నా ప్రియమైనవారలారా, మన ఆపత్కాలంలో ప్రభువు మనకు సంరక్షకుడుగా ఉన్నాడు. లోకంలో ఆపదలున్నవి, ప్రమాదములున్నవి, నష్టములున్నవి. అయినను మన చుట్టూ ఉన్న ప్రజలు మనలను విడిచి వెళ్లు సమయాలు, కాలములు ఉండవచ్చును. ఏమిలేని కాలములు ఉండవచ్చును. కానీ, వాటన్నిటి మధ్యలో, ప్రభువు ఆపత్కాలంలో మనకు భద్రతగాను, కాపుదలగా ఉంటాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 27:5వ వచనము చూచినట్లయితే, "ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీకు ఆశ్రయ దుర్గము ఉంటాడు. నా ప్రియులారా, దుర్ దినములు రావచ్చును. అయితే, బైబిల్ నుండి యెషయా 57:1 వ వచనములో చూచినట్లయితే, " నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారని యెవనికిని తోచదు'' అని చెప్పబడినట్లుగానే, కీడు దినము రాకముందే నీతిమంతుడు కొనిపోబడతాడు, ఆత్మ కాపాడబడుతుంది. అవును, నా ప్రియులారా, కొంతమంది చిన్న వయస్సులోనే కొనిపోబడతారు.

నిన్న ఒక వ్యక్తి ఫోన్ చేసి, నా సహోదరునికి 53 సంవత్సరములు, అతనికి ఎంతో చిన్న పిల్లలు. ఇప్పుడు వారికి తండ్రి అవసరం. కానీ, నిన్న అకస్మాత్తుగా, ఐదు నిమిషాల్లోనే అతడు చనిపోయాడు. అంతకుముందే వారు వాళ్ల అమ్మ దగ్గర కూర్చుని మాట్లాడి, గదిలోనికి వెళ్లారు, ఊపిరి పీల్చలేకున్నానని చెప్పాడు. ఆ తర్వాత, ఐదు నిమిషాలలోనే చనిపోయాడు. ఎందుకు బ్రదర్ అని నన్ను అడిగాడు? అప్పుడు నేను, తన జీవితంలో కీడు వచ్చి అతనిని దేవుని నుండి వేరు చేయకముందే, అతని ఆత్మను కాపాడి దేవుడు పరలోకానికి తీసుకెళ్లాడని చెప్పాను. అతడు కరెక్ట్ అని అన్నాడు. నా సోదరుడు ఎప్పుడు మద్యము త్రాగుతూనే ఉండుట ద్వారా, కాలేయమంతా పాడైపోయింది. కానీ గత ఆరు నెలలుగా పూర్తిగా మారుమనస్సు పొంది, అతడు త్రాగుడు విడిచిపెట్టియున్నాడు. అయినా, అకస్మాత్తుగా ఒకరోజు కొంచెం తాగి వచ్చాడు. అయితే, తాను మద్యమును సేవించడము పూర్తిగా విడిచిపెట్టాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ, అతడు ఈ ఒక్క వారమే మద్యము తాగకుండా ఉన్నాడు. మా అమ్మ వృద్ధురాలు, ఆమె దగ్గరకు వచ్చి కూర్చుని మాట్లాడి, ఎంతో సంతోషంగా అమ్మకు ఒక మంచి బిడ్డగా ఉండిపోయాడు. కానీ, అతనికి ఒక కుటుంబం ఉన్నది, అయినను అమ్మను వెదుక్కుంటూ, మా అమ్మ దగ్గరకు రోజూ వచ్చేవాడు. కొంతసేపు మాట్లాడి అమ్మను సంతోషపెట్టి తిరిగి తన యింటికి వెళ్లేవాడు. ఇలా మార్పునొందిన అతడు అకస్మాత్తుగా కొనిపోబడ్డాడు.

అవును, ప్రియులారా, కీడు దినము రాకముందే నీతిమంతుడు కొనిపోబడతాడు, వాని ఆత్మ కాపాడబడుతుంది. కానీ, ఈ లోకంలో మనం కీడు మధ్యలో జీవించునట్లుగా, ప్రభువు మనలను తన గుడారపు మాటున దాయుచున్నాడు. పరలోకపు గుడారపు మాటున అతనిని దాచాడు. కనుకనే, అతడు కొనిపోబడ్డాడు. కానీ, మనము ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన తన గుడారపు మాటున మనలను దాచి, దాచి ఉంచి, అపవాది ముట్టకుండా, దుష్ట ప్రజలు మనలను ముట్టకుండా, ఏ కీడు మనకు తాకకుండా ఆయన మనలను తన గుడారపు మాటున దాచి ఉంచుచున్నాడు. ఎటువంటి కీడు మనలన ముట్టకుండా, మనలను తన మరుగున దాచి పెట్టి, ఆయన మనలను తన యొక్క ఆశ్రయదుర్గము మీద, ఎవరూ త్రోసివేయలేనటువంటి మరియు మనలను విచ్ఛిన్నం చేయలేనటువంటి స్థితిలో మనలను స్థిరంగా స్థాపించి హెచ్చిస్తాడు. ఈ కృపను ప్రభువు ఈరోజు మీకు అనుగ్రహిస్తాడు. నా ప్రియులారా, మీ ఉద్యోగమును స్థిరపరుస్తాడు. మీ ఆధ్యాత్మిక జీవితమును స్థిరపరుస్తాడు. మీ కుటుంబ జీవితమును స్థిరపరుస్తాడు. మీ చదువులను స్థిరపరుస్తాడు. మీ వ్యాపారమును స్థిరపరుస్తాడు. మీ పరిచర్యను స్థిరపరుస్తాడు. మీ అభిషేకమును స్థిరపరుస్తాడు. ఆయన తన గుడారపు మాటున మిమ్మును దాచి, ఆశ్రయదుర్గము మీద ఆయన మిమ్మును ఎక్కిస్తాడు.

నా ప్రియులారా, తన గుడారపు మాటున దాచి ఉంచుతాడు. దావీదును అంతం చేయాలని అందరూ వెదకుచున్నారు. ఎక్కడ ఉన్నాడని తెలియలేదు. దావీదు వెళ్ళినప్పుడు శత్రువులందరికి ఆయన మంచి నిద్రను ఇచ్చాడు. అతను తన పని ముగించుకుని తన దారిన తాను వెళ్లిపోయాడు. ఏ ఒక్కరు కూడా అతనిని ముట్టలేకపోయారు. అలాగే ప్రభువు మీకు కూడా జరిగిస్తాడు. కనుకనే, ధైర్యంగా ఉండండి. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 90:1వ వచనములో చూచినట్లయితే, "ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే '' అని చెప్పబడినట్లుగానే, దేవా, నీవు మాకు మాత్రమే కాదు, మా పిల్లలకు, మా మనమ సంతతికి, వారి పిల్లలకు, తరతరములకు నీవే ఆశ్రయము అని తెలియజేయబడుచున్నది. ఇంకను బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 33:27వ వచనములో చూచినట్లయితే, " శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను '' అని చెప్పబడినట్లుగానే, ఆయన మీ యెదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమని ఆజ్ఞాపిస్తాడు. కనుకనే, మీరు ధైర్యంగా ఉండండి. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 91:1వ వచనములో చూచినట్లయితే, "మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు'' అని చెప్పబడినట్లుగానే, మహోన్నతుడైన దేవుని చాటున మీరు నివసించునట్లుగా చేస్తాడు. ఈ కృపను ప్రభువు నేడు మీకు అనుగ్రహించుచున్నాడు. ఇంకను బైబిల్ నుండి 2 కొరింథీయులకు 6:16వ వచనములో చూచినట్లయితే, " దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మనలో నివసించి, మనకు దేవుడుగా ఉన్నాడు, మనము ఆయనకు ప్రజలుగా ఉన్నారు.

అవును, నా ప్రియమైనవారలారా, నేడు మీ ఆత్మను ప్రభువు భద్రంగా కాపాడుతాడు. ఇంకను ఆయన మిమ్మును తన బిడ్డగా కాపాడుతాడు, దేవుని బిడ్డగా, ఆయన ఆలయంగా కాపాడుతాడు. ఈ లోకాచారములవలె కాదు, ప్రభువు నడిపింపులో, ఆయన మిమ్మును ఒక తండ్రివలె పరామర్శించి, ఆయన జీవంతో మిమ్మును నింపి, సర్వశక్తిమంతుడైన దేవునిగా మీతో ఎల్లప్పుడు ఉంటాడు. అందుకే బైబిల్ నుండి యెహోషువ 1:9వ వచనములో చూచినట్లయితే, ప్రభువు యెహోషువతో చెబుతున్నాడు, " నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నేను నీకు ఆశ్రయముగా ఉన్నాను, నీవు కలత చెందకు, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవానగు నేను నీకు తోడైయుందును'' అని చెప్పబడినట్లుగానే, మీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ ఆశీర్వాదాన్ని యేసు నామములో మీ మీద నేను ఉంచుచున్నాను. ఈ ధన్యత మీ మీదకు దిగివచ్చును గాక. మీ పిల్లల మీద, మీ మనమసంతతి మీదికి అది దిగివచ్చును గాక. మీ ఆత్మ కాపాడబడును గాక. మీ శరీరం కాపాడబడును గాక. మీ చదువు కాపాడబడును గాక. మీ ఉద్యోగం కాపాడబడును గాక. మీరు వెళ్లుచున్న ప్రతిచోట చేయవలసిన పనులన్నీ, బాధ్యతలన్నీ కాపాడబడును గాక. మీ పేరు కాపాడబడును గాక. మీకు మంచి కీర్తి కలుగును గాక. మీ స్థిరచరాస్థులన్ని కాపాడబడును గాక. సాతాను దేనినీ దొంగిలించకుండా, ప్రభువు వాటన్నిటినీ కాపాడును గాక.ఈ ధన్యతను దేవుడు ఈరోజు మీకు అనుగ్రహించి, ఆపత్కాలమందు మిమ్మల్ని ఆయన రెక్కల కింద దాచి, మరుగైన స్థలంలో ఉంచి, దాచి ఉంచి, ప్రభువు మిమ్మల్ని ఆశ్రయదుర్గము మీద ఉంచి కాపాడును. ఆయన మిమ్మల్ని కప్పి దాచును, ఆశ్రయదుర్గము మీద ఉంచి ఉన్నత స్థానానికి తీసుకువస్తాడు, చింతించకండి. దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మా జీవితంలోని ఎల్లవేళల, నీవు మాకు ఆశ్రయంగా, బలమైన కోటగా ఉన్నందుకు నీకు వందనములు. దేవా, నీ రెక్కల నీడలో మమ్మును దాచి, ఆపత్కాలంలో మమ్మును సురక్షితంగా ఉంచి, కాపాడుము. ప్రభువా, నీ మాటైన స్థలంలో మమ్మును దాచి, కదిలించలేని బండపై మమ్మును ఉన్నతంగా నిలబెట్టుము. ప్రభువా, శత్రువు యొక్క ప్రతి దుష్ట ప్రణాళిక మరియు దాడి నుండి మా కుటుంబమును, మా పిల్లలను, మరియు నీవు మాకు అప్పగించిన వాటన్నిటిని కాపాడుము. దేవా, నీ పరిపూర్ణ చిత్తానుసారంగా మా జీవితమును, మా పనిని, మా పరిచర్యను, మరియు మా భవిష్యత్తును స్థిరపరచి, స్థాపించుము. ప్రభువా, నీ సన్నిధి ఎల్లప్పుడూ మమ్మును ఆవరించి ఉండునట్లుగా చేసి, మేము ఎక్కడికి వెళ్ళినా నీవు మాతో ఉన్నావని గుర్తెరుగునట్లుగాను, ధైర్యంతో జీవించడానికి మాకు సహాయము చేయుము. దేవా, నీ ఆశీర్వాదం తరతరాలుగా మా కుటుంబంపై మరియు మా మనవ సంతతి మీద నిలిచియుండునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు కృపగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.