నా ప్రియులారా, నేడు దేవుడు మీకు రక్షణను కలుగజేయుదునని తెలియజేయుచున్నాడు. నా మహిమను వారికి అనుగ్రహించుచున్నాను. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 46:13వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను'' ప్రకారము యేసు రక్షకుడై యున్నాడు. యేసు అనగా, మన పాపముల నుండి మనలను రక్షించువాడై యున్నాడు. అవును, బైబిల్ నుండి మత్తయి 1:21వ వచనములో మనం చదివినట్లుగానే, "తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను'' ప్రకారముగానే, యేసు అంటే మనలను పాపం నుండి రక్షించేవాడు అని అర్థము. యేసు నామము తప్ప, ప్రజలు రక్షింపబడటానికి భూమి మీద మరే నామము కూడా ఇవ్వబడలేదు. కేవలం యేసు నామం ద్వారానే, మరియు కేవలం యేసు ద్వారానే మనం రక్షింపబడి పాపం నుండి విడుదలను పొందుకొనగలము. కనుకనే, బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 4:12వ వచనములో మనకు స్పష్టంగా ఇలాగున చెబుతుంది, "మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను'' రక్షణ మరెవరియందును లభించదు, ఎందుకంటే మనం రక్షింపబడటానికి ఆకాశం క్రింద మనుష్యులకు ఇవ్వబడిన వేరొక నామము ఏదియు లేదు. ఆలాగుననే, బైబిల్ నుండి తీతుకు 3:5వ వచనములో మనకు సెలవిచ్చునదేమనగా, "మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను'' ప్రకారము మనం నీతి కార్యాలు చేసినందువలన కాదు, కానీ మన మీద ఆయనకున్న కనికరం వలననే యేసు మనకు రక్షణను అనుగ్రహించియున్నాడు. ఆయన కనికరం ఎన్నటికిని వాడబారదు.

నా ప్రియులారా, ఈ రోజు కూడా, మీరు ఆయన వైపు తిరిగి, " ప్రభువా, మా మీద దయ చూపండి' అని చెప్పవచ్చును. మనలో ఎవరూ పరిపూర్ణులు కాదు. కానీ, యేసు ద్వారా మనం ఎప్పుడైనా ఆయన కృపాసింహాసనమునొద్దకు రావచ్చును. అందుకే బైబిల్ నుండి యోహాను 3:16-17వ వచనములలో చూచినట్లయితే, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు'' ప్రకారము దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడంటే, మనం ఆయన వద్దకు వచ్చి ఆయనను విశ్వసించినప్పుడు, ఆయన మనలను నశించిపోనివ్వకుండా, మన పాపాలను క్షమించి మనకు నిత్యజీవమును అనుగ్రహిస్తాడని చెప్పబడియున్నది. ఆయన మనలను తీర్పు తీర్చి, శిక్షించి, దూరపరచడు. అందుకు బదులుగా, ఆయన మన పట్ల కనికరం చూపి, మన పాపాలను తొలగించి, మనలను క్షమించును. ఆయన ప్రేమకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి. అందుకే బైబిల్ నుండి యోహాను 12:47వ వచనములో చూచినట్లయితే, "ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నేనతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదుగాని లోకమును రక్షించుటకే వచ్చితిని '' అని యేసు తాను సెలవిచ్చుచున్నాడు. అవును, ఆయన మనలను శిక్షించుటకు రాలేదు, కానీ, మనలను రక్షించడానికి వచ్చాడు. కనుకనే, భయపడకండి.

ఒకసారి యేసు, పొట్టిగా ఉండటం వలన యేసును చూడాలనే కోరికతో చెట్టుపై దాక్కున్న ఒక పాపిని వెతుక్కుంటూ ఆయన వెళ్లెను. అతను అక్కడ ఉన్నాడని ఎవరికి తెలియదు, కానీ యేసు అతనిని కనుగొన్నాడు. అతని పేరు జక్కయ్య. అతడు ఇంతకు మునుపు ఎన్నడును యేసు కలుసుకోనప్పటికీ, యేసు అతనిని పేరు పెట్టి పిలిచెను. అప్పుడు అతను ఎంతగా ఆశ్చర్యపోయి ఉంటాడో ఒక్కసారి ఊహించుకొనండి. అవును, నా ప్రియులారా, దేవునికి మీ పేరు తెలుసు. అతను లంచము తీసుకుంటూ, ప్రజలను బాధపెట్టేవాడు. కనుకనే, అందరు అతనిని చూచి, 'ఇతడు ఒక పాపి, పాపి, పాపి' అని పిలిచారు. కానీ, యేసు అతని పేరు పెట్టి పిలిచి, ' నేడు నేను నీ యింటికి వచ్చెదను' అని తెలియజేశాడు. జక్కయ్య ఆయనను సంతోషంతో అంగీకరించాడు. అవును, నా ప్రియులారా, మీరు కూడా ఈ రోజు మీ పాపాలు క్షమించబడినవారై, సంతోషంతో ప్రభువైన యేసును మీ ఇంటిలోనికి ఆహ్వానించవచ్చును. ఆయన తన యొక్క రక్షణను మరియు ఆయన మీకు తన మహిమను అనుగ్రహించును. అందుకే బైబిల్ నుండి 1 దినవృత్తాంతములు 16:29వ వచనములో చూచినట్లయితే, " యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు'' అని చెప్పబడియున్న ప్రకారము మీరు యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన తన పరిశుద్ధత యొక్క మహిమను మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఇట్టి ఆశీర్వాదాన్ని నేటి వాగ్దానము నుండి మీకు అనుగ్రహించును గాక.

ప్రార్థన:
కృపగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసు, రక్షణ మరియు మహిమ యొక్క నీ ప్రేమపూర్వక వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మేము పరిపూర్ణులము కాదు మరియు మాకు నీ దయ అవసరమని మేము నీ దయను కోరుచున్నాము. ప్రభువా, మా క్రియల ద్వారా కాదు, నీ కృప ద్వారా మమ్మును రక్షించినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, దయచేసి మా పాపములన్నింటిని క్షమించి, ఈ రోజు మమ్మును పరిశుద్ధులనుగా నీ రక్తము ద్వారా కడుగుము. యేసయ్యా, మా పేరు పెట్టి మమ్మును పిలిచి, మమ్మును ప్రేమించినందుకు నీకు వందనాలు. ప్రభువా, దయచేసి మా హృదయంలోనికి వచ్చి, నీ యొక్క రక్షణానందముతో మమ్మును నింపుము. దేవా, నీ రక్షణ యొక్క ఆనందము ద్వారా నీ పరిశుద్ధుతను మేము ధరించుకొనునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ దయ మా యొక్క గత జీవితమును గురించి మాట్లాడుటకు కృపనిమ్ము. దేవా, మేము ఈ రోజు నీ నిత్యజీవ వరమును ఆసక్తిగల హృదయంతో పొందుకొనుటకు సహాయము చేయుమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.