నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 148:4వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించియున్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులగు ఇశ్రాయేలీ యులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి'' అన్న వచనము ప్రకారము దేవుడు మీ శృంగమును హెచ్చించబోవుచున్నాడు. కొమ్ము లేక శృంగము అనగా, దేవుడు మనకు అనుగ్రహించు బలము ఘనత అయి ఉంటున్నది. అందుకే బైబిల్ నుండి లూకా సువార్త 1:69-71వ వచనములలో మనము చూచినట్లయితే, "ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా, మన శత్రువుల నుండియు మనలను ద్వేషించు వారందరి చేతి నుండియు తప్పించి రక్షణ కలుగజేసెను'' అని చెప్పబడినట్లుగానే, తన సేవకుడైన దావీదు వంశము నందు మన కొరకు ప్రభువు ఒక రక్షణ శృంగమును కలుగజేసెను. ఈ రక్షణ శృంగము అనగా ఎవరై యున్నారు? అనగా, ఈ లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తే ఈ రక్షణ శృంగము.
నా ప్రియులారా, యేసు మీకు ఉన్న సవాళ్లలన్నిటిలో నుండి ఆయన మిమ్మును విడిపిస్తాడు. 'యేసు' అను పదమునకు 'లోక రక్షకుడు' అని అర్థము. ఆయన మన విమోచకుడు. ఆయన మనలను విడుదల చేసే దేవుడు. ఆయనే మన జీవితములో సమస్తమై యున్నాడు. కనుకనే, "ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి'' అని బైబిల్ గ్రంథము అంటున్నది. కాబట్టి, మీరు ఊరకయే నిలిచియుండి, ఆయన ప్రభువని తెలుసుకొనవలెను. అవును, మన యేసయ్య, ఒక కొమ్ముగా మన తల మీద ఉంటున్నాడు. అపవాది మనలను చూచినప్పుడు, మన తల మీద ఉన్న యేసు అను కొమ్మును చూస్తాడు. కనుకనే, మీ హృదయమును కలవరపడనీయకండి.
చెన్నై పట్టణములో ఉన్న వానగరములో నిర్వహించబడిన ఒక కూటము జరిగెను. ఆ కూటములో ఆరాధన కార్యక్రమము జరుగుచుండెను. అప్పుడు దురాత్మ (దయ్యము) పట్టినటువంటి ఒక యౌవన అమ్మాయి ఉండెను. ఆ దురాత్మ పట్టిన అమ్మాయి, ఆ దురాత్మ శక్తి ద్వారా గట్టిగా గట్టిగా అరచుచూ కేకలు వేయుచుండెను. అక్కడ ఉన్న ఆ దురాత్మ పట్టిన ఆ యౌవనరాలిని చూచి, కనుకనే, ఈ అమ్మాయి బయటకు తీసుకొని వెళ్లండి అని మా సిబ్భందికి చెప్పాను. అయినను, ఆ అమ్మాయి, బయట కూర్చున్నప్పటికిని, గట్టిగా అట్టిగా అరుస్తూ కేకలు వేయుచు, అక్కడ ఉన్న ప్రజలందరికి అంతరాయమును కలిగించుచుండెను. కాబట్టి, అక్కడ ఉన్న మా యొక్క సిబ్బందిని ఆ అమ్మాయిని, కూడిక జరుగుచున్న ప్రాంగణమును బయటకు తీసుకొని వెళ్లమని చెప్పాను. అయితే, ఆ అమ్మాయి, ఆ కూటము జరుగుచున్న ప్రాంగణమునకు బయట కూర్చున్నప్పటికి తను గట్టిగా అరుస్తూ ఉండెను. మా సిబ్బంది తనను అదుపులో ఉంచడానికి ఎంతగానో ప్రయత్నించుచుండెను. అయినప్పటికిని, ఆ అమ్మాయి ఎంతో గట్టిగా కేకలు వేయుచుండెను. ఆ చిన్న అమ్మాయిని చూచినప్పుడు, తన పట్ల నాకు కనికరము కలిగినది. ఆ అమ్మాయిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి, తన మీద చేతులుంచినప్పుడు, ఆ దయ్యము ఆ అమ్మాయిని విడిచి వెళ్లిపోయినది. నేనెంతగానో ఆశ్చర్యపోయాను. ఆలాగుననే, నేనెంతగానో ప్రభువును స్తుతించాను. ఆ యౌవ్వన అమ్మాయిని చూచినప్పుడు, తను పెట్టుకున్న కళ్లద్దాలు అన్నియు విరిగిపోయినవి. తన ముఖమంతయు ఎంతో విచారకరముగా ఉన్నట్లుగా నాకు అనిపించినది. అయితే, ప్రార్థన తర్వాత, ప్రభువు తనను విడుదల చేసిన తర్వాత, తను చిరునవ్వుతో ఆనందముగా ఉండెను. అంతమాత్రమే కాదు, ఘనత, గౌరవము తనకు తిరిగి వచ్చియున్నది. అవును, నా ప్రియులారా, యేసయ్య మనకు రక్షణ శృంగమై ఉంటున్నాడు. ఆయన మన మహిమను అధికము చేయుచూ, మన శత్రువులకంటె ఉన్నత స్థలములో మనలను ఉంచే శృంగము ఆయనే. కనుకనే, చింతించకండి.
నా ప్రియులారా, కొంతమంది వారి ఉద్యోగములోను మరియు వృత్తిలోను దీవించబడినప్పుడు, వారు గర్వముతో నిండుకొని యున్నప్పుడు, వారిని చూచి, ' నీ తలపైన ఏవైనా కొమ్ములు ఉన్నవా?' అని వారిని చూచి ఎగతాళి చేస్తుంటాము కదా! ఇంకను, ' నీ తలపైన కొమ్ములు చాలానే మొలిచియున్నవి ' అని వారిని ఎగతాళి చేస్తాము కదా! అంటే అంత ఎత్తుగా వారు ఎదిగియున్నారు అని అర్థము కదా. అంతకంటే, అధికముగా మన జీవితములో యేసయ్య ప్రవేశించినప్పుడు, మన కొమ్ము హెచ్చింపబడుతుంది. మనకు కావలసినటువంటి బలము, శక్తి, ప్రభావము మరియు ఘనత ఆయన మనకు అందిస్తాడు. అందుకనే, అన్నివేళల మనము ప్రభువును స్తుతించుచూ ఉండవలెను. మనము ఆయనను ఆరాధించడాని కొరకే సృష్టింపబడియున్నాము. మనలను మనము లేక మనము సాధించిన విషయాలను గురించి మనము పొగుడుకొనవలసిన అక్కరలేదు. కానీ, రాజుల రాజైనటువంటి దేవుని మనము స్తుతించబద్ధులమై యున్నాము. అవును, నా ప్రియులారా, తన ప్రజల కొరకు ప్రభువు ఒక రక్షణ శృంగమును హెచ్చింపజేసియున్నాడు. ప్రభువు మిమ్మును కూడా లేవనెత్తజేసి, మీకు తన బలమును, అధికారమును, ఘనతను ఇస్తాడు. కనుకనే, మీరు నిరాశ చెందకండి. యేసయ్యను బట్టి, మీరు ఆశీర్వదింపబడతారు. నా ప్రియులారా, ఇప్పుడు కూడా యేసయ్యను మీ జీవితములో అంగీకరించండి. ఇప్పుడే మీ జీవితములో యేసయ్యను అనుమతించి, అంగీకరించినప్పుడు మీరు వర్థిల్లుతారు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నిన్ను మా హృదయములో రక్షణ శృంగముగా కలిగియుండుటము ఎంత గొప్ప ఆశీర్వాదముగాఉన్నందుకై నీకు వందనములు. దేవా, నీవే మా విమోచకుడవు, బలముగాను, నీవే మా సమస్తముగా ఉన్నావు. ప్రభువా, నీవే మాకు కేంద్రముగా ఉండాలని మేము కోరుచున్నాము. దేవా, నీ ఆశీర్వాదములను మా మీదికి వచ్చునట్లుగా, నీ శక్తితో మమ్మును బలపరచుము. ప్రభువా, నిన్ను బట్టి, ఘనతతో జీవించగలిగే కృపను, భాగ్యమును మాకు అనుగ్రహించుము. దేవా, నీ సన్నిధి మా యందు ప్రత్యక్షపరచబడునట్లుగా మాకు నీ కృపను చూపుము. ప్రభువా, మేము దేనిని తాకినను, అది ఆశీర్వదింపబడునట్లుగాను చేయుము. యేసయ్య, నిన్ను బట్టి, ఇతరులను విడిపించునట్లుగా, మేము వాడబడునట్లుగా కృపను చూపించుము. దేవా, అద్భుతములు చేయువారుగా మేము మార్చబడునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, నిన్ను సేవించడానికి మేము పడుచున్న శ్రమ, కష్టమును చూచి, మమ్మును ఘనపరచుము. ప్రభువా, ఈ రోజే నీ యొక్క రక్షణ శృంగమును మాకు ధరింపజేయుము. దేవా, మా జీవితానికి కేంద్రంగా ఉండి, ప్రతి సవాలు మరియు శత్రువుపై మమ్మును పైకి లేవనెత్తి, మమ్మును బలపరచి, మేము కోల్పోయిన ప్రతి గౌరవాన్ని మాకు తిరిగి దయచేయుము. ప్రభువా, మా ద్వారా నీ సన్నిధి ప్రత్యక్షమగునట్లుగాను, మేము తాకిన ప్రతిదానిని ఆశీర్వదించుము. దేవా, ఈ లోకములో మేము మా తల ఎత్తుకొని నడుచు కృపను, భాగ్యమును మాకు అనుగ్రహించుము. ప్రభువా, మేము అవమానములకు గురైనది ఇక చాలు, మా అవమానమునకు తగిన ఘనతను మేము పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీవు మమ్మును ఆశీర్వదించి, లేవనెత్తుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


