నా ప్రియ సహోదరీ మరియు సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 37:23వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు ప్రతిరోజు మనతో నడుస్తూ, మన మార్గమును స్థిరపరుస్తాడు అని గుర్తించడము ఎంత అద్భుతమైన సత్యము కదా! ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచినప్పుడు, దేవుడు వారితో కూడా నడిచి, ప్రతి ఉదయం వారికి మన్నాను అనుగ్రహించాడు. ఆయన కుమ్మరించిన మన్నా ద్వారా వారు ఎంతో బలముతో అనుదినము నడవగలిగారు. అదేవిధంగా, నా ప్రియులారా, మనము అనుదినము దేవునితో కలిసి నడుచుటకు ప్రభువు మనకు తన వాక్యమును అనుగ్రహించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 119:105వ వచనమును చూచినట్లయితే, "నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది'' అని చెప్పబడినట్లుగానే, దేవుని వాక్యము మన పాదములకు దీపముగా ఉన్నందున మనము ఆయన వాక్యమును మన హృదయములలో భద్రపరచుకొని దానిని అనుసరించినప్పుడు, మనము ఆయనతో కలిసి నడిచినప్పుడు ఆయన మన యొక్క నడతలను చూచి మన పట్ల ఆనందిస్తాడు.
అందుకే బైబిల్ నుండి కీర్తనలు 119:133వ వచనములో మనము చూచినట్లయితే, "నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీ అడుగులను స్థిరపరచినప్పుడు మిమ్మును ఎటువంటి పాపము కూడా ఏలలేదు. అవును, నా ప్రియులారా, ఆయన తన వాక్యము ద్వారా మనము త్రొటిల్లనివ్వకుండా మనలను కాపాడుతాడు. ఆలాగుననే, అనుదినమునకు కావలసిన వాక్యమును మనకు అనుగ్రహించుట ద్వారా ఆయన మనలను కాపాడతాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 48:17వ వచనములో చూచినట్లయితే, "నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు తన వాక్యము ద్వారా మీకు ఉపదేశము చేసి, మీరు నడవవలసిన త్రోవలో ఆయన మిమ్మును నడిపిస్తాడు. ఆయన వాక్యము నుండి మనము శ్రేష్ఠమైన సత్యమును పొందుకుంటాము. నా ప్రియులారా, ప్రజలు మనకు అనేక విధాలుగా సలహాలు ఇవ్వవచ్చును. కానీ, మన అడుగులను స్థిరపరచేది మరియు మన ప్రవర్తనను చూచి మన పట్ల ఆనందించునది ఆ ప్రభువు మాత్రమే.
అవును, నా ప్రియులారా, ఆయన మనకు తన వాక్యమును అనుగ్రహించుట మాత్రమే కాదు, ఆ వాక్యమును మన హృదయములలో భద్రపరుస్తాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 37:31వ వచనములో చూచినట్లయితే, " వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు'' అని చెప్పబడినట్లుగానే, దేవుని వాక్యము మన హృదయములలో ఉన్నప్పుడు, మన అడుగులు ఎంతమాత్రము జారవు. అవును, నా ప్రియులారా, నీతిమంతుని అడుగులు ప్రభువుచేత స్థిరపరచును మరియు ఆయన వారి మార్గమును చూచి ఆనందించుచున్నాడు. అదేవిధముగా, నా ప్రియులారా, మీరు కూడా ఆయన వాక్యము పట్ల ఆనందించినప్పుడు, ఆయన మీ ప్రవర్తనను చూచి మీ పట్ల ఆనందిస్తాడు. కనుకనే నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ వాక్యము ద్వారా మా పాదములను సరైన మార్గములో నడిపించి, మా నడతలను స్థిరపరచుము. ప్రభువా, అనుదినము నీ వాక్యమును ధ్యానించుచూ, ప్రతిరోజు నీతో నడవడానికి మరియు నీ మార్గములను వెంబడించడానికి మాకు సహాయము చేయుము. దేవా, మా యొక్క పరిస్థితులకు కావలసిన, నీ వాక్యమును జ్ఞానమును మాకు దయచేయుము. ప్రభువా, మా యొక్క పాపము నుండి మమ్మును విడిపించి, కాపాడి, మేము త్రొటిల్లకుండా సంరక్షించుము. దేవా, నీ వాక్యము మా పాదములకు దీపముగాను, మా మార్గమునకు వెలుగుగా ఉండునట్లు చేయుము. ప్రభువా, నీ వాక్యమును మా హృదయములో లోతుగా నాటబడునట్లుగాను మరియు మా అడుగులను నీతిలో స్థిరపరచబడునట్లుగా చేయుము. యేసయ్యా, మా జీవితములో శ్రేష్టమైనదానిని మాకు ఉపదేశము చేసి, మేము నడవవలసిన మార్గములో మమ్మును నడిపించుము. దేవా, మేము అనుదినము నీ వాక్యములో ఆనందించునట్లుగాను, మా జీవితములో నీ యొక్క ఆనందమును పొందుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచూ యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


