నా ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలమున మీకు శుభములు తెలియజేయుట నాకెంతో సంతోముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 14:14వ వచనమును మనకు ఇవ్వబడినది. ఆ వచనము, "నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును'' అని చెప్పబడినట్లుగానే, మీరు ఆయన నామమున ఏది అడిగినప్పుడు ఆయన మీకు జరిగిస్తాడు. ఈ రోజు మీరు ప్రభువు నామములో అడిగినప్పుడు, యేసు అను నామమున మీరు అడిగినప్పుడు, ఆయన నిశ్చయముగా మీకు ఇస్తాడు. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, ధైర్యము వహించండి, మీకు అనేకమైన ప్రార్థనా మనవులు ఉండియుండ వచ్చును. మీ హృదయములో అనేకమైన ఆశలు మరియు కోరికలు ఉండియుండవచ్చును. అయితే, ఈ రోజు మీరు ఆయన నామమున అడుగుచుండగా, ఆయన మీకు అన్నిటిని సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఇంకను ఆయన మహిమార్థమై మీకు సమస్తమును అనుగ్రహిస్తాడు.

బైబిల్ గ్రంథములో ఆ విధంగా ప్రభువును అడిగినటువంటి ఒక వ్యక్తిని మనము చూడగలము. బైబిల్ నుండి 1 రాజుల గ్రంథములో ప్రభువు రాజైన సొలొమోనుతో ఈ విధంగా చెప్పి యున్నాడు, " యెహోవా రాత్రివేళ స్వప్న మందు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవిచ్చెను'' అందుకు, "సొలొమోను ఈలాగు మనవి చేసెను, " ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయ చేయుము'' అని చెప్పబడినట్లుగానే, సొలొమోను దేవుని యొక్క ప్రజలను పరిపాలించుట కొరకు కావలసిన జ్ఞానమును మరియు వివేచనను కోరుకొనియున్నాడు. అతడు ధనమును మరియు ఐశ్వర్యమును కూడా అడగలేదు. ఇంకను అతడు దీర్ఘాయువును కూడా కోరుకొనలేదు. ఆలాగుననే, పేరు ప్రఖ్యాతులను అతడు కోరుకొనలేదు. ఇంకను అతని యొక్క శత్రువుల నందరిని కూడా ఓడించాలని అడగలేదు. అయితే, ఇవేవియు కాదు గానీ, ప్రజలను పరిపాలించుటకు కావలసిన జ్ఞానమును అతడు కోరుకున్నాడు. తన ప్రజలకు దీవెనకరముగా ఉండే జ్ఞానమును మాత్రమే అతడు అడిగాడు. కనుకనే, సొలొమోను చేసిన యా మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక ప్రభువు అతనికి ఆ జ్ఞానమును అనుగ్రహించి యున్నాడు.

బైబిల్ గ్రంథములో సొలొమోను యొక్క గొప్ప జ్ఞానమును మరియు అతని యొక్క గొప్ప ఘనతను గురించి మనము చూడగలము. తరతరాల తర్వాత కూడా అతని యొక్క జ్ఞానమును గురించి ప్రజలు మాట్లాడుకొనునట్లుగా చేసియున్నాడు. అందువలన అతని దినములన్నిటను రాజులలో అతనివంటి వాడొకడైనను లేడు అని చెప్పబడియున్నది. ఆ దేశమంతటిలో కూడా అతని వంటి రాజు అస్సలు లేనేలేడు. అదేవిధంగా, నా ప్రియులారా, దేవుని ప్రజలకు దీవెనకరముగా ఉండుట కొరకు మీరు దేవునిని ఏది అడిగినను సరే, అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కేవలము మీ యొక్క దీవెనలకు మాత్రమే కాదు గానీ, మీ యొక్క లాభము కొరకు మాత్రమే కాదు గానీ, " ప్రభువా, నీ చిత్తానుసారముగా, మాకు ఇవ్వండి అని అడగాలి, మేము ఇతరులకు దీవెనకరముగా ఉండులాగున దీవించుము, నీవు మమ్మును దీవించుట చూచి, ఇతరులు నీ నామమున మహిమపరచునట్లుగాను, మమ్మల్ని సాక్షులుగా ఉంచుము. నీ యొక్క మంచితనమునకు మమ్మును సజీవసాక్షులుగా ఉండునట్లుగా మమ్మును దీవించుమని మనము అడగాలి. '' నా ప్రియులారా, ఈ రోజు అట్టి విధముగా మన ప్రార్థనలు ఉండునట్లుగా మనము అడగవలెను. 'ప్రభువా, ఈ రోజు నీవు మమ్మును దీవించుచుండగా, మేము ఇతరులకు కారకులుగా ఉండాలి అని అడగండి. మా కొరకు మాత్రమే కాదు, నీ మహిమార్థమై మాకు కావలసిన జ్ఞానమును దయచేయుమని' ఆ విధంగా మీరు అడిగినప్పుడు, నిశ్చయముగా, యేసు నామమున మీరు అడిగినవన్నియు ఆయన మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్ర్రభువా, మేము నీ నామమున ఏది అడిగినను నీ చిత్తానుసారముగా చేస్తావనే నీ వాగ్దానమునకు నీకు వందనములు. దేవా, నీవు మమ్మును దీవించి, ఇతరులకు మేము దీవెనకరముగా ఉండునట్లుగా మమ్మును మార్చుమని మేము నిన్ను అడుగుచున్నాము. ప్రభువా, మా వ్యాధులను నీ మహిమార్థమై తాకి మమ్మును స్వస్థపరచుము. దేవా, ఉద్యోగములేని మాకు ఒక మంచి ఉద్యోగమును దయచేయుము, సంతానము లేని మాకు సంతానమును అనుగ్రహించుము. యేసయ్యా, మా చదువులలో మాకు మంచి జ్ఞానమును దయచేసి, మమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చించుము. దేవా, మాకు కావలసిన బలమును ఇచ్చి, మా జీవితములో మేము ప్రకాశించుచూ, నీకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, ఇతరులను ఆశీర్వదించి, నీ నామమును మహిమపరచవలెనని కోరుకునే హృదయంతో అడగడానికి మాకు నేర్పుము. దేవా, మా పిల్లలైన మాకు మంచి ఉద్యోములను, జ్ఞానమును, మంచి ఆరోగ్యమును, మంచి కుటుంబ జీవితమును మరియు వారికి అవసరమైన సకల బలమును అనుగ్రహించి, మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, నీ యొక్క పరిపూర్ణ చిత్తానుసారముగా మా విన్నపములను ఆలకించి, మా జీవితములను నీ మంచితనానికి సాక్ష్యముగా నిలుచునట్లుగా మమ్మును మార్చుము. దేవా, నీవు మాకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం ఇతరులకు దీవెనకరముగా మారునట్లుగానే, ప్రార్థనకు వచ్చు, ప్రతి జవాబు ద్వారా నీ నామము మహిమపరచబడునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.