నా ప్రియమైన స్నేహితులారా, నేడు ఒక చక్కటి వాగ్దాన వచనమును మనము కలిగియున్నాము. ఆ వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును నేడు దీవించబోవుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 32:13,15వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "పై నుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు...అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగా నుండును'' ప్రకారం నేడు దేవుడు మిమ్మును ఈ విధంగా దీవించబోవుచున్నాడు. ఈ వచనం ఎంతటి మహిమాన్వితమైన రూపాంతరమును వివరిస్తుంది చూడండి! ఆత్మ కుమ్మరింపబడడము అనగా అర్థము ఏమిటి? కరువు సమయములో భూమి యంతయు ఎండిపోతుంది. ప్రతి విధమైన చెట్టు కూడా నశించిపోతాయి. అదే భూమి మీద వర్షములు కురిసినప్పుడు, ఆ భూమి యంతయు కూడా పచ్చగా మారిపోతుంది. ఎండిన భూమి ఫలభరితముగా మారిపోతుంది. నేడు మీ జీవితము కూడా ఆలాగుననే ఉండబోతుంది. కనుకనే, మీరు చింతించకండి.

నా ప్రియులారా, ప్రభువు మనపైన తన ఆత్మను ఎందుకు కుమ్మరిస్తాడు? ప్రతి హృదయమును మార్చడము కొరకై, మనలను తన పరిశుద్ధాత్మ ఆనందముతో నింపడము కొరకు, అది కేవలము దేవుని పనియై ఉంటున్నది. దేవుని ఆత్మ సమస్త ఆశీర్వాదములకు మూలమై యున్నది. మనము చేయవలసినదంతయు పశ్చాత్తాపపడవలెను. బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 3:19వ వచనములో చూచినట్లయితే, "ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి'' ప్రకారముగా మీరు పశ్చాత్తాపపడి ప్రభువు వైపు తిరిగినప్పుడు, మీ పాపములు క్షమించబడతాయి. అప్పుడు ప్రభువు యొద్ద నుండి మీకు విశ్రాంతి కాలములు వచ్చును. ఇంకను యోవేలు 2:13వ వచనములో చూచినట్లయితే, "మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములుగలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై యుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి'' అని స్పష్టముగా చెప్పుచున్నది. అవును, మన పాపములను క్షమించుటకు ప్రభువు ఎంతో కృపామయుడై యున్నాడు. పరిశుద్ధాత్మ మన మీదికి దిగివచ్చినప్పుడు, మన పాపములన్నిటి నుండి మనలను విడిపిస్తాడు. విశ్రాంతి కాలములు మనపైకి దిగివస్తాయి. మన జీవితములోని సమస్యలన్నిటిని ప్రభువు తొలగించి వేస్తాడు. ప్రభువు యందలి మీ విశ్వాసము ద్వారా, మీ అరణ్యము ఫలించెడి వనముగా మారుతుంది. సమస్యలతో నిండియున్న మీ జీవితము నెమ్మదిగా విశ్రాంతి స్థలముగా మారుతుంది.

నా వ్యక్తిగత జీవితములో కూడా ఇలాగుననే జరిగింది. నాకు నూతనంగా వివాహము జరిగినటువంటి సమయములో, ఇండియాలో ఉన్న కోయంబత్తూర్ నగరములో జరిగిన యేసు పిలుచుచున్నాడు శక్తి పరిచర్యలో నేను పాల్గొన్నాను. అక్కడకు అనేకులు వచ్చి, పాల్గొన్నారు. ఆ కూటములో అనేకులు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్నారు. నేను కూడా దానిని పొందుకోవాలని ఎంతో ఆశపడ్డాను. నేను తప్ప నా ప్రక్కన ఉన్నవారికందరికి అభిషేకమును పొందుకున్నారు. కానీ, నేను పొందుకోలేదు. అయినను, నేను నిరుత్సాహము చెంతకుండా, నేను ఎంతో ఓపికగా ఉన్నాను. ఇంకను మరుసటి దినము కూడిక వచ్చు వరకు ఆగాను. ఒక సంవత్సరము తర్వాత నేను మరల శక్తి పరిచర్యలో నేను పాల్గొన్నాను. 'ప్రభువా, నా పాపములన్నిటిని నిజంగా నేను పశ్చాత్తాతపడి నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రభువుకు మొఱ్ఱపెడుతూ ఇలా అడిగాను. దేవా, నేను పరిశుద్ధాత్మను పొందుకొనకుండా, నేను నీ హస్తములో ఎలా వాడబడగలను?' అని ప్రార్థించాను. నేను పరిశుద్ధాత్మను పొందుకొనుటకు, ఏమి తినకుండా, నిద్రపోకుండా ప్రభువుకు మొఱ్ఱపెడుతూ నేను విడువకుండా దేవుని సన్నిధిలో అడిగాను. ఆ మరుసటి దినమున ఎంతో కృపతో నన్ను తన పరిశుద్ధాత్మతో నింపియున్నాడు. నా హృదయము మరియు నా జీవితము పూర్తిగా మారిపోయినది. ఈ రోజు నేనేమై యున్నానో అది కేవలము పరిశుద్ధాత్మ వలన అయి ఉన్నాను. అవును, నా ప్రియులారా, నేడు మిమ్మును కూడా ప్రభువు తన శక్తితో నింపును గాక. మీ జీవితములో ఉన్న అరణ్యమంతటిని ఫలభరితమైన వనముగా మార్చును గాక. మీరు ఇటువంటి అద్భుతాన్ని ఈ రోజు పొందుకుంటారని నేను నమ్ముచున్నాను. కనుకనే, నా ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొనుటకు మీ హృదయాలను దేవునికి సమర్పించినట్లయితే, నిశ్చయముగా, ఆయన పైనుండి తన ఆత్మను మీ మీద కుమ్మరించి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహిమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా జీవితము అరణ్యముగా మరియు ఎడారిగా ఉన్నది, మా జీవితములో ఎటువంటి ఫలములు కనబడలేదు, మమ్మును ఫలభరితమైన భూమిగా నింపుము. తండ్రీ, మా యొక్క ప్రతి మొఱ్ఱకు నేడు నీవు తప్పకుండా మాకు జవాబును దయచేయుము. ప్రభువా, మా జీవితములో ఎండిపోయిన తనమును తొలగించి, దీవెనకరమైన వర్షములు కుమ్మరించి, ఫలభరితమైన జీవితముగా మార్చుము. దేవా, పరలోక ద్వారములు తెరచి, ఇప్పుడే మా మీద నీ యొక్క అభిషేకమును కుమ్మరించుము, అది కొలతలేనంతగా మమ్మును నింపుము. ప్రభువా, మా జీవితములో అన్నియు సంపూర్ణముగా మారిపోవునట్లుగా చేయుము. దేవా, మా యొక్క ఎండిపోయిన స్థితి, ఫలభరితమైన స్థితిగా మారునట్లుగా చేయుము. ప్రభువా, మా అరణ్యము ఫలించెడి వనముగా మారునట్లుగా చేయుము. దేవా, మా మీద నీ యొక్క ఆశీర్వాదపు వర్షములు కురియునట్లుగా చేయుము. ఇంకను ప్రభువా, మా దుఃఖమంతయు సంతోషముగా మారునట్లుగా చేసి, పై నుండి నీ పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరించబడాలని మేము కోరుకుంటున్నాము. దేవా, మా హృదయం ఎంతో కాలంగా అరణ్యాన్ని, ఎండిన స్థితిని మరియు అలసటను ఎరిగి ఉండెను. కానీ, దానిని నీవు ఫలవంతమైన తోటగా మార్చగలవని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నేడు మా పాపాలన్నిటి నుండి మేము పశ్చాత్తాపపడి, నీ దయ మరియు కృపను నమ్ముతూ, ప్రభువా, నీ వైపు తిరిగి వచ్చియున్నాము. దయచేసి నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము. ప్రభువా, మమ్మును ఉత్తేజపరచుము, మమ్మును మరల నీ ఆత్మ శక్తితో పునరుద్ధరించుము. దేవా, మమ్మును నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ బిడ్డగాను, ఆత్మీయతలో ఎదుగుదలను అనుభవించునట్లుగా మమ్మును మార్చుము. యేసయ్య, నీ శక్తి మా జీవితంలోని ప్రతి మూలను నింపనివ్వు మరియు నీ మహిమ కొరకు మంచి ఫలాలను ఫలించునట్లుగా చేయుమని యేసుక్రీసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.