నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాము. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 31:17వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, "రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు'' అని లేఖనము సెలవిచ్చినట్లుగానే దేవుడు మీకు రాబోవు కాలమునందు మేలు కలుగజేస్తాడని నమ్మండి. ఒకవేళ, మీరు మీ పిల్లలను గురించి చింతించుచున్నారా? మీకు దూరంగా నివసించుచూ, వారు స్వంత మార్గములో నడుచుచున్న మీ బిడ్డలను గురించి మీరు బాధపడుచున్నారా? అయితే, దిగులుపడకండి. అవును, ఈ మధ్యకాలములో మా మనవరాలైన షారోన్‌ను గురించి మేమందరము ఎంతగానో చింతించియున్నాము. తను అమెరికా దేశములో పనిచేయుచూ, చాలా కాలము అస్సలు తిరిగి రాలేదు. అయితే, ఈ వాగ్దానాను సారముగా ప్రభువు సరైన సమయములో ఆమెను భారత దేశమునకు తీసుకొని వచ్చి, తన ద్వారా గొప్ప కార్యములను చేసియున్నాడు. కనుకనే, ఈ భూమి మీద ప్రతి దానికి ఒక సమయము కలదు. కాబట్టి, మీరు భయపడకండి.
నా ప్రియులారా, ప్రభువు యొద్ద నుండి మంచితనమును మరియు కృపలను పొందుకొనుటకు యేసుక్రీస్తు మీద మాత్రమే ఆధారపడియుండాలి. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 66:3వ వచనములో చూచినట్లయితే, "ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమునుబట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు'' అని చెప్పబడిన ప్రకారము దేవుని కార్యములు ఎంతో గొప్పవిగా ఉంటున్నవి. ఇంకను బైబిల్ నుండి మరొక వచనమును కీర్తనలు 92:4,5వ వచనములలో మనము చూచినట్లయితే, "ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనులబట్టి నేను ఉత్సహించుచున్నాను'' అని చెప్పబడిన ప్రకారము దేవుని కార్యమును చేత ఆయన మనలను సంతోషపరచుచున్నాడు. కనుకనే, బైబిల్ నుండి మార్కు 16:20వ వచనములో చదివినట్లయితే, "వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై యుండి, వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్'' అని చెప్పబడినట్లుగానే, కాబట్టి, మనము దేవుని వాక్యమును చదువుచూ, వాగ్దానములన్నిటిని కూడా స్వీకరించి, పొందుకోవాలి.
నా ప్రియులారా, ఈ వచనములన్నియు కూడా దేవుని యొక్క వాగ్దానములై యున్నవి. మీరు దేవుని వాగ్దానములను చదివినప్పుడు, మీ కొరకు అని ఆ వాగ్దానములను స్వీకరించాలి. అందుకే బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 1:4వ వచనములో చూచినట్లయితే, "మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను'' అన్న వచనము ప్రకారము వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన సరియైన సమయములో అద్భుత రీతిగా తాను ఆ వాగ్దానములన్నిటిని నెరవేరుస్తాడు. నా ప్రియ స్నేహితులారా, ఎల్లప్పుడు మనము ఆయన వైపు మాత్రమే చూడాలి. మేలుల కొరకు మరియు మంచితనము కొరకు మనము ఆయన మీద మాత్రమే ఆధారపడాలి. ఆయన వాక్యములో చెప్పబడిన ప్రకారముగానే, ఆయన అద్భుత రీతిలో మన అవసరతలన్నిటిని తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి, నా ప్రియులారా, మీరు క్రమముగా దేవుని వాక్యమును చదువుతూ, దేవుని మంచితనమును, కృపను బట్టి సంతృప్తి కలిగి జీవించండి. ఇప్పుడు కూడా మన జీవితాలను ప్రభువు సమర్పించుచు, దీవెనల కొరకు ఆయన వైపు చూచి, ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా, ప్రభువు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొక్క అద్భుత సన్నిధానమునకై నీకు వందనములు. ప్రభువా, మా బిడ్డలను గురించి, లేక మా స్వంత సమస్యలను గురించి చింతించుచున్న మా హృదయములను ఎరిగియున్నాము. దేవా, మేము నీ వాక్యమును చదివి, నీ వాగ్దానములన్నిటిని పొందుకొను కృపను మాకు అనుగ్రహించుము. దేవా, నీ మార్గములను మాకు నేర్పించుము. దేవా, నీ ఆశీర్వాదములన్నిటిని అద్భుత రీతిలో పొందుకొని జీవించునట్లుగా మరియు ఆనందించునట్లుగా మాకు నీవు సహాయము చేయుము. ప్రేమగల ప్రభువా, నీ యొక్క నమ్మకమైన వాగ్దానముల కొరకు నీకు కృతజ్ఞతలు. దేవా, మా చింతలను గురించి, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులను గురించి ఆందోళనలను నీకు తెలుసు. కనుకనే, నీ వాక్యం ప్రకారం, సరైన సమయంలో వారిని తిరిగి మా యొద్దకు తీసుకురమ్ము. ప్రభువా, మాలో నీవు ప్రారంభించిన మంచితనమును, నీ చేతి పనులను సంపూర్తి చేయుటకు నిన్ను సంపూర్ణంగా విశ్వసించడానికి మాకు సహాయము చేయుము. దేవా, నీ దయ మరియు కృప ద్వారా మా అవసరతలన్నిటిని క్రీస్తు యేసులో తీర్చుము. ప్రభువా, మా జీవితమును నీ ప్రేమగల హస్తములకు సమర్పించుకొనుచున్నాము. దేవా, తగిన కాలమున నీవు మా జీవితములో నీ యొక్క భీకర కార్యములను జరిగించుము. ప్రభువా, జీవితంలో కేవలం నీ చిత్తమే చక్కగా నెరవేరనీయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


