నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 13:9వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీతిమంతుల వెలుగు తేజరిల్లును; భక్తిహీనుల దీపము ఆరిపోవును'' అని చెప్పబడినట్లుగానే, మనము ఈ లోకములో తేజరిల్లాలని ప్రభువు ఎల్లప్పుడు మన పట్ల ఆశించుచున్నాడు. కనుకనే, మీరు దిగులుపడకండి.

మా కుటుంబ జీవితములో చూచినట్లయితే, నా కుమారుడు 10వ తరగతి చదువుచున్న దినములలో, "దేవుని ఘనపరచడానికి మరియు ఆయన నామమును మహిమపరచడానికి నీవు ఉన్నతమైన మార్కులను సాధించాలి '' అని చెబుతాను. ఇంకను, 'దేవునితో య«థార్థమైన నడవడిని నీవు కలిగి ఉండాలి, అప్పుడు దేవుని యొక్క మహిమ నీ మీదికి దిగివస్తుంది, నీ చదువులన్నిటిలో కూడా నీవు వర్థిల్లుతావు' అని చెప్పాను. ఆలాగుననే, నా కుమారుడు వెంటనే, నా మాటలకు విధేయత చూపుతూ, ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథమును చదువుకుంటూ, తన విద్యలో కూడా చక్కగా చదువుకుని తన పరీక్షలన్నిటిని వ్రాశాడు. అంతమాత్రమే కాదు, నా కుమారుడు, 'అమ్మా, నేను దేవుని ఘనపరచాను కాబట్టి, నా పరీక్షలన్నిటిని నేను చక్కగా వ్రాశాను' అని నాతో చెప్పాడు. కానీ, చివరిగా చూచినట్లయితే, నా కుమారుడు 10వ తరగతి పరీక్షలలో ఉన్నతమైన మార్కులను సాధించాడు. దేవునికే మహిమ కలుగును గాక.

అందుకే బైబిల్ నుండి సామెతలు 4:18వ వచనములో చూచినట్లయితే, "పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును'' అని చెప్పబడినట్లుగానే, మన నీతి పట్టపగలు వరగు వేకువ వెలుగు వలె తేజరిల్లవలెనని ఆయన మన పట్ల కోరుచున్నాడు. మనము దేవుని వైపు ఎన్నడును క్రిందికి త్రోసివేయబడము. మనము లేచి దేవుని మహిమార్థమై ప్రకాశించువారముగా ఉంటాము. యేసయ్య యందు విశ్వాసముంచినవారు ఈ లోకమందు వెలుగైయుంటారు. ఇంకను ఎవరైతే, ప్రభువుతో కలిసి ఏకమై ఉంటారో వారు కూడా యేసయ్య వలె ప్రకాశించెదరు. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 17:6వ వచనములో చూచినట్లయితే, " అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొనిపోయి భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చియున్నారు...'' ప్రకారము ఈ మనుష్యులు భూలోకమును తలక్రిందులుగా చేసియున్నారు అని పౌలును గురించి చెప్పబడియున్నది.

నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా ఈ లోకమును మార్చుట కొరకు పిలువబడియున్నారు. మా కుమార్తెయైన షారోన్ అనేకసార్లు ఈ విధంగా చెబుతుంటుంది, 'నేను ఈ లోకమును మారుస్తాను.' అవును, మనము ఈ లోకమును ఏలాగున మార్చగలము? దేవుని యొక్క సత్యమును మనము మాటలలోను మరియు మన చేతులలో మనము ప్రతిబింబించినప్పుడు మాత్రమే, అనగా, మనము యథార్థతతో నడుచుకున్నప్పుడు మాత్రమే. అప్పుడు లోకము మన వైపు చూస్తుంది. ముఖ్యముగా, దేవుని బిడ్డల వైపు ఈ లోకము ఈ విధంగా చూస్తుంది. మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము? మనము ఏ విధంగా నడుచుకుంటున్నాము? అని చూస్తుంది.

అవును, యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు, ఆయన మాటలలోను, చేతలలోను, ఒక బలమైన ప్రవక్తగా జీవించాడు. అది ఏ విధంగా సాధ్యపడినది. ఆయన ఉదయముననే, వేకువజామున ప్రార్థించాడు, మధ్యాహ్నము, సాయంకాలము మరియు రాత్రివేళలలో కూడా ప్రార్థించాడు. ఆయన ఎల్లప్పుడు తండ్రి వైపు చూస్తూ, ఈ లోకములో యథార్థముగా జీవించుటకు ప్రయత్నించి, ఆ విధంగానే జీవించాడు. ఆలాగుననే, మీరు ఒక ప్రొద్దు తిరుగుడు పువ్వును చూచినప్పుడు, ప్రొద్దు తిరుగుడు పువ్వు యొక్క కొమ్మ ఉదయకాలముననే, సూర్యుడిని పలకరించినట్లుగానే, సూర్యుని వైపు తిరిగిపోతుంది. ఆలాగే, సాయంకాలమైనప్పుడు, పడమర వైపు తిరుగుతుంది. ఉదయమునే తూర్పు వైపున ఆ కొమ్మ తిరుగుతుంది. సాయంకాలమున పడమర వైపునకు తిరిగిపోతుంది. ఆ విధంగా ఎదగడానికి కావలసిన బలమును ఆ మొక్క పొందుకుంటుంది. ఇంకను సూర్యుని నుంచి శక్తిని పొందుకుంటుంది. సూర్యుని నుండి పొందుకున్నటువంటి ఆ బలమంతటితో ప్రొద్దు తిరుగుడు పువ్వు ఎంతో ఆనందముగా కనిపిస్తుంది.

అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రతిరోజు మనము కూడా ప్రభువును వెదకుచూ, ప్రార్థించువారముగా ఉండాలి. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 1:29వ వచనములో చూచినట్లయితే, "అందునిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను'' అని పౌలు భక్తుడు తెలియజేసియున్నాడు. నా ప్రియులారా, ఎవరైతే, ప్రభువు వైపు చూచుచున్నారో, వారు ఎంతగానో ప్రకాశిస్తారు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 34:5వ వచనములో చూచినట్లయితే, " వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును'' అని చెప్పబడినట్లుగానే, మీరు ఆయన తట్టు చూచినప్పుడు, మీ ముఖములు వెలుగుతో ప్రకాశిస్తాయి. కనుకనే, యేసు ఈ లోకమునకు వైలుగై ఉన్నట్లుగానే, మీరు కూడా ఈ లోకమునకు వెలుగై యున్నారు. నా ప్రియ స్నేహితులారా, రానున్న దినములలో ప్రభువు యొక్క వెలుగు అత్యంత శక్తివంతముగా మీ మీద ప్రకాశించును గాక. ఇంకను మీ చుట్టు ఉన్నవారు కూడా మీరు చేయుచున్న మంచి కార్యములను చూచుదురు గాక. అప్పుడు మీ చుట్టు ఉన్న ప్రజలు పరలోకపు తండ్రిని మహిమపరచెదరు. తద్వారా, మీ జీవితము యేసయ్య యొక్క వెలుగుతో ప్రకాశించును గాక. నా కుమారుడు సాక్ష్యము చెప్పినవిధంగానే, నేడు మీ మీద కూడా దేవుని యొక్క మహిమ దిగివచ్చును గాక. ఆలాగుననే, 'నా కుమారుని దేవుడు మహిమపరచినట్లుగానే, నేడు మిమ్మును కూడా ఆయన మహిమపరుచును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, రానున్న దినములలో మా యొక్క వెలుగు అత్యంత శక్తివంతముగా ప్రకాశించునట్లుగా చేయుము. యేసయ్యా, నీవు త్వరగా రాబోవుచున్నావు, కనుకనే, మేము నీతిమంతులుగాను మరియు మరింత నీతిమంతులుగా మారుటకు నీ కృపను మాకు దయచేయుము. దేవా, పరలోకమందు నీవు ఇచ్చు ప్రతిఫలమును పొందుకొనునట్లుగా చేయుము. యేసయ్యా, మేము నీ యొక్క నీతి మార్గంలో నడుచుకుంటూ, మా జీవితంలోని ప్రతి విషయంలో నిన్ను ఘనపరచునట్లుగాను మరియు మా మాటలలోను, చేతలలోను మరియు మా నడతలలోను అనుదినము నీ మహిమను ప్రతిబింబించునట్లుగా మాకు సహాయము చేయుము. యేసయ్యా, నీవు తండ్రియై దేవుని ఎల్లవేళల వెదకినట్లుగానే, మేము కూడా ప్రార్థన ద్వారా మరియు నీ వాక్యం ద్వారా నిన్ను విశ్వాసముతో వెదకుటకు మాకు నేర్పించుము. ప్రభువా, మేము చేయుచున్న ప్రతి ఒక్క కష్టమునకు మాకు ప్రతిఫలము దయచేసి, మమ్మును ఘనపరచుము. యేసయ్యా, నీవు వెలుగుగా ఉన్నట్లుగానే, మేము నీ వలె వెలుగుగా ఉంటూ, మా ముఖములు ప్రకాశించునట్లుగా చేయుము. దేవా, మా చదువులను మరియు మా చేతి పనులన్నిటిని ఆశీర్వదించుము. ప్రభువా, నీ సౌందర్యము మా ద్వారా కనపరచబడునట్లుగా చేయుము. ప్రభువా, మమ్మును బట్టి, మా చుట్టు ఉన్నవారు నిన్ను మహిమపరచునట్లుగా చేయుము. దేవా, నీ శక్తితోను, బలముతోను మమ్మును నింపి, రానున్న దినములలో మరింతగా మేము తేజరిల్లునట్లుగా సహాయము చేసి, మాకు విజయమును అనుగ్రహించి, నీ వెలుగు మా మీద ప్రకాశించునట్లుగా చేయుమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు అత్యంత ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.