నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 41:13వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, "నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను'' అని లేఖనము సెలవిచ్చుచున్నది. నా ప్రియులారా, కుడి చేతి యొక్క విశిష్టత ఏమిటి? మన పనులన్నియు చేసుకొనుటకు మనము ఎక్కువగా కుడిచేతిని ఉపయోగిస్తాము. ఒక పరీక్ష వ్రాసేటప్పుడు, ఎవరికైన డబ్బులు ఇచ్చేటప్పుడు, మన అనుదిన పనులు చేసుకొనునప్పుడు లేక అనుదిన ఆహారము తీసుకొనేటప్పుడు మరియు దేనికైనను సరే, మొట్టమొదట మనము కుడిచేతిని ఉపయోగిస్తాము. కనుకనే, ప్రియులారా, ఈ రోజు ప్రభువు మీతో ఇలాగున అంటున్నాడు, " భయపడకుడి, నేను మీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను మీకు సహాయము చేసెదను'' అని సెలవియ్యబడినది. నా ప్రియులారా, ఒకవేళ మీరు, 'నేనేమి చేసినను, అది వర్థిల్లుడము లేదు అని అంటున్నారేమో. నా ఉద్యోగములో, నా యొక్క చదువులలో నాకు విజయము రాలేదు, నేను చేసే పనులలో నాకు ఎటువంటి ప్రతి ఫలము రావడము లేదు మరియు కనబడడము లేదు అని అంటున్నారేమో?' అయితే, ఈ రోజు ప్రభువు మీ కుడి చేతిని పట్టుకొనబోవుచున్నాడు. ఆయన మీ యొద్దకు వచ్చి, ' నీతిగల తన దక్షిణ హస్తముతో మిమ్మును పట్టుకుంటాను' అని నేడు ఆయన మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, భయపడకండి.

నా ప్రియులారా, ప్రభువు యొక్క దక్షిణ హస్తములో ఎటువంటి శక్తి దాగి యున్నది? బైబిల్‌లో నిర్గమకాండము 15:6వ వచనమును మనము చదివినట్లయితే, "యెహోవా, నీ దక్షిణ హస్తము బలమొంది అతిశయించును యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితక గొట్టును'' ప్రకారం అవును, ప్రభువు యొక్క కుడి హస్తములో ఎంతో గొప్ప శక్తి దాగియున్నది. బైబిల్ నుండి యెషయా 41:10వ వచనములో చూచినట్లయితే, "దిగులుపడకు ము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి యను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును'' అని చెప్పబడిన ప్రకారం అవును, ప్రభువు యొక్క దక్షిణ హస్తము మిమ్మును బలపరుస్తుంది. మరియు ఆయన మీకు సహాయము చేస్తాడు. మీరు పడిపోవు సమయములలో ఆయన మిమ్మును ఆదుకుని పట్టుకుంటాడు. బైబిల్ నుండి మత్తయి 14:28-32వ వచనములలో చూచినట్లయితే, యేసయ్య నీటి మీద నడవడము పేతురు చూచినప్పుడు, తను కూడా యేసు నొద్దకు నీటి మీద నడిచి వెళ్లాలని అనుకున్నాడు. వెంటనే, పేతురు విశ్వాసముతో దోనె నుండి అడుగు బయటకు వేసి, నీటి మీద నడవడము ప్రారంభించినప్పుడు, తన చుట్టు ఉంటున్నటువంటి అలలను, తుఫానును అతను చూడడముప్రారంభించియున్నాడు. యేసయ్య మీద ఉంచిన తన దృష్టి మరలి పోయినది. తన దృష్టి నీటి మీదికి వెళ్లినది, తన దృష్టి తుఫాను పైకి వెళ్లినది, తన కన్నులు అలలు మీదికి వెళ్లిపోయినవి. తద్వారా, అతడు నీటిలో మునిగిపోవుటకు ప్రారంభించాడు.

అవును నా ప్రియమైన వారలారా, అనేకసార్లు మనము యేసయ్య మీద దృష్టిని ఉంచినప్పుడు, విశ్వాసముతో అడుగు ముందుకు వేస్తాము. అయితే, సమస్యలు, ఆటంకాలు, శ్రమలు, అడ్డులు మన దారికి ఎదురుగా వచ్చినప్పుడు, మన దృష్టి యేసుపై నుండి మరలిపోయి, మన సమస్యలను చూస్తుంటాము. ఆలాగుననే, మనము కూడా నీటిలో మునిగిపోతుంటాము. అదేవిధముగా, పేతురు కూడా నీటిలో పడిపోయాడు. కానీ, యేసు అతని యొద్దకు వచ్చాడు, ఆయన తన చేయిని చాచి, పేతురు యొక్క చేతిని పట్టుకొని, అతనిని ఆ నీటి నుండి పైకి లేవనెత్తాడు. ఆలాగుననే, మత్తయి 14:31వ వచనములో చూచినట్లయితే, "వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.'' అదేవిధముగా, నా ప్రియులారా, మనము మునిగిపోవు సమయములో యేసు ప్రభువు తన చేతిని చాచి, మన కుడి హస్తమును పట్టుకుంటాడు, ఇంకను ఆ లోతులలో నుండి ఆయన మనలను బయటకు లాగుతాడు, నీతిగల తన దక్షిణ హస్తముతో మనలను ఆదుకుంటాడు. మనలను బలపరచి, మన సమస్యలన్నిటి నుండి మనలను విడిపిస్తాడు. అవును, ఆయన హస్తము శక్తివంతమైనది, ప్రభావము గలిగినది. శత్రువులను చెదరగొట్టగలిగినది. మన సమస్యలన్నిటిలో నుండి, ఈ గొప్ప శక్తివంతమైన చెయ్యి, మనలను బయటకు లాగుతుంది. 'నా చుట్టు ఉన్న సమస్యలన్నియు కూడా నాకు ఎదురుగానే ఉన్నాయి' అని అంటున్నారా? 'నేను నా సమస్యలలో నుండి మునుగిపోతున్నాను అని అంటున్నారా?' అయితే, ప్రభువు తన చేయిని చాచి, మీ సమస్యలన్నిటి నుండి మిమ్మును బయటకు లాగుతాడు. మీకు సహాయము చేసి, మీ సమస్యలలో నుండి మిమ్మును విడిపిస్తాడు. కాబట్టి, భయపడకండి, నా ప్రియ స్నేహితులారా, ఆయన మీ హస్తమును పట్టుకొని యున్నాడు. కనుకనే, ఆయనకు వందనాలు చెల్లిద్దాము. ఆయనను గట్టిగా పట్టుకొని, ఆయనను వెంబడించినట్లయితే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును తన దక్షిణ హస్తముతో పట్టుకొని, మీకు సహాయము చేసి, మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు మా కుడి చేయి పట్టుకుని, 'భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను' అని చెప్పే మా దేవుడవు, ప్రభువుడవని వాగ్దానం చేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము బలహీనంగా ఉన్నప్పుడు, మా కష్టాలలో మునిగిపోయినప్పుడు, నీతిమంతుడవైన నీ కుడి చేయి మమ్మును రక్షించడానికి శక్తివంతమైనదని దయచేసి మాకు గుర్తు చేసినందుకై నీకు వందనాలు. యేసయ్యా, తుఫానులో నీవు పేతురు యొద్దకు చేరుకున్నట్లు గానే, నీవు మమ్మును చేరుకుంటావని మాకు తెలుసు. ప్రభువా, ఈరోజు మా చేయి పట్టుకొని, నీ కుడి హస్తముతో మమ్మును బలపరచుము, మమ్మును ఆదుకొనుము మరియు ప్రతి తుఫాను నుండి తప్పించి, నీ హస్తముతో మమ్మును పట్టుకొని నడిపించుము. దేవా, మేము నీ యొక్క నిరంతర పట్టులో మా నమ్మకాన్ని ఉంచుచున్నాము. ఎటువంటి తుఫానులకు మేము భయపడకుండా, ధైర్యముగా ముందుకు సాగుటకు మాకు సహాయము చేయుము. ఎందుకంటే, నీవు మాతో కూడా ఉన్నావన్న ధైర్యమును మాకు కలిగించుము. ప్రభువా, మమ్మును మా సమస్యల నుండి విడిపించుము. ప్రభువా, నీ నీతిగల దక్షిణ హస్తమును చాచి, మమ్మును బయటకు లేవనెత్తుము. దేవా, మాకు సహాయము చేసి, మా సమస్యలన్నిటిలో నుండి విడిపించుము మరియు మా దృష్టిని కేవలము నీ మీద మాత్రమే ఉంచడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, మమ్మును నీవు చేయి పట్టుకొని నడిపించుము. దేవా, మేము నిన్ను వెంబడించడానికి సహాయము చేయుము. ప్రభువా, మా జీవితము మీద అధికారమంతయు నీవే. అన్నిటిలో మేము విజయమును పొందుకొనునట్లుగాను, నీతిగల జీవితమును మేము జీవించునట్లుగా మా పట్ల అటువంటి కృపను దయచేసి, నీ వాగ్దానము ద్వారా మమ్మును ఘనపరచుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.