నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి మనం ఎఫెసీయులకు 1:11వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములు, " క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని, దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు'' ప్రకారము ఇది ఎంతటి మహిమాన్వితమైన సత్యం కదా! దేవుని బిడ్డలకు ఈ ఆశీర్వాదం కలుగుతుంది. ఆలాగుననే, మనం కూడా యేసు ప్రభువు యందు విశ్వసించినప్పుడు, ఆయన మనలను తన బిడ్డలనుగా చేస్తాడు మరియు తనకు స్వాస్థ్యముగా చేయుచున్నాడు. ఇకపై మనం ఒంటరివారము లేదా అనాథలం కాదు. కానీ, మనము రాజాధిరాజైన దేవుని కుటుంబమునకు చెందినవారము. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:17వ వచనములో చూచినట్లయితే, "మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము'' అని చెప్పబడినట్లుగానే ఇది ఎంత గొప్ప అద్భుతం! ఈ భూమి మీద స్వాస్థ్యము, కుటుంబాల ద్వారా సంపద, భూములు లేదా ఆస్తులుగా పొందుకుంటాము. అయితే, ఈ లోకములో ఆస్తి వారసులకు మాత్రమే ఇవ్వబడుతుంది. కానీ, దేవుని రాజ్యంలో, మన స్వాస్థ్యము ఈ లోకానికి సంబంధించినది కాదు. అందుకే బైబిల్ నుండి యోహాను 14:3వ వచనములో యేసు ఇలాగున తెలియజేసియున్నాడు, " నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును'' ప్రకారము ప్రియ స్నేహితులారా, దీనికి అర్థం క్రీస్తు మన స్వాస్థ్యముగా ఉన్నాడు. కనుకనే, మనము యేసుక్రీస్తును కలిగి ఉండటం ఈ లోకములో సర్వసంపదలను కలిగి ఉండడం కంటే అతి గొప్ప ఆశీర్వాదము స్నేహితులారా.

నా ప్రియులారా, దేవుడు మనలో ఉండడమే ఒక గొప్ప ఆశీర్వాదం. మనము ఈ ప్రపంచములో ఉన్నటువంటి ఆస్తులను స్వాస్థ్యముగా పొందుకోవచ్చును లేక పొందుకొనలేకపోవచ్చును. కానీ,ఈ లోక సంపదలు మరుగైపోతాయి. అయితే, యేసుక్రీస్తు మన స్వాస్థమైయున్నాడు. కాబట్టి, మనము ఎల్లప్పుడు ప్రభువునందు నిత్యము ఉత్సహించాలి. అందుకే అపొస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీయులకు 1:14వ వచనములో ఈ విధంగా అంటున్నాడు, "దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు'' మరియు ఎఫెసీయులకు 1:13వ వచనంలో ఆయన ఈలాగున చెప్పబడియున్నది, " మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి'' అని తెలియజేయబడినట్లుగానే, మనము దేవుని చేత సంపాదించు కొనబడినవారముగా కాపాడబడినవారమై ఉన్నాము. పరిశుద్ధాత్మను మన యందు కలిగియుండడము మరియు దేవుని ఆత్మ మనలో నివసించడం ఎంత గొప్ప భాగ్యము కదా! అందుకే, బైబిల్ నుండి యోహాను 17:11 వ వచనములో యేసుప్రభువు ఈలాగున ప్రార్థించియున్నాడు, " నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము'' అని చెప్పబడినట్లుగానే, మన హృదయాలలో యేసును కలిగి యున్నప్పుడు, మనం కాపాడబడతాము. సర్వశక్తుడైన దేవుని బలమైన హస్తములలో మనము భద్రతను మరియు రక్షణను కలిగియుంటాము. నిశ్చయముగా, మన స్వాస్థ్యము కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడబడుచున్నది. కాబట్టి, ఎవ్వరు కూడా దానిని మన యొద్ద నుండి దొంగిలించలేరు, ఏ శక్తి మరియు అధికారము కూడా దానిని నాశనం చేయలేదు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 16:5-6 వ వచనములలో దావీదు భక్తుడు ఈ విధంగా చక్కగా తెలియజేసియున్నాడు, "యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను'' అని చెప్పబడినట్లుగానే, యేసు ప్రభువు మన యొక్క శ్రేష్టమైన స్వాస్థ్య భాగమై యున్నాడు. అవును ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువు ఆ గొప్ప అద్భుతమైన ఒక స్వాస్థ్యము. మన యందు యేసుక్రీస్తును కలిగి ఉన్నప్పుడు మనకు జీవితములో సమస్తమును దొరుకుతాయి. ఇంకను మనకు సమాధానము, సదుపాయం మరియు నిత్యజీవం వంటి మనకు అత్యవసరములన్నియు మనము ఆయనలో కలిగియుంటాము. కనుకనే, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, ఆయన ఎక్కడ ఉంటాడో మనము కూడా అక్కడనే ఉంటాము. కనుకనే, యేసు ఏమి కలిగియున్నాడో మనము కూడా వాటిని కలిగియుంటాము. 'నేను కలిగియున్నదంతయు మీవే' అని యేసయ్యా అంటున్నాడు. అందుకే బైబిల్ నుండి ఆయన యోహాను 17:10వ వచనములో ఇలాగున సెలవిచ్చుచున్నాడు, "నావన్నియు నీవి, నీవియు నావి; వారి యందు నేను మహిమపరచబడియున్నాను'' అని అంటున్నాడు. నా ప్రియులారా, మనం ఆయనలో ఎంత ఐశ్వర్యవంతులమో కదా! ఈ ప్రపంచములో ఇంతకంటె మనకు ఎక్కువగా ఏమి అవసరము. కాబట్టి, ప్రతిరోజు యేసు ప్రభువు మనము కలిగియుండాలని ఆయన కొరకు మొఱ్ఱపెట్టండి. మనం తరచుగా, 'ప్రభువా, నీవు ఇంకా అధికముగా మాకు కావాలి' అని పాట పాడతాము కదా. నా ప్రియ స్నేహితులారా, ప్రతిరోజు మనము చేయవలసిన ప్రార్థన అదియే అయ్యున్నది. నేటి నుండి అది మన అనుదిన ప్రార్థనగా మారాలి. ఈ స్వాస్థ్యము నిమిత్తము మనము ఆయనకు మొఱ్ఱపెడదాము. వస్తువుల కోసం కాదు, క్రీస్తు కోసమే. మనము యేసు ప్రభువు ఎంత అధికముగా కలిగియుంటామో, ఆయన ఆశీర్వాదాలను అంత అధికముగా ఆనందిస్తాము. ఈ దైవీకమైన గొప్ప స్వాస్థ్యాన్ని, మనలో క్రీస్తు సంపూర్ణతను, మహిమ నిరీక్షణను పొందాలని మనం ఆయనకు మొఱ్ఱపెడదాము. యేసుక్రీస్తునందలి ఈ నిత్యమైన స్వాస్థ్యభాగమును పొందుకొని, దేవుని యొద్ద నుండి దీవించబడుదుము. కాబట్టి, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము వర్ణింపనశక్యమైనటువంటి గొప్ప బహుమానము స్వాస్థ్యము నీవేనయ్యా. దేవా, నీవు వర్ణింపనాశక్యము బహుమానమును మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. ప్రభువా, మాలో ప్రతి ఒక్కరిలోను నీవు అధికము కమ్ము. యేసయ్యా, నీవు మాలో ఉదయించి, మేము నీ యొక్క మహిమాన్వితమైన స్వాస్థ్యమును పొందుకొనుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, ప్రతిరోజు మా జీవితములో నీ యొక్క ఆశీర్వాదములు హెచ్చు అగుట మేము చూచునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, క్రీస్తు మా యందు హెచ్చింపబడునట్లుగాను, ఇంకను అధికమగునట్లుగా చేయుము. యేసయ్యా, మేము నిత్యము నీ స్వాస్థ్యము అని నీ ఆత్మను సంచకరువును మాకిచ్చి, ఎల్లప్పుడూ మాకు గుర్తు చేయుటకై మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. దేవా, నీ యందు కలిగియున్న ఆశీర్వాదాములన్నిటిని మేము కలిగియుండునట్లుగా మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. దేవా, మమ్మును మరియు మా కుటుంబాన్ని నీ బలమైన హస్తము క్రింద భద్రంగా కాపాడుము. యేసయ్యా, నీ యందు గుప్తములై ఉన్న సర్వసంపదలు, మా జీవితంలో నీ యొక్క జ్ఞానం, కృప మరియు దయను పొంగిపొర్లునట్లుగా చేయుము. దేవా, నీవు ఇవ్వబడిన వాగ్దానములో నీకు స్వాస్థ్యముగా జీవించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మాలో క్రీస్తు వృద్ధి పొందునట్లుగాను మమ్మును మేము నీ యందు తగ్గించుకొనునట్లుగా నీ కృపను మాకు దయచేసి, నీ యొక్క ఆశీర్వాదాలు మరియు అద్భుతాలు మా మీద ప్రతిరోజు పొంగిపొర్లునట్లుగా సహాయము చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.