నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 8:18 వ వచనమును తీసుకొనబడియున్నది. ఆ వచనము, "కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే'' అని చెప్పబడినట్లుగానే, మనము భాగ్యమును సంపాదించుకొనుటకై సామర్థ్యము కలిగియుండాలని దేవుడు మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీకు సంపాద్యము లేదని చింతించకండి, దేవుడు ఆ సామర్థ్యమును మీకు కలుగజేయుచున్నాడు.

నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని శక్తితోను మరియు దీవెనలతోను ఏ విధంగా నింపబడగలుగుతాము? మనము ప్రభువుతో ఏకమై ఉన్నప్పుడు, ఆయన యొద్ద నుండి సమృద్ధి దీవెనలన్నిటిని మనము పొందుకొనగలుగుతాము. అందుకొరకు, యేసయ్య మనకు చక్కని మాదిరియై ఉంటున్నాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 10:30వ వచనములో చూచినట్లయితే, యేసు ప్రభువు ఈలాగున అంటున్నాడు, " నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.'' ఆ ప్రకారముగానే, మనము అటువంటి జీవితమును కలిగియుండాలి. యేసు తండ్రితో సంపూర్ణముగా ఏకమై జీవించినట్లుగానే, మనం కూడా దేవునితో సన్నిహితంగా నడవడానికి పిలువబడియున్నాము. కనుకనే, సర్వశక్తిమంతుడైన దేవునితో మనము కూడా ఏకమైనప్పుడు ఇటువంటి సన్నిహిత సంబంధమును మనము కలిగియుంటాము.

నా ప్రియులారా, మనము ఏ విధంగా ఆయనతో ఐక్యపరచబడగలుగుతాము? దేవుని వాక్యము ద్వారా మరియు వాక్యానుసారముగా జరిగించుట ద్వారా, దేవుని వాక్యమునకు విధేయత చూపెట్టడము వలన, యేసయ్యను గట్టిగా హత్తుకొనియుండుట ద్వారా, హృదయమంతటితో ఆయనను వెదకడము వలన, ఇవన్నియు మీరు లేక మనము చేయగలిగినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవునితో మీరు ఏకమవుగలుగుతారు. మొదటిగా, ప్రభువు మీకు భయభక్తులను నేర్పిస్తాడు. అవును, నా జీవితములో ప్రభువు, దేవుని యందలి ఎలా భయభక్తులను కలిగియుండాలని నాకు నేర్పించియున్నాడు. కనుకనే, దేవుడు మనకు బోధించుచున్న ప్రాముఖ్యమైన అంశములలో ఒకటి, 'మనము దేవుని యందు భయభక్తులు కలిగియుండుటయే,' అనగా, అది ఆయన పట్ల మనము కలిగియున్న భయభక్తులు మరియు ఘనత ఇవి మనలను ఆయన మార్గములలో నడుచునట్లుగా చేయుచున్నవి.

ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 144:15వ వచనములో మనము చూచినట్లయితే, "...యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు'' అని చెప్పబడినట్లుగానే, ఈ వచనమును మీరు ఈ విధంగా కూడా చదవవచ్చును, "...యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులై ఉన్నారు.' మనము కూడా ఆయనను వెంబడించుచూ, ఆయన యందలి భయభక్తులు కలిగియున్నప్పుడు మనము కూడా ఇటువంటి ధన్యతను పొందుకుంటాము. బైబిల్ గ్రంథములో యాకోబు మరియు అతని యొక్క ఇద్దరు భార్యలను గురించి చదువుతాము. యాకోబునకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు లేయా మరియు మరొక భార్య పేరు రాహేలు. లేయాకు అనేకమంది బిడ్డలు ఉన్నారు. లేయా బిడ్డలను కనిన ప్రతిసారి ప్రభువును తన హృదయాంతరంగము నుండి స్తుతించినది. కాబట్టి, ప్రభువు ఆమె యందు ఇష్టపడ్డాడు. అయితే, రాహేలు అనేక సంవత్సరములుగా బిడ్డను కనలేకపోయినది. తన తండ్రి యొక్క విగ్రహమును దొంగిలించి తప్పు చేసినది. యాకోబు వెంబడించుచున్న సర్వశక్తిమంతుడైన దేవుని వెంబడించకుండా, తన తండ్రి యొక్క విగ్రహములను దొంగిలించినది. అందును బట్టి ఆమె జీవితములో ఏమి జరిగినది? తాను వాగ్దాన దేశమును చేరుకొనలేకపోయినది. తను మార్గములోనే చనిపోయినది. అయితే, లేయా చివరికి బ్రతికి, తాను ఆ వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టి, తను మృతి చెందినప్పుడు తన భర్త ప్రక్కన ఆమె యొక్క మృత దేహము పాతిపెట్టబడినది. ఆమె తన భర్తతో పాటు విశ్రాంతి తీసుకుంటూ, ఆశీర్వాదం మరియు జ్ఞాపకార్థం అనే ఒక ప్రత్యేకమైన బహుమానమును పొందుకొనెను. ఇది ఎంతటి గొప్ప ధన్యత కదా!

అవును, నా ప్రియ స్నేహితులారా, దేవుని మార్గములను మీరు వెంబడించాలి. లేయావలె మీరు కూడా దీవించబడాలి. కనుకనే, ఈ రోజు దేవుని యొద్ద నుండి ప్రత్యేక దీవెనలను పొందుకుందామా? నేడు మనకు ఎంతటి గొప్ప పాఠం కదా ఇది! దేవుడు మన నుండి సంపూర్ణమైన భయభక్తులను కోరుకుంటున్నాడు. మన హృదయముల నుండి సమస్త విగ్రహములను తొలగించి, ఆయనను మాత్రమే వెదకాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయన ఆశీర్వాదాలు మనలను వెంబడించును. నా ప్రియులారా, మాదిరిగా నిలిచిన లేయా నుండి మనం నేర్చుకుని, జీవితంలోని ప్రతి దశలోనూ ప్రభువు పట్ల విశ్వాసంగా జీవించుదాము. కనుకనే, ఈ రోజే దేవునితో సన్నిహితంగా నడవాలని, ఆయన వాక్యమునకు విధేయత చూపాలని మరియు పూర్ణ హృదయంతో ఆయనను వెదకాలని నిర్ణయించుకోండి. మీరు అలాగున చేసినప్పుడు, ఆయన మిమ్మును దేవుని యందు భయభక్తులు కలిగియుండునట్లుగా నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు మరియు తన పరిపూర్ణ ప్రణాళికలో మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మధురమైన రీతిలో మీరు అద్భుతంగా దీవించబడుదురు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా పరమ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొద్ద గుప్తములై ఉన్న సమస్త ఆశీర్వాదములను మాకు దయచేయుము. ప్రభువా, మేము ఎదుర్కొనే ప్రతి పోరాటంలో నీవే మా రక్షణకర్తవు. కనుకనే, దేవా, నీవు మాకు ముందుగా వెళ్లి మా మార్గమును భద్రముగా కాపాడుము. ప్రభువా, నీ యందు నమ్మిక యుంచునట్లుగా, ఎన్నటికిని కదలకుండా ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీవు మా ఆత్మను నిమ్మళపరచి, మా నిరీక్షణను నీ మీద ఉంచునట్లుగా చేయుము. ప్రభువా, మేము జయించడానికి నీ శక్తితో, అధికారంతో మమ్మును నింపుము. దేవా, మా యొక్క ప్రతి భయమును, శత్రువు యొక్క ప్రతి దుష్టకార్యములను మా నుండి తొలగించి, నీ మహిమ కొరకు మమ్మును విజయములోనికి నడిపించుము. ప్రభువా, మా హృదయమంతటితో నిన్ను వెదక గలిగే కృపను మాకు దయచేయుము. దేవా, మేము నీ సన్నిధిలో మా విన్నపములను కుమ్మరించుచున్నాము. దేవా, లేయా వలె మేము అన్ని సమయములలో నిన్ను స్తుతించుటకు కృపను మాకు అనుగ్రహించుము. దేవా, నీ యొక్క మార్గములను మాకు బోధించుము. ప్రభువా, మేము నీ ద్వారా అద్భుతముగాను మరియు మధురమైన నామము ద్వారా దీవించబడునట్లుగా కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.