నా ప్రియమైనవారలారా, నేడు బైబిల్ నుండి లూకా సువార్త 12:32వ వచనమును ప్రకారము ప్రభువు ఈ రోజు ఈ విధంగా మీకు వాగ్దానము చేయుచున్నాడు. ఆ వచనము, "చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మొదటిగా, ప్రభువు మనలను చూచి, "భయపడకండి'' అని ఆజ్ఞాపించుచున్నాడు. మరియు ఆయన తనకు తాను తండ్రిగా ఉన్నాడని మనకు తెలియజేయుచున్నాడు. ఎందుకంటే, ఆయన ప్రేమామయుడైనటువంటి తండ్రిగాను ఉన్నాడు. కనుకనే, ఆయన యొక్క సంపూర్ణమైన ప్రేమ ప్రతి భయమును కూడా మనలను నుండి తొలగించి వేయుచున్నది. కనుకనే, మీరు దేనికిని భయపడకండి.
నా ప్రియులారా, ఆయన మనలను, 'చిన్నమందా' అని పేరు పెట్టి పిలుచుచున్నాడు. దేవుని బిడ్డలమైన మనము ఆయనకు గొఱ్ఱె పిల్లల వలె ఉండియున్నాము. చిన్న గొఱ్ఱె పిల్లలు ఎంతో విశ్వాసముతో మంద కాపరిని వెంబడిస్తాయి. చిన్న చిన్న గొఱ్ఱె పిల్లలన్నియు కూడా విశ్వాసముతో గొఱ్ఱెల కాపరిని వెంబడిస్తూ చక్కగా నడుచుకుంటూ వెళ్లతాయి. అదేవిధముగా, యేసయ్యా, మనలను కూడా, "నా గొఱ్ఱెలు నా స్వరమును వినును '' అని మనలను గురించి చెబుతున్నాడు. ఆలాగుననే, "నేను వాటిని ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను వెంబడించును. నేను వారికి నిత్యజీవమును అనుగ్రహించెదను'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మనము ఆయనను ఎల్లప్పుడు వెంబడించినప్పుడు ఆయన మనకు నిత్యము ఇస్తాడు.
అవును, నా ప్రియులారా, ప్రభువు మనకు నిత్యజీవమును అనుగ్రహించుచున్నాడు. అనగా, దేవుని రాజ్యమును అనుగ్రహిస్తానని మన పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, యథార్థముగా నడుచుకొనువారికి ప్రభువు ఏ మేలు కొదువగా ఉండనివ్వడు. ప్రభువు పరలోకము నుండి మనకు మంచి యీవుల నిచ్చుటకు ఎంతగానో ఆనందించుచున్నాడు. అయితే, బైబిల్ నుండి లూకా సువార్త 12వ అధ్యాయములో చూచినట్లయితే, "కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని మీరు దేనిని గురించి చింతించకండి '' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. స్నేహితులారా, ఇహలోకపరమైనటువంటి విషయములను గురించి, మీరు ఎంతమాత్రము చింతినక్కర్లేదు. అందుకే ప్రభువు, " మీకు సమస్తమును సమకూర్చువాడను నేనే '' అని ప్రభువు అంటున్నాడు. క్రీస్తు యేసునందు ప్రభువు తన మహిమైశ్వర్యమును బట్టి మన ప్రతి అవసరతలను కూడా తీరుస్తాడు. కనుకనే, మీరు ఎటువంటి అవసరతలో ఉన్నను సరే, ప్రభువు తప్పకుండా తీరుస్తాడని నమ్మండి.
నా ప్రియులారా, మొట్టమొదటిగా మనము ప్రభువును వెదకినట్లయితే, అప్పుడు ఇవన్నియు కూడా మన జీవితములో అనుగ్రహింపబడతాయి. అందుకే యేసయ్యా ఈలాగున అంటున్నాడు, "పరలోకమందు మీ ధనమును సమకూర్చుకొనుడి.'' కనుకనే, ఆయన మిమ్మును చూచి, "మీరు పై నున్నవాటిని మాత్రమే వెదకాలి కానీ, క్రిందనున్న వాటిని కాదు. మీరు నన్ను వెదకండి, మిగిలిన విషయములన్నిటిని నేను చూసుకుంటాను'' అని అంటున్నాడు. అవన్నియు అనగా, అవన్నియు ఆయన రాజ్యమును గురించి ఆశీర్వాదములై ఉన్నవి.
నా ప్రియ స్నేహితులారా, దేవుని రాజ్యమును మనకు ఇవ్వడము అంటే, యేసయ్యకు ఎంతగానో ఇష్టమై ఉన్నది కదా! దేవుని రాజ్యము అనగా ఏమిటి? దేవుని రాజ్యము అనగా, "దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది'' అని చెప్పబడినట్లుగానే, తన బిడ్డలమైన మనము ఎల్లప్పుడు కూడా నీతిగాను మరియు న్యాయముగాను నడుచుకోవాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. అంతమాత్రమే కాదు, సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమును కలిగి ఉండాలని కోరుచున్నాడు. ఇదియే పరలోక దేవుని రాజ్యమై ఉన్నది. ప్రభువు మనలను ఆశీర్వదించడంలోనూ, మనలోనికి వచ్చి నివసించడంలోనూ మన పట్ల ఆనందించుచున్నాడు. కనుకనే, దేనికిని భయపడకండి.
నా ప్రియులారా, మన ప్రభువు ప్రతిఫలమునిచ్చు దేవుడుగా ఉన్నాడు. ఈ లోకములో మనము మన భవిష్యత్తును గురించి ఆలోచించుచుండవచ్చును. అయితే, ప్రభువు ఎల్లప్పుడు కూడా పరలోకమందున్నటువంటి విషయములను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే, ప్రభువు ఎల్లప్పుడు కూడా, "నా బిడ్డలకు నేను దేవుని రాజ్యమును ఏ విధముగా ఇవ్వవచ్చును'' అని విషయమును గురించి ఆలోచిస్తూ ఉంటాడు. స్నేహితులారా, దేవుడు ఇది ఖచ్చితముగా మనకు చేయాలని ఎలాంటి నియమము లేదు. అయినప్పటికిని కూడా పరలోక రాజ్యమును మనకు ఇచ్చుట యందు ప్రభువు ఎంతగానో ఇష్టపడుచున్నాడు. దేవుని యొక్క రాజ్యమును మనకు ఇవ్వడము అంటే, ప్రభువుకు ఎల్లవేళల ఆనందకరమునైయున్నది. మనలను ఆశీర్వదించుటలో ప్రభువు ఎంతగానో ఆనందించుచున్నాడు. మనయందు నివసించడము అంటే, ప్రభువునకు ఎంతో ఇష్టకరమైన విషయముగా ఉంటున్నది. కనుకనే, మొట్టమొదటిగా, మనము ప్రభువును వెదకాలని, ఈ రోజు మనలను మనము ప్రభువునకు సమర్పించుకుందాము అని ఒక నిర్ణయమును తీసుకుందాము. ఆలాగుననే, ఆయనను వెంబడించుదాము.
"మొదటిగా దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వవలెను'' అని లిఖించబడిన ఒక పెద్ద కప్పును ఒక ప్రియ సహోదరి నాకు బహుకరించారు. అవును, నా ప్రియులారా, దేవునిని వెదకడము అనగా, ఎంతో అమూల్యమైన విషయమై యున్నది. కనుకనే, ఈ రోజు మీరు కూడా దేవుని రాజ్యములో ప్రవేశించునట్లుగా, మీరు ఆయనను మీ పూర్ణ హృదయముతో వెదకండి, ఆయన రాజ్యములో ప్రవేశించుటకు అర్హులుకండి. ఇటువంటి గొప్ప ధన్యతను మనము ప్రభువును అడిగి పొందుకుందాము. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ బిడ్డలైన మమ్మును చిన్న బిడ్డలుగా భావించుచున్నందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు ఎంతో గొప్ప దేవుడవై యున్నావు, అయినను నీ బిడ్డలైన మమ్మును పట్టించుకొను దేవుడవుగాను, నీవు ఒక మంచి కాపరిగా ఉన్నందుకై నీకు వందనములు. దేవా, విచారముతోను, దుఃఖముతోను, చింతతోను నిండియున్న మమ్మును నీవు ఇప్పుడే తాకి, మా నుండి సమస్తమును తొలగించుము. తండ్రీ, అనేకమైన సమస్యలతో మేము ఈ లోకములో జీవించుచుండగా, నీ బిడ్డలైన మమ్మును సున్నితముగా, మృదువుగా హత్తుకొని, నీ నీతితోను, నీ యొక్క సమాధానముతోను మరియు పరిశుద్ధాత్మయందలి ఆనందముతోను మమ్మును నింపుము. దేవా, రోజు నుండి నీ యొక్క పరలోక రాజ్యమునకు మమ్మును వారసులనుగా చేయుము. ప్రభువైన యేసయ్యా, నీవు త్వరగా రాబోవుచున్నావు గనుకనే, మాలో ఉన్న కోపము, చేదు మరియు నీకు అయిష్టమైన విషయములన్నిటిని మా నుండి తొలగించి, నీ ప్రేమతో నింపి, ఈ లోకములోనే మేము నీ యొక్క పరలోక రాజ్యమును అనుభవించునట్లుగా మాకు కృపను చూపుము. ప్రభువా, నీ ప్రేమతో మమ్మును నింపి, నీ రాజ్యములోనికి ప్రవేశించడానికి అర్హులనుగా మమ్మును చేయుము. దేవా, మా జీవితములోనికి నీ యొక్క నీతి, సమాధానమును మరియు పరిశుద్ధాత్మయందలి ఆనందమును మాకు అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచూ యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


