నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 118:14వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను'' ప్రకారం ప్రియులారా, ఈ రోజు మీరు, ' నేను చాలా బలహీనంగా ఉన్నాను, నేను చాలా అలసిపోయాను, నాకు బలము కావాలి అని అంటున్నారా? శారీరకంగాను, మానసికంగాను నేను చాలా అలసిపోయాను, నన్ను ఎవరైనా లేవనెత్తాలి అని మీరు చెప్పవచ్చును. కానీ, నా ప్రియులారా, ప్రభువు మిమ్మును తన బలముతో నింపుచున్నాడు. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.
ఒక పెద్ద చెట్టును మనము చూచినప్పుడు, దాని యొక్క అందమైన కొమ్మలను మెచ్చుకుంటాము. ఈ చెట్టు ఎంత నీడను ఇస్తుందనియు, దాని ఆకులు ఎంత పచ్చగా ఉన్నాయని, ఆ చెట్టు మొద్దు ఎంత బలంగా ఉన్నదనియు, ఆ భూమిలో ఎంతో స్థిరంగా అది నిలబడియున్నదనియు మనము అనుకుంటాము. అయితే, అది అంత బలంగా ఎలా నిలబడగలుగుతుందని చాలామంది దానిని మనము చూడలేము. కానీ, అది మనకు కనపడని ఒక విషయము వలన మాత్రమే అది జరుగుతుంది. ఆ చెట్టు వేర్లు వలననే మాత్రమే అది అంత స్థిరంగా నిలబడగలుగుతుంది. ఆ చెట్టు వేర్లు భూమి లోపలికి వెళ్లిపాతుకుపోయి, ఆ ప్రదేశమంతట విస్తరించి, ఆ మట్టిని గట్టిగా పట్టుకుని, ఆ చెట్టు స్థిరంగా నిలబడుటకు ఎంతగానో సహాయపడుతుంది. చూడండి, ఆ చెట్టు ఎంతో గట్టిగా నిలబడగలుగుటకు దాని యొక్క వేర్లు దానికి పునాదిగా ఉంటున్నాయి. మనకు పైపైన కనిపించని వేర్లు లోపల ఉంటాయి. కానీ, భూమి లోపల ఎంతో లోతుగా ఆ వేర్లు పాతుకుపోయి ఉంటాయి. అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, మనము బలము ఎక్కడ నుండి వస్తుంది? అని మనము చూచినట్లయితే, మనకు కనిపించని విషయములో నుండి ఆ బలము మనకు వస్తుంది. బైబిల్ నుండి దానియేలు గ్రంథమును మనము చదివినట్లయితే, దానియేలు 6:10వ వచనమును మనము చూచినట్లయితే, "ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను'' అని చెప్పబడినట్లుగానే, దానియేలు తన గదికి వెళ్లి, రోజుకు మూడుసార్లు అతడు ప్రార్థించుచుండెను. అందుకే అక్కడి ప్రజలు అతనికి విరోధముగా వచ్చినప్పుడు, అతడు కదల్చబడలేదు. అతడు ఎంతో దృఢంగా నిలిచియుండెను. అదేవిధముగా, మనము బైబిల్ గ్రంథమును చదివినట్లయితే, మనము గదిలోనికి వెళ్లి, తలుపు వేసుకొని ప్రార్థించమని ప్రభువు సెలవిచ్చియున్నాడు అని వ్రాయబడియున్నది. ఆ వచనమును మనము చదువుదామా? బైబిల్ నుండి మత్తయి 6:6వ వచనమును చూచినట్లయితే, " నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును'' అని సెలవియ్యబడినట్లుగానే, నేడు మీరు కూడా ఆలాగున చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు మీకు ప్రతిఫలమిస్తాడు.
అవును, అదేవిధముగా, మనము రహస్యమందు ప్రార్థించినప్పుడు, రహస్యమందు మన బలము ప్రత్యక్షపరచబడుతుంది అని ఈ వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. ఆలాగుననే, రహస్యమందు మన బలమునకు ఆధారము కనబడుతుంది. మన చుట్టు ఉన్న ప్రజలకు అది తెలియకపోవచ్చును. కానీ, రహస్యముగా మీ గదిలోనికి వెళ్లి ప్రభువు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయన యొద్ద నుండి మీరు బలాన్ని పొందుకున్నప్పుడు, అందరి యెదుట ఆయన మీకు ప్రతిఫలమునిస్తాడు. అవును, ఈరోజు అలసిపోయి, సొమ్మసిల్లి పోయియున్నారా? ఉద్యోగము కొరకు ఎంతో దూరము ప్రయాణించి వెళ్లి, ఇంటికి వచ్చినప్పుడు, నేను ఏమి చేయలేకపోతున్నాను, నేను అలసిపోయాను అని అంటున్నారా? నా జీవితములో ఎంత కృషి చేసినను ప్రతిఫలమును నేను చూడలేకపోవుచున్నాను అని అంటున్నారా? నేను ముందుకు సాగలేకపోవుచున్నాను, ముందుకు వెళ్లలేకపోవుచున్నాను, చాలా అలసిపోయి, సొమ్మసిల్లి పోయి ఉన్నాను అని అంటున్నారా? ప్రియ స్నేహితులారా, శారీరక బలము కొరకు కూడా ప్రభువు తన బలాన్ని మీకిచ్చి, తన బలముతో మిమ్మును నడిపిస్తాడు. ఆయన వాక్కు మీకు జీవమును కలుగజేయుచున్నది. ఆధ్యాతికంగా కూడా మిమ్మును బలపరుస్తాడు. ఆయన నూతన మర్మములను మీకు తెలియజేసి మరియు నూతన ప్రత్యక్షతలను మీకిచ్చి మిమ్మును జీవములోనికి నడిపిస్తాడు. ఒక చెట్టువలె దృఢంగా మిమ్మును నిలబెడతాడు. కాబట్టి, ధైర్యంగా ఉండండి, నా ప్రియ స్నేహితులారా, మీరు ప్రభువు మీద ఆనుకొనండి, ఆయనకు రహస్యముగా మీ గదిలోనికి ప్రార్థించినప్పుడు, ఆయన అందరి యెదుట మీకు ప్రతిఫలమును ఇస్తాడు. ఆయన మిమ్మును దృఢంగా నిలబెడతాడు. నేడు ప్రార్థించి, ఈ ఆశీర్వాదమును పొందుకుందాము. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహిమాన్వితుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు మేము అలసిపోయి, సొమ్మసిల్లియున్నాము. ఇంకను, మమ్మును ఎవరైన లేవనెత్తినట్లయితే బాగుండు అని అనుకుంటున్నాము. కనుకనే, దేవా, మేము నీ యందు విశ్రమించుచుండగా, మమ్మును నూతన బలముతో నింపుము. ప్రభువా, మా బలహీనతలో నుండి మమ్మును పైకి లేవనెత్తుము, మా ఆత్మలో మరియు శరీరములోను మమ్మును ఉత్తేజింపజేయుము. దేవా, నేడు, మేము నీ మీద ఆనుకొనియున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, నీవు మమ్మును నీ యొక్క శక్తితో నింపి మమ్మును పైకి లేవన్తెతుమని మేము వేడుకొనుచున్నాము. ప్రభువా, మేము అడుగుపెట్టినప్పుడు, మేము బలంగా నిలబడగలుగునట్లుగా మాకు నూతన బలము అనుగ్రహించి, మేము నీ యందు వేరుపారియుండునట్లుగా మాకు నీ కృపను నిచ్చి, నీ వాక్యములోను మరియు నీ సన్నిధిలో వేరు కలిగి ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము బయటకు వెళ్లినప్పుడు, మేము నీలో నూతన బలమును, నూతన జీవమును, నూతన శక్తిని పొందుకొను కృపను మాకు దయచేయుము. దేవా, మా మార్గములో ఎన్ని అడ్డంకులు వచ్చినను, వాటిని మేము ధైర్యముగా ఎదుర్కొనుటకు మాకు నీ బలమును అనుగ్రహించుము. దేవా, ఈ రోజు మమ్మును పునరుద్ధరీకరించుము. ప్రభువా, మాకు నూతన జీవమునిచ్చి, మమ్మును ఉత్తేజరపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.