నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శక్తివంతమైన ఘనమైన నామమున మీకు శుభములు. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 29:13వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు'' ప్రకారము మనము ప్రభువు వెదకు ప్రతిసారి పూర్ణ హృదయముతో వెదకాలి. నూరు శాతము మనము ఆయనను యథార్థంగా వెదకేవారముగా ఉండాలి. ఇది ఎంతటి గొప్ప వాగ్దానము కదా! ప్రభువును ఆ విధంగా వెదకినప్పుడు ఏమి జరుగుతుంది? బైబిల్ నుండి కీర్తనలు 34:10వ వచనమును చూచినట్లయితే, "సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు'' అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆలాగుననే, యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు, ఆయన ఒక రోజులో అనేకసార్లు తండ్రిని వెదకుట ద్వారా తాను మనకు ఒక మాదిరిగా ఉండెను. మన జీవితాలలో మనము కూడా ఆయనను వెదకుచూ, ఆయనను కేంద్రముగా కలిగియున్నట్లయితే, ఆయన ఆధ్యాత్మికంగాను మరియు భౌతికంగాను మన అవసరతలన్నిటిని తీరుస్తాడు. ఆయన వైపు చూస్తూ, ఆయనను జాగ్రత్త వెదకువారికి ఆయన తన ఆశీర్వాదములను పొంగిపొరునట్లుగా చేస్తాడు.

ఇందుకు మాదిరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు సంపూర్ణమైన ఉదాహరణగా ఉన్నాడు. అందుకే బైబిల్ నుండి మార్కు 1:35వ వచనములో మనము చదివినట్లయితే, "ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్య ప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను'' ప్రకారము ఆయన వేకువనే లేచి దేవుని సన్నిధిని వెదికాడని తెలియజేయుచున్నది. మరల మనము లూకా 6:12వ వచనములో మనము చదివినట్లయితే, "ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను'' ప్రకారము రాత్రంతయు యేసుక్రీస్తు ప్రార్థనలో గడిపెను. ఇంకను మత్తయి 14:23వ వనచములో చూచినట్లయితే, " ఆయన ఆ జనసమూహము లను పంపి వేసి, ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ యెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను '' అని చెప్పబడిన ప్రకారము సాయంకాలమున ఆయన ఏకాంతముగా కొండ మీద ప్రార్థనలో గడిపెనని వ్రాయబడియున్నది. అదేవిధముగా, రాజైన దావీదు మనందరికి ఒక చక్కని మాదిరియై యున్నాడు. దావీదు కూడా ప్రభువును యథార్థంగా వెదికేవాడు. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 55:17వ వచనములో చూచినట్లయితే, "సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును'' ప్రకారము దావీదు మూడు వేళల తండ్రి సన్నిధిని వెదికాడు. ఆలాగుననే, కీర్తనలు 63:1వ వచనములో చదివినట్లయితే, " దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును '' ప్రకారము దావీదు వేకువనే దేవుని వెదికాడు. పై వచనములన్నిటిని మనము చూచినట్లయితే, దావీదు తనకు సమయము దొరికినప్పుడల్లా, దేవుని వెదికాడు అని చెప్పబడుచున్నది. అందువలన అతని జీవితము ఎలాగున ఆశీర్వదింపబడినది? అని మనము చూచినట్లయితే, కీర్తనలు 23వ అధ్యాయములో మీరు చదివినట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదములన్నిటిని గురించి తెలియజేయబడినది. ఆలాగుననే, కీర్తనలు 23:1వ వచనములో చూచినట్లయితే, "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు'' అని దావీదు అంటున్నాడు. అవును, దావీదు ఎల్లవేళల దేవుని వెదకుట ద్వారా సమృద్ధియైన దీవెనలను అతడు పొందుకున్నాడు. అంతమాత్రమే కాదు, అతడు ఉన్నత స్థానమునకు హెచ్చింపబడ్డాడు అని మనము చూడగలము.

అవును, నా ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మీరు కూడా మీ పూర్ణ హృదయముతో దేవుని వెదకినట్లయితే, మీకు ఏమియు కూడా కొదువగా ఉండదు. విజయవంతమైన మరియు ఆశీర్వాదకరమైన జీవితానికి రహస్యం ఇదే. కనుకనే, మీరు ఆయనను పూర్ణహృదయముతో వెదకినట్లయితే, ప్రభువు మిమ్మును ఘనపరుస్తాడు. ఇప్పుడు కూడా అటువంటి జీవితమును కలిగి ఉండడము కొరకై మనము ప్రభువు హస్తాలకు మనలను సమర్పించుకొని, ప్రార్థన చేద్దాము. ప్రియులారా, మనం నిజంగా మన హృదయపూర్వకంగా ప్రభువును వెదకినప్పుడు, ఆయన మన కాపరి అవుతాడు. ఆయన దావీదును నడిపించినట్లుగానే, అతనికి అవసరమైన వాటిని అనుగ్రహించి, అతనిని రక్షించినట్లుగానే, ఆయన మనలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. పూర్ణ హృదయంతో దేవుని వెదకడం అనగా, ఆయన నుండి మన దృష్టిని మరలించే కార్యాల నుండి మనస్సును త్రిప్పుకోవడం, ఆయన చిత్తానికి మనలను సమర్పించుకోవడం, ప్రార్థించడానికి మరియు ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి సమయాన్ని కేటాయించడం అని అర్థం. ప్రియులారా, మనం ఆయనను ఎంత ఎక్కువగా వెదకుచున్నామో, అంత ఎక్కువగా మనం ఆయనను కనుగొంటాము మరియు ఆయన సన్నిధి మన జీవితాలను మారుస్తుంది. మనలను శూన్యముగా ఉంచే ఈ లోక ఉద్దేశాలలో ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. బదులుగా, ప్రతిరోజూ క్రీస్తును మరింత లోతుగా తెలుసుకోవడం అనే నిత్యము నిలుచు నిధిని వెంబడిద్దాం. కనుకనే, ప్రియులారా, మీరు ఆయనను మీ పూర్ణ హృదయముతో వెదకినట్లయితే, మీకు ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న ప్రశస్తమైన మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానమును నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీవు మాకిచ్చిన కృప అంతటిని బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, నీ బిడ్డలైన మా అందరి జీవితములు నీకు మాదిరిగా ఉండునట్లుగా చేయుము. యేసయ్య, నీవు ఈ లోకములో ఎలా వేకువనే తండ్రిని వెదకావో, ఆలాగుననే, మేము కూడా వెదకునట్లుగా మాకును అటువంటి నీ కృపను దయచేయుము. దేవా, అదేవిధముగా, దావీదు ఏలాగున ప్రార్థించాడో మాకందరికి కూడా అటువంటి కృపను అనుగ్రహించుము. ప్రభువా, మేమందరము ఒక నిమిషము కూడా వ్యర్థము చేయకుండా, ఎల్లప్పుడు నీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా పూర్ణ హృదయముతో జాగ్రత్తగాను మరియు యథార్థ భక్తిగల జీవితమును మాకు అనుగ్రహించుము. యేసయ్యా, నీ వలె ప్రతిరోజు మేము నిన్ను వెదకకుండా అడ్డుకునే, దృష్టిని మరల్చే ప్రతి విషయాన్ని మా నుండి తొలగించుము. దేవా, వేకువనే, సాయంకాలము, రాత్రి వేళలో నిన్ను వెదకిన యేసువలె ప్రార్థించడం మాకు నేర్పించుము. ప్రభువా, అన్నింటికంటే ఎక్కువగా నిన్ను కోరుకునే దావీదు ఆత్మతో మమ్మును నింపుము. దేవా, మా జీవితమునకు నీవు మా కాపరిగాను మరియు పోషకునివిగాను ఉండునట్లుగా సాక్ష ్య జీవితాన్ని మాకు దయచేయుము. దేవా, మేము నిన్ను వెదకుచున్నట్లుగా నీ శాంతి, సదుపాయం మరియు రక్షణతో మమ్మును అలకంరించి, ఆశీర్వదించుము. ప్రభువా, నీ పరిపూర్ణ చిత్తంలో మరియు సమృద్ధిగా ఆశీర్వాదాలలోకి మమ్మును నడిపించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.