నా ప్రియ సహోదరీ, సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 32:17వ వచనములో ఉన్న ఈ అద్భుతమైన వాగ్దానమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు'' ప్రకారము ఇది ఎంతటి చక్కటి వాగ్దానము నేడు మన కొరకు ఇవ్వబడినది. ఇది ఎంత ఆశీర్వదింపబడిన జీవితము కదా! ఈ లోకములో నివసించే ప్రజలు సమాధానకరమైన జీవితము కొరకు ఎదురు చూస్తుంటారు. ఆలాగుననే, దేవుని బిడ్డలు కూడా సమాధానకరమైన జీవితమును ప్రేమిస్తారు. అయితే, దేవుని బిడ్డలు సమాధానము కలిగియుండకుండా అపవాది ప్రయత్నిస్తుంటుంది. అపవాది ప్రజలు మరియు సాతాను శక్తులు దేవుని బిడ్డల యొక్క కుటుంబాలను నశింపజేయుటకు వస్తాయి. అయితే, దేవుని యందు విశ్వాసముంచిన బిడ్డలకు సమాధానమును మరియు విశ్రాంతిని ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! అయితే, ఎవరి మనస్సు దేవుని యందు ఆనుకొని ఉంటుందో అట్టి వారికి సంపూర్ణమైన సమాధానము, శాంతిని ప్రభువు కలిగిస్తాడు. ఇంకను పచ్చిక గల చోట్లను ప్రభువు వారిని పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద వారిని నడిపిస్తాడు. నీతిమంతులు ఎల్లప్పుడు ప్రభువు యొక్క మంచితనమును రుచి చూచెదరు. వారి మనస్సులో ఎల్లప్పుడు తృప్తి కలిగి నివసిస్తారు. అందుకే బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 4:11వ వచనములో చూచినట్లయితే, "నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను'' అని పౌలు భక్తుడు తెలియజేయుచున్నాడు. బైబిల్ నుండి సామెతలు 15:15వ వచనములో చూచినట్లయితే, " బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును'' అన్న వచనం ప్రకారం దేవుని ప్రజలు సంతోష హృదయము కలిగియుండి, నిత్యము విందు కలిగియుందురు. సమాధానము, కాపుదల, విశ్రాంతి మాత్రమే కాకుండా, దేవుని దీవెనల యందు వారు ఆనందిస్తారు. దేవుని పిల్లలు శాంతిని అనుభవించడమే కాకుండా, ఆయన ఆశీర్వాదాలను ప్రతిరోజూ అనుభవిస్తారు.
అమెరికాలో సియాటిలిన్ ఉంటున్న ఒక కుటుంబాన్ని ఒకసారి మేము వారిని దర్శించినప్పుడు, ఒక వారము రోజులు మాకు వారి గృహములోనే ఆతిధ్యమునిచ్చారు. మేము అక్కడ ఉంటున్నప్పుడు, ఒకసారి మేము అనుకోకుండా, ఒక మర్మమును మేము చూచియున్నాము. ప్రభువు వారి సరిహద్ధులను సమాధానముతో నింపియున్నాడు. అంత గొప్ప సమాధానము వారి గృహములో వారు ఎలాపొందుకొనగలిగియున్నారు? అని మేము అశ్చర్యపోయాము. వారములో ప్రతిరోజు వారు రాత్రి సమయములో మేడగదిలోనికి వెళ్లి, ఆరాధన చేసేవారు. కనుకనే, ఆ ఆరాధన క్రమములో పాల్గొనుటకు మమ్మును కూడా పిలిచి, కుటుంబ ప్రార్థనలో మమ్మును ప్రార్థన చేయమని చెప్పారు. వారి కుటుంబములో కుటుంబ ప్రార్థన ఎలా ఉంటుందో మీకు తెలుసా? వారి కుటుంబములో ఇద్దరు అబ్బాయిలు ఉండేవారు. ఆరాధన సమయములో ఒక అబ్బాయి ఫియానో వాయించేవాడు. మరొక అబ్బాయి డ్రమ్స్ వాయించేవాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా గిటారా వాయించేవారు. ఆ సంగీతముతో పాటు వారు ఎంతో మధురముగా పాటలు పాడుచుండేవారు. నిజముగా ఆ స్థలములో పరలోకము దిగివచ్చిన అనుభూతిని మేము పొందుకొనియున్నాము. ప్రార్థనా సమయములో నా భర్తగారు ఇలాగున వారికి ప్రవచించి వారి కొరకు ప్రార్థించారు, ' నా బిడ్డలారా, నేను మీ యందు ఎంతో ఇష్టపడుచున్నాను మరియు ఆనందించుచున్నాను. అందుకనే, నేను నా సమాధానమును మీకు ఎంతగానో ఇచ్చియున్నాను' అని ప్రభువు ప్రార్థనలో వారికి తెలియజేసియున్నాడు. అవును, వారు సమాధానకరమైన నివాసములలో వారు నివసించుచున్నారు. అందుకనే, క్రీస్తునందు కాపుదలగల గృహమును వారు కలిగియున్నారు. గృహములో మాత్రమే కాదు, వారు ఆత్మలో కూడా విశ్రాంతిని కలిగియున్నారు.
నా ప్రియ స్నేహితులారా, నేడు ఎవరైతే, మీ గృహములలో సమాధానమును మరియు విశ్రాంతి లేకుండా కొరతతో ఉన్నారో? నేడే మీరు ప్రభువైన యేసు నొద్దకు కుటుంబముగా రండి. మీ కుటుంబమంతటిని సమకూర్చుకొని, కలిసి ప్రార్థన చేయండి. మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మును తన యొద్దకు రమ్మని ఆహ్వానించుచున్నాడు, ' నా బిడ్డలారా, నా యొద్దకు రండి,' అని పిలుచుచున్నాడు. అందుకే బైబిల్ నుండి మత్తయి సువార్త 11:28వ వచనమును చూచినట్లయితే, " ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, నేడు కుటుంబముగా మీరు ప్రభువు చెంతకు రండి, ఒకవేళ మీ పసిబిడ్డ నిద్రపోతున్నను సరే, ఆ పసిబిడ్డను మీ చేతిలో పట్టుకొని కుటుంబముగా కలిసి ప్రార్థించండి, అప్పుడు ప్రభువు నిశ్చయముగా, మీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. మీ కుటుంబములో దేవుని కాపుదల మరియు విశ్రాంతి, సమాధానము నిలిచి ఉంటుంది. సుఖకరమైన నివాసములను మీరు కలిగియుంటారు. నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన దేవా, క్షేమకరమైన నివాసము కలిగియుండుట ఎంత ఆశీర్వాదకరము అని నీవు వాగ్దానము చేసినట్లుగానే, ఈ సందేశము చదువుచున్న మా య్కొ ప్రతి గృహము మీద, కాపుదల నిచ్చే నీ దక్షిణ హస్తము దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, శాంతి మరియు విశ్రాంతి యొక్క మీ వాగ్దానానికై నీకు వందనాలు. దేవా, నీ యొక్క రక్షణ హస్తాన్ని మా ఇంటిపై ఉంచి దానిని సురక్షితమైన నివాసంగా మార్చుము. యేసయ్యా, ఏ దుష్ట శక్తి మమ్మల్ని తాకకుండా మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండుము. దేవా, మా కుటుంబాన్ని నీ సన్నిధితో నింపండి, ఆనందం, విశ్రాంతి మరియు ఐక్యతతో మమ్మల్ని ఆశీర్వదించుము. యేసయ్య, నీవు ఎల్లప్పుడు మా ఇంటికి అధిపతిగా ఉండుము. దేవా, మా సరిహద్దులు నీ సమాధానముతో దీవించబడునట్లుగా చేయుము. ప్రభువా, మా గృహము చుట్టు అగ్ని గోడలుగాను, కంచెగాను ఉండుము, ఏ అపవాది శక్తులు మమ్మును మరియు మా గృహమును ఎప్పుడు తాకుండా ఉండునట్లుగా చేయుము. యేసయ్యా, నిన్ను స్వేచ్ఛగా ఆరాధించునట్లుగా, నీకు స్వాతంత్య్రముతో పరిచర్య చేయునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, నీ యొక్క సమాధానము, మా యొక్క ప్రతి గృహము మీద ఉండునట్లుగాను, నీ యొక్క సమాధానమును ప్రతి గృహము మీద పలుకుచున్నాను, గృహము మాత్రమే కాదు, మేము ఆరాధించే ప్రతి స్థలములోనికి నీ యొక్క సమాధానము దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, ప్రతి గృహము నీ యొక్క దైవీకమైన సమాధానమునుతోను మరియు నీ యొక్క విశ్రాంతితో దీవించబడునట్లుగా చేయుము. ప్రభువా, ఎల్లప్పుడు మేము సుఖకరమైన నివాసములు ఉండునట్లుగాను, మేము నిత్యము నీ సన్నిధితో నింపబడునట్లుగా చేయుమని యేసుక్రీస్తు అతి మధురమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.