నా ప్రియమైన స్నేహితులారా, ఈ నూతన మాసములో అడుగు పెట్టిన మీకు నా శుభములు తెలియజేయుచున్నాను. కనుకనే, ఈ నూతన మాసములో నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 30:18వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు'' అని చెప్పబడిన ప్రకారము మీరు మీ యొక్క ఫలములను అనుభవించెదరు. అందువలన మీరు భయపడకండి. నేడు మీ జీవితంలోను, మీ కుటుంబంలోను, సమాజంలోను దేవుడు మీకు న్యాయం జరిగించుచున్నాడు. ఆయనను ప్రేమించి ఆయన చిత్తప్రకారం నడుచుకొను, తన భక్తులకు ప్రభువు న్యాయం జరిగించును. అందుకే బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 37:28వ వచనములో చూచినట్లయితే, " ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు న్యాయమును ప్రేమించు దేవుడైయున్నాడు. అందుకే బైబిల్ నుండి యిర్మీయా 17:7-8వ వచనములలో మనము చూచినట్లయితే, "దేవుడు తన పరిశుద్ధుల ను ఎలా కాపాడుచున్నాడని వివరించబడియున్నది, "యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని నమ్ముకొనినట్లయితే, మీరు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా మిమ్మును నడిపిస్తాడు. కనుకనే, ప్రపంచ సంక్షోభం, ఆర్థిక ఇబ్బందులు లేదా ఆపత్కాలములలో కూడా, దేవుడు తన భక్తులు కదిలించబడకుండా ఎంతో భద్రముగా కాపాడుకున్నాడు. కనుకనే, వారు భయపడలేదు.
నా ప్రియులారా, మీరు పరిశుద్ధాత్మ ద్వారా యేసును మీలో మోసుకెళ్తూ, ఆయన స్వరాన్ని వింటూ, ఆయన చిత్తాన్ని చేయుచున్న దేవుని పరిశుద్ధులవలె ఉన్నారా? అలా అయితే, దేవుడు మిమ్మల్ని ఆపత్కాలములో కాపాడుతాడు మరియు గొప్ప కరువులలో కూడా మిమ్మల్ని వర్థిల్లింపజేస్తాడు. భక్తుడైన యోనాను చూసినప్పుడు, అతని అవిధేయతలో కూడా, దేవుడు అతనికి నీతిన్యాయమును జరిగించాడు. యోనా దేవుని పిలుపు నుండి పారిపోయినప్పుడు, తుఫాను చెలరేగింది. తద్వారా, అతను సముద్రంలో పడవేయబడ్డాడు. అయినప్పటికిని దేవుడు అతనిని రక్షించడానికి ఒక చేపను పంపాడు మరియు దేవుడు అతనిని కోరుకున్న స్థలమైన నీనెవెకు తీసుకొని వెళ్లాడు. అప్పుడు భక్తుడైన యోనా పశ్చాత్తాపపడి, దేవునికి విధేయుడయ్యాడు మరియు పశ్చాత్తాపమును గురించి నీనెవె ప్రజలకు బోధించాడు. ప్రజలు తమ పాపముల నుండి వారి మనస్సులను త్రిప్పుకున్నారు మరియు దేవుడు ఆ ప్రజల పట్ల కనికరమును చూపించి ఆ పట్టణమును విడిచిపెట్టాడు. ఇది మనకు బోధించునది ఏమనగా, వ్యక్తిగత గౌరవానికి ముందు దేవుని ఆజ్ఞకు విధేయతను కలిగి ఉండాలి. మనం మన పేరు కొరకుగానీ సేవ చేయకూడదు, కానీ దేవుని చిత్తము నెరవేరడానికి సేవ చేయాలి.
నా ప్రియులారా, దేవుడు మీ నీతిని ప్రజల యెదుట ప్రత్యక్షపరచడం ద్వారా కూడా న్యాయం జరిగిస్తాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 58:8వ వచనములో చూచినట్లయితే, " నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును '' అని చెప్పబడిన ప్రకారము మీ నీతి మీకు ముందుగా నడుస్తుంది. ఆలాగుననే, 1985 సంవత్సరములో, మా కుటుంబం తీవ్రమైన శ్రమలను ఎదుర్కొనెను. దేవుడు మా నాన్నగారిని విశ్వవిద్యాలయం నిర్మించమని అడిగినప్పుడు, ఆయన మూత్రపిండాలు పాడైపోయినవి. కొందరు ఆయనను బాహాటముగా అపహసించి, హేళ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికే, మా చెల్లెలు ఒక విషాదకరమైన ప్రమాదంలో మరణించింది. తద్వారా, మా హృదయాలు ముక్కలయ్యాయి. అయినప్పటికిని, జూలై 1986వ సంవత్సరములో, మేము దేవుని యెదుట సాగిలపడి, 'మా చిత్తం కాదు, ప్రభువా, నీ చిత్తం మా పట్ల నెరవేరును గాక' అని తెలియజేశాము. మా హృదయాలు ముక్కలై పోయినప్పటికిని, మేము విధేయతను చూపుటకు ఎంపిక చేసుకున్నాము. తద్వారా, పరిశుద్ధాత్మ మమ్మల్ని బలపరచింది, గాయపడిన మా హృదయాలను స్వస్థపరచింది మరియు మేము తిరిగి పైకి లేవడానికి వీలు కల్పించింది. ఆయన శక్తి ద్వారా, కారుణ్య విశ్వవిద్యాలయం స్థాపించబడినది మరియు నేడు దేవుని న్యాయం మరియు విశ్వాసానికి సాక్ష్యంగా నిలిచియున్నది. యేసు స్వయంగా దేవునికి పరిపూర్ణముగా సమర్పించుకొనుటకు విధేయుడయ్యాడు. దేవుని నీతిని నెరవేర్చడానికి ఆయన సిలువకు వెళ్ళాడు. ఆయన అందరి కొరకు మరణించాడు, కానీ మూడవ రోజున దేవుని న్యాయం గెలిచింది. పరిశుద్ధాత్మ ఆయనను మృతులలో నుండి లేపాడు. నేడు, యేసు రాజులకు రాజుగా ఏలుచున్నాడు. అదేవిధంగా, దేవుడు మీ విధేయతను గౌరవిస్తాడు మరియు తన మహిమ కొరకు మిమ్మల్ని స్థిరపరుస్తాడు.
నా ప్రియులారా, దేవుడు తన చిత్తాన్ని ఉపవాసం ఉండి, ప్రార్థించి, నిరంతరం తనను ఆరాధించే వారికి బయలుపరచడం ద్వారా న్యాయం జరిగిస్తాడు. అందుకే బైబిల్ లూకా 2:37-38వ వచనములలో చూచినట్లయితే,"యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను. ఆమె కూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను'' అని చెప్పబడినట్లుగానే, రాత్రింబగళ్లు దేవునిని ఆరాధించున్న దానిని గురించి మాట్లాడుచున్నది. ఆమె భక్తి కారణంగా, దేవుడు తన ప్రణాళికను ఆమెకు బయలుపరచాడు మరియు ఆమె మెస్సీయను గురించి ప్రవచించింది. అందుకే సామెతలు 21:3 ప్రకారం, బలులకంటే నీతిన్యాయం జరిగించడం దేవునికి అంగీకారయోగ్యమైన బలిగా ఉంటుందని చెప్పబడియున్నది. అందుకే బైబిల్ నుండి యెషయా 1:17వ వచనములో మనము ఎవరికి న్యాయం జరిగించాలని చూచినట్లయితే, " కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి అని ఆజ్ఞాపించుచున్నది.'' అణచివేయబడినవారి కేకలు ప్రభువు చెవులకు చేరుతాయని యాకోబు 5వ అధ్యాయములో హెచ్చరించుచున్నది. ఆలాగుననే, 1 యోహాను 4:20 మనకు గుర్తు చేయుచున్నది: "ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు '' అని చెప్పబడిన ప్రకారము మనం మానవులను ద్వేషిస్తూ ఉండగా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పలేము. ఒక వ్యక్తి ఒక దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు, అతను నన్ను మార్గదర్శకత్వం అడిగారు. అందుకు నేను, 'మీరు పక్షపాతంతో పరిపాలించలేరు. మీరు ప్రతి వ్యక్తిని మీ స్వంత బిడ్డగా ప్రేమించినట్లయితే, దేవుడే మీ కుర్చీని దక్కిస్తాడు. ఆయన మీ ద్వారా దేశమును ఏలుచున్నాడు, మరియు మీరు చేయుచున్న ప్రతి పని విజయవంతమవుతుంది' అని చెప్పాను. ఈ సూత్రం మనలో ప్రతి ఒక్కరికిని వర్తించును. నా ప్రియులారా, మన కుటుంబాలు, కార్యాలయాలు, సంఘములు మరియు సమాజంలో, మనం పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి మరియు వారి పట్ల శ్రద్ధ వహించాలి. ఇంకను మనము నీతిగా జీవించాలి, అందరికి న్యాయమును జరిగించాలి. అందరిని ప్రేమించాలి. అప్పుడు దేవుడు మీకు న్యాయం జరిగిస్తాడు. అప్పుడు మీరు దృఢంగా స్థిరపడతారు, ఫలవంతంగా ఉంటారు, తన భక్తుల వలె కదలకుండా స్థిరంగా ఉంటారు మరియు ఆశీర్వదించబడతారు. దేవుని న్యాయం మీ జీవితంలో విస్తరించును. నేటి వాగ్దానము నుండి దేవుడు ఈ మాసమంతయు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు న్యాయవంతుడవు మరియు నీతిమంతుడైన న్యాయాధిపతివై యున్నావు. కనుకనే, మా జీవితాన్ని, మా కుటుంబాన్ని మరియు మా భవిష్యత్తును నీ చేతులలో సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, దయచేసి మేము నీతిమంతులముగా జీవించడానికి మరియు అన్ని విషయాలలో నీ చిత్తాన్ని జరిగించడానికి మాకు సహాయం చేయుము. దేవా, ప్రతి సమయములోను జలము యొద్ద నాటబడిన చెట్టువలె మమ్మును కాపాడుము. ప్రభువా, ఆపత్కాలములో మమ్మును బలపరచుము మరియు మా నీతిని వెలుగుగాను, మాకు ముందుగా వెళ్ళునట్లుగా చేయుము. దేవా, పక్షపాతం లేకుండా మేము అందరినీ ప్రేమించునట్లుగా మాకు నేర్పుము. ప్రభువా, మేము నిన్ను ఆరాధించేటప్పుడు కూడా నీ చిత్తాన్ని మాకు బయలుపరచుము. దేవా, నీవు మాకు నీతి న్యాయం జరిగిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము నిన్ను ఆశ్రయించుటకును మరియు మేము జలముల యొద్ద నాటబడిన చెట్టువలె నుండునట్లుగాను, అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడకుండను, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానకుండా ఉండునట్లుగా మమ్మును మార్చుమని యేసు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


