నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 4:8వ వచనములో చూచినట్లయితే, ప్రభువు ఈలాగున అంటున్నాడు, " యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్ర పోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు'' అని చెప్పబడిన ప్రకారము నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో సమాధానము ఎంతో ప్రాముఖ్యమైనది. కనుకనే, సమాధానకర్తయగు అధిపతిగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చియున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 29:11వ వచనములో చూచినట్లయితే, " యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును'' అని చెప్పబడిన ప్రకారముగా దేవుడు మనకు బలమును అనుగ్రహించు దేవుడై యున్నాడు. కనుకనే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యమును చదివిన ప్రతిసారి, అట్టి విధముగా చదవాలి. యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును. అయితే, మన జీవితములోనికి ఈ సమాధానము ఎప్పుడు కలుగుతుంది? మన యేసయ్యను మన రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఈ గొప్ప సమాధానము మనకు కలుగుతుంది.
నా ప్రియులారా, కనుకనే, మీలో ప్రతి ఒక్కరు ఇప్పుడే దేవునికి మొఱ్ఱపెట్టండి, 'ప్రశస్తమైన యేసయ్యా, ఇప్పుడే మా జీవితములోనికి రమ్ము, ఈ లోకములోని పాపములన్నిటి నుండి మమ్మును కాపాడుము, నీ రక్షణను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా పాపములన్నిటిని క్షమించుము, మమ్మును క్షమించి, నీ బిడ్డగా మార్చుము' అని చెప్పి, ప్రతి ఒక్కరు ఆ విధముగా మీ జీవితములను ఆయనకు సమర్పించుకొనండి. అప్పుడు,ప్రభువు మీ మొఱ్ఱలను ఆలకిస్తాడు. ఆయన మిమ్మును స్వస్థపరుస్తాడు, మీకు సమాధానమును ఇస్తాడు. అంతమాత్రమే కాదు, ప్రతి జ్ఞానమును మించిన సమాధానమును మీకు అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప దేవునిని మనము కలిగియున్నాము కదా! బైబిల్ నుండి 1 సమూయేలు 30వ అధ్యాయములో దావీదును గురించి చదువుతాము. అతడు ఎంతో కష్టతరమైన సమయమును ఎదుర్కొన్నాడు. తనకు సహాయము చేయుటకు ఎవ్వరు లేరు. తన మనస్సులో ఎంతగానో చింతించాడు. ఆ సయములో దావీదు ఏమి చేశాడు? ఈ వాక్యమును ఎంతో జాగ్రత్తగా చదవండి. బైబిల్ నుండి 1 సమూయేలు 30:6వ వచనములో చివరి వాక్యమును చదివినట్లయితే, " దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను'' అని చెప్పబడిన ప్రకారము మీ సమస్యలన్నిటి మధ్యన మీకు ధైర్యమును అనుగ్రహిస్తాడు.
నా ప్రియులారా, నేడు మీరు కూడా మీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యమును తెచ్చుకొనవలెను. మీ సమస్యలన్నిటి యందు కూడా మీరు చేయవలసినది ఇదియే. దేవుని యందు మిమ్మును మీరు బలపరచుకోవాలి. మీరు సమాధానమును సంతోషమును అప్పుడు కలిగి ఉంటారు. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 11:8,12వ వచనములలో మనము చూచినట్లయితే, అబ్రాహామును గూర్చి చదువుతాము. అబ్రాహామును తన జీవితములో ఇటువంటి సమాధానమును ఎలా పొందుకున్నాడని మనము చూడగలుగుతాము. అందుకే మనము బైబిల్ నుండి యెషయా 26:3వ వచనములో చూచినట్లయితే, "ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని యందు విశ్వాసముంచినప్పుడు ఆయన మీకు సమాధానమును అనుగ్రహిస్తాడు. నా ప్రియ స్నేహితులారా, నేడు మీ సమాధానమును విరిచివేయుచున్నట్లుగా మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటున్నారేమో? అందుకే బైబిల్ నుండి రోమీయులకు 16:20వ వచనములో చూచినట్లయితే, "సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక'' అని చెప్పబడిన ప్రకారము మన నిరీక్షణ ప్రభువు యందు మాత్రమే ఉన్నది. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. కనుకనే, మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నను సరే, సమాధానము లేకుండా ఉన్నను సరే, ప్రభువు ఇప్పుడే, మిమ్మును తన దైవీకమైన సమాధానముతో నింపుతాడు. కాబట్టి, సమాధానకర్తయైన దేవుని వైపు చూద్దాము. దేవుడు మిమ్మును నేటి వాగ్దానము నుండి దీవించును గాక.
ప్రార్థన:
సమాధానకర్తయగు మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో ఉండాలని మేము నీకు మొఱ్ఱపెట్టుచున్నాము. దేవా, మాకు సమాధానము లేదు, నీవు మాత్రమే మాకు సమాధానము ఇవ్వగలవని మేము నీ యందు విశ్వాసముంచి, మా మనస్సు నీ యందు ఆనుకొని ఉండునట్లుగాను మాకు సహాయము చేయుము. ప్రభువా, సమాధానము లేని మాకు నీ యొక్క దైవీకమైన సమాధానమును అనుగ్రహించుము. ప్రభువైన యేసు, ఈ రోజు మేము నీ యొద్దకు వచ్చుచున్నాము, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానముతో మమ్మును నింపుము. ప్రభువా, దయచేసి నీలో మమ్మును మేము బలపరచుకోవడానికి మాకు సహాయం చేయుము. యేసయ్య, నీవు మా వైపు చూచి, మేము ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యలను మా నుండి తొలగించి, నీ యొక్క దైవీకమైన సమాధానమును మేము పొందుకొనునట్లుగా మాకు నీ యొక్క కృపను చూపించుము. దేవా, నీవు నీ వాక్యము ద్వారా వాగ్దానం చేసినట్లుగానే, శత్రువు యొక్క ప్రతి పనిని మా పాదముల క్రింద అణిచివేసి, మా జీవితమును నీ యొక్క ఆనందం మరియు భద్రతతో మమ్మును నింపుము. దేవా, ఈ రోజు నుండి, నీ అతీంద్రియ బలము మాలో ఎదుగునట్లుగాను ప్రతిరోజూ మమ్మును నడిపించుము. దేవా, ఇప్పటి నుండి మాలో నీ యొక్క సంతోషమును మరియు ఆనందమును మాకు దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


