నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, ఈ రోజు ఒక అద్భుతమైన వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 103:11వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులుగలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది '' అని చెప్పబడిన ప్రకారము ఆయన కృప మన మీద ఎంతో అధికముగా ఉన్నది. కనుకనే, మనము ఆయన ప్రేమను కొలువలేనిదిగా ఉంటున్నది. మనము ఆయన ప్రేమను ఏ విధముగా కొలువగలము? అని చూచినట్లయితే, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 57:9వ వచనములో దావీదు అదే చెబుతున్నాడు, "నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది'' అని చెప్పబడిన ప్రకారము ఆయన ప్రేమ ఎంతో లోతైనది మరియు ఎంతో వెడల్పు కలది. ఆయన ప్రేమ ఎంతో గొప్పది గనుకనే, మనందరి యొక్క పాపములను ఆయన ప్రేమ క్షమించుచున్నది. ఆయనకున్న గొప్ప ప్రేమను బట్టి, మన కొరకు తన ప్రాణమును ఇచ్చియున్నాడు. తన గొప్ప ప్రేమను బట్టి తన శరీరమును నలుగగొట్టబడడానికి తన్నుతాను అప్పగించుకొనియున్నాడు. మనము మరల మరల పాపము చేయుచూ, యేసు యొక్క ప్రశస్తమైన రక్తమును వ్యర్థము చేయువారముగా ఉండకూడదు. అవును, నా ప్రియులారా, యేసుప్రభువు మనలను క్షమించడానికి ఎంతో సిద్ధముగా ఉన్నాడు. ఈ రోజు కూడా క్షమించమని యేసు ప్రభువును మీరు అడుగుతారా? 'ప్రభువా, ఆకాశము కంటె నీ ప్రేమ ఎంతో ఉన్నతముగా ఉన్నది కనుకనే, నన్ను క్షమించు' అని మీరు ఆ విధంగా ఆయనను అడిగినప్పుడు ఆయన ఎంతో సంతోషముగా మిమ్మును తప్పకుండా క్షమిస్తాడు. బైబిల్‌లో యెషయా 38:17వ వచనములో చూచినట్లయితే, " మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి'' అని వ్రాయబడియున్నది. కనుకనే, ఆయన తన యొక్క గొప్ప ప్రేమను బట్టి, ప్రభువు ఈ విధంగా జరిగించియున్నాడు. కనుకనే, ధైర్యంగా ఉండండి.
నా ప్రియ స్నేహితులారా, ఈ కొలువలేని ప్రేమను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథను మీతో పంచుకోవాలని నేను మీ పట్ల కోరుచున్నాను. మా తండ్రిగారు తన చిన్నతనములో తన స్నేహితునితో ఒకసారి ఆడుకుంటున్నప్పుడు, మా నాన్నగారు ఏదో ఒక అల్పాహారమును తిను చుండెను. అది ఏదో ఒక తెల్లటి పొడి వలె ఉండెను. కానీ, ఆయన స్నేహితుడు కూడా దానిని కొంచెము ఇవ్వమని అడిగాడు. అయితే, నా తండ్రి ఆ సున్నపు పొడి తీసుకొని తన స్నేహితునికి కూడా ఇచ్చారు. తద్వారా, ఆ స్నేహితుని యొక్క గొంతు ఎంతో మండిపోయినది. అతని యొక్క నాలుక కాలిపోయి, అతడు మాటలాడలేకపోయాడు. ఆ స్నేహితుని యొక్క తల్లి, మా తండ్రిగారి తల్లిదండ్రుల యొద్దకు వచ్చి, 'నీ కుమారుడు ఈ విధంగా చేశాడు' అని చెప్పారు. అయితే, మా నానమ్మగారు తన కుమారుని మీద ఉన్న ప్రేమను బట్టి, తన కొడుకును ఏ మాత్రము ఏమి అనలేదు. నా తండ్రిగారి యొక్క పేరు, తమిళ భాషలో, "తంగస్వామి'' అనగా, 'బంగారము' అని అర్థము. మా నానమ్మగారు, 'నా కుమారుడు బంగారము మరియు నా కుమారుడు ఇలాగున ఎప్పుడు కూడా చేయడు' అని చెప్పారు. ఆలాగుననే, మన పరమ తండ్రి కూడా మీ గురించి ఈలాగున చెబుతాడు, 'నా కుమారుడు, కుమార్తె ఎంతో బంగారము మరియు నా బిడ్డల యొక్క పాపమును నేను క్షమిస్తాను,' అని అంటాడు. అవును, భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల అంత అధికముగా ఉన్నది. కాబట్టి, ఉన్నపాటుగా మీరు యేసు ప్రభువు యొద్దకు రండి, మీ హృదయమును ఆయనకు సమర్పించండి, ఆయన మీ పాపములన్నిటిని క్షమిస్తాడు. ఇది దేవుని యొక్క గొప్ప ప్రేమగల గుణాతిశయం. ఇది అనేక పాపాలను కప్పి ఉంచే ప్రేమ. అందుకే బైబిల్ నుండి 1 పేతురు 4:8వ వచనములో చూచినట్లయితే, "ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి'' ప్రకారము మీరు ఎంత దూరం వెళ్ళినా, ఆయన చేతులు మిమ్మల్ని మరల అంగీకరించడానికి విశాలంగా ఉన్నాయి. మీరు ఉన్న పక్షముగానే, యేసు వద్దకు రండి. మీ గతాన్ని చూసి మీరు భయపడకండి. ఆయన ప్రేమ మీ పాపం కంటే గొప్పది మరియు ఆయన క్షమాపణ మీ వైఫల్యం కంటే లోతైనది.
నా ప్రియులారా, ఆయన ప్రేమ చాలా గొప్పది కాబట్టి, ఈ లోకం మనలను తృణీకరించినప్పుడు కూడా మనకు ఒక నమ్మకము కలదు. ప్రజలు మిమ్మల్ని నిందించి, మీ తప్పులను గుర్తు చేయవచ్చును, కానీ దేవుడు మీకా 7: 19వ వచనములో ఇలాగున అంటున్నాడు, "ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు'' అని చెప్పబడిన ప్రకారము ఆయన మీ పాపాలను సముద్రపు అగాధములలోనికి విసిరివేయుచున్నాడు. కనుకనే, ఆయన ప్రేమ మీ హృదయాన్ని నింపినప్పుడు, మీరు అపరాధం, అవమానము మరియు శిక్షావిధి లేకుండా నూతన జీవితాన్ని గడపడం ప్రారంభిస్తారు. నా ప్రియులారా, మీ పాత మార్గాలలోనే ఉండకుండా, దానికి బదులుగా, 'తనకు ప్రియమైన బిడ్డగా లేచి తన మహిమతో ప్రకాశించాలని' ఆయన మిమ్మల్ని తన యొద్దకు రమ్మని పిలుచుచున్నాడు. ఎందుకంటే, భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు కలిగియుండు వారి పట్ల ఆయన కృప అంత ఉన్నతంగా ఉన్నదని చెప్పబడియున్నది. కాబట్టి, ఈరోజే మీ హృదయాన్ని యేసుకు అప్పగించండి. ఆయన మిమ్మల్ని శుభ్రపరచనివ్వండి, మీ ఆనందాన్ని పునరుద్ధరించుకోండి మరియు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు లేవనెత్తునట్లుగా చేయనివ్వండి. నిజంగా, నా ప్రియులారా, మన పాపాలన్నియు క్షమించబడడము ఎంత గొప్ప అనుభవము కదా! కనుకనే ప్రియమైన స్నేహితులారా, మీ పాత పాపపు జీవితానికి వెనుకకు మరల వెళ్ళకండి. దేవునికి దగ్గరగా రావడానికి ప్రయత్నించండి. ప్రభువు తన యొక్క ఉన్నతమైన కృపకు మిమ్మును హత్తుకొని, ఉన్నత శిఖరాలకు మిమ్మును లేవనెత్తును గాక. ఆయన గొప్ప ప్రేమ మిమ్మును బలపరచునట్లుగాను మరియు రాబోయే దినములలో సురక్షితంగా ముందుకు తీసుకువెళ్లును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నీ బిడ్డలైన మా పట్ల ఎంత గొప్ప ప్రేమను కలిగియున్నావు. ప్రియమైన యేసయ్య, ఇంకను నీవు సిలువలో ఆ ప్రేమను కలిగియున్నందుకై నీకు వందనాలు. యేసయ్యా, మా పాపములన్నిటిని నీవు ఆ సిలువలో భరించావు, నీవు చేసిన త్యాగమును జ్ఞాపకము చేసుకొని, మమ్మును క్షమించుము. ప్రభువా, బంగారు పాత్ర వలె నీవు మమ్మును మార్చుము. దేవా, మా పాపములన్నిటిని నీవు కడిగి మమ్మును పరిశుద్ధపరచుము. ప్రభువా, ప్రజలు మమ్మును క్షమించలేకపోయినప్పటికిని, నీవు మమ్మును క్షమించుము. దేవా, మా పాపములను, వ్యసనములన్నిటి నుండి మమ్మును క్షమించి, శుద్ధులనుగా చేయుము. యేసయ్యా, నీ గొప్ప ప్రేమను బట్టి, మా యొక్క పాపములన్నిటిని నీ వెనుకకు నెట్టివేసి, నీ ప్రేమ మా చుట్టు ఆవరించునట్లుగా చేసి, ఉన్నత శిఖరాలలోనికి తీసుకొనివెళ్లి, మమ్మును హత్తుకొని ఆశీర్వదించుము. ప్రభువా, నీ ప్రేమ ఎంత విశాలమైనది మరియు లోతైనదో అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ దైవీక కృపతో మమ్మును హత్తుకొని, ఎటువంటి పాపం లేదా అపరాధం మమ్మును నీ నుండి వేరు చేయకుండా చేయుము. ప్రభువా, మా హృదయాన్ని శాంతి మరియు యథార్థతతో నింపుము. యేసయ్యా, నీ యొక్క ప్రేమ మరియు రక్షణతో మమ్మును కప్పి, నీ కృపలో మమ్మును ఉన్నత శిఖరాలకు లేవనెత్తుము. దేవా, మేము నీ ప్రేమ చేత నిండియుండునట్లుగా, మేము నీకు గొప్ప ప్రజలుగా మారునట్లుగా సహాయము చేయుమని యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.