నా ప్రియులారా, లేఖనముల ద్వారా నేటి వాగ్దానము ఆలకించుట మనకు ఎంతో సంతోషముగా ఉన్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సంఖ్యాకాండము 14:9వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకుడనిరి... '' అని చెప్పబడినట్లుగానే, ఇశ్రాయేలీయుల నివాసము ఉంటున్న ప్రాంతమునకు కాలేబు యెహోషువలు ఇట్టి వర్తమానమును తీసుకొని వచ్చియున్నారు. దేవుడు వారి కొరకు వాగ్దానము చేసినటువంటి ఇట్టి భూభాగమునకు వారు వెళ్లి చూచి, వచ్చియున్నారు. పాలు తేనెలు ప్రవహించుచున్నటువంటి కనాను భూభాగము అది. ఇశ్రాయేలీయులు వారి యొద్ద నుండి వెళ్లినటువంటి వారందరు కూడా ఏమని చెప్పియున్నారు అంటే, వారు గొప్ప మనుష్యులు, రాక్షసులు వంటి మనుష్యులు ఇక్కడ ఉన్నారు. ఇది సాధ్యము కాదు అని చెప్పారు. అటువంటి బలమైన కోట గోడలు గల నగరము అని చెప్పారు. మనము వారిని ఓడించలేము అని చెప్పారు. కాలేబు యెహోషువ చెప్పినటువంటి మాటలను మీరు గమనించండి, "ఈ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ మరియు వారి యొక్క భద్రత వారి మీద నుండి తొలగిపోయెను'' అని చెప్పారు. వారు ఆధారపడుచున్న భద్రత దేవుడు మాత్రమే. మనతో కూడ ఉన్నటువంటి దేవుడు వారిని మన హస్తాలకు అప్పగిస్తాడు అని చెప్పారు.
నా ప్రియులారా, అనేక ఫర్యాయములు మనము చేయవలసిన పనుల వైపు చూస్తూ, 'అయ్యో, ఇవి నాకు మించినవిగా ఉన్నవి, ఆలాగుననే, నాకు చాలినంత నైపుణ్యము లేదు గదా' అని అనుకుంటాము. ఇంకను, 'నాకు చాలినంత సామర్థ్యము లేదు. నాకు చాలినన్ని వనరులు లేరు. నాకు చాలినంత ప్రజలు లేరు, నాకు చాలినంత ధనము లేదు, ఇంకను నాకు చాలినంత అభిషేకము లేదు. కనుకనే, నేను దానిని జరిగించలేను' అని అంటుండవచ్చును. కానీ, కాలేబు మరియు యెహోషువ ఇలాగున చెబుతున్నారు, వీటన్నిటిని మీరు చూడకండి. కేవలము దేవుడు మీకు అనుగ్రహించిన వాగ్దానము చూడండి. ఆయనే మీకు దర్శనమును చూపించియున్నాడు. ఆయనే మిమ్మును ఈ కంపెనీకి తీసుకొని వచ్చియున్నాడు. ఆయనే మిమ్మును ఈ పాఠశాలకు మరియు కళశాలకు తీసుకొని వచ్చియున్నాడు. ఆయన మీకు సంపూర్ణమైన విజయమును అనుగ్రహిస్తాడు. ఆయన మిమ్మును పైకి లేవనెత్తి స్థిరపరుస్తాడు. తద్వారా, దేవుడు తన వాగ్దానమును నెరవేరుస్తాడు. తన యొక్క చిత్తమును నెరవేరుస్తాడు. మనము దీనిని బట్టి ఆనందించవలసిన వారముగా ఉన్నాము. ఇటువంటి ఉన్నత అనుభవమును మనము యేసు నామములో స్వీకరించవలెను.
ఒక పాష్టరుగారు నాకు ఏమని చెప్పారంటే, మా సేవా పరిచర్య కొరకు మేము స్థలము సంపాదించుకొనుటకు మేము ఎంతగానో పోరాడుచున్నాము. అందుకొరకు మేము ఉపవాస ప్రార్థనను ఏర్పాటు చేసుకున్నాము. ఒకరోజు నేను మేల్కొన్నప్పుడు, దేవుడు నాకు కృతజ్ఞతా ప్రార్థనను కలిగియుండమని చెప్పారు. కనుకనే, ప్రార్థనకు బదులుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పడము ప్రారంభించాము. మహా అద్భుతముగా దేవుడు మా కొరకు ద్వారమును తెరువజేశాడు. ఎందుకనగా, గొప్ప దర్శనమును ఇచ్చిన దేవునికి మేము వందనములు చెప్పియున్నాము. ఆయన మాకు విజయమును ఇస్తాడని మాకు తెలుసు.
నా ప్రియ స్నేహితులారా, మనము కూడ ఆలాగుననే ఈ రోజు చేద్దాము. దేవుడు మీకు ఒక దర్శనమును ఇచ్చినప్పుడు, మీకు అడ్డుగా ఉన్న ఆటంటముల మీద గానీ లేదా మీ పరిమితులపై దృష్టి పెట్టకండి. నేడు మీరు ఎదుర్కొంటున్న సవాళ్లన్నియు మీ సామర్థ్యములకంటే గొప్పవిగా అనిపించినప్పుడు, దేవుని వాగ్దానమును నమ్మండి; ఆయన మిమ్మును విజయ మార్గములోనికి నడిపిస్తాడని విశ్వసించండి. ప్రభువు మీతో ఉన్నాడని గుర్తుంచుకోండి. మీకు కావలసినవన్నీ ఆయన మీకు సమకూరుస్తాడు, తన అభిషేకంతో మిమ్మల్ని బలపరుస్తాడు మరియు మిమ్మును ముందుకు నడిపిస్తాడు. నా ప్రియులారా, మీకు ముందుగా ఉన్న మార్గము అసాధ్యంగా అనిపించినప్పటికి కూడా, ఆయన వాగ్దానమును నమ్ముతూ, విశ్వాసంతో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించినట్లుగానే, నేడు దేవుడు మిమ్మును కూడా నేటి వాగ్దానము నుండి దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు ఆతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మేము ఈ రోజు భయపడడము లేదు. ప్రభువా, మా భౌతిక నేత్రాలతో మేము చూచుట లేదు. కానీ, మా ఆధ్యాత్మిక నేత్రముల ద్వారా నీవు మా పట్ల కలిగియున్న సమస్తమును మేము చూచుచున్నాము. దేవా, నీవు మాకిచ్చిన వాగ్దాన వచనము, నీవు మాకు ఇచ్చిన ప్రవచనము మేము చూచునట్లుగా నీవు మమ్మును ఈ స్థలమునకు నడిపించియున్నావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, ఇక్కడ నీవు మమ్మును స్థిరపరచుము. ప్రభువా, మాకు మార్గమును సరాళము చేసి, మాకు విజయమును అనుగ్రహించుము. దేవా, సమస్తమైన కృపను మరియు సామర్థ్యమును నీవు మాకు అనుగ్రహించుము మరియు సమస్తమైన అభిషేకమును ఇచ్చి, అది ఇప్పుడే మమ్మును నింపునట్లుగా చేయుము. ప్రభువా, నీవు మాకు కావలసినవన్నీ ఆయన మనకు సమకూర్చుము. దేవా, నీ యొక్క అభిషేకముతో మమ్మును బలపరచి, ముందుకు నడిపిస్తాడు. ప్రభువా, మార్గము అసాధ్యంగా అనిపించినప్పుడు కూడా, ఆయన వాగ్దానమును నమ్ముతూ, విశ్వాసంతో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, నిశ్చయముగా, ఇశ్రాయేలీయులును ఆశీర్వదించినట్లుగానే నేడు నీవు మమ్మును ఆశీర్వదించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


