నాకు అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మీకా 4:2వ వచనము నేడు దేవుడు తన వాగ్దానమును మన కొరకు దయచేయుచున్నాడు. ఆ వచనము, "ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు'' ప్రకారము ఆయన తన మార్గములను మనకు బోధించుచున్నాడు. అవును, దేవుని యొక్క మార్గములు ఉన్నతమైనవి. ఆయన మార్గములు అగమ్యములు, అగోచరములు. కానీ, ఆయన బిడ్డలుగా తమ్ముతాము ఆయనకు సమర్పించుకున్నట్లయితే, ఆయన పిల్లలకు తన మార్గములను తేటగా బయలుపరుస్తాడు. మన పట్ల ప్రభువు మార్గములు ఎంతో ఉన్నతమైనవిగా ఉంటున్నవి. అందుకే బైబిల్ నుండి యెషయా 58:14వ వచనములో చూచినట్లయితే, "నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే'' అని చెప్పబడిన ప్రకారము ఆయన మనలను ఉన్నత మార్గములలో నడుచునట్లుగా చేయుచున్నాడు. ఇంకను యెషయా 52:7వ వచనములో చూచినట్లయితే, "సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై యున్నవి'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మనలను పర్వతముల మీద నిలువబెట్టి, సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, అద్భుతాల ద్వారా దేవుడు ఏలుచున్నాడని నిరూపించే మన పాదాలను సుందరమైనవిగా చేయుచున్నాడు. అన్నింటికన్నా మరి ప్రాముఖ్యంగా, బైబిల్ నుండి యోహాను 14:6వ వచనములో చూచినట్లయితే, యేసు ఇలాగున అంటున్నాడు, "యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు'' అని చెప్పబడిన ప్రకారము ఆయనే మనకు మార్గం. కనుకనే, ప్రతి ఒక్కరూ ఆయన ద్వారానే దేవుని వద్దకు వచ్చెదరు.
నా ప్రియులారా, ప్రభువైన యేసు శరీరధారియైన దేవుడుగా ఉన్నాడు మరియు సిలువపై తాను చేసిన త్యాగం ద్వారా, మనమందరం పాపం నుండి విడుదల పొందడం కొరకు, ఆయన తన శరీరాన్ని బలిగా అర్పించడం ద్వారా, మనకు ఒక మార్గాన్ని చూపించాడు. కనుకనే, మనం దేవుని పిల్లలుగా మారడానికి మన కొరకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరచియున్నాడు. అవును, నా స్నేహితులారా, యేసు మీ కొరకు ఆయన ఏకైక మార్గముగా ఉన్నాడు. కనుకనే, ఈరోజు ఆయన మీ కొరకు అటువంటి మార్గమును తెరచుచున్నాడు. కాబట్టి, నా ప్రియులారా, నేడు మీరు యేసును మీ హృదయంలోకి అంగీకరించినప్పుడు, ఆయన మీ జీవితానికి ఒక మార్గాన్ని తెరచుచున్నాడు. తద్వారా, ఆయన మీరు నడువవలసిన మార్గమును మీకు బోధించుచున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఒకవేళ, మీకు సమస్యలు రావచ్చును, శోధనలు రావచ్చును, శ్రమలు రావచ్చును, కానీ వాటన్నింటిని జయించుట కొరకు యేసుక్రీస్తు మనకు ఒక మార్గమును కనుపరచియున్నాడు. ఇంకను మనము దేవుని బిడ్డలనుగా జీవించడానికి మార్గమును ఆయన మీకు చూపించుచున్నాడు.
నా ప్రియులారా, యేసుక్రీస్తు, మనకు మార్గము అని ఎలా మనము గ్రహించగలము? మొదటిగా, అది దేవుని యొక్క ఆత్మయై ఉన్నాడని మనము పరిశుద్ధాత్మ ద్వారా మొదటగా గ్రహించగలుగుచున్నాము. అందుకే బైబిల్ నుండి యోహాను 14:26వ వచనములో చూచినట్లయితే, " ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును'' అని చెప్పబడిన ప్రకారము యేసు యొక్క మార్గం తెలుసుకోవడానికి మరియు ఎల్లప్పుడూ ఆయనతో నడవడానికి మీరు కూడా యేసు ఆత్మ కలిగియుండాలి. అందుకే బైబిల్ నుండి 1 యోహాను 2:27వ వచనములో చూచినట్లయితే, ఆ అభిషేకము మీకు అన్ని విషయాలు బోధించుచున్నది. "అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు'' అని చెప్పబడియున్నది. రెండవదిగా, దేవుని వాక్యం ద్వారా ఆయన మార్గమును మనకు బోధించుచున్నాడు. కనుకనే, బైబిల్ నుండి కీర్తనలు 32:8వ వచనమును మనము చూచినట్లయితే, " నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను'' అని చెప్పబడినట్లుగానే, మనము నడవవలసిన మార్గమును ఆయన మనకు బోధిస్తాడు. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 119:105వ వచనములో చూచినట్లయితే, " నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది'' అని చెప్పబడినట్లుగానే, ఆయన వాక్యము మనకు దీపముగాను, వెలుగుగాను ఉంటున్నది. మూడవదిగా, దేవుడు ప్రవచనం ద్వారా నడిపిస్తాడు. ఆలాగుననే, అపొస్తలుల కార్యములు 2:17వ వచనములో చూచినట్లయితే," అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు'' అని చెప్పబడినట్లుగానే, నేడు మీరు దర్శనములు చూచెదరు మరియు కలలు కనెదరు. మరియు మీరు శోధనకు గురైనప్పుడు, బైబిల్ నుండి 1 కొరింథీయులకు 10:13వ వచనములో వ్రాయబడినట్లుగానే, "సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును '' ప్రకారము ఆయన మీ శోధనతో పాటు మీకు తప్పించుకొను మార్గాన్ని కూడా చూపిస్తాడు. యేసే ఆ మార్గం. కనుకనే, నా ప్రియులారా, మీరు నడవవలసిన మార్గాన్ని ఆయన మీకు చూపిస్తాడు. కాబట్టి, ప్రభువుకు మిమ్మును మీరు సమర్పించుకోండి, పరిశుద్ధాత్మ కొరకు మొరపెట్టండి, దేవుని వాక్యాన్ని చదవండి మరియు ప్రవచన వరాన్ని కోరండి. మీరు ప్రభువు మార్గంలో నడవాలని ఎంచుకున్నప్పుడు మీకు రక్షణ మరియు భద్రత లభిస్తుంది. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సమస్త ఆదరణకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువైన యేసయ్య, నీవే మా జీవితానికి ఒక మార్గం. కాబట్టి, ప్రభువా, నీ మార్గములను మాకు బోధించి, మా అడుగులను ముందుకు నడిపించుము. దేవా, దయచేసి నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపి, మేము నడువవలసిన మార్గమును మాకు బోధించునట్లుగా చేయుము. దేవా, నీ వాక్యం మా పాదములకు దీపముగాను మరియు మా త్రోవకు వెలుగుగా ఉండునట్లుగా చేయుము. ప్రభువైన యేసయ్యా, మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి శోధనను జయించే మార్గమును నేడు నీవు మాకు చూపించి, ఆ శోధనల నుండి మేము తప్పించుకొను మార్గమును తెరవజేయుము. దేవా, ప్రతిరోజు మా యెదుట సరైన మార్గమును నూతనంగా తెరచి, మమ్మును నీ యొక్క నూతన ఆశీర్వాదములతో నింపుము. పరిశుద్ధాత్మ దేవా, మేము నీ ద్వారా దర్శనములను మరియు కలలు కనునట్లుగా, మమ్మును నీ శక్తితో నింపుము. ప్రభువా, దయచేసి మేము ఎల్లప్పుడూ నీ బిడ్డలుగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయుము. యేసయ్య, మేము నేటి నుండి నీ మార్గములో నడుచుటకు ఎంపిక చేసియున్నాము, కనుకనే, మాకు ముందుగా నీవు నడుచుచూ, మా మార్గమును సరాళము చేయుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


