నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 2:8వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును'' అని చెప్పబడినట్లుగానే, మనము న్యాయము తప్పిపోకుండా, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, మనము చేయవలసినదంతయు యథార్థతతో నడుచుకొనవలెను. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 121:3వ వచనములో చూచినట్లయితే, అప్పుడు, " ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు'' అని చెప్పబడినట్లుగానే, మన పాదములను ఆయన తొట్రిల్లనియ్యకుండా మనలను కాపాడుతాడు.
ఆలాగుననే, బైబిల్ నుండి కీర్తనలు 121:5వ వచనములో చూచినట్లయితే, "యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును'' అని చెప్పబడినట్లుగానే మిమ్మును కాపాడువాడు ప్రభువే. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, "యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు'' అని చెప్పబడినట్లుగానే అవును, నీతిమంతుని యొక్క అడుగుజాడలు యెహోవాచేత నిర్దేషించబడియున్నవి. అతడు ఒకవేళ, తొట్రిల్లినను కూడా క్రింద పడిపోనేపడిపోడు. ప్రభువు తన చేతితో అతనిని పట్టుకుంటాడు. ఆయన మన మార్గములన్నిటిలో మనలను కాపాడుటకై ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. దేవదూతలు తమ చేతులతో మనలను ఎత్తిపట్టుకుంటారు. మన పాదములకు రాయి తగులకుండా దేవదూతలు మనలను కాపాడుతూ ఉంటారు. ఈ విధములన్నిటిలో ప్రభువు మనలను కాపాడుచున్నాడు అని తెలుసుకొనుట ఎంత అద్భుతము అని చెప్పుటలో ఇది గొప్ప విషయము కదా! అవును, నా ప్రియులారా, మనలను కాపాడు దేవుడు ఎన్నడు కునుకడు మరియు నిద్రపోడు. ఒక దినమునకు 24 గంటల సమయము ఆయన మనలను కాపాడుతూ ఉంటాడు.
ఈ మధ్యన నన్ను ఎంతగానో ఆశ్చర్యమునకు గురిచేసినటువంటి ఒక వీడియోను నేను వీక్షించడము జరిగినది. 87 సంవత్సరములుగల ఒక తండ్రి మరియు ఒక పాష్టరుగారు ఒక హుండాయ్ తెల్లని కారును నడిపించుచుండెను. అతని పేరు పాదర్ జాన్ బాక్ అయ్యియున్నది. అతడు ఆదివారము ఆరాధన నడిపించుటకు వెళ్లుచుండెను. ఆ రోజు ఆరాధనను ఆయనే నడిపించాలి. మార్గమధ్యములో ఈయన కారు నడిపించుచుండగా, ఒక ఎస్‌యువి ఈయన కారునకు పై నుండి వెళ్లడము జరిగినది. అస్సలు ఇవన్నియు కూడా ఆయన గమనించకుండా కారు నడుపుచుండెను. మందిరమునకు వెళ్లాలి అను ఒక దృక్పథముతో ఈయన తన కారును నడుపుకుంటూ వెళ్లుచుండెను. ఆ సమయములో ఎస్‌యువి కారును నడిపించుకొని వెళ్లుచున్న డ్రైవరకి మూర్ఛ వ్యాధి రావడము జరిగినది. తద్వారా, అతడు వాహనమును సరిగ్గా నడిపించలేకపోయాడు. అందును బట్టి, అది వెళ్లి, ఒక పోల్‌కు గ్రుద్దుకుని, ఈ కారు పై నుండి వెళ్లడము జరిగినది. అయితే, అతడు క్షేమముగా మందిరమునకు వెళ్లాడు. ఆరాధన అనంతరము ఒక పోలీస్ ఆఫీసర్, పాదర్ జాన్‌గారి యొద్దకు వెళ్లి, ఆయనకు ఆ సర్‌వేలియన్ వీడియోను చూపించాడు. పాదర్ జాన్‌గారు ఆ వీడియోను చూచి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. నేను ఎంత గొప్ప దేవునిని, మంచి దేవుని కలిగియున్నాను అని అన్నారు. ప్రభువు నిజంగా నన్ను కాపాడియున్నాడు, ఇంకను ప్రభువు నిజముగా, తన హస్తములతో నన్ను మోయుచున్నాడు అని చెప్పాడు.
అవును, నా ప్రియులారా, ప్రభువు మిమ్మును ఎంత భద్రముగా కాపాడుతాడు కదా! ఆయన నిజముగా మీ మార్గములన్నిటిని కాపాడుతాడు. ఆయన మిమ్మును భద్రపరుస్తాడు. స్నేహితులారా, అదేవిధముగా ప్రభువు మిమ్మును కూడా కాపాడుతాడు. ఏ హాని కూడా మీ యొద్దకు ఎంతమాత్రము ఎన్నడును రానేరదు. ఆయన తన దూతలచేత మిమ్మును కాపాడును గాక. ప్రభువు మిమ్మును భద్రపరచి, మీ మార్గములన్నిటిలో ఆయన మిమ్మును కాపాడును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమకలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు సెలవిచ్చిన రీతిగానే, నీ కాపాడే హస్తము మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, నీ యొక్క అద్భుతములు చేయు హస్తము మాకు తోడుగా ఉండునట్లుగా చేసి, నీవు మమ్మును మోయుము. దేవా, ఏ కీడు ఎన్నటికి మమ్మును మరియు మా కుటుంబమును తాకకుండా నీ కాపుదలను మాకు దయచేయుము. దేవా, మేము కష్టపడినది ఇక చాలును, నీవే మాకు నీడగా ఉండి మమ్మును భద్రపరచుము. ప్రభువా, నీ యొక్క కాపాడే హస్తము మా మీద ఉండుట మేము చూచునట్లుగా మా కళ్లను తెరువుము. దేవా, మా కుటుంబము మరియు మా చుట్టు ఉన్నవారందరు కాపాడబడునట్లుగా చేయుము. యేసయ్యా, ఏ దుష్ట వ్యక్తులు కూడా మా సరిహద్దులలోనికి ప్రవేశించకుండా, నీ రక్తమును మా మీద ముద్రించుము. దేవా, మేము సమస్త కీడు నుండి కాపాడబడునట్లుగా నీ దేవదూతలను మా యొద్దకు పంపించుము. ప్రభువా, నీ యొక్క ప్రశస్తమైన హస్తము మాకు తోడుగా ఉండునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


