నా ప్రియమైన స్నేహితులారా, నేడు దేవుని నుండి మనకు అనుగ్రహింపబడిన వాగ్దానము బైబిల్ నుండి 2 సమూయేలు 22:31వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము'' అని చెప్పబడినట్లుగానే, దేవుని వాక్యము నిర్మలమైనది, తనను ఆశ్రయించు వారందరికీ ఆయన కేడెముగా ఉంటాడు. కనుకనే, నా ప్రియులారా, మనము దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు, అది ప్రత్యక్షంగా ఆయన యొద్ద నుండి పంపబడిన ఒక వాగ్దానమును పొందుకొనినట్లుగా మనకు ఉంటుంది. కనుకనే, మీరు ప్రభువు సన్నిధిలో నిలబడియున్నారనియు, ఆయన తన వాగ్దానములను మీతో మాట్లాడుచున్నాడని మీరు భావించండి. మీ జీవితములో ఆయన ఏమి చేయాలని తలంచియున్న వాటన్నిటిని ఆయన మీకు బయలుపరుస్తాడు. ఇది ఎంతటి గొప్ప ఘనత, ఎంతటి గొప్ప ధన్యత కదా! దేవుని వాక్యమును మనము పొందడం ఎంత శక్తివంతమైన అనుభవము కదా! అవును, నా ప్రియులారా, మనము బైబిల్‌ను చదువుచున్నప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. కాబట్టి, ప్రతిరోజు మనము లేఖనముల ద్వారా దేవుడు మనకు తెలియజేయు మాటలు ఎంతో విలువైనవి. కనుకనే, మనము ఆయన వాక్యమును ఘనపరచుదాము.

బైబిల్‌లో, యూదాలో రాజైన యెహోషాపాతు ఉండెను. మోయాబీయులు ను అమ్మోనీయులును మెయోనీయులలో కొందరును మరియు అన్యజనులును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండు సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యమొకటి నీ మీదికి వచ్చుచున్నదని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యూదా యంతట ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, యూదావారు యెహోవావలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణము లన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు వారిని ఐక్యపరచి, దేవునిని వెదకమని, తమను రక్షించమని ఆయనకు మొఱ్ఱపెట్టుమని చెప్పాడు. అప్పుడు దేవుడు ఒక ప్రవక్త ద్వారా తన వాక్యమును పంపి, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడీలాగు ప్రకటించెను, " యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; "యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యా యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి; మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగుకొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చినిలువబడుడి; మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతో కూడ ఉండునని తెలియజేసెను.'' వారు ఆ ప్రవక్త ద్వారా దేవుని మాటలు వినగానే, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను; యూదా వారును యెరూషలేము కాపురస్థులును యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి.

నా ప్రియ స్నేహితులారా, దేవుడు తన నోట నుండి మాటను పలికినప్పుడు అది నిశ్చయముగా నెరవేరుతుంది. కాబట్టి, ఆయన వాక్యమును అంగీకరించి, ఆయన వాక్యమునందు విశ్వాసమును కలిగియుండండి. యూదా ప్రజలు దేవుని మాట యందు నమ్మకముంచి, ఆయనను స్తుతించారు. కాబట్టి, యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు. వారు యుద్ధము చేయడానికి ముందే, ప్రభువు వారికి సంపూర్ణ విజయమును అనుగ్రహించియున్నాడు. నా ప్రియులారా, దేవుని మాట ఎంత గొప్ప అద్భుతమైనది కదా! ఆయన వాక్యము నిర్మలమైనది. కనుకనే, దేవుని వాక్యము ఎంతో శక్తివంతమైనది, అది మీ జీవితంలో నిశ్చయముగా నెరవేరుతుంది. కనుకనే, నా ప్రియులారా, మీరు బైబిల్‌ను చదువుచున్నప్పుడు, ఆ వాక్యుమునందు నమ్మకముంచి, ఆయనకు ఆరాధించి, స్తుతించండి. ఎందుకంటే, ఆయన వాక్యము తప్పకుండా మీ జీవితములో నెరవేరుతుంది. ఆయనను ఆశ్రయించి, ఆయన వాక్యమును నమ్ము వారందరిని ఆయన కాపాడతాడు. దేవుని వాక్యము మన ద్వారా మన దేశ నాయకులకు చేరునట్లుగాను, తద్వారా వారు దేవుని నుండి నడిపింపును పొంది ఆయన మాట వినునట్లుగా మనము ప్రార్థించండి. తద్వారా, దేశ ప్రజలు దేవుని ఆశ్రయమును అనుభవించునట్లుగా చేయవలెను. దేశ నాయకులకు కూడా దేవుని వాక్యము ఎంతో అవసరము. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా క్రమము తప్పకుండా దేవుని వాక్యమును చదవండి, ఆ మాటల యందు విశ్వాసముంచి, ఆయనను వెంబడిస్తూ, ఆయనను స్తుతించినట్లయితే, నిశ్చయముగా, మీ పోరాటములు ఏవైనను సరే, మీ పక్షమున ఆయన పోరాడి, యుద్ధము చేసి, మీకు విజయమును చేకూరుస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మేము నీ శక్తివంతమైన వాక్యమును అంగీకరించి, ఆ ప్రకారము ప్రతిరోజు బైబిల్‌ను చదువడము ద్వారా నీ స్వరమును విని, నీ నడిపింపును పొందుకొనునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మేము నీ వాక్యమును అంగీకరించినప్పుడు, మీరు జీవమును మరియు అద్భుతములను పొందునట్లుగా చేయుము. ప్రభువా, నీ వాక్యమును విశ్వసించి, దానిని గట్టిగా పట్టుకొని, దానిని గొప్పధననిధిగా తలంచి, నీ శక్తివంతమైన విడుదలను అనుభవించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీ వాక్యము విని, నీ ఆశ్రయములోనికి వచ్చి, నీవు మాకు కేడెముగా ఉండి మమ్మును కాపాడే ఈ కృపను మాకు ఈ రోజు నుండి అనుగ్రహించుము. ప్రభువా, నీ వాక్యము ద్వారా మా దేశ నాయకులకు నడిపించునట్లుగాను, వారు జ్ఞానవంతమైన మరియు న్యాయమైన నిర్ణయములు తీసుకునట్లుగా వారికి సహాయము చేయుము. దేవా, మా దేశ ప్రజలను ఆశీర్వదించుము, వారి జీవితాలలో సమాధానము తీసుకొనినట్లుగా మరియు చీకటిని తొలగించునట్లుగాను నీ వాక్యమును మాకును మరియు వారికి పంపించుము. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదము మా దేశము మీద నిలిచియుండునట్లుగాను, మా పక్షమున నీవే యుద్ధము చేసి, మాకు ఈ లోక శ్రమలన్నిటి నుండి విజయమును దయచేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.