నా ప్రియ స్నేహితులారా, ఈ మే నెలకు స్వాగతం. ఈ నెలలో దేవుడు మిమ్మును ఆశీర్వదించడం ప్రారంభించాడని నాకు తెలుసు. కనుకనే, ప్రియులారా, ఈ రోజు ఆయన ఆశీర్వాదం గురించి ధ్యానించడానికి మనం ఇక్కడ ఉన్నామని గుర్తించాలి. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 తిమోతికి 6:17వ వచనమును గురించి మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము’’ ప్రకారం నేడు మీకు దేవుడు సమస్తమును ధారాళముగా దయచేయాలని మీ పట్ల కోరుచున్నాడు. అవును, ఈ వచనం ఒక ఐశ్వర్యవంతుని గురించి మాట్లాడుచున్నది. 

నా ప్రియులారా, ఐశ్వర్యవంతుడు అంటే ఎవరు? ఐశ్వర్యవంతుడు అంటే, ఒక వ్యక్తికి ఎక్కువగా సంపద, ఎక్కువగా డబ్బు, ఎక్కువగా వస్తువులు, ఎక్కువగా ఆస్తులు ఉన్నవారు కాదు.  అది ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతుని చేయదు. ఈ వచనం ఇలాగున చెబుతుంది, ‘‘ ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక,’’ అని చెప్పబడియున్నది. ఎందుకు ఆలాగున చెప్పబడియున్నది? ఎందుకంటే, అది శాశ్వతం కాదు. అంతమాత్రమే కాదు, అది అస్థిరమైనది. బైబిల్‌లో దేవుడు దానిని యోబునకు కనుపరచాడు. ఈ భూమి మీద  యోబు అంతటి ఐశ్వర్యవంతుడు మరొక వ్యక్తి లేడు. బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతనికి పెద్ద కుటుంబము ఉండెను. ఊహించగలిగిన దానికంటే అతనికి ఆస్తి మరియు కుటుంబము ఉండెను! కానీ, ఒక్క క్షణంలోనే, అవన్నియు అతని యొద్ద నుండి తొలగించవేయబడ్డాయి. దేవుడు యోబును మనకు మాదిరిగా చూపించాడు మరియు అస్తులు మరియు అంతస్థులు రావచ్చును, పోవచ్చును అని మనకు కూడా చూపించాడు.

నా ప్రియులారా, ఈ లోకములో మనం నిర్మించేది ఏదైనా ఒక్క క్షణంలోనే మన యొద్ద నుండి తీసివేయబడవచ్చును లేక నాశనమైపోతాయి. ఈ భూమి మీద ఆస్తులు మరియు అంతస్థులు మీరు ఇవన్నియు కలిగి ఉన్నందున ఐశ్వర్యవంతులు కాదు. అయితే, మీరు ఎప్పుడు ఐశ్వర్యవంతులు అనగా, ‘‘ నేను మీలో ఉన్నప్పుడు, మీరు ఐశ్వర్యవంతులు’’ అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మరియు ‘‘నేను మీ దగ్గర ఉన్నప్పుడు, నేను మీకు ఎప్పుడైనా ఏదైనా ఇవ్వగలను’’ అని చెబుతున్నాడు. అందుకే బైబిల్‌లో హగ్గయి చెప్పినట్లుగానే, ‘‘వెండి బంగారములు నావి’’ అని యెహోవా సెలవిచ్చియున్నాడు. యోబునకు అతని ఆస్తులన్నింటిని, అతని ఇళ్లన్నింటిని, అతని కుటుంబాన్ని మరియు అతనికి కలిగిన సమస్తమును మునుపటి కంటే మరింత సౌందర్యంగాను ఇచ్చాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, ‘‘యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను’’ ప్రకారం యోబు కోల్పోయినదంతటిని రెండంతలుగా తిరిగి ఇవ్వగలడని దేవుడు అతనికి కనుపరచాడు. అవును, నా ప్రియులారా, దేవుడు మనము కోల్పోయిన దానిని తిరిగి ఇచ్చుటకు సమర్థుడై యున్నాడు. కనుకనే, నేడు మీరు యేసును కలిగి ఉన్నప్పుడు మీరు ఐశ్వర్యవంతులు. దేవుడు, మనము సమస్తమును అనుభవించడానికి  ధారాళముగా అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. నేడు అదే మనకు ఇవ్వబడిన వాగ్దానం. కనుకనే, మీరు దానిని పొందుకుంటారా? ఆలాగున మీరు పొందుకోవాలనగా, యోబు వలె దేవుని యందు నమ్మకము కలిగి, యథార్థవంతముగా జీవించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీరు కోల్పోయిన దానికంటె రెండంతలుగా నేటి వాగ్దానము ద్వారా మీరు అనుభవించుటకు సమస్తమును ధారాళముగా ఇచ్చి, మిమ్మును యోబు వలె దీవించును గాక. 

ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ నూతన మాసమైన మే నెల కొరకై నీకు వందనాలు. దేవా, మేము ఆనందించడానికి అవసరమైనవాటన్నిటిని సమస్తమును సమృద్ధిగా అనుగ్రహిస్తావనియు నమ్ముచున్నాము. దేవా, అస్థిరమైన ఐశ్వర్యము మరియు సంపదలపై మా నిరీక్షణను ఎప్పుడూ ఉంచకుండా, సమస్తము మాకు ధారాళముగా అనుగ్రహించు నీ వైపు మా దృష్టిని ఎల్లప్పుడు ఉంచునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, మా జీవితంలోని నిజమైన ఐశ్వర్యవంతుడవైన నీలో మాత్రమే మా హృదయం విశ్రాంతి తీసుకొనునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, యోబువలె మేము ప్రతి సమయములోను, లాభంలోను లేదా నష్టంలోను నిన్ను మాత్రమే నమ్ముకొనునట్లుగా సహాయము దయచేయుము. దేవా, మేము కలిగియున్నదంతయు నీ యొద్దను మాత్రమే ఉన్నాయని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము కోల్పోయినదానినంతటిని, నీవు రెండంతలుగా పునరుద్ధరించగలవని మాకు తెలుసు. కనుకనే, నీవే, స్వాస్థ్యము, మా పానీయభాగము మరియు మా సమాధానము నీవే, కనుకనే, మేము నిన్ను కలిగి ఉన్నప్పుడు మాకు ఎటువంటి కొరత ఉండదని మేము నమ్ముచున్నాము. దేవా, నేడు పేదరికమును తొలగించి, మేము సమస్తమును ధారాళముగా అనుభవించునట్లుగా సమస్తమును మాకు దయచేయుము. ప్రభువా, ఈ రోజు, నీవు మాకు సమస్తమును ధారాళముగా ఇస్తావని  కృతజ్ఞతతో మరియు ఆనందంతో నీ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని, ముందుకు సాగివెళ్లుటకు నీ కృపను మాకు దయచేయుమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.