నా ప్రియ స్నేహితులారా, ప్రభువుతో సమయం గడపడం ఎంత ఆనందం మరియు గొప్ప ధన్యత కదా. ఆయన సన్నిధి మనలను ఎంతో ఆనందంతో నింపుతుంది. నేటికిని, ఆయన సన్నిధిలో, ఆయన తన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 57:15 వ వచనమును మన కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, "...నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును... దీనమనస్సుగలవారి యొద్దను నివసించుచున్నాను'' అని చెప్పబడినట్లుగానే దేవుడు మీ యొద్ద నివసించాలని నేడు మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీరు ప్రభువు యందు ఆనందించండి.

నా ప్రియులారా, ఓహ్! ప్రభువైన యేసు గొప్ప వ్యక్తులతో నివసించుచున్నాడు అని ప్రజలు అనవచ్చును. కానీ అది కాదు, నా స్నేహితులారా, ఆయన గొప్పవారితో మాత్రమే జీవించడు. ఆయన ప్రజలను గొప్పవారినిగా చేస్తాడు! యేసు అలాంటి హృదయముగలవాడు. నిజానికి, ఆయన ఈ లోకంలోనికి రావడానికి, తనను తాను సమర్పించుకోవడానికి, మానవునితో ఉండటానికి, వారికి సహాయం చేయడానికి మరియు పాపపు బానిసత్వం నుండి వారిని విడిపించడానికి పైన ఉన్న పరలోక మహిమను విడిచిపెట్టి, మానవ స్వరూపము దాల్చి ఈ లోకమునకు దిగివచ్చాడు. . ఆయన వినయ హృదయముగలవాడు, నలిగిన హృదయముగలవాడు. ఇంకను ఎవ్వరైన సరే, పశ్చాత్తాపపడి, "ప్రభువా, నేను పాపిని'' అని చెప్పుకునే వారితో కూడా ఉంటాడు మరియు ఉన్నాడు. అందుకే యేసు ఇద్దరు వ్యక్తుల కథ చెప్పాడు. ప్రార్థన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పాపిగా ఉంటూ పన్ను వసూలు చేయుచున్న వ్యక్తియైన సుంకరి ప్రక్కన పరిసయ్యుడు నిలబడ్డాడు. కానీ, పరిసయ్యుడు గర్వంగా ఇలాగున ప్రార్థించాడు, "పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నాను. నేను నీతిమంతుడిని. నన్ను దీవించుము'' అని తనలో తాను ప్రార్థించు చుండెను. కానీ, పన్ను వసూలు చేయువాడై సుంకరి, వినయంగా ప్రార్థించుచూ, " అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణించుము, నన్ను రక్షించు. నా పట్ల కనికరము చూపించు'' అని పలికెను.

కానీ, నా ప్రియులారా, చూడండి యేసు మాట్లాడుతూ, పాపిగా పశ్చాత్తాపపడిన ఆ వినయపూర్వకమైన వ్యక్తి ప్రార్థన దేవుని హృదయాన్ని చేరినది అని చెప్పి, " అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు '' సెలవిచ్చెను. అవును, నా ప్రియులారా, నిజంగా, నేడు మనస్సులలో వినయము గలిగి, పశ్చాత్తాపపడి హృదయంలో నలిగినవారికి సహాయం చేయడానికి ఆయన అట్టివారి యొద్దకు వస్తాడు. కాబట్టి, నేడు నా ప్రియులారా, నేడు మీరు దీనమనస్సును మరియు వినయం కలిగి ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా నేడు, దేవుడు అమూల్యమైన ప్రార్థనలను వింటాడు, మరియు మిమ్మును పాపం నుండి బయటకు తీసుకువస్తాడు మరియు మిమ్మల్ని పైకి లేవనెత్తి నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును హెచ్చించి, దీవించును గాక.

ప్రార్థన:
కనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఉన్నతమైన మరియు పరిశుద్ధ స్థలంలో మాత్రమే కాకుండా, వినయపూర్వకమైన ఆత్మతో మరియు హృదయంలో నలిగిన వారితో కూడా నివసించే దేవుడుగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, ఇప్పుడు కూడా, మేము ఆ వినయపూర్వకమైన హృదయంతో పన్ను వసూలు చేయు సుంకరి వలె పశ్చాత్తాపముతో నిండియున్న మా హృదయ ప్రార్థనలను అంగీకరించి, నేడు మా ప్రతి అవసరాన్ని తీర్చునట్లుగా మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువా, దయచేసి మా పట్ల కనికరము చూపుము మరియు మా పాపాలను క్షమించి మమ్మును నీ బిడ్డలుగా మార్చి, రక్షించుము. ఎందుకంటే, నీవు మా రక్షకుడివి, గనుకనే మా జీవితం ఎల్లప్పుడూ నీ సన్నిధి మరియు ప్రేమతో ప్రకాశించునట్లుగా చేయుము. దేవా, నేడు మా పాపములను నీ సన్నిధిలో విడిచిపెట్టుకొనుటకు విరిగినలిగి హృదయమును మాకు దయచేసి, మాకు దీనమనస్సును అనుగ్రహించి, మమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చించుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.