నా ప్రియులారా, ఈ రోజు మిమ్మును చూడడము నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 4:7వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును'' అని చెప్పబడినట్లుగానే, దేవుని సమాధానము మీ జీవితములో అన్ని విధములుగా నేడు మీకు కావలి ఉంటుంది. నా స్నేహితులారా, ఇది చాలా ప్రత్యేకమైనది. అదేమనగా, 'దేవుని యొక్క సమాధానము క్రీస్తు యేసునందు మీ హృదయమునకు మరియు మీ తలంపులకు కావలి యుండును' అని తెలియజేయుచున్నది. ఇది సమస్త మానవ అవగాహనను మించినది. మానవ మనస్సులో ఉన్న సమాధానకరమైన ఆలోచనలకు మించినది. ఇది మానవ మనస్సునకు మించినది. ఇది క్రీస్తు యేసునందు మన మనస్సునకు తలంపులకు కావలిగా ఉంటుంది. ఇది యేసు ఆలోచనలను, మన మనస్సులలోనికి తీసుకొని వస్తుంది. ఈ సమాధానము మానవ ఆలోచనలకు పైగా వెళ్లిపోతుంది. ఇది మానవ ఆలోచనలకంటె మనలను పైకి తీసుకొని వెళుతుంది. మనము యేసు మార్గములను ఆలోచించుటకు ప్రారంభించినప్పుడు దేవుని స్వరము మన హృదయములోనికి, మన మనస్సులోనికి దిగివస్తుంది. యేసు స్వరము ద్వారా మాత్రమే మన హృదయములోనికి ఆయన యొక్క సమాధానమును తీసుకొని వస్తుంది.

ఒకానొక సమయములో నేను చాలా ఒత్తిడికి లోనైన ఒక సందర్భములో నేను ఇటువంటి అనుభూతిని ఈ రీతిగా పొందుకొనియున్నాను. నేను దేవునికి ప్రార్థన చేయడము, రోధించడము ప్రారంభించాను, "ప్రభువా, నా జీవితములో ఈ యొక్క కొదువను చూడండి. ప్రభువా, నేను చాలినంత చేయలేక పోవుచున్నాను. సేవా పరిచర్యకు చాలినంత చేయలేకపోవుచున్నాను. నా యొక్క ఆధ్యాత్మిక జీవితములోను మరియు మా కుటుంబములో కూడా చాలినంతగా చేయడము లేదు. నేను చేయవలసిన నీ పని చాలినంతగా చేయడము లేదు. మా బృంద సభ్యులకు కూడా చాలినంతగా చేయడము లేదు. నేను నిరూపయోగముగా ఉన్నాను. ప్రభువా, నేను చాలినంతగా లేను ప్రభువా, నేను ఎంతగా ఒత్తిడికి లోనై నీ సన్నిధి యెదుట కన్నీటిని కుమ్మరించుచున్నాను. దేవా, నేను చాలా విసిగిపోయి ఉన్నానని'' దేవునికి నేను మొఱ్ఱపెట్టాను. అటువంటి సమయములో ఆకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు నాలో పొంగిపొర్లుట నేను గమనించియున్నాను. ఆయన నన్ను తన స్వాధీనములోనికి తీసుకున్నాడు. ప్రచంఢమైన గొప్ప సమాధానము శాంతి నాలోనికి వచ్చినది. అది నా హృదయములోనికి వచ్చి, నన్ను నింపి వేసినది. ఇంకను పరిశుద్ధాత్ముని యొక్క భాషను ఆయన నా ద్వారా మాట్లాడింపజేయుటకు ప్రారంభించియున్నాడు.

నేను ఆ భాషలను మాట్లాడుచుండగా, పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచనలను అర్థము చేసుకొనగలుగుచున్నాను. ఆయన నా గురించి దేవునికి సాక్ష్యమును ఇచ్చుచున్నాడు. "ఇదిగో, ఇది శ్యామ్, నీవు అతని కొరకు ఈ ప్రణాళికలను కలిగియున్నావు, ఈ అధికారము నీవు ఇతనికి అనుగ్రహించియున్నావు, ఈ మార్గమును ఇతని కొరకు నీవు నియమించియున్నావు. ఈ వివరములన్ని యు కూడా ఆయన మాట్లాడుచున్నాడు.'' నేను పరిశుద్ధాత్మలో చాలా గొప్ప అనుభూతికి లోనైయ్యాను. నేను నా యొక్క లోపములన్నియు కూడా మరచిపోయాను. ఆయన నన్ను నూతన కోణములోనికి లేవనెత్తియున్నాడు. దేవుని మార్గములలో నడుచుటకు తన ఆలోచనలకు నన్ను లేవనెత్తియున్నాడు. నా ప్రియులారా, అదేరీతిగానే, దేవుని సమాధానము మిమ్మును నడిపించును. మీరు దేవుని యొక్క మార్గములను అనుసరించినప్పుడు, మీరు దేవుని ఆలోచనలను కలిగియున్నప్పుడు, ఆయన తన పరిశుద్ధ గ్రంథము ద్వారా మరియు ఆయన తన వాక్కుల ద్వారాను, ఆయన మీ హృదయములలో మాట్లాడుతాడు. ఆయన ప్రవచనము ద్వారా మీతో మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ అనుగ్రహించు భాషల ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. ఆయన వివిధ సందర్భములలో కూడా ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతాడు. ఈ సమయాలన్నింటిలోనూ, దేవుని యొక్క సమాధానము మీలోనికి వచ్చి మిమ్మును నింపుతుంది. ఇది మానవ శాంతిని మించియున్నది. కనుకనే, నా ప్రియులారా, ఇప్పుడే మీ జీవితములోనికి దీనిని అంగీకరించండి, దేవుడు ఇంకను మీ మధ్య పనిచేయుచున్నాడు. కనుకనే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, మేము పాపులము, మేము నీ సేవకు చాలినంతగా చేయలేకపోవుచున్నాము. దేవా, మేము నిరుపయోగముగాను మరియు మేము దేనికి పనికిరానివారముగాను ఉన్నాము. ప్రభువా, మా జీవితములో ఉన్న కొదువలను చూడుము. ప్రభువా, మేము అర్హులముకాకపోయినను, నిరాశ చెందిన మేము సమస్యలతో సతమతమైనప్పుడు, మా పరిస్థితుల వైపు కాకుండా నీ వైపు చూచునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా తలంపులు మానవ అవగాహనకు మించి హెచ్చించి, మా జీవితం పట్ల నీ మార్గములను, ప్రణాళికలను అవగాహన చేసుకొనునట్లుగా మాకు నేర్పించుము. ప్రభువా, నీ వాక్యము ద్వారా, నీ స్వరము ద్వారాను మరియు పరిశుద్ధాత్మ ద్వారా అనుదినము మమ్మును నడిపించుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మును నింపి, నీ యొక్క సమాధాకరమైన తలంపులను మాకు కలిగించుము. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మును సిద్ధపరచి, మా హృదయముతో నీవు మాట్లాడుము. యేసయ్యా, నీ ప్రేమను, నిరీక్షణను మరియు పరిష్కారములను మా హృదయంలో కలిగించుము. దేవా, క్రీస్తు యేసునందు మా హృదయాన్ని, మనస్సును కాపాడుము మరియు మా జీవితంలోని ప్రతి రంగంలో అద్భుతాలు జరిగించుము. ప్రభువా, నీవు అనుగ్రహించు సమాధానమును మేము అగీకరించునట్లుగా మాకు నీ కృపను దయచేయుము యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.