నా ప్రియమైన వారలారా, దేవుడు మీకు దయను అనుగ్రహించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. అందుకోసమై కృపా సింహాసనము మీద ఆయన ఆసీనుడై యున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హెబ్రీయులకు 4:16వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "...మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము'' అని వ్రాయబడినట్లుగానే, తద్వారా మనము దేవుని దయను పొందునట్లుగాను, దేవుని సింహాసనము కృపాసింహాసనమై యున్నది. ఈ యొక్క కృప మనకు ఏమి తీసుకొని వచ్చుచున్నది? అని మనము చూచినట్లయితే, మొట్టమొదటిగా మనకు రక్షణను తీసుకొని వచ్చియున్నది. అందుకే బైబిల్ నుండి ఎఫెసీయులకు 2:8,9 వ వచనములలో చూచినట్లయితే, "మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు'' అని చెప్పబడినట్లుగానే, ఇది మీరు చేయుచున్న కార్యములను బట్టి కాదు, ఇది మీరు చేయుచున్న మంచి పనులను బట్టి కాదు, మీరు ఎంత త్యాగము చేసియున్నారో, మీకు మీరు ఎంత హాని జరిగియున్నది అను దానిని బట్టి కాదు, భౌతికంగా మీరు చేయుచున్న ఏ చర్య ఎప్పటికి కాదు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది ఎంత అద్భుతమైన దేవుని యొక్క కృప కదా!
అవును నా ప్రియులారా, రక్షణ అనునది ఆధ్యాత్మికమైనది. కేవలము దేవుడు మాత్రమే మీ ఆత్మను సంధించగలడు. కారణము, దేవుడు ఆత్మయై యున్నాడు. కనుకనే, ఆయనను ఆరాధించువారు, ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలెనని యేసు సెలవిచ్చియున్నాడు. కనుకనే, మనము మన యొక్క ఆత్మను పరిశుద్ధాత్మతో అనుసంధానము చేసుకొనవలెను. అప్పుడు ఆయన శక్తి మనలోనికి దిగివచ్చును. తద్వారా, ఆయన శక్తి మన ఆత్మలను రూపాంతపరచుచున్నది. అంతమాత్రమే కాదు, మనలో ఉన్న పాపపు ఆత్మను తొలగించి, మనకు దేవుని ఆత్మను అనుగ్రహించుచున్నది. నా ప్రియులారా, దేవుడు నేడు ఇట్టి కృపను మీకిచ్చును గాక.
రెండవదిగా, మన బలహీనతలలో మనకు బలము. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 12:9వ వచనములో చూచినట్లయితే, "అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను...'' అన్న వచనము ప్రకారముగానే, మీ బలహీనతల మధ్యలో మీరు దేవుని ఆత్మచేత బలపరచబడునట్లుగా ఇట్టి కృపను దేవుడు నేడు మీకు అనుగ్రహించుచున్నాడు. నా ప్రియులారా, దేవుని కృపా సింహాసనము యొద్ద నుండి వచ్చు కృపచేత, మీలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామమున మిమ్మును విడిచిపెట్టి వెళ్లిపోవును గాక. యేసు ఇదివరకు మీరు స్వస్థతను పొందు నిమిత్తము సిలువలో ఆయన క్రయధనముగా వెల చెల్లించియున్నాడు. ఎందుకనగా, ప్రతి శోధన మధ్యను మీరు బలపరచబడు నిమిత్తమే. యేసు చేసిన త్యాగము ద్వారా పరిశుద్ధాత్మ యొక్క బలము మీ మీదికి ఇప్పుడే దిగివచ్చుచున్నది. కనుకనే, ధైర్యముగా ఉండండి. అటువంటి కృపను ఇప్పుడే ఆయన యొద్ద నుండి పొందుకొనండి.
మూడవదిగా, మన ప్రభువైన యేసు యొక్క కృప ద్వారా ఐశ్వర్యము మీ చెంతకు వచ్చుచున్నది. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 8:9వ వచనములో చూచినట్లయితే, "మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దార్రిద్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను'' అని చెప్పబడినట్లుగానే, మీరు ఐశ్వర్యమును కలిగియుండాలని యేసు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సిలువలో దిగంబరియైన వ్యక్తివలె ఆయన చనిపోయాడు. ఆయన వస్త్రములు తొలగించబడినవి. మహిమవంతమైన దేవుడు, తన్ను తాను తగ్గించుకొని, ఆయన సిలువలో వ్రేలాడదీయబడ్డాడు. మహిమ లేకుండా సిలువలో వ్రేలాయదీయబడ్డాడు. ఆయన ఆధ్యాత్మిక మహిమను కలిగియున్నాడు. ఆయన అందరిని క్షమించునిమిత్తమై పరలోకమునకు ద్వారమును తెరవజేసియున్నాడు. అయితే, భౌతికముగా, ఆయన ఎంతో బీదవాడుగా మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. తద్వారా, ఆయన చేసిన త్యాగమును బట్టి, ఆయన కృప ద్వారా, మీరు మరియు నేను ఐశ్వర్యవంతులము కావలెనని మరియు మనము పేదరికము నుండి బయటకు రావలెననియు ఆయన మన నిమిత్తము దరిద్రుడాయెను. కనుకనే, నా ప్రియులారా, నేడు ఇటువంటి కృప మీ మీదికి దిగివచ్చును గాక. ఇటువంటి కృపను మీరు కూడా నేడు పొందుకొనవలెనని కోరినట్లయితే, ఇప్పుడే, మిమ్మును యేసు ప్రభువు హస్తములకు సమర్పించుకొని, ఆయన కృపాసింహానము నొద్దకు వచ్చినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును తన కృపతో నింపి, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, రక్షించే కృప మాలోనికి దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా ఆత్మ నీ ఆత్మవలె రూపాంతరము చెందునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా నుండి శరీరేచ్ఛలను తొలగించి, మా దేహములను మరియు ఆత్మలను స్వస్థపరచుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి భారమును, ప్రతి ఒత్తిడిని నీవు చూస్తున్నావు. కనుకనే, దేవా, నీ యొక్క బలము ద్వారా మా దేహములో ఉన్న ప్రతి బలహీనతను తొలగించుము. యేసయ్యా, నీ యొక్క మహిమైశ్వర్యములో మేము పేదరికము నుండి ఐశ్వర్యవంతులముగా మారుటకు మాకు నీ యొక్క కృపను అనుహ్రించుము. ప్రభువా, నీ యొక్క కృప ద్వారా మాకు జ్ఞానమును మరియు ఐశ్వర్యమును, తెరవబడిన ద్వారములను అనుగ్రహించుటకు మేము ఎల్లప్పుడు నీ యొక్క కృపాసింహాసనము యొద్దకు వచ్చునట్లుగా మాకు కృపను దయచేయుము. ప్రభువా, మేము బాధ, అవమానం, మరియు నిస్సహాయత ద్వారా నీ కొరకు కనిపెట్టుచున్నాము. దేవా, ఈ రోజు, నీ విమోచన మా జీవితంలోనికి వచ్చునట్లు చేయుము. ప్రభువా, ఇంతకాలం మమ్మును బంధించి ఉంచిన ప్రతి సంకెళ్ళను తెరువుము. దేవా, మా హృదయాన్ని మరొక్కసారి శాశ్వతమైన ఆనందంతో, సంతోషంతో నింపుము. యేసయ్యా, నీ యొక్క శాంతిని, ఘనతను, మరియు నిరీక్షణను పునరుద్ధరించుము. నీవు నీ ప్రజలను రక్షించి, బంధింపబడిన వారిని విడిపించినట్లుగానే, మమ్మును కూడా రక్షించుము. దేవా, నీవు మమ్మును ఎన్నటికీ నిరాశపరచకుండా చేయుమని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


