇలా చేయి' అని నడిపిస్తాడు. ఆయన ఇచ్చు ఈ నడిపింపును వెంబడించుట ద్వారా, మీరు మీ ప్రియులైన వారికి సమాధానమును చేకూరుస్తాడు మరియు మీ కుటుంబమంతటిని సామరస్యంతో నడిపిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువైన యేసయ్యా, నీ బిడ్డలైన మాకు జ్ఞానమును, వివేకమును సమృద్ధిగా అనుగ్రహించుము. దేవా, ఈ లోకములో, మేము, నీతిగా తీర్పు తీర్చుటకును, నాయకులను నడిపించుటకును మరియు మా కుటుంబములను చక్కగా పోషించుటకు మాకు కావలసిన నీ యొక్క దైవీకమైన జ్ఞానమును అనుగ్రహించుము. దేవా, నీ యొక్క జ్ఞానముతో, మమ్మును ఆశీర్వదించి, మమ్మును ఉన్నత స్థితికి హెచ్చించి, మా జీవితములను నీ యొక్క దైవీకమైన సమాధానముతో నింపుము. ప్రభువా, మా మరియు మా ప్రియులైన వారి యొక్క ప్రతి నిర్ణయములలోను నీ పరిశుద్ధాత్మతో మమ్మును నడిపించుము. దేవా, మా ప్రియులైన వారిని పోషించుటకు మరియు సరైన సమయంలో వారి అవసరతలను తీర్చుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, అడుగుచున్న మాకు నీ యొక్క దైవీకమైన జ్ఞానమును ధారాళముగా అనుగ్రహించుము. ప్రభువా, ఈ రోజు ఈ ఆశీర్వాదమును మాకు దయచేసి, సొలొమోనుకు ఇచ్చిన బుద్ధి జ్ఞానములను మాకును దయచేసి, మమ్మును దీవించుమని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.