నా ప్రియమైన స్నేహితులారా, నేడు అద్భుతమైన ఒక వాగ్దానముగా 1 యోహాను 5:4వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదు రు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే'' ప్రకారము దేవుని మూలముగా పుట్టడము అనునది, ఒక నూతనమైన అనుభవముగా ఉంటున్నది. దేవుడు మన యందు లోకపరమైనది ఏదియు అనుమతి చేయడ. మన పాత్రను తనతోనే ఆయన నింపుతాడు. ఆయన మన లోపల ఉన్నప్పుడు మనము లోకమును జయించగలుగుతాము. దేవునితో మీరు లోకమునే మార్చివేయగలుగుతారు. ఈ లోకమును జయించగలుగునది ఎవరు? అనేది తర్వాత ఈ వాక్యములో మనము చూడగలుగుతాము. యేసు దేవుని కుమారుడు అని నమ్మువారు మాత్రమే ఈ లోకమును జయించగలుగుతారు. అందుకే మనము యేసయ్యను విశ్వసించాలి. అప్పుడు ఆయన వచ్చి, మన యందును మరియు మనలో నివస్తాడు. నా ప్రియులారా, ప్రతి దేవుని బిడ్డ కూడ ఈ లోకమును జయించగలుగుతారు. ' లోకమును జయించిన విజయము మన విశ్వాసమే' అని దేవుని వాక్యము చెప్పబడినట్లుగానే, కేవలము మనము ఆయనను విశ్వసించాలి. ఇంకను మనము యేసయ్యను నమ్మాలి. యేసు దేవుని కుమారుడు అని మనము విశ్వసించాలి మరియు మన నోటితో ఒప్పుకోవాలి. అయితే, దేవుని కుమారుడైన యేసయ్యను, విశ్వసించకుండా, దేవుని రాజ్యములోనికి ఎవ్వరును కూడా ప్రవేశించలేరు. ఎందుకంటే, ఆయనే మార్గమును, ఆయనే ద్వారమును, ఆయనే సత్యమును మరియు జీవమునైయున్నాడు.
కనుకనే, నా ప్రియులారా, మీ విశ్వాసము మూలముగా మీరు లోకమును జయించగలుగుతారు. ఈ లోకము ఎంతో దుష్టమై యున్నది. ఈ లోకాధికారి ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును నశింపజేయడాని కొరకై వేచి ఉన్నాడు. మీరు ఈ లోకమును నమ్మినప్పుడు, మీరు చీకటితో నింపబడతారు. అయితే, మీరు యేసయ్యను నమ్మి, ఆయనను విశ్వసించినప్పుడు, మీరు వెలుగును కలిగియుంటారు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, 'నేనే ఈ లోకమునకు వెలుగై యున్నాను,' అని యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నాడు.' అంతమాత్రమే కాదు, ఆయన 'నన్ను వెంబడించువారు జీవపు వెలుగును కలిగియుందురు' అని తెలియజేయుచున్నాడు. అవును, 'నీతిమంతులు విశ్వాస మూలముగానే జీవించెదరు' అని చెప్పబడినట్లుగానే, ఈ లోకములో మీరు శ్రమలను ఎదుర్కొనెదరు అని యేసయ్య చెప్పియున్నాడు. అయితే, ధైర్యముగా ఉండండి, 'నేను ఈ లోకమును జయించి యున్నాను.' మీ హృదయమునందు నన్ను మీరు కలిగియున్నప్పుడు, మీరు కూడా ఈ లోకమును జయించగలుగుతారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విజయమును ఇచ్చు దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీ యందు ఉన్న దేవు డు ఈ లోకములో ఉన్నవానికంటె ఎంతో గొప్పవాడైయున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి వానిని ప్రజలు స్తుతించి, ఆరాధించవచ్చును. ఈ లోకపు విషయములను ప్రజలు అనుసరించవచ్చును. ఈ లోకాధికారి చేయు ఆలోచనలను బట్టి, అనేకులు మోసపోవుచున్నారు. ఈ లోకాధికారుల ప్రణాళికలను బట్టి, అనేకులు మోసపోవుచున్నారు మరియు వంచింపబడుచున్నారు. అందుకే, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటె గొప్ప వాడు అని దేవుని వాక్యము ఎంతో స్పష్టముగా తెలియజేయుచున్నది. అవు ను, నా ప్రియులారా, ఇటువంటి గొప్ప దేవునిని మీయందు మీరు కలిగియున్నట్లయితే, ఈ లోకమును నిశ్చయముగా, మీరు జయించగలుగుతారు. దేవుని మూలముగా తిరిగి జన్మించడము అంటే ఇదియే అయి ఉన్నది.
బైబిల్‌లో మనము చూచినట్లయితే, పరిసయ్యుడైన నికోదేముతో యేసయ్యా, సంభాషించినప్పుడు, ప్రభువైన యేసయ్యా, తిరిగి జన్మించడము అనుభవమును గురించి, రాత్రి సమయమునందు నికోదేముతో సంభాషించినప్పుదడు, 'నీవు తిరిగి జన్మించితినే గానీ, దేవుని రాజ్యములోనికి ప్రవేశించజాలవు' అని యేసయ్య చెప్పియున్నాడు. అవును, నా ప్రియ స్భేహితులారా, దేవుని ఆత్మను మన యందు కలిగియున్నప్పుడు, మనము లోకమును జయించగలుగుతాము. అంతమాత్రమే కాదు, దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశిస్తాము. ఈ లోకములో ఉన్న ఒత్తిడిలన్నిటిని కూడా మనము జయించగలుగుతాము. మన మానవ ప్రయత్నముల వలన మనము ఎంత మాత్రము ఈ లోకమును జయింపజాలము. మన శరీరము ఎంతో బలహీనమైనది. అయితే, మన యందు నివసించున్నటువంటి ఆత్మ దేవుడు ఎంతో బలవంతుడు. ఈ లోకములో మనము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి యుద్ధమును ఆయనే మన పక్షమున పోరాడుతాడు. మనకు విజయమునిచ్చువాడు దేవుని ఆత్మయై యున్నాడు. మనము ఈ లోకమును జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేస్తాడు. ఈ లోకములో ఉన్నటువంటి శోధనలన్నిటిని మనము జయించడానికి ఆయన మనకు సహాయపడతాడు. నీతిగల జీవితమును జీవించడానికి సహాయము చేస్తాడు. ఆలాగుననే, ఈ రోజు అనేకమంది యౌవనస్థులు నీతిగల జీవితమును జీవించడానికి ఎంతో శ్రమడుచున్నారు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, మీ హృదయాన్ని ప్రభువునకు సమర్పించండి, అదేవిధముగా, ఈ సందేశమును మీరు చదువుచున్నట్లయితే, మీ హృదయాన్ని ప్రభువు ఇస్తారా? 'ప్రభువా, నా హృదయములోనికి రండి, యేసయ్య, నేను నిన్ను విశ్వసించుచున్నాను, నా శోధలన్నిటిని జయించగలిగే శక్తిని, కృపను నాకు అనుగ్రహించుము, నీతిగల జీవితమును జీవించే కృపను ఇమ్మని ' అడగండి. ఇప్పుడు కూడా ప్రభువు మీ మొఱ్ఱలను ఆలకించుచున్నాడు, మీరు ఎవ్వరైనప్పటికిని కూడా ప్రభువును మీ హృదయములోనికి వచ్చి నివసించమని ప్రార్థించండి, నేను కూడా మీతో కూడా కలిసి ప్రార్థిస్తాను. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు విజయమును అనుగ్రహించి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ మూలముగా జన్మించినవారు ఈ లోకములో జయిస్తారని నీవు ఎంతో స్పష్టముగా చెప్పియున్నావు. కనుకనే, ప్రభువా, మేము కూడా ఇటువంటి అనుభవమును మాకు అనుగ్రహించుము. దేవా, మమ్మును నీ ఆత్మ చేత నింపుము. పరలోక తండ్రీ, యేసు దేవుని కుమారుడని మరియు మా రక్షకుడని మేము నమ్ముచున్నాము. కనుకనే, దేవా, ఇప్పుడు కూడా, దయచేసి వచ్చి మమ్మును నీ సన్నిధితో నింపుము. ప్రభువా, ఈ లోకములో ఉన్నవానికంటె మాలో ఉన్న నీవు ఎంతో గొప్పవాడవు కనుకనే, నీవు మాలోనికి వచ్చి, మా హృదయములో నివసించుమని కోరుచున్నాము. యేసయ్య, నికోదేము వలె మేము కూడా తిరిగి జన్మించే అనుభవమును కలిగియుండునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీవు మాలో లేకుండా, మేము నీ రాజ్యములోనికి ప్రవేశించలేము అన్న వాక్యము ప్రకారము మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మేము నీ రాజ్యములోనికి ప్రవేశించడానికి మాకు అటువంటి కృపను మాకు ఘనతను మాకు దయచేయుము. యేసయ్యా, మమ్మును నీ పరిశుద్ధాత్మతో అభిషేకించుము మరియు నీపై మాకున్న విశ్వాసం ద్వారా ఈ లోక విషయాలను అధిగమించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి చీకటి ప్రదేశంలో నీ వెలుగును ప్రకాశింపజేయుము. ప్రభువా, దయచేసి మా యుద్ధాలతో పోరాడి మాకు విజయాన్ని అనుగ్రహించుము. దేవా, నీ రక్షణ యొక్క ఆనందాన్ని అనుభవించి, నీ మహిమ కొరకు నీతివంతమైన జీవితాన్ని గడపడానికి మమ్మును అనుమతించుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


