నా ప్రశస్తమైన స్నేహితులారా, ఈ నూతన మాసములో దేవుడు మీ జీవితమును మరల పునరుద్ధరించవలెనని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 147:2వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవాయే యెరూషలేమును కట్టువాడు చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన ఈ నూతన మాసములో చెదరిపోయిన మీ కుటుంబ జీవితమును మరియు మీ ప్రియులను మరల పోగుచేయాలని మీ పట్ల కోరుచున్నాడు. అంతమాత్రమే కాదు, బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 30:3వ వచనమును మరొక వాగ్దానముగా మీకివ్వబడియున్నది, ఆ వచనము, " నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును'' అని చెప్పబడినట్లుగానే, మీరు ఎక్కడైతే చెదరగొట్టబడియున్నారో, అక్కడనే ఆయన మిమ్మును సమకూర్చి మరల రప్పించును. ఇది ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానము కదా! కనుకనే, ప్రభువు, 'మీరు దేనిని నిమిత్తము భయపడకండి, మిమ్మును మరల రప్పించుదును ' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, చింతించకండి.
నా ప్రియులారా, మీ నుండి దూరమైన సమస్తమును, ఆలాగే మీ జీవితం నుండి దొంగిలించబడిన లేదా దోచుకున్న సమస్తమును మరియు మీ యొద్ద నుండి దోచుకున్న ప్రతి ఒక్కరిని ప్రభువు తిరిగి మీకు రప్పిస్తాడు. ఆయన మీ పట్ల కనికరం చూపుచున్నాడు అనే మాటలు ఆయన ప్రేమగలిగియున్న హృదయమును వ్యక్తపరచుచున్నది. స్నేహితులారా, మీ జీవితములో మీరు ఊహించని ప్రాంతములకు ఆయన మిమ్మును తీసుకొని వెళ్ళినప్పటి కిని, ప్రభువు మిమ్మును మరచిపోజాలడు. బహుశా! మీ జీవితములో భయం, తిరస్కారం, ఒంటరితనం, నిందారోపణ లేదా దుఃఖముతో నిర్భంధించబడినట్లుగా భావించుచుండవచ్చును. అయితే, అటువంటి మిమ్మును చూచి, ఈ రోజు, ప్రభువు ఇలాగున అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా చెరలో నుండి మిమ్మును తిరిగి రప్పిస్తాను.'' కనుకనే, ఆయన మీ జీవితమును మరల పునరుద్ధరిస్తాడు, విరిగిపోయిన వాటిని తిరిగి నిర్మిస్తాడు, మీ కుటుంబమును పునరుద్ధరించుచున్నాడు మరియు మిమ్మును ఘనపరచుచున్నాడు.
ఎందుకు ప్రభువు మిమ్మును పునరుద్ధరిస్తాడు? అందుకు జవాబు ఎంతో సులభము. మన ప్రభువైన యేసు మీ యొక్క కాపరి. అందుకే బైబిల్‌లో, యేసు, "నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణము పెట్టును '' అని సెలవిచ్చుచున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువపై మీ కొరకు తన ప్రాణాన్ని పెట్టుచున్నాడు. నా ప్రియులారా, ఆయన మీ పాపములను క్షమించడము మాత్రమే కాకుండా, మిమ్ములను తన మందలోనికి చేర్చుకోవడానికి మరియు తన హృదయమునకు సమీపముగా ఉంచుకోవడానికి ఆయన తన అమూల్యమైన రక్తమును చిందించియున్నాడు. అందుకే ప్రభువు మిమ్మును ఎల్లప్పుడు గాయపడినవారిగాను, పగిలిపోయినవారిగా, లేదా విడువబడినవారిగా ఎన్నటికిని విడిచిపెట్టడు. ఇంకను ఆయన మిమ్మును తన యొక్క ప్రేమచేత హత్తుకొని, తన యొద్దకు తిరిగి చేర్చుకుని, మరల సంపూర్ణులనుగా చేయాలని మీ పట్ల ఆకాంక్షించుచున్నాడు. బహుశా! ఈ రోజు మీరు ఎటుదిక్కుతోచని, గందరగోళమైన మరియు భారమైన గొఱ్ఱెపిల్లలవలె భావించుచున్నట్లయితే, మీకు మంచి కాపరిగా ఉన్న ఆయన మీ వైపు కనికరంతో చూచుచున్నాడు. ఆయన హృదయము పగిలిన వారిని ఓదారుస్తాడు, రోగులను స్వస్థపరుస్తాడు, బంధింపబడిన వారికి విడుదలను అనుగ్రహిస్తాడు మరియు ప్రజలకు సంపూర్ణతను చేకూరుస్తాడు. ఆ యేసు నేటికిని, మీ జీవితములో గొప్ప కార్యములను జరిగిస్తాడు.
అందుకే బైబిల్ నుండి లూకా సువార్త 13:34వ వచనములో చూచినట్లయితే, " యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీరొల్లకపోతిరి'' అని యేసు సెలవిచ్చినట్లుగానే, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు ఎలాగైతే చేర్చుకుంటుందో, అలాగే ఆయన మనలను ఎన్నిసార్లో తన యొద్దకు చేర్చుకోవలెనని ఆయన ఎదురు చూచుచున్నాడు. ఇదియే దేవుని యొక్క హృదయమై యున్నది. ఆయన మిమ్మును తన రెక్కల నీడలో చేర్చుకోవాలని, మిమ్మును కాపాడాలని, ఆదరించాలనియు మరియు మీకు విశ్రాంతిని కలుగజేయాలని ఆయన మీ పట్ల ఎంతగానో కోరిక కలిగియున్నాడు. బహుశా! బాధ, నిరాశ లేదా పాపము మీకును మరియు ఆయనకు మధ్య దూరమును కలుగజేసియుండవచ్చును. అయితే, తిరిగి ఆయన యొద్దకు సమీపంచడానికి యోగ్యులుకారని కూడా మీకు అనిపించవచ్చును. కానీ, మీ ఓటమికంటే, యేసు ప్రేమ ఎంతో గొప్పది. నా ప్రియులారా, మీరు ఎంత దూరముగా వెళ్లినను సరే, యేసు ఈ రోజు మిమ్మును తన యొద్దకు తిరిగి రమ్మని ఆహ్వానించుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, నేడు మీరు కాపరిగా ఉన్న యేసును మీకు కాపరిగా ఉండమని అడిగినప్పుడు, ఆయన మిమ్మును ఎన్నటికిని త్రోసివేయడు. కనుకనే, నేడు మీరు ఈ లోక మార్గములను విడిచిపెట్టి, మీ జీవితమును సంపూర్ణముగా దేవుని చిత్తమునకు మరియు ఆయన హస్తములకు అప్పగించుకున్నట్లయితే, నిశ్చయముగా, ఆయన మీకు ఒక మంచి కాపరిగా ఉంటూ, మిమ్మును ఎన్నటికిని ఒంటరిగా విడువడు.
నా ప్రియులారా, మీరు అలాగున చేసినప్పుడు, ప్రభువు మీ కుటుంబమును మరియు మీ భవిష్యత్తును కూడా పునరుద్ధరిస్తాడు. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 16:31వ వచనములో చూచినట్లయితే, "అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు'' అని చెప్పినట్లుగానే, మీరు ఆయన యందు విశ్వాసము ఉంచినప్పుడు, ఆయన రక్షించు కృప మీ కుటుంబమంతటిని తాకుతుంది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 23:1,2వ వచనములలో చూచినట్లయితే," యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, మీ మంచి కాపరిగా ఉన్న ఆయన మిమ్మును పచ్చికగల చోట్లను ఆయన మిమ్మును పరుండజేసి, శాంతికరమైన జలముల యొద్ద మిమ్మును నడిపిస్తాడు. నా ప్రియులారా, ఆయన తన నామము నిమిత్తం మీ బలమును పునరుద్ధరించి, మీ ప్రాణమును సేదతీర్చి, నీతి మార్గములలో మిమ్మును నడిపిస్తాడు. చివరిగా, ప్రభువు మీ జీవితంలోని విచ్ఛిన్నము చేయబడిన ప్రతి భాగమును తిరిగి పునరుద్ధరించి, మీ అవమానమును ఘనతగా మారుస్తాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 62:4వ వచనములో చూచినట్లయితే, " విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మిమ్మును గూర్చి ఆనందించుచున్నాడు, మీ దేశము గూర్చి చెప్పబడదు, ఇక మీదట మీరు విసర్జించువారుగా ఉండరు, మీ పేరు హెఫ్సీబా అని పిలువబడుదురు. ఎందుకంటే, ప్రభువు మీ యందు ఆనందించుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు, మీ జీవితం విచ్ఛిన్నమైనదని ప్రజలు చెప్పవచ్చును; కానీ ప్రభువు ఇలాగున అంటున్నాడు, "లేదు! నేను మీ యందు ఆనందించుచున్నాను. '' కనుకనే నా ప్రియులారా, ఈ రోజు ఆయన వాగ్దానమును నమ్మండి, అప్పుడు మీరు కోల్పోయిన సమస్తమును ఆయన తప్పకుండా మీకు తిరిగి అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపాకనికరముగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా మంచి కాపరిగా ఉన్నందుకు నీకు వందనములు. యేసయ్యా, మేము నీ యందు విశ్వాసముంచుటకును, మేమును మరియు మా యింటివారును రక్షణ పొందుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా జీవితమును సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. నేడు, నీవు మా జీవితము పట్ల నీవు బాధ్యతను వహించి, మా జీవితంలోని ప్రతి విచ్ఛిన్నమైన ప్రతి భాగమును బాగుచేసి, మా యొక్క ప్రతి బంధకముల నుండి మమ్మును విడిపించి, మా హృదయమును నీ యొక్క సమాధానముతో నింపుము. ప్రభువా, మా కుటుంబములో చెదరిపోయిన మా ప్రియులను నీ వాగ్దానము ద్వారా పోగుచేయుము. యేసయ్యా, నీవు మాకు కాపరిగా ఉండి, పచ్చికగల చోట్లను నీవు మమ్మును పరుండజేసి, శాంతికరమైన జలముల యొద్ద మమ్మును నడిపించుము. ప్రభువా, అందరిచేత విడువబడిన మమ్మును బ్యూలా అని పిలువబడు గొప్ప ధన్యతను మాకు దయచేయుము. దేవా, నీ యొక్క రక్షణానందము మా కుటుంబమును తాకునట్లుగాను మరియు మేము నీ యొక్క నీతి మార్గములలో నడుచునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను దాచుకున్నట్లుగా, నేడు నీవు మమ్మును మరియు మా కుటుంబమును నీ రెక్కల నీడలో భద్రపరచుకొనుమని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


